11
సాయంకాలం ఎప్పటి లాగానే ముస్తాబై వచ్చింది.
రవిచంద్ర అక్కడకు వచ్చి అప్పుడే నాలుగు నెలలు గడిచాయి. ఆరోజు భోజనం చేసిన దగ్గిర నించి అతను చదువుతూనే ఉన్నాడు. గదిలోకి చీకటి దండెత్తే సరికి , ఇహ అతనికి చదవ బుద్ది కాలేదు. తలంతా దిమ్మెక్కి న ట్లనిపించింది.
ఆవలిస్తూ రేడియం డయల్ గడియారం లో చూసుకున్నాడు. ఆరు గంటలు కావస్తున్నది. గభాల్న అతనికి జ్ఞాపకం వచ్చింది, ట్యూటరియల్ కాలేజీ పీరియడ్ సంగతి. రెండు నెలల నుంచి ప్రతి రోజు సాయంత్రము, అతడు అక్కడికి దగ్గిరే ఉన్న ట్యూటరియల్ కాలేజీ లో పని చేస్తున్నాడు.
గబగబా ముఖం కడుక్కుని, ఆదరా బాదరా బట్టలు వేసుకొని పుస్తకాలు పట్టుకొని గదికి తాళం వేసి బయటకు వస్తుండే సరికి సురేఖ వచ్చింది, "నమస్కారం గురువుగారూ" అంటూ.
రవి నవ్వుతూ "గురువు గారికి ఇవ్వాళ పంగనామాలు పెడదామను కుంటున్నావా? కాలేజీ కి రావడం లేదేమిటి?" అన్నాడు.
సురేఖ తప్పిన బి.ఎ తో కుస్తీ పట్టి పరీక్ష పాసు కావాలని చూస్తున్నది. ప్రస్తుతం ఆ ట్యూటోరియల్ కాలేజీ విద్యార్ధినే ఆమె.
"ఆదివారం కూడా పంతుళ్ళు చదువు చెబుతామని వెంట బడితే పిల్లలు బ్రతకరు, మాస్టారూ!" అంది సురేఖ కొంటెగా.
అప్పుడు జ్ఞాపకం వచ్చింది రవిచంద్ర కు ఆరోజు అదివారమన్న సంగతి.
"సరే కాగల కార్యం గంధర్వులే తీర్చారు. శిష్యులారా! మీరే ఇవ్వాళ పాఠం చెప్పాలి అయితే" అన్నాడు పుస్తకాలను మూలగా గిరాటేస్తూ.
"పాఠం ఇక్కడ చెప్పటం నాకు అలవాటు లేదు. అలా సినిమాకు వెళదాం పదండి, మీకు అభ్యంతరం లేకపోతె."
అవ్వాళ అతనికి చాలా బడలికగా ఉంది. ఆ సాయం కాలం హాయిగా సినిమాలాంటిది చూడాలని కూడా ఉంది.
"సరే, అయితే పదండి" అంటూ పర్సు లో నోట్లను లెక్క పెట్టుకున్నాడు.
"ఇదేమిటి? ఇవ్వాళ ఏ దేవుడు వరమిచ్చాడు? ఎన్నడడిగినా రానివారు ఇవ్వాళ వెంబడే ఒప్పుకున్నారు! మంచి అవకాశం మించిన దొరకదు, పదండి" అంది హుషారుగా రోడ్దేక్కుతూ సురేఖ.
మనహసంతో ఆమెను వెంబడించాడు రవిచంద్ర.
ఇద్దరూ థియేటరు దగ్గిరికి చేరేసరికి సినిమా అప్పటికే మొదలు పెట్టారు. టిక్కెట్లు తీసుకొని లోనికి వెళ్లి కూర్చున్నారు. అది ఏదో ఇంగ్లీషు సినిమా. రవిచంద్ర పక్కనే కూర్చుంది సురేఖ. ఆ సాయంత్రం సురేఖ చాలా సాదాగా అలంకరించు కున్నప్పటికి అందంగా ఉంది. ఎందుకనో ఆమె పక్కన కూర్చోవాలంటే రవి చంద్ర కు కొంచెం బెరుకని పించింది. జనం కూడా అట్టే లేరు.
"మీరు పాఠాలను అంత గొప్పగా చెప్పటం ఎక్కడ నేర్చుకున్నారు , మాస్టారూ?"
తన మీదకు వంగి అంటున్న ఆమె మాటలు అతనికి కొత్తగా అనిపించాయి. ఆమె ఒంటి మీద నుంచి వచ్చిన సువాసన అతన్ని ఒక్క క్షణం ఉక్కిరిబిక్కిరి చేసింది.
'అంటే?"
"క్లాసులో మీ పాఠాలు నన్ను ముగ్ధురాలిని చేస్తాయి. నన్నోక్కదాన్నే కాదు,అందర్నీ!"
