'మీ ఆరోగ్యం బాగుంది. ఫిట్ సర్టిఫికేట్ పైకి పంపించి వేస్తాం.'
సూర్యం తన చేవులనే నమ్మలేక పోయాడు. 'ఎక్స్ రే తీసారు. ఏమైనా అనుమానం వుందేమో అనుకున్నాను.'
'అనుమానం మీదే తీసాను. మిమ్మల్ని అన్ ఫిట్ చెయ్యటానికి కాదు. ఏమైనా లోటు పాట్లుంటే సలహా యివ్వడానికి.'
'ఏమైనా వుంటే సంశయించక చెప్పండి" 'ఏమీ లేదు. మీ గుండె మీ వయసుకు మీ ఆస్థి పంజరానికి సరిపడ్డట్లే వుంది. కాస్త పెరిగినట్లు అనిపించటానికి కారణం మీ శరీరం లో మాంసం కండలు తక్కువ కావటం వలన మీరు ప్రతి రోజూ ఒక మైలు దూరం పరుగెత్తండి. సరియైన ఆహారం తినండి. మీ వెయిట్ పెరుగుతుంది.'
'ఆహారం హెచ్చు తింటే అరగదండి.'
అతను నవ్వాడు. 'ఎందు కరుగుతుంది? కొద్ది నిమిషాలు మిమ్మల్ని చూసాక మీ గురించి తెలుసు కోగలిగాను. మీరేల్లప్పుడూ ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంటారనుకుంటాను. ఈ అనవసరపు ఆలోచనల వలన జీర్ణాశయం దెబ్బ తింటుంది. మీరు సంతోషంగా వుండి సరియైన వ్యాయామం చెయ్యక పొతే మీకు అజీర్ణవ్యాధి వచ్చే అవకాశం వుంది. మీకంటే వయసులో పెద్ద వాడ్ని. కాస్త సలహా యివ్వ వచ్చను కుంటాను.'
'దయచేసి తప్పక చెప్పండి.'
'మనిషి భయంతో బ్రతికే యుగం మనది. ఈ భయం రావటానికి కారణం మనం మన గురించి మనదేశం గురించే తల్చుకోవటం. ఇలా తల్చు కోడానికి కారణం మనకున్న అత్యాశ. ఈ అత్యాశ మరచి పొతే గానీ మనిషికి నేను నేననే అహం పోదు. ఆ అహం పొతే గానీ మనిషి తనకో ఆత్మ వుందని గుర్తించ లేడు. ఆత్మ, దయ, సహనం, త్యాగాన్ని ప్రదర్శించేటట్లు యీ జీవి చేస్తుంది. ఈ లోకం లో దుఃఖం ప్రక్కనే సుఖం వుంటుంది. కుళ్ళు కాలవ ప్రక్కనే మీరు చూడ గలిగితే గడ్డి మొక్కలు అందమైన గడ్డి పూలతో ఉంటాయ్. కుళ్ళు కాలవనే విచారంతో చూస్తూ కూర్చోకండి. ఆ ప్రక్క గడ్డి పూల వేపు చూడటానికి ప్రయత్నించండి. పెద్ద లేక్చరై పోయింది. మీకు యిదంతా తెలియనిది కాదు.
'మీ సలహా కు కృతజ్ఞుడ్ని. గడ్డి పూల వేపు చూడటానికి ప్రయత్నిస్తాను.
సూర్యం కు తను ఆఫీసరునయ్యానన్న సంతోషం కన్నా తన ఆరోగ్యం తో యింకో జన్మ ఎట్టానన్న వుత్సాహం హెచ్చింది. అందులో సాదరంగా పెద్ద డాక్టరు యిచ్చిన సలహాను మళ్ళీ మళ్ళీ తలచుకున్నాడు. ఒకచోట రాసుకున్నాడు. ఎప్పుడైనా తను తప్పి జారి మళ్ళీ లేనిపోని ఆలోచనలతో నున్నప్పుడు అదోకసారి చదివితే మనసు త్రిప్పుకోవచ్చు. అమ్మ, అంతా సవ్యంగా వెళ్లి పోయిందని చెప్పగా ఆనంద బాష్పాలు రాల్చింది. కళ్ళు తుడుచుకోకుండా.
'నాయనా భగవంతుడు నీచేత అధికారం యిచ్చాడు. అతని బిడ్డల కడుపు యెప్పుడూ పొరపాటు నైనా కొట్టక' అంది.
ఈ అమూల్యమైన సలహా తన హృదయంతరాళం లోనికి చొచ్చుకుని ప్రతి ధ్వనించింది. ఎల్లప్పుడూ యీ మాతృదేవత కోర్కె టేప్ రికార్డర్ చేసినట్లు హృదయంలో నిల్చి పోయింది.
తనకు బొంబాయి లో ఆఫీసరు గా వేసినట్లు అర్దర్డు వచ్చేసాయి. అమ్మ అంత దూరం ఇల్లు వాకిలీ వదలి రావటం కష్టం. అదీ కాకుండా తనకింకా యిల్లెదీ దొరకలేదు. బొంబాయి లో యిల్లు దొరకటం చాలా కష్టం అని విన్నాడు. తనకు తెలిసిన కొద్ది మంది ఆఫీసర్ల యింట్లో తను ఒక్కడైతే కొన్నాళ్ళు గడపవచ్చని ఒంటిగా వెళ్ళడానికి నిశ్శయించాడు. తను ఆఫీసరయ్యాడని వాళ్ళ కుటుంబాలలోనే కాదు, జాతిలోనే ప్రాకిపోయింది.
సూర్యం దగ్గరకు యెందరెందరో వచ్చారు. ఎంతో పొగడ్త సాగించారు. ఇది వరకు ' ఏం ఆస్థి పాస్తులున్నాయ్ . గుమస్తా వుద్యోగమేనా? ఆ కుటుంబాన్నాన్నంతా యెత్తే సరికి సరిపోతుంది. మా అమ్మాయి ముద్దు ముచ్చటలు ఆ గంపెడు సంసారం లో ఏం తీరుతాయ్.' ఇలా అన్న వాళ్ళే సూర్యం కు పిల్ల నిస్తామని ముందుకు వచ్చారు. అతని తల్లిని అమితంగా గౌరవించి బ్రతిమాలారు. పెద్ద పెద్ద హోదాలో నున్న వాళ్ళు బాగా డబ్బు పులిసిన వాళ్ళు వేలకొద్దీ కట్నాలు ఎర చూపించారు.
సూర్యం యిదంతా చూసి నవ్వుకున్నాడు. అతని తల్లి క్కూడా ఒకవిధంగా ఒళ్ళు మండి 'నా కొడుక్కి కష్టం వచ్చిన్నాడు యీ చుట్టాలంతా యేమయ్యారు' అని మనసులో అనుకుని బయటకు మాత్రం ' ఈ రోజుల్లో మా యిష్టాలు పని కోస్తాయా? అబ్బాయి యిష్టం-- వాడు పెళ్ళి వద్దంటూన్నాడు.
'తల నెరిసాక చేస్తావా రుక్మిణమ్మ. పెళ్లి చెయ్యమంటారా పిల్లలు. వద్దే అంటారు. తల్లిదండ్రులు బాధ్యతతో ఒక ముడి పెట్టాలి గానీ.'
'నేనిప్పుడు వేగలేనండి. ఇంకో అమ్మాయి పెళ్లి కుంది.'
'కుండ మార్పులు చేద్దామా?
'మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు.'
'వాడికి వుద్యోగం చేసే ఖర్మేం వచ్చింది. నిక్షేపం లాంటి ఆస్థి, అది కాసుక కూర్చుంటే చాలు,'
'అమ్మాయి యెలా వుంటుంది?'
'దానికేం? అదో నిక్షేపం లా వుంటుంది.'
'అప్పుడే తొందర లేదమ్మా. బాబు పెళ్ళికి ఒప్పుకోవటం లేదు.'
'ఇలా యెన్నో సమాధానాలు చెప్పుకోలేక రుక్మిణమ్మ వూరికి కదలింది. బొంబాయి వెళ్ళిపోయే ముందు ఒకసారి స్వగ్రామం వెళ్లాడు. ఆ గ్రామంలో పుట్టి తొలిసారి బి.ఎ అనిపించుకున్నాడు తనే-- తోలి సారి అఫీసరైన వాడు తనే! ఊరు వూరంతా అతనికి స్వాగతం యిచ్చింది. ఎందరెందరో యెన్నెన్నో ప్రశ్నలు వేశారు. కొందరు కలవాళ్లు తను బొంబాయి లో వుండగా చూడడానికి వస్తామన్నారు. సూర్యం గౌరిని చూడలేక పోయాడు. హృదయం ఒకసారి స్పందించింది. ఆమెను భర్త చనిపోయినందుకు కాదు ఆమె భర్తను కలుసుకోకుండా చేసినందుకే తన్ను తాను క్షమించ లేక పోతున్నాడు. అతను భార్యకు ఏం చెప్పేవాడో? ఆ చివరి మాటల్లో ఏదో ఒక కోర్కె వుండేది. ఆ అంతిమ కోర్కె తీర్చి ఆమె జీవితాంతం తృప్తి తో బ్రతికేది. ఆ తృప్తిని గౌరికి తను లేకుండా చేసినందుకే బాధపడసాగాడు.
