Previous Page Next Page 
అర్పణ పేజి 17


    రాజు లోలోపల మండి పోయాడు. అతనిలోని ప్రకృతి సిద్దమైన పురుషత్వం దెబ్బతింది. చివరకు ఒకనాడు సమయం చూసి తల్లి ఎదురుగానే పార్వతి తో అనేశాడు:    
    "నీకు విడాకులు పారేస్తే కానీ లాభం లేదు." విసిగి వేసరి పోయిన వాడిలా మొగం మాడ్చుకుని అన్న అతని మాటలకు పార్వతి నవ్వుకుంది. బాగా వెక్కిరించింది. పైగా ఊరుకోలేదు.
    "విడాకు లిస్తావో, పెడాకు లిస్తావో ! నాకేం? నలుగురూ నిన్నే ఏకుతారు, నేను మరొక మంచి మొగుణ్ణి పెళ్లి చేసుకుని దర్జాగా నీ దగ్గర కంటే హాయిగా బతుకుతాను."
    "హు. నోటి కొచ్చినట్లల్లా వాగే ఆడదానికి సిగ్గేక్కడి నుంచి వస్తుంది? మగవాడితో సమానం." విసురుగా వెళ్ళిపోతున్న రాజుకు అంతకంటే విసురుగా వెనక నుంచి మాటలు వినిపించాయి.
    "అవును! మగవాడు ఆడదానిలా ఉంటేనే అసహ్యం. ఆడది పురుషుడి లా ధైర్య సాహసాలు కలిగిఉండటానికి హక్కులు ఉన్నాయి మొదటి నుంచీ."
    "పారూ!" జానకమ్మ అదిలించింది. "వాడసలే.......మొదట్నించీ ........" మాటలకు తడుముకో వలసి వచ్చింది ఆవిడ.
    "ఏమిటత్తయ్యా?"
    జానకమ్మ డానికి సమాధానం చెప్పకుండా, "పోయి నీ పనులు చూసుకో"అనేసింది.
    "అత్తయ్యా! నీకు నా మీద కోపంగా ఉంది కదూ?' పార్వతి అడిగింది.
    "అది కాదే! విడాకులూ, వేరు పడడాలూ మన ఇంటా వంటా లేవు కదా? అల్లాంటి పనులు రాజు ఎప్పటికీ చెయ్యడు."
    "అదే మంచిది, అత్తయ్యా! నీకు తెలియదు"అన్నది పార్వతి.
    "ముందు ఆలోచించకుండా పెళ్లి చేసుకోవడ మెందుకు; తర్వాత సరిపడక విడాకులిచ్చు కోవడ మెందుకు? ఏడాది కూడా తిరగలేదు పెళ్ళయి" జానకమ్మ అంది నిట్టూర్పుతో.
    "అయితే నింద అంతా నామీదనే వేస్తున్నారా, ఈ ఇంట్లో అందరూ? బావను పెళ్లి చేసుకోవడం నా కిష్టం లేదని నేనే అప్పుడని ఉంటె మరొక విధమైన నిందలు వేసి ఉండేవారు . 'రాజును  చేసుకుంటావా, పార్వతీ?' అని మీరు నన్నడిగితే మనః పూర్వకంగా ఒప్పుకున్నాను. రాజు నా బావ-- అని గర్వం ఉండేది నాకు. ఇప్పుడేమో రాజుకు నేనంటే ఈషణ్మాత్రం ఇష్టం లేదని తెలిసి ఆ అన్యాయ మేదో నా వల్లనే జరిగినట్లు అనుకుంటున్నావత్తయ్యా, నువ్వు. మా అమ్మ ఉంటె నాకే అన్యాయం జరిగిందని వాపోయి ఉండును."
    జానకమ్మ మనసు చివుక్కు మంది. ఇన్నేళ్ళు తనదగ్గర పెరిగిన పార్వతి ఒక్కనాడు కూడా వాళ్ళ అమ్మను గురించి అడగలేదు. ఆ తలపే లేనట్లు అగుపించేది. అల్లాంటి అమ్మాయి ఇవాళ ఇలా అన్నదంటే -- ఎంత బాధపడ్డదో!
    స్త్రీ సొత్తు అయిన జాలి, వాత్సల్యం ఉప్పొంగాయి. మెల్లిగా వెళ్లి పార్వతి చుబుకం పట్టుకు ముఖం చూచింది.
    "చిన్నప్పటి నుంచి నా దగ్గర కూతురు లా పెరిగావు . వాడోకటీ, నువ్వోకటీనా, నాకు? పిచ్చి పిల్లవి" అంది జానకమ్మ.
    పార్వతి బలవంతంగా నవ్వవలసి వచ్చింది.

                            *    *    *    *
    ఆ సాయంత్రం పుట్టిన రోజు హడావుడి లో ఉన్నది పార్వతి. ఆడంబరం వద్దు -- అంటూనే అతి నాజూకు గాను తయారయింది. ఆఫీసులో బాగా పరిచయస్తులను పిలవడం వల్ల వాళ్ళందరూ వచ్చి పార్టీలో పాల్గొని అభినందించి వెళ్ళిపోయారు.
    సరోజ చదువు ముమ్మరంలో ఉన్నా, పార్వతి కోపం సంగతి గుర్తు రాగానే కదిలి వచ్చింది.
    ఇద్దరు చెలుల ఇష్టాగోష్టి చాలాసేపు సాగింది. సరోజ ఏ విషయాన్నీ -- అది చెప్పదగిన దైనా, చెప్పదగని దైనా -- ఎక్కువసేపు హృదయంలో దాచుకోలేదు. హితులు, ప్రేమస్పదులు ఐన వాళ్ళ దగ్గర అసలు ఆలోచించదు. అందుకే అంది నవ్వుతూ : "మీ రాజు గారు ఏం చేద్దామనుకున్నారో తెలుసా?"
    "ఏం చెయ్యాలను కున్నారు?" కుతూహలంగా అడిగింది పార్వతి, సరోజ కు అభిముఖంగా తిరిగి.
    "పక్షుల కే కాదు, మనుషులకీ రెక్కలున్నాయి -- అన్నాడు." సరోజ వ్యంగ్యంగా చెప్పింది. "అర్ధమయిందా?" అన్నది తిరిగి.
    "లేదు."
    "మీ పెళ్లి ఇంకా నెల రోజులుందనగా నా దగ్గర కొచ్చి , "మనిద్దరం పెళ్లి చేసుకుందాం, కాకపోతే లేచిపోదాం , పద' మన్నాడు."
    పార్వతి తెల్లబోయింది . "ఆ! అలా అడిగాడా? నువ్వేమన్నావప్పుడు?"
    "ఏమంటాను? 'రాజాదిరాజా! తమరు పార్వతి ని గనక చేసుకున్నారంటే నన్నొక చీమ కన్నా అధ్వాన్నంగా చూస్తారు' అని బుద్ది చెప్పి పంపాను."
    "ఎంత పని చేశావు, సరూ! రాజు అలా నిన్ను కోరితే నాతొ చెప్పమన్నాను కదా? దొంగలా ఊరుకున్నావా? ఛ! నీ మాటలు నమ్మకూడదు."
    "లేకపోతె కొండంత నీ ప్రేమ కొల్లగొట్టి పుట్ట గతుల్లెకుండా చేసుకోమన్నావా? అయినా పెళ్లి చేసుకున్న తర్వాత నేనేం  డాక్టర్నవుతానే , నా మొహం!"
    చాలాసేపు మౌనంగా ఉండి పోయింది పార్వతి.
    "ఏమిటే , ఆలోచన? రాజూ, నువ్వూ రాజీ అయి ఉంటా రిప్పుడు కదూ? ఇందాక నేను వస్తుంటే నీ నామ భజన చేస్తున్నట్లగుపించాడు."
    పార్వతికి నవ్వు వచ్చింది. "నామ భజన కాదది. తిట్ల భజన!" అంది.
    "నిజంగానా? ఫరవాలేదులే. అతనే క్రమంగా మారతాడు. నువ్వు బెంగ పెట్టుకునే రకానివి కావుగా?"
    "ఏమిటో ? స్వేచ్చ దొరకడం లేదు. చికాకుగా ఉంటోంది " అంది పార్వతి.
    కొంతసేపాగి పార్వతే మాట్లాడింది. "రాజు దగ్గర కోపంలో నీ గురించి కూడా చెడ్డగా మాట్లాడాను, సరూ!'
    "ఏమని అన్నా వేమిటి?"
    "ఏవేవో! చెప్పడ మెందుకు? నన్ను క్షమించు."
    "క్షమించాలె. నేనేలాటి దాన్నయినా రాజు నిన్ను గుర్తిస్తే చాలు!"
    సరోజ వెళ్తానంది. అప్పటికి బాగా చీకటి పడింది.
    సరోజ వెళ్తుంటే చూస్తూ నిలబడింది పార్వతి. అందుకోలేని ఆనందం లా బాధ కలిగించే అనుస్మరణం. ఇప్పుడు సరోజ వచ్చి, ఇద్దరూ మాట్లాడు కుంటున్నా , అప్పటి లా , ఇదివరకటి లా చిన్నతనపు ఆటలు, చిలిపి మాటలు రావడం లేదు.
    ఎంతలో ఎదిగి పోయారు -- తనూ, సరోజా!
    ఇంట్లో దీపాలు వెలిగాయి, పార్వతి తన  వైపు చూసుకుంది. మెరుస్తున్న దుస్తులు. తటిల్లతలా ఉంది. ఇంద్రధనుస్సు ను గుర్తు తెస్తున్న అలంకరణ కాస్సేపు తృప్తి కలిగించింది. తర్వాత వ్యక్తీకరించలేని నిరాశ.
    "తను పైకి ఆడంబరంగా , మంచి వ్యక్తిత్వం కలదానిలా కనిపిస్తుంది. లోపల ఏ గొప్పతనం లేదు. వైశిష్ట్యం లేదు.
    "సరోజ హృదయం పరిచి అన్నీ చెబుతుంది. తను అలా చెప్పలేక పోయిందే? రాజు ఎదట సరోజ ను గూర్చి తనేమందో ఆప్త స్నేహితురాలైన ఆ పిల్లకే చెప్పలేక పోయింది చివరకు.
    "రాజు నిజంగా సరోజను అంత గాడంగా ప్రేమించాడా? తండ్రికి అంత భయపడేవాడు, సరోజను తీసుకుని పారిపోయే ప్రయత్నం చేశాడంటే -- ఎంత ప్రేమ! అతను కేవలం తనను తప్పించు కోవడానికే ప్రేమ అనే కారణం సృష్టించి , తన ఎదట సరోజతో అలా ప్రవర్తిస్తున్నా డనుకుంది. అనుమానంగా ఉన్నా తనకు పట్టుదల బాగా పట్టుకుంది. తనేం సుఖ పడుతున్నది , ఇప్పుడు? లొంగ దీసుకుని దాసానుదాసుణ్ణి చేసుకోవడం సులువనుకుంది కానీ, తానె లొంగి పాదాలు పట్టుకోవలసి వస్తుందనే భయం వణికించేస్తుంది, అప్పుడప్పుడు. పూర్తిగా తప్పించు కుంటుంది అందుకే.
    "అతని సేవకురా లన్నట్లు స్వయంగా చేసుకోవలసిన పనుకు కూడా తన నెత్తిని పెట్టబోతాడు . ఆర్బాటం చేసి ఆఫీసు కనో, సినిమా కనో, అవేవీ కాకపొతే తలనొప్ప నో దాటు కుంటుంది తను. రోజూ అదే కధ! ఒక్క రోజూ  అతని మాట సాగనివ్వలేదు. తన కర్మకు ఇతనిలా తయారయ్యాడు కానీ, అప్పుడు స్కూల్లో చదివేదీ-- ఆ అవంతి! భర్త ఎంత ప్రేమగా చూస్తాడని , ఆమెను! పువ్వుల్లో పెట్టడమంటే అదే! ఆమె ఏమంటే అదే. అతనెంత గంబీరుడో అంత ప్రేమ హృదయుడన్న మాట. రాజును పెళ్లి చేసుకోకుండా ఉంటె బాగుండును. ఒకవేళ సరోజ చెప్పినది కల్పనేమో? ఉహూ. అబ్బబ్బ! తనలో ఒక్కొక్క సారి ఎంత నీచమైన , కుత్సితమైన ఆలోచనలు ప్రవేశిస్తాయి , ఇష్టం లేకపోయినా!'
    "అమ్మాయి ! దిష్టి తీస్తా, ఇలా రా!" జానకమ్మ పిలుపుతో వాస్తవ ప్రపంచంలో పడింది పార్వతి. రాజు అప్పుడే వచ్చి మేడ మీదకు వెళ్తున్నవాడల్లా ఆగిపోయి, పార్వతి బట్టల వైపు ఒకసారి నిర్లక్ష్యంగా చూశాడు. "ఈవిడ అందచందాలకి ముగ్ధులై పోయి, దిష్టి పెట్టేవాళ్ళే వరూ లేరిక్కడ" అని, పరుగెత్తినట్లు వెళ్ళిపోయాడు గదిలోకి.
    పార్వతి కోపంగా ఏదో అనబోయింది. అంతలో బూట్లచప్పుడు వినిపించింది వీధిలో. పార్వతి సహోద్యోగి కృష్ణమూర్తి లోపలికి వస్తూ, ఆమెను చూసి విష్ చేసి కూర్చున్నాడు. పార్వతి  కూడా ప్రతిగా నవ్వి, మాట్లాడింది.'
    కృష్ణమూర్తి తో ముఖ పరిచయాన్ని పురస్కరించు కుని రాజు వచ్చి పలకరించాడు.
    పార్వతికి అదొక మంచి అవకాశం, తనెంత అధునాతన యువతో, నలుగురి లో తనెలా వాక్చాతుర్యం ఒలికించగలదో రాజుకు తెలియాలన్నట్లు కృష్ణ మూర్తితో కిలకిలలు పకపకలు గానే మాట్లాడింది.
    "మీ పుట్టిన రోజుకి నా బహుమతి ఇదే" అంటూ జానెడు పొడవు, మూడంగుళాల వెడల్పు ఉన్న ఒక అట్ట పెట్టె పార్వతి చేతి కందిచ్చి అభినందనలు చెప్పి వెళ్లి పోయాడతను.
    "ఎవరే, అతను?' అంటూ జానకమ్మ వచ్చింది. ఆత్రుతగా పాకింగ్ విప్పి చూసే వరకు మరో పని తోచలేదు పార్వతికి. లోపల నుంచి పాతిక మడతలు వేసి ఉన్న జరీ నక్షత్రాల పలచని చీర ఒకటి బయట పడింది. అది ఏ రకానికి సంబంధించిన చీరో, దాని పేరేమై ఉంటుందో రాజు గ్రహించలేక పోయాడు.
    చీర మీద చెయ్యి రాస్తూ, "ఎన్నాళ్ళ నుంచో ఇల్లాంటిది కొనుక్కోవాలను కుంటున్నాను. నా కిష్టమైనదే తెచ్చాడత్తయ్యా!" అంది పార్వతి.
    "బాగానే ఉన్నట్లుంది దూరానికి" అన్నది జానకమ్మ , మూల్యం అంచనా వేస్తూ.
    "ఏదీ, చూడనీ" అంటూ చీర లాక్కున్నాడు రాజు పార్వతి చేతిలో నుంచి. ఎగాదిగా చూశాడు పావుగంట ఇంచుమించు. నలిగిపోయేటట్లు పట్టుకుని అతను చూస్తుంటే , పార్వతి గుండెలు దడదడా కొట్టుకున్నాయి. ఆమధ్య తన మీద కోపం తీర్చుకోవడం సాధ్యం కాక రెండు మూడు చీరలకు కత్తెర పెట్టాడు. నాలుగైదు స్నో సీసాలు, లవండరు బుడ్లు పగుల గొట్టాడు. ఇలా చాలా ఉన్నాయి, కధలు.
    "నలుగుపోతుంది . ఇచ్చెయ్యి." పార్వతి మర్యాదగా అడిగింది.
    "ఇది కట్టుకుంటావా ? వద్దు." అతని ముఖంలో పెంకితనం కనిపిస్తున్నది.
    "ఏం?' అంది పార్వతి.
    "ఇల్లాంటివి సానివాళ్ళు కట్టుకుంటారు. నువ్వు కట్టుకుంటే సిగ్గుతో నేను ఇదై పోవాలి!"
    "సానిదాన్ననే అతనిచ్చాడా? ఇంతకీ నేను ఆనందిస్తే నీ కళ్ళు చూడలేవు. ఆ చీర ఇలా పడెయ్యి. ఇది కట్టుకుని నీకు మాత్రం కనిపించను లే!"
    "ఉ హు, వీల్లేదు. దీని పని నేను పట్టిస్తాను." చీరను పాంటు జేబులోకి పోనిచ్చాడు.
    "తీసుకెళ్ళి ఏ సాని కిస్తావు?' పార్వతి హేళనగా అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS