అప్పుడే తనకు చేతులు నొప్పి పుట్టుతున్నాయి. అరగంటసేపు తల ఎత్తకుండా పనిచేసిందా తను?- ఇలా రోజుకు ఎనిమిది గంటలు పనిచెయ్యాలి. ఇప్పటికే శోష వస్తూందే - అనుకుంది తులసి.
15
"నీకు ఫోనొచ్చిందమ్మా" అన్నాడు ఫ్యూను.
తులసి రిజిస్ట్రేషన్ డిస్పాచ్ లో పనిచేస్తున్నది. కుప్పలు కుప్పలుగా పడిఉన్న ఉత్తరాలను సార్ట్ చేయటంలో ఒక్క క్షణం ఊపిరి సలపటం లేదు.
"వస్తున్నా" అంటూ చేతిలోని బండిల్ అక్కడే పడేసి ఫోను తీసుకుంది.
"నేను శశిరేఖను" అంది ఫోనులోని కంఠం.
"ఓ, నువ్వా! గుడ్ మార్నింగ్ బావున్నావా, ఏం, ఇన్నాళ్ళకు జ్ఞాపకం వచ్చానన్నమాట" అంది తులసి.
"ఔనులెండి. నాకు మీరు ఇవాళన్నా జ్ఞాపకం వచ్చారు. నే నింకా జ్ఞాపకమున్నానా అని" అంది శశిరేఖ.
"ఛ, అదేం లేదు. ఏం విశేషాలు, పని ఎలా ఉన్నది?" అంది తులసి.
"పని గురించి ఏం మాట్లాడుకుంటాం గాని, మీరు ఇన్ని విషయాలు దాస్తారని నాకు తెలియదండీ" అంది శశిరేఖ.
"ఏమిటి, ఏం రహస్యాలు?" అంది తులసి, ఏమిటో అర్ధంకాక.
"ఇప్పుడలాగే అంటారుగాని, ఈ సాయంత్రం నన్ను కలుసుకునే తీరిక ఉంటుందా మీకు? ఓ విషయం అర్జంటుగా మాట్లాడాలి" అంది శశిరేఖ.
"ఊఁ, చెప్పేయ్" అంది తులసి.
"ఇలాకాదు. మీరు ఆఫీసునించి ఓ గంట ముందుగా వచ్చేయండి. కోఠీ తాజ్ దగ్గర కలుసుకుందాం" అంది శశిరేఖ.
"సరే" అంది తులసి.
పని ఎక్కువగా ఉన్నప్పుడు పర్మిషన్ అంటే పని ఎగేస్తున్న దనుకుంటారు. ఫోను పెట్టేసి, "ప్చ్, వెధవపని" అంది.
"ఏమమ్మా, అంత విసుక్కుంటున్నావు!" అన్నాడు యస్పీయం.
"తొందరగా వెళ్ళాలండీ. ఇక్కడేమో పని" అంది.
"అంత తొందర పనా?" అన్నాడు యస్పీయం.
తను మాట్లాడకుండా విసవిసా నడిచి, పెద్ద చప్పుడుతో కుర్చీలాక్కుని కూలబడింది. పిజియన్ హోల్స్ లోకి ఉత్తరాలను గిరాటు వెయ్యసాగింది.
యస్పీయం కుర్చీలోంచి లేచి దగ్గిరగా వచ్చి, "నీకు పనుంటే వెళ్ళిపోవమ్మా" అన్నాడు.
"థాంక్స్ ఇప్పుడే కాదులెండి. కాసేపైన తర్వాత వెళ్తాను" అంది.
తులసి కాసేపు గబగబా పనిచేసి, వెళ్ళి టాయ్ లెట్ లో మొహం కడుక్కుని, పౌడర్ వేసుకుని వచ్చింది. యస్పీయం దగ్గిరగా వెళ్ళి, "వెళుతున్నానండీ" అంది.
యస్పీయం తల ఎత్తే తీరిక లేకుండా పనిలో మునిగి ఉన్నాడు.
హోటల్ చేరేటప్పటికే శశిరేఖ ఆమె కోసం ఎదురుచూస్తున్నది ఫామిలీ సెక్షన్ లో.
"మీకు హాయిగా ఉన్నట్టుంది. అలసిపోలేదు" అంది శశిరేఖ.
"పని తక్కువుండి కాదు. వచ్చేటప్పుడు కాస్త మొహం కడుక్కున్నాను" అంది తులసి.
"ఏం తీసుకుంటారు, చెప్పండి" అంది శశిరేఖ.
"కాఫీ చాలు. అది సరే, ఏమిటంత అర్జంటు విషయం?" అంది తులసి.
శశిరేఖ ఏమీ చెప్పకుండా, చిరునవ్వులతోనే కాఫీ ముగించింది.
తులసీ సస్పెన్సు భరించలేకుండా ఉంది.
"ఏమిటి, శశీ, నీకు చెప్పని రహస్యాలు?" అంది.
"మన మొదటి పరిచయం నించీకూడా నేను హిమాయత్ నగర్ లోని హాస్టల్ లో ఉంటున్నానని తెలుసు గదా" అంది శశిరేఖ.
తులసికి చాలా అర్ధమైపోయింది.
కాని, మాట్లాడకుండా తల ఊపింది.
"నేను మిమ్మల్ని రెండు మూడు సార్లు రమ్మని ఎంత అడిగినా మీరు రాలేదు."
తులసి బిల్లు మీద రూపాయ నోటు పెట్టబోయింది. శశిరేఖ వారించి, తులసికి ఆ అవకాశం ఇవ్వలేదు.
"మీ చెల్లెలు మా హాస్టల్ లోనే ఉంటున్నదని నా కీ మధ్యనే తెలిసింది" అంది శశిరేఖ.
తులసికి నిప్పులమీద కూర్చున్నట్లుంది.
"ఆమె జరిగిందంతా చెప్పిందండీ" అంది శశిరేఖ.
"మంచిదండీ చాలా మంచి పని చేసింది. మీరు నన్ను పర్మిషన్ తీసుకుని ఇక్కడికి రమ్మన్నదీ ఈ రహస్యం చెప్పటానికేనా? చాలా థాంక్స్ మీ లిమిట్స్ లో మీరు ఉండటం మంచిది. నే నేదో పెద్ద నేరం చేసినట్టుగా మాట్లాడుతున్నారేమిటి? ఈ కబుర్లన్నీ వినటానికి నాకు తీరిక లేదు" అంది తులసి, గభాలున లేచి.
"తులసిగారూ, ప్లీజ్, కోపగించుకోకండి. మీతో వేరే సంగతి చెప్పాలి" అంది శశిరేఖ.
"అక్కర్లేదు" అంటూ తులసి ఈవలికి నడిచింది.
శశిరేఖ తులసి వెనకే నడుస్తూ వచ్చి, "సారీ, క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాను" అంది.
తులసి నడక వేగం తగ్గించింది.
"అది చెప్పింది విన్నారు. నా గురించి అంతా తెలుసుకున్నారు. ఇంకా ఏం మాట్లాడతారు" అంది.
"ష్ష్. అదికాదండీ. నేను మిమ్మల్ని మరో విషయం కోసం పిలిచాను" అంది శశిరేఖ.
తులసి మాట్లాడకుండా నడిచింది.
"మొదట ఆవిడ మీ చెల్లెలంటే నేను నమ్మలేదండీ. మొన్న డైనింగ్ రూంలో పరిచయమైంది. తనే అడిగిందండీ, మీ గురించి. మీరు నాకు పరిచయమా అనడిగింది. నేను ఔనన్నాను. అంతే. ఇక మిగతా కథంతా తనే చెప్పింది, నే నడక్కుండా తనెలా కష్టపడుతున్నదీ, తన డబ్బులో కొంత పొదుపు చేసి ఎలా తల్లితండ్రులకు పంపిస్తున్నదీ. గాడ్, అసలు అలాంటి అమ్మాయి మీ చెల్లెలంటే నేను నమ్మలేక పోయాను" అంది శశిరేఖ.
"ఏమిటి, అవేం మాటలు?" అంది తులసి.
"మా హాస్టల్ కెడదాం పదండి" అంది శశిరేఖ.
తులసి అభ్యంతరం చెప్పలేదు.
"ఆమె మరీ నొటోరియస్ ఐపోయిందండీ. మేట్రస్ చాలాసార్లు వార్నింగ్ ఇచ్చిందికూడాను. ఆవిడ కోసం ఎవరెవరో వస్తుంటారు."
తులసికి అవమానమూ, బాధా తల తిప్పేయి.
పాప తనతో పోట్లాడినా, మరేం చేసినా ఇంత దూరం పోగలదని తనెన్నడూ అనుకోలేదు.
"మొన్న ఆవిడ మేట్రస్ తో పోట్లాడిందండీ. మేట్రస్ తనను హాస్టల్ లోంచి తీసేస్తానంది. తర్వాత మేమంతా పోరుపెడితే మీ చెల్లెలు క్షమాపణ చెప్పుకుంది లెండి. మేట్రన్ చాలా మంచిదండీ. ఆవిడతో పోట్లాడటం మూర్ఖం. తులసిగారూ, అలాంటివాళ్ళు మా హాస్టల్ లో ఇంకా ఒకరిద్దరు ఉన్నారనుకోండి. కాని, ఏమిటో, ఆవిడను మీ చెల్లులుగా చూస్తే, చాలా జాలి వేస్తుంది. మీరు మీ కళ్ళముందర ఆవిన్నలా పాడైపోనివ్వకండి. మీ ఇంట్లో ఉండకపోతే మానె. మీతో పోట్లాడిందన్నా నేను సమర్ధిస్తాను. ఆవిడ మరేమైనా చెయ్యనీండి. కాని అలా విచ్చలవిడిగా తిరగడం చాలా అసహ్యం" అంది శశిరేఖ.
"నన్నేం చెయ్యమంటావమ్మా అది నేను చెబితే వింటుందా? ఇప్పుడు పెద్దదైపోయింది. నాకే పాఠాలు చెబుతోంది. నా ప్రవర్తననే దిద్దుకొమ్మంటుంది. పైగా అమ్మా, నాన్నాకూడా ఆ విషయం గ్రహించరు. దాని బాగును చూసి ఓర్వలేక రాశానంటారు. అది వాళ్ళకు డబ్బు పంపిస్తుంది. అందువల్ల ఇవన్నీ వాళ్ళకు కనిపించవు. కాని, ఇది ఇలాగై పోయిందని తెలుసుకున్నరోజున వాళ్ళ దుఃఖానికీ, పశ్చాత్తాపానికీ అవధులు ఉండవు" అంది తులసి.
"కాదండీ, తులసిగారూ, మీ రిప్పుడు హాస్టలుకు రండి. ఓ సారి చెప్పండి.
మీరు చెబితే ఆవిడ వింటుందో, వినదో - అది వేరు సంగతి. ఇవన్నీ మీరు తెలుసుకునిగూడా ఏ మెరుగనట్టుగా ఉండకండి. కనీసం మీ బాధ్యతగా నైనా చెప్పండి" అంది.
హాస్టల్ చేరుకున్నారు.
శశిరేఖ తులసిని లోపలికి తీసుకువెళ్ళింది.
"ఇదిగో, ఇదీ మీ చెల్లెలి గది. ఈవిడ నీరజ. మీ చెల్లెలూ, ఈవిడా రూంమేట్స్" అంది.
"నమస్కారమండీ" అంది తులసి.
"ఈవిడ మా రూంమేట్ అక్కగారా! నమస్కారం" అంది నీరజ.
ఆ మాటకు తులసి తన రెండు పెదవులూ ఎవరో కత్తిరించివేసినట్టుగా మాట్లాడలేకపోయింది.
తులసి మౌనాన్ని చూసి శశిరేఖకూ ఏం మాట్లాడాలో తోచలేదు.
"కూర్చోండి" అని తులసితో చెప్పి, "ఎక్కడి కెళ్ళింది?" అని అడిగింది నీరజను శశిరేఖ.
"ఏమో, నన్నడుగుతావేమిటి? నిత్యకల్యాణం అన్నట్టుగా ఆవిడుంటేనూ" అంది నీరజ.
శశిరేఖ ఇంక అడగలేకపోయింది.
"మీరు నా గదికి రండి. అక్కడ కూర్చుందాం. భోజనం వేళకు ఎల్లాగూ వస్తుంది" అంది.
తులసి ఆమె వెంట నడిచింది.
"పోనీ, మరోనాడు వస్తాను లెంచి. చీకటి పడింది. ఇంటికెళ్ళాలి" అంది,
"వద్దు. మరి కాసేపే" అంది శశిరేఖ.
తన దగ్గిరున్న పత్రికలు తులసిముందు పడేసి, బాత్ రూంకి వెళ్ళింది.
తులసి పత్రికలు చూస్తూ కూర్చుంది.
బయటినించి "శశీ!" అన్న పిలుపు వినబడింది. ఆశ్చర్యంగా తులసి తలఎత్తి చూసేటప్పటికి గుమ్మంలో పాప.
"నమస్కారమండీ" అంది పాప.
తులసికి భయంతో చెమటలు పోశాయి.
"ఏమిటిలా దయచేశారు, మీ ఫ్రెండు కోసం వచ్చారా?" అంది పాప వెటకారంగా.
మాటలు తడబడగా, "కాదు, పాపా, నీ కోసమే వచ్చాను" అంది తులసి.
"నా కోసమా, నా బాగోగులు కనుక్కుపోవటానికా?" అంది పాప. పాప గొంతులో ఎంత ధిక్కారం.
"శశిరేఖ ఏదీ?" అంది.
"బాత్ రూం కెళ్ళింది" అంది తులసి.
పాప వెళ్ళిపోబోతూంటే, "పాపా!" అంది తులసి. అదొక చిన్న పొలికేక లాగుంది.
పాప ఆగింది.
"మీ బావగారు నిన్నోసారి ఇంటికి రమ్మన్నారు. ఏదో పనుందిట" అని బొంకింది.
"బావకు నాతో ఏం పని?" అంది పాప.
"ఏమో, తెలియదు" అంది తులసి.
"అంత అవసరముంటే బావే వచ్చేవాడుగా, నీతో ఈ రాయబార మెందుకు పంపేవాడు" అంది పాప.
"ఏమో, పాపా, నా కవన్నీ తెలియవు. కాని తప్పకుండా రమ్మన్నాడు. తనమీద గౌరవం ఇంకా మిగిలుంటే రేపోసారి రమ్మన్నాడు" అంది తులసి గొంతు పూడుకు పోగా.
ఉబికివచ్చే కన్నీటిని ఆపుకోలేక, "ఆగండీ" అంటున్న శశిరేఖను వినిపించుకోక తులసి హాస్టలునించి పరుగెత్తింది.