8
గౌరీ గురించి తండ్రి యేమీ ఆలోచించలేదు. ఆలోచించడాని కేముందన్నాడు. వాళ్ళ అత్తవారి నించి రావలసింది ఒక్క రూపాయి లేదు. ఆ కలిగిన సంతానం ఒక్కటైనా అది మగ బిడ్డ కాకూడదూ? గౌరీ కి అదృష్టం లేకపోబట్టే ఆ బిడ్డా కూతురై పోయింది. అదొక భారం. ఆ భారం దించుకోడానికి ఆమె యెంత ఆరాట పడాలి.... వచ్చే మొగుడు సరిగ్గా లేకపోతె అదొక విచారం. గౌరీ విచారానికి ప్రతిరూపమౌతుంది. ఆ విచారం నుంచి బయటపడటానికి విజ్ఞానం వుండాలి. విజ్ఞానం చదువు వల్ల కానీ సంస్కారం వల్ల గానీ అబ్బుతుంది. ఆమె యింట్లో కూర్చుని యెవరితో పరిచయం యేర్పరచుకుంటుంది? సమస్యలు పరిష్కరించటం వలననైనా విజ్ఞానం అలవరచుకునే అవకాశం లేదు. ఇక మిగిలింది విద్య. అ విద్య విజ్ఞానాన్ని యువ్వటమే కాక అవసరమైతే ఆమె కాళ్ళ పై ఆమె నిల్చే అవకాశం యిస్తుంది. ఆమె బిడ్డ కూడా తెలివి తేటలను మెరుగులు దిద్దుకునే అవకాశం ఉంది. అందుకే తల్లిదండ్రులతో గౌరీ చదువు గురించిన ప్రస్తావన తెచ్చాడు.
'మన కుటుంబం లో లేని పనెందుకు నాయనా?' అన్నాడు తండ్రి.
అమ్మ అందుకుంది. 'నీలాంటి తోబుట్టువులుండగా దానికేం కొదవ నాయనా? అంతకీ కాకపొతే ఆ పిల్లను , ఒక తమ్ముడికి చేసుకుంటుంది. దాని తల యెలానూ చెడింది. దాని మీద నిందలు మొయ్యగలదా?'
'మన కుటుంబం పెద్దది నాయనా! మనలో ఎవ్వరే తప్పటడుగు వేసినా కుటుంబం అంతటికీ కీడు ముట్టుకుంటుంది.' తండ్రి వినయంగా అనగానే సూర్యం మనస్సోక్కసారి విశాల వేపు మళ్ళింది. జవాబు చెప్పలేదు. ఊళ్ళో వున్న నాలుగు రోజులు యేటి వేపు, పంట పొలాల్లోనికి సరుగుడు తోటల్లోనికి వెళ్ళేవాడు. కిలకిల పరుగులు తీస్తున్న యేరు, పొలాల్లో కదులుతున్న లక్ష్మీ దేవి గాజుల గల గలలు , సరాగాలడు తున్న సరుగుడు చెట్ల పై చిలకల గుంపుల కిలకిలలు క్రొత్త అర్ధాలను సృష్టించాయ్. ఏం పెద్దమ్మా అని, ఏం అత్తయ్యా, ఏం వదినా అని యిలా వరసలు పెట్టి వూర్లో పెద్ద కుటుంబాల నించి పాటక జనం యిళ్ళకి వెళ్ళేవాడు. వరసైన వాళ్ళు సరసం విరసం కాకుండా మోటు పదాల నుపయోగించేవారు. 'ఈ బెండకాయ యింకా ముదరలేదు వదినా' అని సమాధానం యిస్తే' ఎవడబ్బ బొట్ట్టేవు' అని యింకో వయసు మళ్ళిన ఆవిడ అందుకునేది. కొందరు యౌవనం అతనితో మాట్లాడకుండా చూపులతోనే బాసలాడేది. చిన్న నవ్వు ఆ చూపులకు సమాధానంగా యిచ్చేవాడు.
'సూర్యం యింత పెద్దవాడైనా -- ఎంటమ్మ గర్వంగా అసలే లేదు.'
'వాళ్ళ తాత తిండికి లేకపోయినా నీతిగా పోయాడు. పెద్దలు చేసిన తపస్సు వూరికే పోతాదా? వంశాన్ని వుద్దరించడానికి యిలా యెవడో పుట్తాడు' ఒక ముసలమ్మ అంది.
ఇలాంటి మాటలు సూర్యం విని యెన్నెన్నో ఉత్సాహంగా తలచుకున్నాడు. ఆ ముసలమ్మ మాటలు మనసులో మాటిమాటికి మెసలసాగినాయ్. తనలాంటి అధికారం గల వుద్యోగులకు నీతిగా పోవటం ఒక తపస్సు లాంటిది. ఆ తపస్సు తాము ఆచరిస్తే వూరికే పోదు. దేశాన్ని వుద్దరించే మహానాయకుడెవరో ఉద్భవిస్తాడు. అతని కృషి వలన రామరాజ్యం ప్రతిష్టింపబడుతుంది. ప్రజలు సుఖ పడ్తారు.
