'వాళ్ళతోటే విట్లే గాని నీ కతడు నచ్చాడా.'
'ఆ, ఈ అయిదారేళ్ళ పరిచయం లోనూ కొద్దిగా ముక్కోపం తప్పించి వేరే ఏవిధమైన లోపమూ అతన్లో నాక్కని పించలేదు.'
'భేష్. ఇద్దరూ ఒకే చదువు ఒకే ఉద్యోగం ఒకర్నొకరు ఇష్టపడ్డారు . అంతకన్నా ఇంకేం కావాలీ--'
'బాగుంది ఇక కులమూ, గోత్రమూ --'
'కులం బ్రాహ్మలే గోత్రాల గొడవ నాకు తెలియదు'- తల్లి వేపు విసుగ్గా చూస్తూ అంది.
'అబ్బ ఊర్కుందూ. ఏదో నీ చెప్పు చేతల్లో ఇంట్లో పడుండే పిల్లల్నన్నట్టంటావేవిటి దాన్నీ' అని భార్యని కాస్త మందలించి 'చూడమ్మా. నీ వరకూ కుర్రవాడి వివరాలన్నీ నువ్వే ఎంచుకున్నావ్ గనక నీ కభ్యంతరం లేదంటే నేనోమారు అతడ్ని, వాళ్ళ పెద్ద వాళ్ళనీ కల్సుకు మాట్లాడుతాను ఏమంటావ్.'
'అలాగే నాన్నా, అసలా మాటే మీతో చెప్పాలను కుంటున్నా నేను. అతని అభిప్రాయం కూడా అదే నాన్నా. మన శర్మ గారికేదో బంధువు లనుకుంటా కూడా వాళ్ళు.'--
'వారి దేవూరో'-
'ప్రస్తుతం విజయవాడ లో సెటిలయ్యారుట వాళ్ళ నాన్న.'
'కొంపదీసి ఆ చక్రపాణి గారి వియ్యాల వారు కాదు గదా?'
అనుమానంగా అంది అమ్మమ్మ.
'వుండదమ్మా' వారిది బర్మా ట కదూ' అంది నళిని తల్లి.
'అన్నట్టు వీరూ అట్నుంచొచ్చి సెటిలైన వారే అనుకుంటా.'
'పేరు తెలుసా ఆలోచనగా అన్నారు జోగారావు గారు.
'ఏదో తమాషా పేరు నాన్నా....ఆ? విశ్వనాధ దత్తు -- దత్తుగారంటా రనుకుంటా....'
'ఆ, అయితే వాళ్ళే. ఎవరో ఆమధ్య చెప్పారు కూడా వారి రెండో అబ్బాయి వున్నాడని....అయినా ఆ రాక్షసి తో ఎవరు పడగలరు బాబూ' రెండు చేతులూ పైకెత్తి ఒక్క దండం పెట్టేశారు నళిని తల్లి....
'ఆ, ఆవిడ గయ్యాళితనం దాన్నేం చేస్తుంది లెద్దూ--
'అంతే కూడా కాదోయి ? ఆ కుర్రవాడేవరో పిల్లని ప్రేమించి దాన్నే చేసుకుంటానని కూడా అందరితోటీ స్పష్టంగా చెప్తున్నాట్ట కూడా. ఆసంగతేరక్క. ఈ వెర్రి ఇల్లాలు పాతికవేలిస్తారా? ఏభై వేలిస్తారా!' అంటూ బెరాల్చేస్తుందిట తెలిసిందా. ఆవిడ మాటలు విన్నాక జోగారావుగారేదో అనబోతుంటే తనడ్డు వొచ్చి 'ఆ, అతను చేసుకుంటా నంటున్న 'ఆ ఎవత్తేనో' నేనే నాన్నా.' అంది పకపకా విరగబడి నవ్వుతూ నళిని.
'ఇదుగో అమ్మాయి. నువ్వు పెద్ద చదువు కున్నదానివే అయితే అయ్యావ్ గానీ' ఇటువంటి విషయాల్లో తొందర పాటు పనికి రాదు సుమా' అంది మందలిస్తూ తల్లి.
'ఆ మాటా నిజమే నళినీ? వాళ్ళు చెప్పిందీ నిన్నేనా? లేక'--
'ఛా, నేనేరగనా నాన్నా! ఇంతకీ నేనేమన్నా అజ్ఞానా వస్తలో వున్న పిల్లనా' మీరంత హెచ్చరించెందుకూ. ఆవిడ గయ్యాళిదన్న మాటేవో నిజమే. అందుకే అందుకు ఫలితంగా మునుముందే గొడవలూ రాకుండా వుండేటట్టు అతనేదన్నా ఏర్పాటు చేస్తానని మాటివ్వాలని చెప్పేస్తా--'-
'అవ్వ, నువ్వే అలా అడిగితె ఏమన్నా బాగుంటుందా.'
'అందుకని అలాటి మోఘమాటాలన్నింటి కి పోయి ఇప్పుడు నోరు మూసుకుంటే తరవాత ఆ నరకం అనుభవించే దేవ్వరనీ' సూటిగా అడిగింది తల్లిని.
'చాలా బాగుందమ్మా. ఏవండీ విన్నారా'
'ఏం న్యాయమైన మాటే అందీ.... అది చెప్పినట్టు ఇప్పుడు మెత్తగా ఊర్కుంటే తరవాత యాతన్లు పడాల్సింది అదా, నువ్వా. ఈ రోజుల్లో పిల్లలకి మనమేమీ చెప్పక్కర్లేదు నువ్వోర్కో' మళ్లీ తన పని చూసుకుందుకు వెళ్ళిపోయారాయన.
'ఎలా వుంటాడే బావా?....' అంది అమ్మమ్మ పక్కనే కూర్చుని అన్నీ చక్క విని అర్ధం చేసుకున్న ఎనిమిదేళ్ళ పిల్ల దేవిక.
'అదికి ముందు'-- నళిని ఏదో అనబోతుంటే --
'అది కి ముందుగా ఈ ఒరసేవిటే? 'అందాకా బావా' అను' అంటూ దిద్దాడు అసూయ పట్టలేక నళిని మేనమామ.
'నిన్నెవ్వరూ చెప్పమన్లె దిక్కడ' అంటూ గునిగింది నళిని చేయి పట్టుకుని ఊపుతూ.
'ఎలా వుంటాడా? నల్లగా, లావుగా, బొర్ర ముక్కూ, తుట్ట పెదిమలూ , బుంగ మీసాలూ '--
'ఛ? ఛ? అయితే అచ్చంగా ఈ మావయ్యకి మల్లేనే వుంటాడన్న మాట. ఛ. నీకసలు ఎంచుకోవడమే తెలియదు. ఫో-- ' అంది కళ్ళూ, ముక్కూ పెట్టడం లో తన అయిష్టాన్ని వ్యక్త పరుస్తూ.
'పోనీలే నువ్వు మంచి అందగాణ్ణి చూసి ఎంచు కుందువు గాని ఏం?' చెల్లెలి చెంప మీద ముద్దుగా ఒక్క టంటిస్తూ అంది నళిని.
'ఛీ , నేనసలు పెళ్ళే చేసుకోను, బాగా చదువుకుని నీకుమల్లె డాక్టర్నవుతాను.'
'మరి మీ అక్కయ్య అటు డాక్టరమ్మా అయి ఇటు పెళ్లీ చేసుకుంటుందిగా' అన్నాడు . మళ్ళీ ఆ అవకతవక మావయ్య.
'చెప్పాగా అక్కయ్య కేవీ తెలియదనీ. నేనలాక్కాదు పెద్ద డాక్టరమ్మనై ఎన్నెన్నో మందుల్ని కనిపెట్టి నీలాంటి వాళ్ళందర్నీ బాగుచేస్తా.
'నాలాంటి వాళ్ళేవిటేవ్. దుంగ ముక్కలా నేనుంటేనూ' అన్నాడు భయశ్చర్యాన్ని ప్రదర్శిస్తూ హాస్యంగా మావయ్య.
'దుంగలా ఒళ్లుండగానే సరా మావయ్యా. కాస్తంత బుర్ర కూడా వుండొద్దూ' అంది నవ్వుతూ నళిని.
'అమ్మయ్యో బుర్ర కాదె. అంత పెద్ద బుర్రని ఇంత చిన్న చేత్తో ఎలా పట్టుకోగల్ననీ . అదీ గాక బుర్ర గట్టిగా వుంటుంది. ముక్కూ, చెవులూ , పెదిమ లూ ఇలాంటి వన్నీ మెత్తగానూ, చిన్నవి గానూ వుంటాయి గనక, ఇలా పట్టుకుని అలా కావాల్సిన కొలతని వుంచి, ఇలా మిగతా అంతా కోసేసి కుట్టేయ్యొచ్చు.' అంది మేనమామ ముక్కుని నిజంగానే పట్టుకుని. ఇన్నీ అభినయంతో చూపిస్తూ.
'అబ్బ వదలవే . ఇప్పుడు నీ చేతులో కత్తి లేదు, బతికి పోయాను. లేకుంటే అంతపనీ చేసేసుండేదానివే' అన్నాడు బలవంతంగా దేవిక చేతిపట్టు విడిపించుకుని , కందిపోయిన ముక్కుని తడువు కుంటూ మావయ్య.
'మరలా కోసేసి కుట్టేస్టే అసహ్యంగా వాత పడుదుటే' అంది అంత చిన్న పిల్లకి తోచినా అదీ ఓ మంచి 'ఐడియాయే' అనుకుంటున్న నళిని , ఆపై ఇంకా ఏం చెప్తుందో తెల్సుకుందాం అన్న కుతూహలంతో.
'అదా వోస్ నేను డాక్టర్నయ్యాక అలాంటి వన్నీ తెలియకుండా సర్దుకునే ఆపాటి మందేదన్నా కనిపెట్టలేక పోతానాఏం లెద్దూ. అంతగా కనిపెట్టలేక పోయినా ఇన్నీ వంకర్లుండే కన్నా అసహ్యంగా వుండదు గదా ఆ గుర్తూ' అంది. అతి సులువైన విషయం లా తీసి పారేస్తూ దేవిక.
'నా బంగారు తల్లివి కదే. మీ అక్కయ్య డాక్టరయిందన్న మాటే గాని నువ్వన్నట్టు గా ఎందుకూ ప్రయోజనం లేదు. పోనీ నువ్వన్నా దబ్బున పరీక్ష లన్నీ ప్యాసై నాకీ లోపాలన్నీ తీర్చేద్దువు గాన్లె.' అన్నాడు అమాంతం గా మేనకోడల్నేత్తుకుని ముద్దాడి దింపుతూ. పాపం కావలసినంత ఆస్తికి ఏకైక పుత్రుడై వుండి విద్యాబుద్దు లబ్బక మొద్దులా వుండి పోవడం తో పాటు అతి కురూపి కూడా అయిన ఆ మావయ్య.' నిజంగా ఇటువంటి వైద్యాలే గనక ఏ నిపుణుడన్నా కనిపెడితే తనవంటి వారికే ఎంత ఉపయోగం పడ్నూ' అని అనుకుంటే 'నిజంగా మావయ్యన్నట్టు , తనంత చదువూ చదుకున్నందుకు ఇటువంటి ముఖ్య విషయాల్లో పరిశోధన్లు జరపక పోవడం గొప్ప లోపమే' అనుకుంది అదే సమయాన్న నళిని.
'పాపం పాటు లేని వాడికి కూటి మీదే లోకం' అన్నట్టు వేరే ఏవిధమైన వ్యాపకమూ లేని మావయ్య కి ఎప్పుడూ, తన పెళ్ళి గురించే ధ్యాస. అందుకోసరం ఎన్నెన్ని విధాల విశ్వ ప్రయత్నాలో చేసి , రహస్యంగానూ, బహిరంగం గానూ అనేక సార్లు అవమానం పాలు కూడా అయ్యాడు పాపం అతడు.
తన అక్కగారూ, తన తల్లీ తన కోసరం సుధని అడగాలని అనుకోవడం విన్న మావయ్య. ఒకసారి తన మేనల్లుడి కోసరం వచ్చిన వేణు తో పళ్ళికిలించుకుంటూ ఈ ప్రస్తావన తెచ్చేసరికి కోపంతో అతణ్ణి తన్నేంత పని చెయ్యడమే గాకుండా, తమ సుధ ని అంత తక్కువ బుద్దితో ఊహించు కుంటున్నందుగ్గాను తన స్నేహితుడితో సహా ఆ ఇంట్లో వారందర్నీ దులిపే సోచ్చాడు వేణు. అంతతో పోనివ్వకుండా తమది పొరపాటని ఒప్పుకునే టంత వరకూ మళ్ళీ వారింటి గుమ్మం తొక్కలేదు కూడా.
'అయినా, చక్కగా అందంగా ఎంతో బావున్న రఘు వుండగా, అతన్ని మానేసి నువ్వీ బాగులేని బావ నెందు కేంచుకున్నా వక్కా!' అంది మావయ్య దింపగానే నళిని తో దేవిక , మళ్లీ.
'పోనిద్దూ , ఇతనైతేనేం. నువ్వు డాక్టరువయ్యాక బాగా తయారు చేసేస్తావు'గా' అంది. 'హుం మొదట్లో అతని కోసరం ఆశపడి అది అందరాని పండు కోసరం ఆశే పడడం వంటిదేనని తెలిసి రాగానే ఆరంభం లోనే ఆ కోరికను తుడిచేసుకున్నానే తల్లీ' అని మనసులో అనుకుంటూ.
'ఏవిటే అప్పట్నుంచీ దీని గొడవా?' మళ్ళీ వచ్చింది అమ్మమ్మ.
'అబ్బే, ఏవీ లేదు ఆ పిల్లా డెలా వుంటాడని అది అడిగితేనూ పెద్ద వాళ్ళందరి కన్నా ఇది మేలే! దీనికైనా ముఖ్యమైన సంగతి, ఏదో దాన్ని గురించి మాత్రమే అడగాలని తోచింది అనుకుంటున్నాం.' అంది నళిని మీరంతా అర్ధం మాలిన సాంప్రదాయాల్ని గురించే అడిగారు గాని అసలు విషయం ఎవ్వరన్నా అడిగారా, అన్ని అర్ధాల్ని ఆవిడకి తోచేటట్టు.
'అదా, అది సిసింద్రీ. నువ్వు ముందుగా ఆ మాటన్నా మా చెవిని వేశావ్. అది ఆపాటి కూడా చెప్పకుండా అ చేసుకున్న వాణ్ణి తీసుకొచ్చి ఏకంగా ఎదుట నిలబెట్టేస్తుంది . ఏమే' అంది ముసిముసి నవ్వుల్నవ్వుతూ అమ్మమ్మ అది తప్పన్నది బలపరుస్తూ!
'అయ్యో రామా సభ్యతగా ప్రవర్తించడమన్నది ఇంకా ఎప్పటికి తెల్సుకుంటారో మనవాళ్ళు' అనుకుంటూ లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది నళిని.
