"ఒక్కమాట అడగనా?" అన్నది ఎట్టకేలకు సురేఖ స్నేహితురాలీని బరువుగా చూసి.
"వెయ్యి మాట లడుగు.....అమ్మకి ఇవేమీ తెలియవు...........తను నేను కేవలం 'ఎం.ఏ' చదువుకే ఇంతదూరం వచ్చా ననుకుంటోంది........ఇంత సాహసం చేస్తానూ అంటే తను భయపడుతుంది. ఇక నువ్వు ఒక్కతివే ఉన్నావు ......... అడుగు సురేఖా! నీ ఇష్టమొచ్చిన ప్రశ్న లడుగు......."
"నువ్వు నువ్వు.......భాస్కరంగారిని అపార్ధం చేసుకోలేదు కదా?"
"అంటే......"
"అతను నిన్ను నిన్ను........"
సిగ్గుపడ్డది. అంతలో మొహం ఎర్రవార జేసుకుంది. ఆవేశంగా "దగా చేస్తున్నారనా అంటావ్?" అన్నది పద్మావతి కన్నీళ్ళు నింపుకుని.
"ఛీ! ఛీ! అదేం మాటలే......మనం ఒక్కోసారి మనుషుల వాత్సల్యాన్ని.......ఒక దానికి మరొకటిగా అర్ధం చేసుకోవచ్చునుగా."
సురేఖ క్షమాపణ చెప్పుకుంటున్నట్లు అన్నది కాని, "సురేఖా! నువ్వు నన్ను నిందిస్తున్నావు" అని దుఃఖపడ్డది పద్మావతి.
"ఛా! లేదయ్యా! నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇందులో నువ్వు భ్రమ పడ వల్సిందేమీ లేదు."
నేస్తం తల ఆప్యాయంగా నిమిరింది సురేఖ-పద్మావతి ఆ పిల్ల గుండెలమీద తల ఆన్చుకుంది.
"భాస్కరంగారు గత నాలుగు సంవత్సరాల లోనూ, ఇప్పుడున్నంత గంభీరంగా ఏనాడూ లేరబ్బా" అన్నది.
"ఔను పద్మా! పురుషుడి సమాజం వేరు- అక్కడి అతని ఉనికి వేరు. కేవలం వ్యామోహాల తోనూ, ఆవేశాలతోను అతగాడు - జీవితంలోని ప్రధాన సోపానాలను కట్టుకోడు. అందకు ఆధారాలను, అవసరాలను అంతస్తుల ఛాయను, హోదాల ఆస్కారంతోనూ, వేసుకుంటాడు.....సామాజికమైన అతని ప్రతిపత్తికి హోదా వస్తున్నప్పుడు 'ప్రేమ' ను మింగేస్తాడు......హలా హలంలా గొంతులో దాచేసుకుంటాడు."
జీరవోయిన కంఠమే అయినా, సురేఖ స్పష్టంగానే తన భావాన్ని పద్మావతికి చెప్పింది.
"అంతేనంటావా? మా అమ్మ ఈ సమాజంలో నాకు కాబోయే భర్తకు ఒక గౌరవ ప్రదమైన ఉనికిని ఇవ్వడానికి చాలినంత సంస్కారాన్ని నాకు ఇవ్వలేదంటావా?"
"అది వ్యక్తులు నిర్ణయిస్తారు. మనం కాదు. బహుశా భాస్కరంగారికి గల బాధ్యత లెల్లాంటివో నువ్వూహించావా?"
"ఎన్ని ఉన్నా ఆయన మగవాడు.......మా అమ్మ ఎదురీది, నిభాయించి నన్ను ఇంతదాన్ని చేసిందే.........తాను పురుషుడై నిభాయించలేడా?"
"ఒక్కోసారి అహంకార జనితమైన పట్టుదలల కోసరం మన అంతా బందీల మవుతామ్ పద్మా!"
సురేఖ ఇంత వింతగా మాట్లాడటాన్ని పద్మావతి విస్తుపోయి విన్నది.
"ఏమిటోయ్! నువ్వు నాకు ఇవాళ ఇలాంటి బోధ చేస్తున్నావ్...........'ప్రేమ', 'పెళ్ళి', 'చదువూ' అన్నీ వృధాగా నేను అల్లుకుంటున్న చిక్కు ప్రశ్నలే నంటావా?" హతాశయై అడిగింది.
"అబ్బే లేదు.......నే నేదో డిబేట్ ధోరణిలో పడి నిన్ను ఈ బాధనంతా పెట్టాను. ఎందుకంటావా?" సురేఖ మాట మార్చింది. "వెనుకటికి మా ఫ్రెండు ఒకామె ఉండేదిలే......ఆమెకు ఒకబ్బాయి ఉత్తరాలు రాసేవాడు. ఎంత తియ్యగా రాసేవాడనుకున్నావ్?"
"నీ కెలా తెలుసు" పద్మావతి కూడా సంభాషించుకుని, నువ్వు తెచ్చుకుని అడిగింది.
"తెల్సులే-ప్రేమలేఖలు నీ ఒక్కతెకే వస్తాయనుకోకు!" సురేఖ నవ్వింది.
"సరే! చెప్పు........"
"నువ్వు లేపోతే నే చస్తాననేవాట్ట" సురేఖ కళ్ళు పెద్ధవిచేసి రెండు క్షణాలూరుకుంది.
"పాపం!" అన్నది పద్మావతి.
"అది సరే ఇది విను.......ఆనక ఆ కుర్రవాడికి మాంచి సమ్మంధ మొకటి చూశారుట వాళ్ళవాళ్ళు"
పద్మావతి చాలా నొచ్చుకుంది. "నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తున్నావు. నా ప్రేమ గురించి" అని కించపడ్డది.
"లేదు ఇది నీ ప్రేమ వైనం కాదు ఒక కధ-కధ కూడా కాదు వాస్తవికతయే......ఎందుకంటే మనిషి అంత సుళువుగా చచ్చిపోలేడు. పరిస్థితుల నించికూడా తప్పించుకు పోలేడూ అయితే ఒక్కోసారి విపరీతమైన ప్రలోభనలకు లోనవుతాం కదా" లేచింది సురేఖ "రావోయ్! సినీమాకు పోయొద్దాం" అంతో.
"నిజమే-నా భయం నువ్వు వూహించావు గాని, భాస్కరంగారు మాత్రం అలా కాదే ఏమంటారో తెలుసా? ఆయనని, నేను 'మెస్మరైజు!' చేశానుట......తాను.......తాను......"
"ఆఁ! మీ భాస్కరంగారు తాను బెజవాడ వెళ్తున్నాననీ, నీకు చెప్పమనీ నిన్న నాతో ఫోన్ లో చెప్పారు" కొంచెం చులకన చేసి అన్నది సురేఖ.
"అలాగా"........ఖిన్నురాలైంది పద్మావతి.
"వాళ్ళ చెల్లాయి పెళ్ళి స్థిరపడిందిట."
"ఔను మరి మా ఇల్లు తెలియదుగా........" పద్మావతి తనను తానే ఓదార్చుకున్నది.
సురేఖకు పద్మావతి మీద జాలి వేసింది. ఈ వెర్రి బాగుల్ది తల్లినీ, కాపురాన్ని కూడా తీసుకుని ప్రేమ కోసం- నమ్ముకున్నవాడి సామీప్యం కోసరం వచ్చే సింది. నేనేం చెయ్యను?-"దొడ్డమ్మా నువ్వు మంచి దానివి కాదు" అనుకుంది.
రిక్షాలో సినీమా హాలుకి బయలు దేరారు. తోవలో ఎవరూ మాట్లాడలేదు.
"మా దొడ్డమ్మ మంచిది కాదు" అన్నది సురేఖ, ఒకసారి గభిక్కున.
"మధ్యలో అదేమిటోయ్!" అడిగింది పద్మావతి.
"మధ్యలోకాదు మొదట్లోనే"
"భాస్కరంగారి పిన్నమ్మగారు చాలా మంచివారుట" అని పద్మావతి నవ్వింది. సురేఖ కూడా నవ్వింది నవ్వి "అని నీ కెలా తెల్సు?" అడిగింది కొంటెగా.
"ఆయనే చెబుతారు......."
"నీ వూసు ఆవిడకు తెలుసునా?" సురేఖ ప్రశ్నకు పద్మావతి తల దించుకుంది. "సమయం రావాలిగదా!" అన్నది.
"నేను మీ అమ్మగారిని చూస్తానోయ్!" అడిగింది సురేఖ అనుకోని ఈఆప్యాయతకు పద్మావతి విస్తుబోయి "రేపు సాయంకాలం మా ఇంట్లోనే భోంచేసిపడుక్కుందికిరా" - అన్నది స్నేహితురాలిలా బుగ్గగిల్లి-
26
సినీమాలో వెనకవేపు విద్యార్ధుల సజ్జు ఒకటి చేరింది. వాళ్ళు తమకు తెలిసిన "హిస్టరీ, జాగ్రఫీ, సినీమాటోగ్రఫీ సినీతారల బయోగ్రఫీ" వరకూ గల శాస్త్రాలన్నీ తెగ మాట్లాడేస్తున్నారు. ముఖ్యం గా సురేఖ వచ్చిందో నలుగురికీ "కీ" యిచ్చి వదిలేసి నట్లు 'వాగు'తారు-"నువ్వు హాలీవుడ్ స్టార్ నోయ్" అంటుందందుకనే పద్మావతి. సాధారణంగా "బ్యూటీ" అని సురేఖకి మరో పేరు.
హాలులో ఎక్కువ భాగం పెద్ద చదువులకని "దూరాభారం" వచ్చిన విద్యార్ధులే. "తప్పించుకు తల దూర్చుకున్ధికి సినీమా లొక్కటే చోటు" అన్నది పద్మావతి. ఎవర్నీ గమనించకుండా.
సురేఖ నవ్వింది. "తప్పించుకోకూడదే భామామణీ! ఎదురీదాలి" అన్నది.
"అసలు నీళ్ళల్లోఉంటేకదా? ఒడ్డున పారేస్తే?" నన్నది పద్మావతి.
అసలు కధ తెరమీద ప్రారంభమైంది. ఆవేళకప్పుడే పద్మావతి వెనక్కి స్ప్రుతి వరంలోకి కరిగిపోయింది.
నిజంగా భాస్కరం తనను మనసారా ప్రేమించడం లేదా? కేవలం ఒక తాత్కాలికమైన భ్రాంతియేనా? "తనెంత మంచివాడు. అతని ఉత్తరాల్లో అక్షరాల్లో ప్రాణాలతో లేచివచ్చే ప్రేమాను రాగాలన్నీ పొల్లు మాటలా?" "కాదు కాదు" అనుకుంది.
"ప్రేమకోసం మనుషులు చేసే త్యాగాలు వాళ్ళను దేవతలను చేస్తాయి పద్మా!" అన్న భాస్కరం-హోదా కోసరం...........తనను.......తనను "యింపాజిబిల్" అనుకుంది.
............ఒకసారి-
"ఏమండీ! మా అమ్మ ఒక్కర్తే నాకు దిక్కు. తను మీకు పెద్ద కట్నాలు అవీ ఇచ్చుకోలేదు" అన్నది తను.
అంటే "నీ కంటే ఎక్కువ కట్నం నేనేం" కోరగల్ను. చెప్పు-" అన్నాడు తను తన తల నిమిరి! "నువ్వు నా ప్రపంచానివి" అంటాడు అక్కున అదుముకుని.
"మీ పిన్నిగారు ఒప్పుకుంటారా? అమ్మకి ఎందుకనో భయం-ఎవ్వర్నీ నమ్మవద్ధంటుంది" అడుగుతుంది పద్మావతి దూరంగా జరిగి.
"మా పిన్ని చాలా మంచిది. మీ అమ్మగారికి నన్ను తెలియదు-లేపోతే ఇలా అనరు" అనేవాడు భాస్కరం, ఆమె పాదాలవ్రేళ్ళు లెక్కిస్తూ.
"నేను, నాకు మా అమ్మా, తప్ప మరెవ్వరూ లేరు నాకు ఈ ప్రపంచంలో....." అంటే, ఆమె చెయ్యి తను గుండెల కదుముకుని, "నేనున్నాను....... నువ్వు నన్ను ఎరుసు చేస్తున్నావు" అని ఎంతగా గానో నొచ్చుకునేవాడు భాస్కరం-
"నిన్ను చూడకుండా బ్రతకలేను పద్మా.......నువ్వు వాల్తేరు రావాలి........నిన్ను చూస్తేనే చాలు. ఏదో చల్లని భావన మలయ మారుతం వీచినట్లుంటుంది. నీతో మాటాడితేనే చాలు-మనసుకుల్లాసంగా ఉన్నట్లు ఉంటుంది-నీతో గడిచిన క్షణాలు ఈ జీవితం మీద విపరీతమైన మమకారానికీ పునాదులు పద్మా!....." అంటాడు భాస్కరం.
"నేను కవినికాదు. అంచేత ఇవన్నీ సత్యాలూ" అనీ, "కావాలంటే నీ ముక్కు మీద ఒట్టూ" అనీ అనడమూ అతనికి అలవాటు.
పద్మావతికి భాస్కరం మీద పూర్తి భరోసా ఉన్నది. అందుకే అంత సాహసంగా వాల్తేరు వచ్చింది.
ఏ పని చేస్తున్నా, భాస్కరం మాటలే. ఉదయమే లేచి బడలికగా ఒళ్ళు విరుచుకుంటూ, భాస్కరాన్ని తల్చుకుంటే-మనసుకు ఆహ్లాదంగా ఉండేది. పొద్దున్నే పెరట్లో గులాబీ పువ్వు వికసించి పలకరిస్తే "ఆయన చూస్తే చాలు...........ఇది కోసి నా తలలో ముడుస్తారు" అనిపించేది.
పువ్వును కోసి, రహస్యంగా భాస్కరాన్ని తల్చుకుని ముద్దెట్టుకుని తలలో ముడుచుకుంటే అదో ఘన కార్యం చేసినట్లుండేది.
"పద్మా! నీ కోసరం నేను ఈమధ్య చాలా జాగర్తగా ఆరోగ్యం కాపాడుకుంటున్నాను. లావెక్కడం మానేశా..........లేపోతే నీ ప్రక్కన నడుస్తూ వుంటే నలుగురూ, "ఎవడ్రా ఈ ముష్కురుడూ పువ్వులాంటి ఆ చిన్నదాని ప్రక్కనా. అనుకోరూ" అని రాసే వాడు భాస్కరం.
"ఇవాళ పిన్ని నన్ను ఆలస్యంగా భోజనానికి వచ్చేవని కోప్పడింది తెలుసా? కాని, నా పద్మావతి కోసరం పిన్నిచేత దెబ్బలేం కర్మ ఏమేనా తింటాను" అని రాసేవాడు భాస్కరం గుంటూరు తన కోసరం వచ్చి, తిరిగి బెజవాడకు వెళ్ళి,
"నువ్వు వాల్తేరురా పద్మా! ఇక్కడ సముద్రం ఎలాంటిదో తెలుసా? నువ్వు నడుస్తూ వుంటే నీ చీరె కుచ్చెళ్లల్లోని చురకుదనానికి, దాని కెరటాలు పోటీలు పడతాయ్........దూరంగా, స్నిగ్ధంగా, నీలంగా, లోతుగా, నీ చిలిపి మాటల వెనుక దాగిన నిండైన ప్రేమలాగ అగుపిస్తుందీ సముద్రం నేను నీ కోసం ఈ సముద్రాన్ని ఇక్కడ ఓ ఏకాంత ప్రదేశాన్ని దాచి, నిత్యమూ వెయ్యి కళ్ళలో పూజిస్తున్నాను. ఆ రెంటినీ నీ పాదాలముందు పారేసి, వాటితో నువ్వాడుకుంటూ వుంటే. దొంగతనంగా నీ సౌందర్యాన్ని నే దోచుకుంటాను- నీ కనుల సంగీతాన్ని త్రాగుతాను......"
