Previous Page Next Page 
మనిషి పేజి 17


    "అయితే ఏం చేద్దామని?"
    "తిరుగుతాను , నిర్బయంగా, ఆశల్ని జయించి, బాధల్ని జయించి, స్వేచ్చగా నిర్మలంగా ప్రపంచం చుట్టూ పరిభ్రమిస్తాను శక్తి ఉన్నంత వరకూ . తరవాత ఏం చేయాలో నిర్ణయించే కర్తవ్యం దేవుడిది?"
    "నీ ఆలోచనలు ఎంత వికృతంగా ఉన్నాయో నువ్వు ఆలోచించావా?"
    "నేను చేసే పనే అది. ఆలోచనలు రంగు రంగులతో , చిత్ర విచిత్రాలతో, కలల మాదిరి, అలల మాదిరి తేలిపోతూ , తూలీ పోతూ నన్ను అడిస్తున్నాయి. నా మనస్సు నాకు లొంగటం లేదు. అదే అధినేతగా నన్ను  నడిపిస్తుంది. మార్గం చూపెడుతుంది. ఆ దోవనే నడుస్తున్నాను. మరో మార్గం వెతుక్కోవటం నాకు చేత కావటం లేదు. కళ్ళు మూసుకుంటే ఏదో వెలుగు కనిపిస్తుంది. కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా నల్లగా మాడిపోయినట్లు , ఆకాశం భూమిని ఎక్కడికో లాక్కు పోతున్నట్లు కనిపిస్తుంది. మనుషులకీ, దయ్యాలకీ, తేడా కనిపించదో సారి. ఏమిటో, ఇలాగే రూపం లేని ఆలోచనలు, అర్ధం కాని అభిప్రాయాలు నాలో రేగుతుంటాయి. నాకే అర్ధం కానిది నేనేం చెప్పను?'
    'సారదీ , నీకు మతి చలించలేదు గదా?"
    "పిచ్చేక్కితే ఏం కొంప మునిగింది? పిచ్చి వాడి కంటే సుఖపడేవాడేవడు? పసిపాపలా నవ్వుతూ, ఏడుస్తూ, కేరింతాలు కొడుతూ, పాప పుణ్యాలకు దూరంగా నిర్మల జీవితం గడిపేవాడు పిచ్చివాడు. పిచ్చి వాణ్ణి అయితే నాకది అదృష్టమే."
    "నీకు కాదు, సారదీ, నాకు అంతకంటే దురదృష్టం లేదు. అయినా ఇంత చిత్రంగా ఆలోచించే వాళ్ళు, జీవించే వాళ్ళు నాకెక్కడా కనిపించలేదు."
    "ఈ అనంతమైన సృష్టి లో ఎంత వైవిధ్య ముందో ఎవరు చూశారు? ఎవరు చూడగలరు? అందరికంటే నా జీవితం భిన్నంగా ఉండటానికి కారణం ఉంది."
    "ఏమిటది? చెప్పు సారధి."
    "నాకు ముందేం జరుగుతుందో తెలుసు!'
    "ఏం జరుగుతుంది?"
    "రెండు సంవత్సరాలు మాత్రమే ఇంక నే జీవించేది."
    నాకు ఆ విషయాన్ని గురించి మాట్లాడాలని పించలేదు. పరమ రహస్యమై మహా నిగూడ మైన భవిష్యత్తు ను మానవ మాత్రుడు తెలుసు కోగాలిగితే , ఆకాశం విరిగి, నక్షత్రాలు రాలిపోవూ? అదెలా సాధ్యం? అసాధ్యమైన విషయాన్ని నమ్మి నిప్పులో దూకుతానంటే? నాకు దుఃఖం పొంగు కు వచ్చింది. ఏడ్చాను. సారధి నన్ను దగ్గిరికి తీసుకున్నాడు.
    "సారదీ , నాకు దూరంగా జరిగి పోకు. నన్ను ఏకాకిని చేయ్యబోకు. ఈ మనస్సు, ఈ హృదయం , ఈ శరీరంలోని ప్రతి అణువూ, ప్రతి నెత్తుటి చుక్కా నీ కోసం పొంగుతుంది." అని సిగ్గు విడిచి పరిపరి విధాల చెప్పాను. ప్రాధేయ పడ్డాను. కాని మగవాళ్ళు ఎంత చిత్రమైన మనుష్యులు! ఆడది తనంత తాను రెక్కలు కట్టుకొని పురుషుడి ఓడిల్లో వ్రాలితే , అతను దాన్ని అసహ్యించు కుంటాడు. చీదరించు కుంటాడు. విముఖుడౌతాడు. ఆ ఆడదే అతన్ని చీదరించుకు పేడ ముఖం పెడితే, అతను ఆమె వెంట పెంపుడు కుక్కలా వెళ్లి గుంజీలు తీస్తాడు. ఆమె కోసం మనుష్యుల్ని చంపుతాడు. దేశాన్ని తగల పెడతాడు. మహా పాపాలు చేస్తాడు.
    చెవిటి వాడి చెవికి మధుర గీతం వినిపించినట్లు, అంధుడ్నీ ఆకాశం లోని ఇంద్రధనుస్సు ను చూడమన్నట్లు, కళ్ళు తెరవని పసి గుడ్డును కోర్కెలతో మండుతున్న యౌవని వలచి పిలిచినట్లు అతన్ని నేను పిలిచి పిలిచి విసిగిపోయాను.
    సారధి నన్ను హింసించాడు. అవమానించాడు. ప్రపంచంలో అతన్ని ద్వేషించి నంతగా నేనెవర్నీ ద్వేషించ లేదు. కారణ మేమిటనుకున్నావు! అతన్ని ప్రేమించి నంతగా ఎవర్నీ ప్రేమించ లేకపోవటమే . నా ప్రేమ ద్వేషంగా మారింది. అతన్ని పీక పిసికి చంపాలని పించింది. నాకు ఉద్రేకం ఎక్కువ. తొందర పాటేక్కువ. అతన్ని నోటికి వచ్చినట్టు తిట్టాను. "గడ్డి పోచకు కూడా ఈ విశ్వంలో కొంత చోటుంది. అంతకంటే హీనంగా , కీటకాన్ని చూసినట్టు నన్ను చీదరించు కుంటున్నావు. నువ్వేం పోగొట్టు కుంటున్నావో, నే మరణించాక గానీ తెలియదు. అప్పుడు నువ్వు ఎంత శోకించినా , నీ కన్నీరు పొంగి జల ప్రళయం తెచ్చినా , నన్ను బ్రతికించు కో లేవు" అని అతని పై నాలో రేగిన ద్వేషాన్ని వెళ్ళ గక్కి తిరిగి వచ్చాను.
    అతను మళ్ళీ నా దగ్గిరికి రాలేదు.
    నేను మళ్ళీ అతని దగ్గిరికి వెళ్ళలేదు.
    కానీ.........,'    నేనే అతనికి లొంగి పోయాను. ఎంత ప్రయత్నించినా అతన్ని శాశ్వతంగా ద్వేషించ లేకపోతున్నాను. నా స్మృతి పధం నుంచి అతన్ని ఎంత పూర్తిగా చెరిపి వేయాలను కుంటున్నానో , అంత గాడంగా అతని  మూర్తి నా సమస్తం నుండి , నన్ను నాకు కాకుండా చేస్తుంది" అంటూ ఒక్క నిమిషం ఆగి, "నే తప్పు చేశా నంటావా?' అని అడిగింది హెలెన్.
    "చెయ్యలేదు. ఆ పరిస్థితుల్లో ఏ ఆడదైనా అలాగే ప్రవర్తిస్తుంది. నువ్వు చేసింది తప్పని సారధి కూడా అనుకోడు."
    "అతన్ని దైవం లానే అరాదిస్తున్నాను. అతను కీటకం లా నన్ను తృణీకరిస్తున్నాడు. అతని స్వభావ మేమిటో, అంతర్య మేమిటో నా కర్ధం కావటం లేదు."
