9
సాయంత్రం వెడుతూ చాలాసార్లు సుమిత్రకి కృతజ్ఞలు చెప్పింది కల్యాణి. ఆవిడ వెళ్ళాక 'హమ్మయ్య' అని నిట్టూర్చి.
'ఇప్పుడు చెప్పు వదినా!' అన్నది సుమిత్ర.
ఉలిక్కిపడి 'ఏమిటి! ఏం చెప్పను ?' అన్నది ఇందుమతి.
'నువ్వేదో చెప్పాలని ప్రొద్దుటి నుంచీ అనుకుంటున్నావు -- కానీ చెప్పలేదు -- ఆ సంగతి చెప్పు--'
ఇందుమతి మాట్లాడలేదు.
సావిత్రి స్థభ్దుగా కూర్చుండి పోయింది. ప్రొద్దున వచ్చినప్పటి నుంచీ ఒక్కమాట కూడా మాట్లాడలేదు స్నానం చేసింది కానీ తల దువ్వుకోలేదు. పౌడరు వేసుకోలేదు. చూపుడు వ్రేలితో కుంకుమ తీసుకుని నుదుట పెట్టుకుంది.
'ఈ ఏడు దీన్ని కాలేజీ లో చేర్పించలేదా?' అనడిగింది సుమిత్ర మళ్లీ.
'చల్లకొచ్చి ముంత దాచడం దేనికి సుమిత్రా! నీతో చెప్పకుండా నేనెలా బ్రతకగలను! చెబుతాను! కానీ ఈ సత్యాన్ని నువ్వు విషం లాగా కంఠం లోనే దాచుకోవాలి. లోపలికి మ్రింగ కూడదు. బయటికి కక్క కూడదు' ఆవేదన నిండిన కంఠం తో నెమ్మదిగా అన్నది ఇందుమతి.
తల్లి ప్రక్కన తలవంచుకుని కూర్చున్న సావిత్రి వాకిట్లో కి వెళ్ళిపోయింది వెంటనే.
ఆశ్చర్యంగా చూస్తూ కూర్చుంది సుమిత్ర . -- రెండు క్షణాలు గడిచాక తలఎత్తి నెమ్మదిగా, 'వారం రోజులనాడు ఇది పెరట్లో వాంతి చేసుకుంటూ వుంటే చూశాను. అసలు నెల రోజుల నుంచీ దీని వంట్లో ఏమీ బాగాలేదు. ఏమిటని అడిగితె చెప్పదు- చివరికి తేలింది- డాక్టర్ దగ్గరికి వెడితే -- ఏం చెయ్యను? నాకేమీ తోచలేదు -- ఊళ్ళో నలుగురికీ తెలియక ముందే ఉపాయం ఆలోచించాలి కదా! మీ అన్నయ్య ఇక్కడికి తీసుకు వెళ్ళ మన్నారు--' కళ్ళు తుడుచుకుంది.
నిశ్చేష్టయై వింటున్నది సుమిత్ర.
తమకిలాంటి సమస్య వస్తుందని ఎన్నడూ ఊహించనే లేదు.
ఎదుట మూర్తీభవించిన శోక దేవతలాగా కూర్చున్నది వదిన. చేసిన తప్పుకు కుమిలి పోతున్నది పదిహేరేళ్ళు నిన్న మొన్న నిండిన పసిది. ఈ సమస్య కేమిటి పరిష్కారం?
'ఏం చేద్దామని నీ ఉద్దేశ్యం వదినా?' చివరి కేలాగో అడిగింది , ఎండిపోయిన గొంతుతో.
'నాకేమీ తోచలేదు సుమిత్రా! నిన్న ప్రొద్దున డాక్టర్ దగ్గర పరీక్ష చేయించాను. రాత్రికి రాత్రే ఇలా బయలుదేరి వచ్చాను-- నాకెందుకో ఒక్కసారి బావురుమని ఏడవాలని పిస్తోంది!' అన్నది ఇందుమతి.
'ఏడిచి ఏం లాభం వదినా? ఏదైనా ఆలోచిద్దాం మార్గం -- దాన్ని మరీ అంత దిగులుగా ఉండొద్దని చెప్పు-- ఇంతకీ అతనెవరో కనుక్కోగలిగావా?' వదిన భుజం మీద చెయ్యి వేసి వాత్సల్యం నిండిన కంఠం తో అన్నది సుమిత్ర.
