Previous Page Next Page 
అపరిష్కృతం పేజి 17

 

    స్వర్ణా! మా ఇంట్లో నువ్వు చూసిన పాప - ఉషా బాల-- నా కూతురు. నేను వివాహితను. నే నున్న ఇల్లు మా అత్తవారిదే. నీవు చూచిన యువకుడు నా భర్త. న్యాయబద్దంగా మేము దంపతులం.
    నా కధ విని. ఓనమాల దగ్గరి నుండి చెప్పి నీకు బోరు కొట్టించనులే!
    మేము కాపులం - రెడ్ల పౌరుషమంతా మా నాన్న గారితో మూర్తీభవించి ఉంది. నాకు ఇద్దరు చెల్లెళ్ళూ, ఒక అన్నా ఉన్నారు. రాజన్నా, సుధేష్ణా మా పెద్దనాన్న గారి పిల్లలు. వాళ్ళు పెరిగింది మా ఇంట్లోనే.
    నేనంటే అందరికీ ఇష్టం. ఎంతో తెలివిగా చదివేదాన్ని. బి.ఎ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాను. ఎమ్ ఎ చదవటానికి నాగపూర్ లో చేరాను.
    ప్రశాంతంగా ప్రవహించే నా జీవన స్రవంతి లో తుఫాను ఇక్కడే సృష్టించబడింది.
    నాగపూర్ లో నాకు రామచంద్ర మూర్తి పరిచయ మయ్యాడు. పరస్పరం ఆకర్షితులమయ్యాము. ఎమ్. ఎ. ప్రీవియస్ చదివేటప్పుడు మా ప్రేమ అంతర్గతం గానే ఉండింది.
    నా పాలిటి శాపం లా రెండో సంవత్సరం వచ్చింది. అంతర్గతంగా ప్రవహించే నది పొంగి పొరలింది.
    ఈ సంవత్సరం గడిచిపోతే ఇక ఇద్దరం కలుసుకోలేము అన్న భావన మా ఇద్దరినీ సన్నిహితులను చేసింది.
    కాలు జారాము.
    నేను ఫలితాన్ని అనుభవించాను.
    సెలవులకు ఇంటికి వెళ్ళినప్పుడు మా వదినకు అయిదో నెల. నాకు నాలుగో నెల!
    వేవిళ్ళ బాధ ఆవిడ కంటే నాకే ఎక్కువగా ఉంది.
    ఇంట్లో అమ్మా, వదినా- ఇద్దరూ నా పరిస్థితిని ఊహించారు. చెప్పితే నాన్నగారు నన్ను చంపుతారేమో అన్న భయంతో పైకి చెప్పలేక మా అమ్మ చిత్రహింస పొందింది. వదిన బాధతో పాటు హేళన కూడా ప్రకటించింది.
    వదినకు సీమంతోత్సవం ఎంతో వైభవంగా జరిగింది.
    వదిన ఏదో ఘనకార్యాన్ని చేసినట్లు పేరంటానికి వచ్చిన వాళ్ళూ, బంధు మిత్రులూ ఒకటే మెచ్చుకోవడం! ఒకటే సంతోష పడడం! చలోక్తులతో, హాస్యాలతో , సరస సంభాషణలతో ముంచెత్తారు వదినని.
    మరి అదే స్థితిలో ఉన్న నేనో?
    వాంతి చేసుకొంటే అంతా గమనిస్తారని , అమ్మ నన్ను నలుగురిలోకి రావద్దని అంక్ష పెట్టింది. చదువు ఎక్కువై ఒళ్ళు బాగుండటం లేదని అందరితో అబద్దాలు చెప్పింది.
    నేను సీమంతోత్సవానికి అనర్హురాలిని! వదిన కున్న కోర్కెలు నాకు లేవు! వదిన ధర్మపత్ని! నేను అధర్మ పత్నిని! ప్రజలందరి కళ్ళ ముందూ వదిన ఒకరికి అంకితం కాబడ్డది. నేను అజ్ఞాతంగా అంకితమయ్యాను!
    వదినను పూజించుతున్నారు! పోగాడుతున్నారు! నన్ను ద్వేషించి, మట్టిలోకి ఈడుస్తున్నారు!
    వివాహితను కాకుండా గర్భవతి అయిన నేను పతితను! భ్రష్టను! మనసు నిలకడ లేనిదాన్ని! సంఘం లో నాకు స్థానం లేదు!
    నిప్పు దాచితే కాలుస్తుంది. స్త్రీ చేసిన తప్పూ అంతే! దాగదు.
    చండశాసనులైన నాన్నగారు నా పతనాన్ని విని రుద్రులయ్యారు. నన్నెందుకు నిలువునా చంపలేదో నా కిప్పటికీ అర్ధం కాదు. నా ప్రేమ వృత్తాంతాన్ని ధైర్యంగానే చెప్పాను.
    మూర్తిని ఇంటికి పిలుచుకొని వచ్చి, రైఫిల్ చూపి నన్ను పెండ్లాడవలసిందిగా నిర్భందించారు నాన్నగారు.
    'నేను బ్రాహ్మణుడిని. ఆవిడ కాపులు. మా ఇద్దరికీ పెండ్లి యెట్లా?' అని అన్నాడు మూర్తి.
    నాన్నగారు మండిపడి -'దానికి కడుపు చెయ్యటానికి కులం అడ్డు రాలేదా? నా సంగతి నీకు తెలియదు. ప్రాణాలు దక్కవని బెదిరించారు.
    నిజమే! చాటు పనులకు కుల ప్రసక్తి లేదు. బహిరంగంగా చేసే పనులకే కుల ప్రసక్తి! నేను ఎంత అవివేకినో ఆనాడే తెలియ వచ్చింది నాకు!
    బలవంతంగా మూర్తితో నాకు పెండ్లి జరిగింది. పురోహితుడూ, అమ్మా, నాన్నా, రాజన్నా, సుధా- వీళ్ళే సాక్షులు.
    పెండ్లి అయిన మరుక్షణం నన్ను ఇంటి నుండి తరిమారు. చివరి సారిగా మా నాన్నగారు నాతొ అన్న మాట లివి:
    'నిన్ను నమ్మి చదువు కోసం పంపాను. కీర్తిని తెస్తావని ఆశించాను కాని, ఇట్లా అందరినీ బురదలోకి ఈడుస్తావని అనుకోలేదు.
    ఆలోచిస్తే నాదే తప్పేమో! చిన్నప్పుడే నీకు పెండ్లి చేస్తే ఈ గోతిలో పదేదానిని కాదేమో. చిన్నప్పుడే పెండ్లి చేస్తే నిర్దిష్టమైన అభిప్రాయాలూ, ప్రేమలూ, వ్యక్తిత్వాలూ సమస్యలూ ఏమీ ఉండవు. పెద్దయిన తరవాత మీరు తలిదండ్రులను మోసగించటానికి జంకరు! మీ ఆలోచనలు మీ చుట్టే తిరుగుతాయి కాని, కుటుంబం చుట్టూ తిరగవు. ఈనాడు నువ్వు చేసిన పనికి నీ ఒక్కదానినే సుఖ పడేదానివి! మా సంగతి చూడు. నేను కనబడితే -- "ఈయన కూతురు చెడిపోయిన ' దంటారు. నీ చెల్లెళ్ళు కనపడితే -- "వీళ్ళ అక్క పెళ్ళి కాకముందే కడుపు తెచ్చుకొంది!" అని ఎగతాళి చేస్తారు. లోకం ముందు మే మెంత హీనపరచబడ్డామో నీకు తెలుస్తుందా? నీ పని వల్ల నీ చెల్లెళ్ళ కు ఎంత నష్టమో నీవు ఊహించుకోగలవా? వాళ్ళను చదువులకు పంపించగలమా? వాళ్ళూ నీ లాగే పక్క దారులు తొక్కుతారేమో? వాళ్ళకు చదవాలని ఉన్నా, నలుగురిలోనూ తిరగాలని ఉన్నా, వాళ్ళ కోరికలన్నీ నీ మూలంగా నాశనమయ్యాయి! నీ సంగతే చూచుకోన్నావు కాని, కుటుంబం మానావమానాల సంగతి నీ కక్కర్లేదు! ఛీ! చదువు కుటుంబ గౌరవాన్ని పెంపొందిచెందుకు గాని, చేడ గొట్టటానికి కాదు! ఏవో సినిమా కధలల్లో తప్ప కులాంతర వివాహాలు, ప్రేమ వివాహాలూ నిజ జీవితంలో రాణించవు. ముందు ముందు నీకే తెలుస్తుంది. నీ చెల్లెళ్ళ భవిష్యత్తును పాడు చేసినందుకు వాళ్ళ ఉసుళు నీకు కొట్టుతుంది.
    మళ్ళీ నా గడప తోక్కకు. నీకు మేం ఎవ్వరం లేము. మాకు సంబంధించినంతవరకూ నీవు చచ్చిపోయిన దానితో లెక్క. ఎక్కడైనా మన బంధుత్వాలు చెప్పితే, నేను చచ్చిపోయినంత ఒట్టు!"
    కన్యగా నన్ను వలచి, వలపించుకొన్న మూర్తి పెండ్లి కాగానే నాకు అపరిచితుడయ్యాడు. ఆ ఇంటిలో నేను ఆవాంఛనీయమైన అతిధిని! నేను చచ్చినా, బ్రతికినా ఎవరూ పట్టించుకోరు.
    నా నగలమ్మి ఎమ్. ఎ. పరీక్ష వ్రాశాను. జీవితానికి పనికి వచ్చే తెలివి లేదుగాని, పరీక్షలకు పనికి వచ్చే తెలివి బాగానే ఉంది. చక్కగా పాసయ్యాను.
    పాప పుట్టింది. చీకటి నిండిన నా జీవితాన్ని వెలుగు లోకి నడిపించుతుందేమో అన్న ఆశతో పాపకు ఉషాబాల అని పేరు పెట్టుకొన్నా.
    పాపకు ఆరో నెల వచ్చినప్పటి నుండి మూర్తి కానీ, అత్త మామలు కానీ, పాపను నా కివ్వలేదు.
    పాప సంగతి నేను చూడవలసిన అవసరం లేదని మూర్తి నిష్కర్షగా చెప్పాడు. పాపకు నేను తల్లి ననే విషయం ఎవరికీ, చివరకు పాపకు కూడా తెలియరాదని గట్టిగా హెచ్చరించాడు.
    కొడుకు రక్తం పంచుకొన్న పాప బ్రాహ్మణుల పిల్ల! తల్లి నైనా నా రక్తానికి ప్రాముఖ్యం లేదు. ఇది మా అత్తగారి ఊహ. కోడలుగా నేను పనికి రాను కాని, పాప మనవరాలుగా పనికి వస్తుంది! ఊహలు ఎంత చిత్రంగా ఉంటాయి!
    నన్ను ఇంటి నుండి తరుమలేరు. తరిమితే నేను అల్లరి పెడతానన్న భయం ! నిజంగా నేను ఏమీ చేసేదాన్ని కాదు.
    మూర్తి పనిగట్టుకొని ఈ ఊళ్ళో ఉద్యోగం వేయించుకొన్నాడు. నేను దిక్కులేని దానివనీ, తెలిసిన వాళ్ళ పిల్లను కాబట్టి దయతో ఇంట్లో ఉంచుకొన్నా మనీ అందరితో చెప్పారు. అందరితో పాప తల్లి చనిపోయిందని చెప్పారు.
    ఎవరికీ చెప్పకుండా నేను ఉద్యోగానికి అప్లై చేశాను వచ్చింది.
    స్వర్ణా! రాజకుమార్తె ల కధలు విన్నావా? పగలు చనిపోయి, రాత్రి బ్రతికే వారుట! నేను రాత్రి చనిపోయి , పగలు మీ మధ్య బతుకుతాను!
    సుధ ఈ ఊళ్ళోనే డాక్టర్ గా చేరిన తరవాత నా స్థితి మరీ అధ్వాన్న మయింది. నేను చెప్పక పోయినా  సుధ నిజం చెబుతుందేమో అన్న భయం వాళ్ళకి!
    మా ఇంటిలో పాతికేళ్ళ అమ్మాయిని చూశావు, గుర్తు ఉందా? ఆ అమ్మాయి మూర్తి మేనమామ కూతురు, సుమిత్ర. మొదటి నుండి సుమిత్ర ను మూర్తి కివ్వాలనే ఊహ. మధ్యలో తోకచుక్క లాగా నేను వచ్చాను.
    కొన్ని నెలల నుండీ సుమిత్రను వివాహం చేసుకొనే ఆలోచనలు కనిపించినాయి. మూర్తి నేను మెడికల్ లీవు పెట్టిన విషయాన్ని ఆధారంగా తీసుకొని, నేను పెళ్ళికి ఒప్పుకోక పొతే విడాకుల దాకా పోవచ్చుని బెదిరించాడు. మొన్నటితో మూర్తి కీ , సుమిత్ర కూ వివాహం నిశ్చయమయింది.
    నా స్థితి చూడు. పాపకు తల్లినని చెప్పుకోలేను. మూర్తి కి ధర్మ పత్నినని చెప్పుకోలేను. ఆ ఇంటిలో సర్వ హక్కులూ ఉన్న కోడలి నని పైకి చెప్పు కోలేను!
    పాప నన్ను 'అంటీ ' అని పిలుస్తుంది. ఇంగ్లీష్ భాష పుణ్యమా అని 'ఆంటీ' అంటే 'అత్తా' అని కాకుండా 'పిన్నీ ' అని పిలిచినట్లు భావించుకొని సంతృప్తి పడతాను.
    సంఘం దృష్టి లో , మా తల్లిదండ్రుల దృష్టి లో నేను చేసినది తప్పు! నిజంగా ఆలోచిస్తే అది ఘోరమైన నేరమే! భవిష్యత్తును గమనించకుండా, లాభ నష్టాలను బేరీజు వెయ్యకుండా, ఫలితాలను ఊహించకుండా తప్పటడుగు వేశాను! ఎంత చదివినా మనసు నిగ్రహించుకోలేని హీనురాలను!  మనిషిలోని మనసే జయిస్తుంది గాని బుద్ది జయించదు ! అంతా నాలాంటి చంచల చిత్తలే ఉండరు!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS