నాగభూషణ రావు ముఖం ముడుచుకుని వెళ్ళిపోయాడు.
ఆ తరవాత రాజశేఖర మూర్తి మామగారిని ఇందుమతి అనారోగ్యాన్ని గురించి ప్రశ్నించాడు.
"అప్పుడప్పుడు సాయంత్రం అయ్యేసరికి తలనొప్పి అని మూలుగుతున్నది. వద్దే అంటే ఊరుకోదు. రోజల్లా ఏవో పుస్తకాలు చదువుతూ ఉంటుంది. వాళ్ళమ్మ ఊరుకోలేక కబురు చేసినట్లుంది మేనల్లుడి కి. ఇండుకి వాడంటేనే మంట" అన్నారు అనంత కృష్ణ శర్మ గారు.
"అయన సంభాషణ నాకూ అంత నచ్చలేదు లెండి. అయినా తెలిసీ తెలియని వైద్యాలు చేసేకంటే ఊరు కోవటమే ఉత్తమం. వైద్యం చేయించ దలుచుకుంటే తెలిసిన వైద్యుల దగ్గర చేయించటం మంచిది. ఏలూరు పంపించి దివాకర రావు గారికి చూపించ కూడదూ?"
"ఇదుగో, ఆయనా దిగుతాడు గా, రేపో, మాపో? చూద్దాం.
"వదినగారు కూడా వస్తున్నారా?"
"ఆ. నువ్వు వస్తున్నావు కదా అని వారిద్దరిని కూడా రమ్మని వ్రాశాను. వస్తున్నామని జవాబు వచ్చింది."
మరునాడు సాయంత్రం ఏలూరు నుంచి భానుమతీ, దివాకర రావు గారూ వచ్చారు. వస్తూనే అయన రాజశేఖర మూర్తిని కౌగలించుకుని, "ఏం, తమ్ముడూ అంతా క్షేమమా?' అని అడిగాడు.
"మీ దయవల్ల" అని జవాబిచ్చి , భానుమతీ దేవికి నమస్కారం చేశాడు. ఆమె చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేసింది.
ఆమె సరాసరి లోపలికి పోయి ఇందుమతి ని , రేవతి ని కౌగలించు కున్నది. ఇందుమతి కి ఆనాడు కూడా మళ్ళీ తల నొప్పి వచ్చింది. పరిస్థితిని తెలుసుకున్న భానుమతి భోజనాల వేళ ఆ సంగతి దివాకరరావు గారికి చెప్పింది. భోజనాలైన తరవాత అయన ఇందుమతి దగ్గిరికి పోయి, "ఏమమ్మా, తల నొప్పి వస్తున్నదటగా?" అని అడిగారు.
"అవును, బావా. అప్పుడప్పుడు సాయంకాలం కొంచెం వస్తూనే ఉంది. మళ్ళీ ఒక రాత్రి వేళ నిద్రలో తగ్గిపోతుంది."
"బలహీనత. అంతకంటే ఏం లేదు. ఎన్నాళ్ళు పోయినా బుచ్చి బువ్వలు తింటావాయెను! రోజూ మధ్యాహ్నం ఒక అరగంట నిద్రపోతూ ఉండు. అదే సర్దుకుంటుంది. నిన్నూ రాజశేఖర మూర్తి ని ఏలూరు తీసుకెళదా మానుకుంటున్నాను. అక్కడ ఏదైనా మంచి టానిక్కు తీసుకుందువు గాని" అని బయటికి వచ్చేశారు.
"కుటుంబం లో ఒక డాక్టర్ అంటూ ఉంటె చాలా ఉపయోగం సుమండీ" అన్నారు అనంత కృష్ణ శర్మ గారు. నవ్వి ఊరుకున్నారు దివాకర రావు గారు.
దివాకర రావు గారి సంభాషణ కూ, నాగభూషణ రావు సంభషణ కూ ఎంత భేదం! ఇందుమతి కి ఇద్దరూ బావలే. కాని, వారి పలకరింపు లలో, మాట పొందిక లలో వారి సంస్కారాల వ్యత్యాసం కనిపిస్తూనే ఉన్న దనుకున్నాడు రాజశేఖర మూర్తి.
18
నాలుగు రోజులు అనంత వరం లో ఉన్న తర్వాత దివాకరరావు గారు, భానుమతీ దేవి, ఇందుమతి రాజశేఖరులను తమతో కూడా ఏలూరు తీసుకొని వెళ్ళారు. బయలుదేరే ముందు అనంత కృష్ణ శర్మ గారు అల్లుళ్ళ కు, పెద్ద కూతురి కి కొత్త బట్టలు పెట్టారు. రేవతి కూడా అక్కలతో వెళతా నన్నది. కాని, అన్నపూర్ణమ్మ గారు వద్దులేమ్మని వెళ్ళ నివ్వలేదు.