'ఎంత అడిగినా అది చెప్పిన సమాధానం ఒక్కటే! అతని పేరు చెప్పినా, అతడిని పెళ్లి చేసుకునే అవకాశం లేదనీ, అతన్ని పెళ్లి చేసుకుంటే తన జీవితం బాగు పడడం అంటూ వుండదనీ అంటుంది. దాని ఇష్టం లేకుండా జరిగిందేమో ఈ పని. ఆ సంగతీ చెప్పదు. ఏదైనా అడిగితె ఏడుస్తుంది !'
'సరే నేను కనుక్కుంటాలే ఆ సంగతిని నీ ఉద్దేశ్యం ఏమిటో చెప్పు! ఏం చేయ్యాలనీ!' గట్టిగా అడిగింది సుమిత్ర.
'నీకు తెలిసిన డాక్టర్ ఎవరైనా వుంటే -- ఈ పాప ఫలాన్ని ఇక్కడ వదిలించేసి తీసుకెళ్లాలని వచ్చాను-- ' గోడ వైపుకు తిరిగి భయంగా అన్నది ఇందుమతి.
'అది చాలా కష్టమైన పని! అయినా ఎలాగో ప్రయత్నం చేద్దాం -- ఈ ఊరొచ్చి ఇన్నాళ్ళ యినా నాకు డాక్టర్ల పరిచయం కాలేదు-- నువ్వు ధైర్యంగా వుండు-- ' అన్నది సుమిత్ర ఓదార్పుగా. ఆ రాత్రికి భోజనం ఎవరికీ సహించలేదు. వ్రేళ్ళతో అన్నం కెలుకుతూ కూర్చుని తరువాత లేచి పోయింది సావిత్రి.
కృష్ణమూర్తి ఏదో మాట్లాదబోయినా ఎవరూ ఆసక్తి చూపలేదు వున్నది ఒక్క గది.
ఆ గదిలో ఏ ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకునే అవకాశం లేదు. తొమ్మిదిన్నర కల్లా అలసి పోయినట్లు నిద్రపోయింది ఇందుమతి.
కృష్ణమూర్తి చదువు కుంటున్నాడు.
సావిత్రి కళ్ళు పెద్దవి చేసుకుని దీపం వంక చూస్తూ పడుకుంది.
సుమిత్ర చదువుదామని ప్రయత్నం చేసింది కానీ బుర్రలోకి ఏదీ దూరదు.
'దీపక్ మహల్ లో మంచి తెలుగు సినిమా వుంది వెడదామా!' అన్నది సుమిత్ర సావిత్రి వంక తిరిగి...
'అలాగే పద!' అన్నది సావిత్రి లేచి కూర్చుని, ఆ అవకాశాన్ని జారవిడవకుండా.
'చెప్పు సావిత్రీ నీ మనస్సులో మాట!' అన్నది సుమిత్ర త్రోవలో.
'నీతో చాలా మాట్లాడాలి చిన్నత్తా! ఇప్పుడెలా కుదుర్తుంది? సినీమా హాలులో బోలెడు మంది జనం!' విషాదంగా నవ్వింది సావిత్రి.
'ఇది సెకండ్ రన్! వచ్చి చాలా రోజులైంది.' మనం వెనక కూర్చుని మాట్లాడుకుంటే ఎవరికీ వినిపించదు' అన్నది సుమిత్ర. టికెట్లు తీసుకుని చివరగా వున్న సీట్లలో కూర్చున్నాక తగ్గు స్వరంతో అన్నది సావిత్రి!
'అంతా జరిగిపోయాక అతను వచ్చి దొంగ అనీ మోసకాడనీ, చదువు కానీ, 'ఉద్యోగం కానీ లేవనీ, గౌరవంగా సంఘంలో బ్రతకడానికి అతని భార్య కి ఏ అవకాశమూ వుండదనీ తెలిసింది. అంతేకాదు -- అతని వలలో పడ్డ ప్రతి ఆడదాన్నీ అనుభవించడమే కానీ పెళ్లి చేసుకునే తలంపు అతనికి వుండదు-- నేను మోసపోయాను. అతను చెప్పిన కబుర్లన్నీ నమ్మి అతని వెంటపడి సినిమాలకీ, షికార్ల కి , చివరికి అతని గదికి కూడా వెళ్లాను. చాలా స్టయిలిష్ గా వుంటాడు. ఇంటిదగ్గర ఆస్తి వుందన్నాడు. కాలేజీ లో చదువు తున్నానన్నాడు . నమ్మాను-- అతన్ని పెళ్ళాడినా మన కులం కాదు -- సంఘం లో స్థానం లేదు-- ఆ నికృష్ణ మైన బ్రతుకు నాకొద్దు చిన్నత్తా-- చూస్తూ చూస్తూ దొంగతో నేను కలిసి బ్రతకలేను-- అతను జేబులు కొడతాడు. పెద్ద పెద్ద వ్యభిచార సంస్థలకి అమ్మాయి లని సరఫరా చేస్తాడు -- నేను మాత్రం ఆ కూపం లో పడకుండా తప్పించుకున్నాను.--' రెండు చేతుల్తో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది సావిత్రి !
సుమిత్ర అలాగే కూర్చుంది అవాక్కయి.
'రోజూ కాలేజీ కి వెళ్ళే టప్పుడు వెంట పడేవాడు. పాటలు పాడి ఫోజులు కొట్టేవాడు. రెండు మూడు చీరెలు కూడా ప్రెజెంట్ చేశాడు. ఇవ్వన్నీ చూసి మోసపోయాను-- జీవితాలకి ధ్యేయమేమిటో గమ్యం ఏమిటో ఆలోచించే వివేకం నాకు లేకపోయింది --'
సావిత్రి భుజం మీద చెయ్యి వేసి 'ఊర్కో సావిత్రీ!....ఏడవకు! జరిగి పోయినదాన్ని మరిచిపో! నీ మీద నాకేం కోపం లేదు -- బంగారు పంట పండాల్సిన జీవితాన్ని ఇలా బుగ్గి పాలు చేసుకున్నావన్న దిగులు తప్ప!' అని ఓదార్చింది సుమిత్ర తెర మీద సినిమా కదుల్తోంది. అవివాహితగా వున్న నాయిక గర్భవతి అవుతుంది. అపనిందలతో క్రుళ్ళి పోతోంది -- నాయకుడి చేతిలో పరాభవం చెంది ఆత్మ హత్యకి తలపడింది. ఉలిక్కి పడింది సుమిత్ర.

'ఇలాంటి పనులు చెయ్యకు సావిత్రీ! నీకేం భయం లేదు-- నీ జీవితాన్ని మేము సరిదిద్దుతాం " అన్నది.
* * * *
'హల్లో సుమిత్రాదేవి! గుడ్ ఈవినింగ్!' సావిత్రిని తీసుకుని హాస్పిటల్ లో నుంచి బయటికి వస్తున్న సుమిత్ర ఆశ్చర్యంగా వెనక్కి చూసింది.
'ఎందుకంత ఆశ్చర్యం! నేను బసవరాజు ని!'
'అవును, గుర్తు పట్టాను' క్రింది పెదవిని ముని పంటితో నొక్కి పెట్టి కళ్ళతో నవ్వుతూ అన్నది సుమిత్ర.
'మర్చి పోయారేమో జ్ఞాపకం చేసి పోదామనోచ్చాను--' అతని కళ్ళల్లో కోపం కదను తొక్కుతోంది.
'రోజూ కనపడుతూనే వున్నారుగా ఆఫీసులో! ఎలా మర్చిపోతాను!' దగ్గరలో వున్న రెస్టారెంట్ వైపు దారి తీస్తూ అన్నది సుమిత్ర.
'గుర్తించే పలకడం మానుకున్నారు కాబోలు!'
'మీకు కోపం వచ్చిందిగా నా మీద !' నవ్వింది సుమిత్ర.
'పోగొట్టే ప్రయత్నం ఏదైనా చేశారా?'
'దానంతటదే పోతుందని తెలిసీ వూరుకున్నాను-'
కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ నిలబడింది సావిత్రి.
'ఈమె నా మేనకోడలు సావిత్రి, తోలి కాన్పు కష్టమని ఇక్కడికి పంపారు. డాక్టర్ దగ్గర ఇంజక్షన్లు తీసుకుంటోంది...రండి కాఫీ తీసుకుందాం -- కోపం నిలవ వుంటే మంచిది కాదు' అన్నది సుమిత్ర చొరవగా.
'అవును -- మీ దృష్టి లో ఏదీ మంచిది కాదు --' అన్నాడు బసవరాజు.
అతను అతి కష్టం మీద ఈ మూడు నెలలూ తన మీద కోపం వుంచుకో గలిగాడని గ్రహించడానికి సుమిత్ర కి ఎక్కువ సేపు పట్టలేదు.
సావిత్రి వునికిని మర్చిపోయి ఇద్దరూ కబుర్ల లో పడిపోయారు.
'మా ఇంటికి రమ్మని ఇన్ని రోజులుగా పిలుస్తున్నాను -- మీరు రానేలేదు -- పోనీండి -- ఎల్లుండి మా ఇంట్లో అమ్మ ఏవో నోములు చేసుకుంటున్నది. మీరు భోజనానికి రండి -- ఆ వంక నైనా ఆవిడకి మిమ్మల్ని చూపించ గలను--';
'నన్ను క్షమించండి బసవరాజూ! నా మనస్సు కి ఇప్పుడు స్థిమిత మంటూ లేకుండా పోయింది. తరువాత మాట్లాడు కుందాం' అని కాఫీ కప్పు పెట్టేసి లేచింది సుమిత్ర.
వాళ్ళు విడిపోయాక సావిత్రి అడిగింది.
'ఆయనెవరు చిన్నత్తా!' అని.
అయన మా ఆఫీసులో పనిచేస్తారు-- నాకీ ఉద్యోగం రావడానికి కారణం కూడా ఆయనే. మంచి స్నేహితుడు ' అన్నది సుమిత్ర.
'మంచి వాళ్ళ కెప్పుడూ మంచి స్నేహితులే దొరుకుతారు!' అని నిట్టూర్చింది సావిత్రి. ఆమె కిప్పుడు అరవ నెల కాబోలు!
గర్భీణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్త లేవిటో ఆమెకీ తెలియవు, తనకీ తెలియవు. పదిహేడేళ్ళు న్న పసిదీ! అప్పుడే తనలో పెరుగుతున్న మరో జీవాన్ని గురించి ఆందోళన పడుతున్నది! అది తియ్యని ఆహ్వానంతో కూడిన ఆందోళన కాదు! అసహ్యంతో నూ, నిస్సహాయత తోనూ కూడిన భయంకరమైన ఆందోళన! మానసికంగా శారీరకంగా నానాటికీ కృశించి పోతున్న ఆమెకి తన ఓదార్పు చాలడం లేదు.
అప్పుడు ఇక్కడ వదిలేసి వెళ్ళిన ఇందుమతి మళ్ళీ రాలేదు. కూతురికి ప్రత్యేకంగా ఏ ఉత్తరమూ వ్రాయలేదు. ఆమె మందులకి గానీ మరి దేనికైనా గానీ ఒక్క పైసా అయినా ఫంపలేదు వాళ్ళు.
ఇంట్లో కృష్ణుడు, నెల తప్పకుండా డబ్బు కోసం వ్రాసే విశ్వం, ఇప్పుడు సావిత్రి! తానిలాగ బెనారస్ వెళ్ళగలదు! పరీక్ష ఫీజులెం కట్టగలదు! సావిత్రి పురుడే లాగ గడుస్తుంది! ఇదే ఆమెకి సమస్య!
'నువ్వు కాసేపు చదువుకో! నేను వంట చేస్తానులే!' అంటూ తనని ఒక్కపని ముట్టుకోనివ్వడం లేదు సావిత్రి.
'చాల్లే వూరుకో! నువ్వు అసలే అనారోగ్యంగా వున్నావు -- విశ్రాంతి తీసుకోవాలి -- నీచేత పనిచేయిస్తూ కూర్చుంటే నాకు చదవ బుద్ది కాదు--' అనేది సుమిత్ర.
'ఈ విశ్రాంతు లూ మందులూ దేని కోసం చిన్నత్తా! నేను బ్రతికినా చచ్చిపోయినా ఒకటే, అలాగే ఆ శిశువు నూ! మేం బ్రతికి ఎవర్ని సంతోష పెట్టాలి?' అని ఏడ్చేది సావిత్రి.
ఆ దృశ్యం కడుపులో చెయ్యి పెట్టి దేవినట్లుండేది. అన్నం కూడ సహించేది కాదు సుమిత్ర కి.
ఇవన్నీ చెప్పేసి, 'నాకేం తోచడం లేదు బసవరాజు! ఏం చెయ్యను?' అని బేలగా అడిగింది. ఆ సాయంత్రం పబ్లిక్ గార్డెన్ లో పచ్చిక మీద కూర్చుని.