"అంటే?' మళ్ళీ అదే ప్రశ్న.
"సుజాతా దేశ్ ముఖ్ ఏమంటుందో తెలుసా, మిమ్మల్ని గురించి?"
"చెప్పండి."
"మీరు పాఠం చెబుతుంటే ఏదో దివ్యకాంతి మీ ముఖం లో కొట్టో'చ్చినట్లు కనబడుతుందట."
అతడు ఆశ్చర్యాన్ని అణుచుకొని నవ్వుతూ, "ఈ సాయంత్రం మా సురేంద్ర కలిసి మిమ్మల్ని బార్ కేమన్నా తీసుకు వెళ్ళలేదు గదా? చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు."
ఆమె అదే నవ్వు గలగల మని నవ్వింది.
"అదేం లేదు. నిజంగానే ఆ పిల్ల అలా అంటుంది. నాకోకప్పుడు భయం కూడా కలుగుతుంది, మిమ్మల్ని ఎవరైనా ఆ కాంతి చేత ఆకర్షించబడి బుట్టలో వేసుకొని పోతారేమోనని."
"ఉష్! చిన్నపిల్లలా అల్లరి చేయకండి, సినిమా చూడండి." కొంచెం గంబీరంగా అన్న మాటలకు ఆమె చిన్న బుచ్చుకున్నదన్న సంగతి ఆమె అటు పక్కకు జరిగి, ఏం మాట్లాడకుండా సినిమా చూడటం ద్వారా అతడు గ్రహించాడు.
సినిమా ఏమీ బాగాలేదు. ఇంటర్వెల్ దాకా ఓపిగ్గా చూశారు. లైట్లు వేలగ్గానే అతనికి ఊపిరి పీల్చిన నట్లయింది.
"బయటకు వెళ్దామా?' అన్నాడు సురేఖ ను చూస్తూ.
"బయటకే కాదు, ఇంటికే వెళ్లాలని ఉంది" అంది ఆమె.
"సరే, అయితే నడవండి. 'ఇద్దరూ కలిసి బయటకు వచ్చి నెమ్మదిగా నడవ సాగారు.
"మీరు అనవసరంగా నాచేత డబ్బు ఖర్చు పెట్టించి సినిమా చూడనీయకుండా చేశారు."
అతడు సరదాగా అన్న మాటలకు ఆమె కొంచెం చిన్నబుచ్చుకొని, "క్షమించండి. అయితే, నేనిందాకా సినిమా హల్లో కూడా హద్దు అతిక్రమించి మాట్లాడి నట్లుంది" అంది.
'అరెరే....నేనేవంటే నాకంటే మీరు సెన్సిటివే. నాకున్న ఆ ఒక్క స్పెషల్ క్వాలిఫికేషన్ పోయింది ఈ దెబ్బతో.
ఆమె నవ్వి అన్నది: "సంతోషం, మీరు సెన్సిటివ్ అన్న సంగతి మీ అంతట మీరే తెలుసుకున్నందుకు."
అతడు "ఊ! ఇహ చెప్పండి, మీరు నన్నేమీ అనదలుచు కున్నారో?" అన్నాడు.
"అనడానికి ఏమీ లేదు. ఏదో పొద్దుపోక ఇందాకా ఆ సంగతి మీకు చెబితే కోపం వచ్చింది. గ్లాస్ విత్ కేర్, మీతో వ్యవహారం."
"సరే, తీరిగ్గా భోజనం చేస్తూ , నాతొ దేబ్బలాడుడురు గాని రండి" అంటూ అతను హోటల్లోకి దారి తీసి ఫామిలీ రూం వైపు నడిచాడు. సురేఖ కూడా వెంబడించింది.
భోజనం అర్దరిచ్చిన తరవాత "ఎలా సాగుతున్నాయి మీ నాటకాలు?" అన్నాడు.
ఆమె కూడా అతని గొంతును అనుకరిస్తూ "ఊ! ఎలా సాగుతున్నాయి మీ ఐ.ఎ.యస్ స్టడీస్?" అంది.
"మీరు నటీమణులని నాకు తెలుసు. నన్నెందుకు పరీక్షిస్తారు?"
"మీరు విద్యావంతులని నాకు తెలుసు, నా విద్యలేమిని చూసి ఎందుకు పరిహసిస్తారు?"
"ఊ! బాగుంది."
"ఊ! బాగుంది."
పగలబడి ఇద్దరూ నవ్వుకున్నారు. ఇంతలో భోజనం వచ్చింది. ఇద్ద్దరూ తినడానికి ఉపక్రమించారు.
ఈసారి సురేఖే అడిగింది, "బాగా చదువుతున్నారా?' అని.
"ఏదో చదువుతున్నాను."
"మీరు ఏదో చదువుతున్నారని అంటున్నారు కాని సురేంద్ర మాత్రం బ్రహ్మాండం బద్దలు చేస్తున్నారని, ఐ.ఎ.యస్ ఆఫీసరుగా ఇక్కడికే వచ్చే టట్లున్నదని అందరికీ చెప్పెస్తున్నాడే!"
"పరీక్ష అవందే! ఇంకా పోస్టింగ్స్ ఇచ్చే రోజులు రాలేదు."
"ఎన్ని రోజులున్నాయి పరీక్షలు?"
"ఇంకా రెండు నెలలు మాత్రమె."
"తరవాత మావంక చూడరు కాబోలు!"
"అవును. తరవాత నాన్న తీరిగ్గా నిద్రపోవాలి కాబట్టి చూడక పోవచ్చు.
భోజనాలయ్యాయి. ఇద్దరూ నడవసాగారు.
"మాస్టారూ! రిపు, ఎల్లుండి నేను రాలేనండోయ్. నాటకాలున్నాయి" అంది సురేఖ ఆమె ఇంటి వైపు వెళ్ళే బస్సు ఎక్కిన తరవాత.
"మంచిది" అని చేయి ఊపాడు రవి.
రవి బస్సు కదిలిన తరవాత తనగది వైపు నడవ సాగాడు.
వెనక కారు హారన్ మోగింది కాని, అతను సరిగ్గా వినిపించుకోలేదు.
"రవిచంద్ర గారూ!" ఎవరో పిలిచినట్లయి వెనక్కి తిరిగాడు.
రాజగోపాలం కారులో ఉన్నాడు. కారు దగ్గిరగా వెళుతూ, "హల్లో ! ఎక్కణ్ణించి ?" అని పక్కనే ఉన్న ప్రియంవద ను చూసి, "ఓహో మీరు కూడా ఉన్నారే" అని "సినిమాకు పోయి వస్తున్నారు లాగుంది" పూర్తీ చేశాడు రవిచంద్ర.' "కరెక్ట్! మీరు ఐ.ఎ.యస్ అఫీసరయ్యేటట్టున్నారు చూడబోతే!"
"అదేమిటి ? ఎలా?"
"ఆ షార్ప్ నెస్ కు. చెప్పకుండానే కనుక్కున్నారుగా సినిమా నుంచి వస్తున్నామని!"
అందరూ నవ్వుకున్నారు. "ఊ! ఎక్కండి" అన్నాడు రాజగోపాలం కారు స్టార్టు చేస్తూ.
"నో, నో మీరు డీవియేట్ అయి నాకు డ్రాప్ ఇవ్వాలి. నేను వెళతాను" అంటూ అడుగేయబోయాడు.
"కూర్చోండి, మహాశయా! మా కారు టైర్ల కు నొప్పులేమీ పుట్టవు లెండి" అని అతని చేయి పట్టుకొని లోనికి గుంజాడు.
రవి కూర్చున్న తరవాత డోర్ వేస్తూ , "మీ కారు టైర్ల కు నొప్పులు పుట్టవు గాని, కారు టాంకు లో పెట్రోలు అయిపోతుంది" అన్నాడు.
"ఏమిటో దర్శనాలే లేవే! మమ్మల్ని మరిచి పోయారా ఏమిటి?" అన్నాడు స్టీరింగ్ తిప్పుతూ రాజగోపాలం.
"మీరు నిజంగానే చాలా రోజులయింది మా ఇంటికి వచ్చి" అంది ప్రియ.
"ఎబ్బే , వద్దామనే అనుకుంటున్నాను. సాయంత్రం వేళల్లో వస్తేనే గాని మీరు ఉండరు. నాకేమో ట్యూటోరియల్ కాలేజీ.........."
"గుడ్, స్టడీస్ ఎలా సాగుతున్నాయి?"
"బాగానే సాగుతున్నాయి. అన్నట్టు, అడగటం మరిచి పోయాను. మీ దగ్గిర గాంధీ పిలాసప్జీ దగ్గిర్నించి గాంధీ జీకి సంబంధించిన పుస్తకాలు ఏమున్నా నాకు కావాలి."
"ఓయస్, పట్టుకు వెళ్ళండి. మరి కారల్ మార్క్స్ పుస్తకం , అవ్వాళ తీసుకెళ్ళింది చదివారా?"
"ఆ! చదివాను. రేపు తీసుకొస్తాలెండి" అని రవిచంద్ర అంటుండగా రవి గది వచ్చింది.
"రేపు రావడం మాత్రం మరిచి పోకండి" అంటూ రాజగోపాలం టర్న్ తిప్పి, కారులో వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతున్న కారును క్షణ కాలం చూసి నెమ్మదిగా గదిలోకి నడిచాడు రవి.