దివాకరరావు గారి ఇల్లు ఆధునిక పద్దతులలో అలంకరించబడి ఉన్నది. ఇంటి ముందు ఆవరణ లో పూల మొక్కలు, క్రోటన్ మొక్కలు కుండీ లలో కనుల కింపు గా ఉన్నాయి. ముందు వరండా లో నాలుగు ఫేము కుర్చీలు, ఒక చిన్న బల్ల, ద్వారానికి పలచని తెరలు, లోపల పరుపులు కుట్టిన సోఫాలు, వెనకగా భోజనాలకు ఒక పొడుగాటి బల్ల, దాని చుట్టూ అరడజను కుర్చీలు, బల్ల దగ్గిర అద్దాల బీరువా లో పింగాణీ కప్పులు, ప్లేట్లు, గాజు గ్లాసు లో , చేమ్చాలు, వగైరా అమర్చబడి ఉన్నాయి. ముందు వరండా లో పడుకుని ఉన్న జూలు కుక్క ఇంటికి వచ్చిన వ్యక్తు లందరినీ వాసన చూసి, తోక ఆడించుకుంటూ పోయి దివాకర రావు గారి ఒడిలోకి ఎక్కి కూర్చున్నది.
ఏలూరు వచ్చిన తరవాత రాజశేఖర మూర్తి కి భార్యతో మళ్ళీ చనువుగా మాట్లాడు కోవటానికి వీలయింది. దివాకరరావు గారు ఆసుపత్రి కి పోయి నప్పుడు రాజశేఖర మూర్తి ఒంటిగా ఉండాడని భానుమతి దేవి చెల్లెలిని అతనితో కబుర్లు చెప్పడానికి పంపి, తాను ఇంటి పనులు చూసుకునేది. తన హృదయం లో ఉప్పొంగి పొరలు తున్న ప్రేమ వాహిని లో ఇందుమతీ పదంబుజాలు ప్రక్షాళించాలనుకున్న రాజశేఖర మూర్తి కి ఆమె అనారోగ్య శంక పాలపొంగు పై చన్నీటి జల్లు లాగ అయింది.
"నా దేవికి నాతొ మాట్లాడటానికి ఇప్పుడు వీలైందన్న మాట."
"మీ దేవిని మీ దగ్గిరే ఉంచుకుంటే మీ ఇష్టమయినప్పుడల్లా మాట్లాడుకుంటూ ఉండవచ్చు గా?"
"నేనూ అదే అనుకుంటున్నాను. ఇందూ. ఈ ఒక సంవత్సరం గడిచి పోనీ. నీకు కొంత ఆరోగ్యమూ చిక్కుతుంది. నా చదువూ ఒక మెట్టుకు వస్తుంది. ఆ తరవాత నిన్నిక విడవ మన్నా విడవను. అయినా, నువ్వు నా హృదయంలో లేనిదెప్పుడు?"
"అయితే మీ హృదయం లో ఉన్న దేవితోనే మాట్లాడుకోండి."
"ఇన్నాళ్ళూ నే చేస్తున్నదదేగా?"
"సరస్వతీ దేవి ఏమంటున్నది?"
"కనిపించినప్పుడల్లా నీ విషయం అడుగుతున్నది."
"అయితే ఎప్పుడూ ఆవిడతో మాట్లాడుతూనే ఉంటారన్న మాట."
"కాలేజీ లో అందరు స్నేహితులతోనూ మాట్లా
దినట్టె.
"ఆడపిల్లలతో అలా మాట్లాడితే ఎవరూ ఏమీ అనుకోరా?"
"అనుకోవడం , అనుకోక పోవడం వారి వారి మనః ప్రవృత్తు లను బట్టి ఉంటుంది. మాట్లాడుకునే వారి మనస్సు లు నిర్మలంగా ఉంటె ఎవరేమనుకున్నా బాధలేదు. మనస్సులు నిర్మలంగా లేనప్పుడు అది బంధువు లైనా సరే వెగటుగా ఉంటుంది. ఉదాహరణ కు మొన్న నాగాభూషణ రావు చూడు. అతను నీతో మాట్లాడుతున్నంత సేపూ నాకేమో అసహ్యం అనిపించింది. నువ్వు అంతకన్నా ఎక్కువ బాధపడి ఉండాలి."
"నిజమే . చూసి చూసి బంధువుల ను ఇంటికి రావద్దని చెప్పలేం కదా. సాధ్యమైనంత వరకూ అతనికి దూరంగానే ఉంటుంటాను. అతని చేతితో ఇచ్చిన మందు కూడా నాకు విషం అనిపిస్తుంది. సంస్కార హీనుల పెలాపన కు మనం బాధ పడనవసరం లేదు."
"నీ ఆరోగ్యం బాగాలేదని నాకు తెలియచేయ్యనే లేదే?"
"నా ఆరోగ్యాని కేమయిండిప్పుడు? మనుష్యులయ్యాక తలనేప్పు లు రాకుండా ఉంటాయా?"
"ఎప్పుడైనా వస్తే ఫరవాలేదు గాని తరచుగా వస్తుంటే నిర్లక్ష్యం చెయ్యకూడదు."
"ఏదీ, ఈ మధ్యనే కొంచెం అలా అనిపిస్తుంది. చదువు తగ్గించ కూడదూ?"
"ఏదైనా పుస్తకం మొదలు పెడితే అది పూర్తీ అయ్యేదాకా నాకు తోచదు."
"ఏమి పుస్తకాలు చదివా వేమిటి ఈ ఆరు నెలల్లో?"
"మను చరిత్ర, పారిజాతాపహరణం."
"నవ్య సాహిత్యమేమీ చదవ లేదా?"
"ప్రబంధ సాహిత్యం అయిన తరవాతే కదా నవ్య సాహిత్యం?"
"ప్రబంధాలలో భాష సంస్కృత భూయిష్టంగా ఉంటుందే! నీకు అర్ధ మవుతుందా?"
"తెలియని చోట నాన్నగారు చెబుతారు."
"అయితే మను చరిత్ర లో ఈ పాదాని కర్ధం చెప్పు చూద్దాం:
"సాహసా నఖం పచస్తనదత్త పరిరంభ
మామూల పరిచుంబితా ధరోష్టము."
"అదే దొరికిందా మీకు-- అర్ధం అడగటానికి?"
"ఇంతకీ తెలుసా, తెలియదా?"
"తెలుసు."
"అయితే చెప్పు మరి."
"చెప్పలేను."
"పోనీ, నే చెప్పనా?"
"ఇంకొక సంవత్సరం పోయిన తరవాత చెబుదురు గాని."
"దానికీ నిర్భంధా లేనా?"
"మీరు నోటితో చెప్పటానికి బదులు కార్య రూపంగా చెబుతారని భయం."
మనసారా నవ్వుకున్నారా నవ దంపతులు.
"పోనీ, పారితాజాపహరణం లో ఏం నేర్చు కున్నావో చెప్పు."
"భర్త నెలా శిక్షించాలో, నేర్చుకున్నాను."
"చేతితోనా, కాలితోనా?"
"నోటితో."
"అంతటి అదృష్టమా , నాకు! ఎప్పటికో?"

దివాకరారావు గారి ఇంట్లో పద్దతులన్నీ కూడా అదునికాలే. దివాకరరావు గారు, భానుమతి, రాజశేఖర మూర్తి , ఇందుమతి కలిసి కుర్చీ లపై ఎదురెదురుగా కూర్చుని బల్ల మీద భోజనాలు చేసేవారు. మధ్యాహ్నం తీరిక సమయం లో బ్రిడ్జి ఆడుకునేవారు. దివాకరరావు గారు, ఇందుమతి ఒక పక్షం. భానుమతి, రాజశేఖర మూర్తి ఒక పక్షం. దివాకరరావు గారు పేకాట లో కుశలుడు. అయన క్లబ్బులకు అలవాటు పడిన వారు. సాయంకాలం అయన టెన్నిస్ ఆడటానికి క్లబ్బు కు వెళుతూ రాజశేఖర మూర్తి ని కూడా తీసుకు వెళ్ళేవారు. అయన ఆడినంత సేపూ రాజశేఖర మూర్తి పత్రికలూ చదువుతూ కూర్చునేవాడు. రాత్రులు పెందరాళే భోజనాలు చేసి భార్యా సమేతులై రెండో అట సినిమాకు పోయేవారు. సినిమా హాలులో భానుమతి, ఇందుమతి మధ్యన కూర్చునేవారు. భానుమతి పక్కన దివాకరరావు గారు, ఇందుమతి పక్కన రాజశేఖర మూర్తి . సినిమా జరిగినంత సేపూ దివాకరరావు గారు ఏవో వ్యాఖ్యానాలు చేసేవారు. అందరూ నవ్వుకునేవారు. రసమయాలైన ఘట్టాలలో రాజశేఖర మూర్తి విలీనుదయ్యే వాడు. వెగటుగా ఉన్న ఘట్టాల లో అబ్బా అని కన్నులు మూసుకునేవాడు. కాని గోల చెయ్యడు. ఇందుమతి భుజాలు గాని, చేతులు కాని తన ఒంటికి తగిలినప్పుడు తనకేదో విచిత్రాను భూతి కలిగేది. కావాలని అప్పుడప్పుడు ఆమె భుజాల పై వాలేవాడు. ఆమె పైట కొంగు చేతితో తీసుకుని ముద్దు పెట్టుకునేవాడు. ఆమె లోలోపల పతి చర్యలకు నవ్వుకునేది.