    "సారధి నీకే కాదు ఎవరికీ అర్ధం కాని మనిషి. పాతికేళ్ళు ఇద్దరం కలిసి ఒక్క మనిషిలా బ్రతికాం. అతను నా దగ్గిర ఉండి కూడా నాకు దూరంగా ఉన్నట్టే కనిపించే వాడు. అతను ఎంత ఆత్మీయంగా మాట్లాడాలని ప్రయత్నించినా, అతని మాటలు మరో గోళం నుంచి వస్తున్నట్లు వినిపించేవి. అసలు తనకి తానై అర్ధమై ఉండదు. ఒకరి సలహా అతనికి అవసరం లేదు. ఒకరి సహాయాన్ని అతను అసహ్యించు కుంటాడు. ఒకరి ప్రేమను అతను స్వీకరించలేడు."
    "మరి, కల్యాణి సంగతి."
    "ఎమైందనుకుంటూన్నావు నువ్వు?"
    "కల్యాణి తో చాలా కధ నడిపి ఉండాలే సారధి?"
    నేను చెప్పాను జరిగినదంతా. సారధి విజయవాడ వదిలి పోవటానికి కారణం చెప్పాను. హెలెన్ నమ్మలేక పోయింది . నమ్మింది.
    "మద్రాసు లో సారధి అడ్రసు ఎలా కనుక్కుంటావు? అతను ఎక్కడున్నాడో నాకు తెలియదు. జాబు వ్రాయమన్నాను. నవ్వి ఊరుకున్నాడు. వ్రాయలేదు" అన్నాను.
    "కనుక్కుంటాను. ప్రతి వీధి వెతుకుతాను. నా సోత్తయితే నాకే దొరుకుతుంది."
    "సారధి నీ సొత్తే కాకపొతే ఇంకెవరి సొత్తూ కాదు, ఎవరి సొత్తూ కాలేడు కూడా. నీ కతను దొరకటం నిజానికి అతని అదృష్టమే ఔతుంది. వెళ్ళు హెలెన్. తప్పకుండా మద్రాసు వెళ్ళు. వెళ్ళగానే జాబు వ్రాయి."
    
                                      16
    హెలెన్ మద్రాసు చేరినట్టు, సారధి జాడ ఇంకా ఏమీ అందనట్టు వ్రాసింది ఉత్తరం. ఉత్తరం వచ్చిన రోజునే మా ఊరు నుంచి రంగదాసు వచ్చారు. వైకుంఠ ఏకాదశి నాటి రాత్రి ముకుందరావు , భార్య ఇద్దరూ ఆకస్మికంగా గుండెలు ఆగి మరణించారుట. ఆ వార్త మోసుకు వచ్చాడు రంగదాసు. ఊళ్ళో పెద్దలు నలుగురు చేరి సారధి కోసం కబురు పెట్టారు.
    ముకుందరావు , అనంతమ్మ ఇద్దరూ బలం గానే , ఆరోగ్యం గానే కనిపించే వారు. వయస్సు కూడా తగినంత లేదు. అకాల మరణమే అయింది. ఒక్కగానొక్క కొడుకైన సారధి తల్లి తండ్రుల మరణ సమయం లోను, చివరికి కొరివి పెట్టటానికి కూడా దగ్గిర లేకపోవటం చాలా ఘోరమైన విషయమని ఊళ్ళో అందరూ విచారించారని రంగదాసు చెప్పారు.
    పది నిమిషాలు ఈ సంగతులు చెప్పి, "సుబ్బుల్ని నాకు ఇవ్వటానికి మునసబు గారు ఒప్పుకున్నారు" అన్నాడు ఆనందాన్ని ఆపుకోలేని రంగదాసు. వచ్చే మూడమి వెళ్ళాక పెళ్లి ముహూర్తం పెట్టించాలను కుంటున్నారట.
    సారధి అడ్రసు నాకూ తెలియదని చెప్పాను. ఆ సాయంత్రం నన్ను వెంటబెట్టు కొని బజారు తీసుకు వెళ్లి ఒక నైలాన్ చీర నాచేత ఎన్నిక చేయించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS