Previous Page Next Page 
వంశాంకురం పేజి 18


    ఆనంద్ కు ఎక్కడ లేని గర్వమొచ్చింది. ఒక యువతి నల్గురి యువకులలో తనను ప్రత్యేకంగా చూస్తుందంటే గర్వము కాదా? సీతారామయ్య లేచాడు. ఇద్దరూ మౌనంగా అతన్ని అనుసరించారు. సరసారి ఇల్లు చీరిన , రేఖ తొందరగా వంట పనిలో దూరి, వంట ప్రారంభించింది. సీతారామయ్య పని ఉందంటూ వెళ్ళిపోయాడు.
    "రేఖా! వంటలో సాయము చెయ్యనా?' ఆమె ఏం మాట్లాడలేదు.
    "చెప్పవేం రేఖా" రెట్టించాడు.
    "మీరు నా పేరుకు కొత్త అందాన్ని చేర్చి పిలుస్తున్నారు. నా పేరేనా అని సందేహము కల్గుతున్నది. మరోసారి వినాలని...." చిన్నగా నవ్వింది.
    "చాలా కొంటె అమ్మాయి . అత్తగారనే పిలువాల్సింది."
    "మీరు పిలవలేరని తెలుసులెండి."
    "ఏమిటో ఆ ధీమా?"
    "పిలువండి చూద్దాము." ఆమె ఓ ప్రక్కకు మెడ వంచి నిలబడితే , భుజాల మీదుగా జారి, తొడలను తాకి వేణి బంధము, అతన్ని బెదిరించి నట్టే కనిపించి, 'అత్తగారని కాదు , అందాల బొమ్మా" అప్సరస అపురూప సౌందర్య వతి ఏమన్నా తక్కువే.
    'ఆలస్యమైతే , నా స్నేహితులంటారు. త్వరగా కానియ్యి. సిగరెట్టూ వెలిగించి బయటకు వచ్చాడు.
    రాను రాను రేఖ అతన్ని ఆరాధించటము యెక్కువైంది. ఆ విషయము గ్రహించిన ఆనంద్ గర్వపడ్డాడు గాని, ముందు ఏమిటన్నది అలోచించి, ఆబంధము నుండి బయట పదాలని ఆలోచించలేదు. అతనొక్క పూట ఏ హోటల్లోనో తిని భోజనానికి రానని చెబితే, అందరు వెళ్ళిపోయాక రహస్యంగా అతనికి క్యారియరు తీసుకు వెళ్ళేది. అట్లా అని ఆమె పొరపాటన లేము. ఆ వయసు అటువంటిది. ఆవేశము, తను నిర్ణయము పట్ల నిశ్చింత తప్ప మరో ఆలోచనే రాదు. అటువంటి అప్పుడు తగినపని మెదడుకు, మందలిస్తూ ఓ దారికి తెచ్చే పెద్దలు ఉండాలి. సీతారామయ్య కు సంగీత పాఠాలు తప్ప మరో విషయమే పట్టదు. ఆ విషయాలన్నీ అప్పుడు ఆలోచించ లేకపోయాడు. ఆనంద్ . ఆమె ఆరాధనకు అతని ప్రోత్సాహము లభించింది.
    కాలము ఎవరి కోసము ఆగదు. పరీక్షలు ముగిశాయి. అందరూ తమ, తమ ఊర్లకు తిరుగు ప్రయాణమయ్యారు.
    "మీరింత తొందరగా వెళ్ళకుంటేనేం?" దిగులుగా చూచింది రేఖ.
    "నీకు తెలియదు రేఖా. అమ్మను విడిచి ఇన్నాళ్ళు ఎప్పుడూ ఉండలేదు. ఆమె చాలా దిగులు పెట్టుకుని ఉంటుంది. నెలా పది హేనురోజులు ఎంతలో గడుస్తాయి?"
    "మీకు గడుస్తాయి. నాకెలా గడుస్తాయి? మీరందరూ వెళ్ళిపోతే పని కూడా ఉండదు. ఈ సంవత్సరము వేగంగా గడిచిపోయింది?"
    "బాగా చదువుకో. హోమ్ వర్క్ ఇచ్చి వెళ్తానుగా.' అతను ఆమెను ప్రసన్నురాలిని చేసుకోవాలని ఎంతో ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఇంటికి వెళ్దామనగానే అందరూ, సురేఖ పై నున్న కోపము మరిచిపోయారు.
    "నిజంగా మీదయ వల్ల ఆరోగ్యంగా వెడుతున్నాను." చక్రవర్తి క్లుప్తంగా తన అభిప్రాయము చెప్పేడు.
    "నిజమండి. మీరే గనక లేకుంటే ఎప్పుడో పారిపోయేవాడిని అన్నాడు గోవింద్. "మెనీ మెనీ థాంక్స్ సురేఖా ఈయేడు వచ్చాక తప్పక ఇంగ్లీష్ చెప్తాను." విల్లియమ్స్ ప్రమాణము చేశాడు. ఆ పూట అందరికి విందు భోజనము  పెట్టింది. ఆనంద్ వెంట తండ్రీ, కూతురు అతని గదికి వచ్చి సామాన్లు సర్దినారు. టాక్సీ పిలువటానికి వెళ్ళాడు సీతారామయ్య. ఆనంద్ సంకోచంగా పాతిక రూపాయలు ఆమె చేతిలో పెట్టాడు.
    "ఎందుకూ?"
    "దేనికయినా అవసరము వస్తాయి. ఇలా నా దగ్గర అభిమాన పడితే, నేను అసలు మాట్లాడను.' అన్నాడు.
    "అలా అయితే అంతా ఇవ్వండి." చొరవగా  అతని జేబులోని పర్సు తీసుకుంది. "ఇల్లు చేరేవరకు టీకి, సిగరెట్ల కుంచు. లేకుంటే గొడవ అవుతుంది." ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఇరువురాక్షణము ప్రపంచాన్నే మరిచిపోయారు. ఆనంద్ చొరవ చెయ్యలేక పోయాడు. అతని రెండు చేతులు కళ్ళ కద్దుకుని, సున్నితంగా ముద్దు పెట్టుకుంది. తండ్రి వచ్చే జాడ పసిగట్టి అతనికి దూరంగా జరిగింది. టాక్సీ లో అందరూ సెంట్రల్ స్టేషన్ చేరినాము.    
    అందరికి కాఫీ, స్వీట్స్ ఇప్పించాడు చక్రవర్తి .కన్నీటితో అందరికి వీడ్కోలిస్తున్న సురేఖ ముఖము చూచి చలించి పోయాడు ఆనంద్. మాట్లాడలేకపోయాడు.
    "క్షేమము తెలుపుతూ ఓ కార్డు ముక్క వ్రాయి నాయనా." అన్న సీతారామయ్య మాటలు గాలిలో కలుపుతూ బండి ముందుకు దూసుకు పోయింది.
    ఆనంద్ మనసు ఈసారి ఇంటి వద్ద నిలువటము లేదు. రేఖ వైపే లాగుతున్నది. ఆ విషయము తల్లితో ఎలా చెప్తాడు. యాంత్రికంగా పాత స్నేహితులతో సినిమాల కెళ్ళి వస్తున్నాడు.
    "అమ్మా, ఇక్కడేం చదువు సాగటం లేదు. వెళ్ళిపోతాను."
    "వచ్చి పది హీను రోజులయినా కాలేదు కదరా! తొమ్మిది నెలలు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండేది. నువ్వు వచ్చావు అని నిశ్చింతగా ఉంటేను."
    'చదివేది చాలా వుంది. ఇక్కడుంటే స్నేహితులు, షికార్లు, సినిమాలు చదువు సాగదు. పోయినాసారిలా అవుతుంది." అది తిరుగులేని అస్త్రమని తెలుసు.
    "మంచిది నాయనా. నాకోసము నీ చదువు పాడు చేసుకోవద్దు. బట్టలు అవీ కుట్టించుకో." తేలికగానే అంగీకరించింది తల్లి. రెండవ రోజు తండ్రి వెంబడి వుండి కావల్సినవి ఇప్పించాడు.
    వారిని మోసము చేస్తున్నాననే అని బాధపడినా, రేఖతో కబుర్లు చెప్పుకోవచ్చునని తృప్తిగా నిట్టూర్చాడు. ఆవకాయ, నెయ్యీ, కారప్పూస , చక్కిలాలు చేసి వెంబడి ఇచ్చింది తల్లి.
    టాక్సీ లో గది చేరటానికి బదులు రేఖ ఇంటికే వెళ్ళాడు. కారు చప్పుడు విన్నదేమో ఆదుర్దాగా బయటికి వచ్చింది. ఆమె కళ్ళు ఆనందముతో మెరిసిపోయాయి. అతని చేతిలోని సంచులు అందుకున్నది. అతను టాక్సీ వాడికి డబ్బులిచ్చి వచ్చాడు.
    "చాలా ఉక్కగా ఉంది రేఖా. నాన్నగారు బావున్నారా."
    "ఊ" సంచుకు పెట్టి, అతనికి గ్లాసుతో నిమ్మరసము తెచ్చింది.
    "మీకు ఉక్కగా లేదూ?"
    "యెందుకు లేదు నాన్నగారు అందుకే యెప్పుడూ బయట తిరుగుతుంటారు."
    "నువ్వేమిటి బాగా నల్లబడినావు " గ్లాసు అందుకోవటానికి చాపిన చేతిని అందుకున్నాడు.
    "మీకంటే అమ్మ ఉన్నారు. వెళ్ళగానే ఆప్యాయంగా అన్నీ అందిస్తారు. నాకెవరున్నారు?"
    "నేను." అస్పష్టంగా గొణిగాడు.
    "అమ్మను వదిలి తొందరగా వచ్చారేం?"
    "నీకోసము."
    "పచ్చి అబద్దము" అన్నది నవ్వుతూ.
    "పోనీ యేందుకొచ్చానో చెప్పు" ఆమె గంబీరముగా ముఖము పెట్టి ఆలోచించసాగింది.
    "తెలివైన దానవని గర్వముగా జవాబు చెప్పడాని కింతసేపా?"
    "రాగానే నీతో పోట్లాదాలని వచ్చారా ఏం?"
    "పైగా నాదే ప[పోట్లాటా? నీ కోసము వచ్చానంటే నమ్మవు."
    "నమ్ముతాను వదలండీ.' చెయ్యి విదిలించుకుంది. అతను సంచి లో వున్న పేపరు తీసుకుని విసురుకోసాగాడు.
    "నాన్నగారడిగితే నా కోసమే వచ్చానని చెబుతారా ?' ఈసారి ఆనంద్ తికమక పడినాడు.
    "బుద్ధమూర్తి గారూ, అలా బేలగా చూడకండి. చదువుకోసమని నాన్నగారు పంపించారండీ అని చెప్పాలి తెలిసిందా?"
    "ఆ మాత్రము తెలియదేమిటీ? నేను చెప్పబోయేదే నువ్వు చెప్పావు."
    "పోనీలెండి బుద్ద మూర్తి కాదు." ఆమె నవ్వింది. ఆ నవ్వు మనుష్యుల్ని విచాలికితులను చేస్తుంది.
    "ఏయ్ రేఖా ఇలా దగ్గరకు రా?"
    "ఎందుకు?"
    "నీ బుగ్గపై ఏదో నల్లగా కనిపిస్తుంది. ఆమె దగ్గరగా వచ్చింది. అతను బుగ్గను పరీక్షించే నెపముతో తన పెదవులతో స్పృశించాడు.
    "ఇలాంటి కోతి పనులే వద్దు," కోపంగా చూచి దూరంగా జరిగింది.
    "ఇక లేవండి. భోజనము చేద్దురు. స్నానం చెయ్యాలా ఏం?"
    "కోతులేక్కడయినా భోజనము, చేస్తాయా?"
    "కోతులు కాదు మనుష్యులు బాబూ? లేవండి" అతనికి వడ్డించింది. చిన్న స్నానాల గదిలో రెండు చెంబులు నీళ్ళు పోసుకుని వచ్చాడు. అతను భోజనము చేసి లేచే లోపల సీతారామయ్య గారు వచ్చారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS