Previous Page Next Page 
నీళ్ళు రాని కళ్ళు పేజి 17


    అక్కయ్య ముఖం వివర్ణమై పోయింది. ఖిన్నురాలై రాధ ముఖం వైపు చూడసాగింది. నాకూ నవ్వొస్తున్నది. రాధ బింకంగా కూర్చుని మాట్లాడకుండా మజ్జిగన్నం తింటున్నది. రాధ ఓరగా అక్కయ్య వైపు చూసింది.
    "రాధగారూ . కోర్టులో కేసుండగా వారు మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చా. నా కాపరం మీరే తీస్తారా రాధా" అక్కయ్య కళ్ళు చేమ్మర్చాయి.
    "మగవాళ్ళ కోరికలు ఆడవాళ్ళ కోరికల్లా నెలల పర్యంతం దాగవు అక్కయ్యా. సరే విషయం తెల్సింది కనుక నేనాయన్ని పెళ్లి చేసుకోను సరేనా."
    రాధ భోజానం చేసి ఇవతలికి వచ్చేసింది. అక్కయ్య ముఖంలో యేవో ఆలోచనలు ముసిరాయి.
    మర్నాడు రాధ కూడా నాతొ పాటు భోజనం చేసి మా ఆఫీసు కు వచ్చింది.
    దార్లో అడిగాను.
    "అక్కయ్య ను అట్లా బెదర గోట్టావెం రాధా?"
    రాధ నా వైపు నిశితంగా చూసి.
    "సునందను నేను బెదర గోట్టలేదు. ఆ అమ్మాయి అమాయకురాలు, వెకిలిది , తెలివి తక్కువది అనే పదాలు  మీరే వాడి మీరే బెదర కొట్టారు" అన్నది.
    నేను మాట్లాడలేక పోయాను. ఇద్దరం ఆఫీసుకు వెళ్లాం. నా పక్కనే ఉన్న మరో కుర్చీ లో కూర్చున్నది రాధ అందరి కళ్ళూ ఆమె మీదనే ఉన్నయ్యి. ఆరోజుల్లా ప్రతి వారూ ఏదో నెపంతో నా సీటు దగ్గరకు వచ్చి రాధను చూసేవారే.
    రామారావు గారు వచ్చి "వాడి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చిందా' అనడిగారు.
    "లేదు" అన్నాను.
    రాధ వైపు చూసి "వీరెవరు ' అన్నారు చెప్పాను. రామారావు గారు వెళ్ళాక రాధ అన్నది.
    "బావ వద్ద నుంచి ఉత్తరం రాలేదా"
    "లేదు. తరువాత మాట్లాడుకుందాం ఇది ఆఫీసు" నెమ్మదిగా అన్నాను.    
    సాయంత్రం ఇంటికి వెళుతూ జరిగిన విషయమంతా రాధతో చెప్పాను. వారిని గురించిన సంగతులు చెప్పకుండా ఎంత దాచి పెట్టినా రాధ ఊరుకోదు. అత్తయ్య నైనా అడిగి తెల్సు కుంటుంది. కాకపోయినా మనస్సులో గూడు కట్టుకున్న వ్యధ రాధతో చెపితే కాస్త మనస్సు తేలిక పడినట్లు ఉంటమే గాక నాకు తోచని సలహా కూడా ఏమైనా చేపుతుందేమో నని ఆశించాను. ఎప్పుడో పెళ్ళిలో చూసిన రాధ నాకు పరమ అప్రురాలు కాకపోయినా అమ్మాయి తెలివి తేటలు నాకు బాగా తెల్సు. నేను చెప్పిందంతా విని రాధ అన్నది.
    "ఉద్యోగం కోసం వచ్చిందాన్ని మీ ఇంటి వ్యవహారాల్లో జోక్యం కలుగ జేసుకోటం తప్పేనేమో."
    "తప్పులూ, బాధలూ మా కుటుంబం లో జరగవలసినవి జరిగిపోతూనే ఉన్నయ్యి. నువ్వేమీ పరాయిదానివి కాదు. ఆచరణీయమైన నీ సలహా ఏదయినా పాటిస్తాను. మాతో పాటు నాలుగు మెతుకులు తిని ఇక్కడే ఉండు. నీ ఉద్యోగ ప్రయత్నమేదో నువ్వుచూసుకో" అన్నాను.
    పది రోజులు గడిచాయి. రాధ తన ఉద్యోగ ప్రయత్నాలు తనే చూసుకున్తున్నది. అప్లికేషన్లు మాత్రమే నేను టైప్ చేస్తున్నాను. ఉదయమే వెళ్ళేది. మధ్యాహ్నం వచ్చేది. మళ్ళీ సాయంత్రం మూడు గంటలకు వెళ్ళేది. ఒక్కొక్కప్పుడు వచ్చేసరికి రాత్రి తోమ్మిదయ్యేది.
    ఒకరోజున రాధ అన్నది.
    'ఉద్యోగం విషయం లో నువ్వు చాలా అదృష్ట వంతు రాలివి. సర్వీస్ కమీషన్ వాళ్ళు నిన్ను పిల్చి బొట్టు పెట్టి ఉద్యోగం ఇచ్చారు. నాకు చెప్పుల జత అరిగినా ఉద్యోగం దొరకలేదు. కాని ఎన్నో విషయాలు తెల్సుకున్నాను. నీలా ఉద్యోగం దొరకట మనేది మేనరికం లాంటిది. నా ఉద్యోగ ప్రయత్నాలు అమ్మాయికి పరాయి సంబంధం వెతికినట్లే వుంది. మనస్సును ఆకట్టుకో గలిగితే ఈ రోజుల్లో మొగుడన్నా దొరికేట్టున్నాడు కాని ఉద్యోగం దొరికేటట్లు లేదు. రోగికి మందులూ ఇంజక్షన్ల మాదిరి నిరుద్యోగి కి మంత్రులు సిఫార్సు లూ కావాలి."
    నా పరిస్థితికి రాధ నన్ను మెచ్చుకుంటుంటే ఆ అమ్మాయి కన్న నా పరిస్థితే మెరుగని పించింది. అదృష్ట మనేది బంగారం లాంటిదయినా ఆ ముద్దను కరిగించి నచ్చిన నగలు చేయించు కుంటేనే ఆ బంగారపు విలువ,శోభ . అందరికీ వెల్లడయ్యేది. నా తోటిది నగలు చేయించుకున్నా ఆ రాళ్ళ నగలు దిగిపోవటం చేత అన్నీ మట్టి సుద్దల్లా వెలాతెలా పోతున్నాయ్యి. కాని ఎప్పటి కయినా ఆ బంగారు నగలను చేడకోట్టింఛి మంచివిగా తయారు చేయించుకో వచ్చు. కాని రాధకు అసలు బంగారమే లేదు.
    "నువ్వన్నది నిజమే రాధా, ఉద్యోగాధ్యాయం లో నీ అనుభవాలేమిటో."
    రాధ నవ్వి చెప్పింది.
    "ఒక ఆఫీసుకు వెళ్ళే దాన్ని. ఆ ప్రోఫైటరో, మేనజరో కమిన్ మేడమ్ , టెక్ యువర్ సీట్ అని ఆహ్వానించి కూర్చో పెట్టేవాళ్ళు. కూర్చుని మెల్లిగా ఉద్యోగం విషయం చెప్పేదాన్ని. ఓహో, సారీ. నో వేకెన్సీ  ప్లీజ్. యు కెన్ గో అనేవారు. మరొకచోట మా ఆఫీసులో ఆడపిల్లల్ని వేసుకోటం లేదమ్మా. ఇంకొక చోట అనేవారు. మీరు చాలా స్మార్ట్ గానే వున్నారు కాని బి.కాం అయితే బావుండేది. మీరు బి.ఏ కదా సారీ అనేవాళ్ళు. మరొక ప్రబుద్దుడు ఉయ్ వాంట్ ఓన్లీ బి,యస్సీ  ప్లీజ్ అనేవాడు. సరే ఏదో ఒక ఉద్యోగం పెళ్ళి సంబంధం లాగా ఎప్పుడో దొరక్క మానదు. మీ విషయం లో నేనొకఆలోచనకు వచ్చాను.
    "ఏమిటది?'
    "మీ అక్కయ్య ను కాస్త ఎడ్యుకేట్ చెయ్యాలి. ఎంతసేపూ అక్కయ్య అమాయకత్వాన్ని, బావ కోర్టు తత్వాన్ని ఆడిపోసుకుంటున్నారే గాని రోగానికి తగిన చికిత్స చెయ్యటం లేదు. ఇంటి దగ్గరే అక్కయ్యకు చదువు చెప్పి కొంత రాపాడితే లోకజ్ఞానం కలుగుతుందేమో.
    "నా సంసార తాపత్రయంలో పెడత్రోవను పడుతున్న వారిని తీర్చి దిద్దుదామనే ధ్యాసతోనే ఇంతకాలం వెళ్ళబుచ్చాను కాని, ఈ పరిష్టితికి ఒక కారణమై కూర్చున్న అక్కయ్య జీవితంలో జోక్యం కలుగ జేసుకుందామనే జిజ్ఞాస నాకు ఇన్నాళ్ళ నుంచీ లేకపోయింది.
    "నీ సలహా అమలు జరుపుతాను రాధా. కాస్త చదువు ధోరణి లో పెడితే అక్కయ్య లో కొంత ,మార్పెమయినా కలుగుతుందేమో.
    ఆ మర్నాటి నుంచే నాలుగో క్లాసు పుస్తకాలు తెచ్చి అక్కయ్యకు పాఠాలు మొదలు పెట్టాను. తనకు వీలయినప్పుడు రాధ కూడా అక్కకు చదువు చెప్పేది.
    వారు వెళ్ళి నెల దాటింది. ఆరోజే ఆఫీసు అడ్రసు కు నా పేర ఉత్తరం వచ్చింది . చదివాను.

                                                                                                   కాకినాడ
    లక్ష్మీ సౌభాగ్యవతి సుభాషిణి కి ఆశీర్వదించి వ్రాయునది;
    నాకన్నా చిన్నదానివి కనుక ఆశీర్వచనములు అందచేయటం విధాయకం కనుకా ఆశీర్వదించి వ్రాయునది అన్నాను లేకపోతె నమస్కరింప తగినదానివి. మన జీవితాలకు తోడు మన కిద్దరు పిల్లలు. వాళ్ళు ఏ పాపం చేశారో గాని మన కడుపున పుట్టారు. మన కర్మకు మించిన ఖర్మ వాళ్ళది.
    నాలో మానవత్వమూ, మానధర్మాలూ లేవని నువ్వన్నప్పటికీ , నీలో ఆదర్శ గృహిణి కి ఉండవలసిన ప్రేమానురాగాలూ, అణుకువ లేవని నేను అన్నప్పటికీ మనిద్దరం జీవించే ఉన్నాం. భార్యాభర్తలమయినా ఒకరి అభిప్రాయాన్ని మరొకరం మన్నించుకోలేక దూరదూరంగా ఉన్నా ఉద్యోగానికి తిలోదకాలిచ్చే స్థాయికి మనం చేరుకోలేదు కనుక ఉద్యోగరీత్యా మనం గౌరవ ప్రడంగానే జీవిస్తున్నాం. జీవించాలి కూడా.
    ఏకాకిగా జీవితాన్ని గడుపుదామనే నిర్ణయంతో ఇక్కడికి వచ్చినా అలాంటిదే ఒక కాకి తన గూటి లో నాకు ఆశ్రయం ఇచ్చింది. అడ కాకులు అక్కడ, మగ కాకులు ఇక్కడ.
    అందరూ క్షేమమనే మా భావం.
    నువ్వు కాకినాడ ట్రాన్స్ ఫర్ కు పెట్టుకున్న అప్లికేషన్ చేరింది. అవును నువ్వు సాధించేందుకు నేను అక్కడ లేను కదా. నీ కోరిక మేరకు నువ్వు కూడా ఇక్కడికే వస్తే నా జీవితం ఆలోకానికే వెళ్ళ వలసి వస్తుందేమో! అదే నీ కోరికయితే నీకూ ఈ ఊరు బదిలీ అయ్యే ప్రయత్నం నేనూ చేస్తాను. అలోచించి జాబు వ్రాస్తావు కదూ?
                                                                                                  సెలవు,
                                                                                               భవదీయుడు''                                

                                                                                                శ్రావణ కుమార్.
    ఆ ఉత్తరం చదువుతుంటే నా జీవితం సగం పైగా తగ్గిపోయినంతగా బాధపడ్డాను. మనస్సంతా ఆ ఉత్తరమే ఆక్రమించటంతో ఆరోజున టైపు చేసిన కాగితాల్లో తప్పులు కూడా చాలా ఎక్కువే పడ్డాయి. ఇటీవల అన్ని తప్పులు ఎప్పుడూ రాలేదు. కాల ప్రవాహం లో మనుష్యులు కొట్టుకు పోతున్నట్లే మనః క్లేశమనే ఈ ప్రవాహం లో నా జీవితం మరింత వేగంగా కొట్టుకొని పోవాలేమో ననుకున్నాను.
    ఇంటికి వెళ్ళాక మీ అబ్బాయి దగ్గర్నుంచీ ఉత్తరం వచ్చిందని చెప్పి ఆ ఉత్తరాన్ని అత్తయ్య కు ఇచ్చాను. "నీకు రాసిన ఉత్తరం నేను చదవట మేమిటే" అని అన్నా పరిస్థితి తెల్సిన ఆవిడ ఆ ఉత్తరాన్ని పూర్తిగా చదివింది.
    "వాడి మనస్సు ఇంతగా మారిపోతుందనుకోలేదు. నువ్వోక్కసారి కాకినాడ వెళ్లిరా, వాడు ఆనందరావు ఇంట్లోనే ఉంటున్నాడల్లె వుంది." అన్నది అత్తయ్య.
    రాధ వచ్చాక ఆ ఉత్తరం చదవమని ఇచ్చాను. అ ఉత్తరాన్ని రెండు సార్లు చదివింది రాధ.
    "బావ నీమీద చాలా ద్వేష భావంతో ఉన్నాడు. ఇలాంటి ఉత్తరం వచ్చాక వెళ్లక పొతే తప్పంతా నీదే అవుతుంది. వెళ్ళి రా అక్కయ్యా" అన్నది రాధ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS