"పోలావరము బ్రిడ్జి దగ్గర ఏదో యాక్సిడెంట్ సీన్ తీస్తారుట సినిమా వారు వస్తావురా." చక్రవర్తి అడిగాడు.
'ఆదివారము పని చేస్తారురా. ఎవరో మనల్ని మిస్ గైడ్ చేశారు." గోవిందు తన సందేహాన్ని వెలిబుచ్చాడు.
"వ్యాపారస్తులు రా , వారికి వారము దినము తో ఏం పని? కావాల్సింది డబ్బు."
"నేను నిదురపోవాలిరా . రాత్రి మా ఇంటి యజమాని సెకెండ్ షో కి పిల్చు కెళ్ళాడు.' ఆనంద్ తప్పించుకున్నాడు. ఈ మధ్య అతనికి ఒంటరిగా ఉండి, సురేఖ గూర్చి ఆలోచించటము హాబీగా మారిపోయింది. అందరూ వెళ్ళిపోయాక ఓ కొట్టు దగ్గర నిల్చుని సిగరెట్ కొన్నాడు. అంతవరకు దూరంగా నిల్చుని తంబి దగ్గరగా వచ్చాడు.
"యేన్నడా తంబీ.' నవ్వుతూ అరవములో ప్రశ్నించాడు. వాడు చొక్కా జేబులో నుండి చిన్న కాగితము తీసి అతని చేతిలో పెట్టాడు. మీ మౌనముతో నా మతి పోగొడుతున్నారు. మంచి మాట చెబితే కోపమా? ఒక్కసారి వచ్చి మాట్లాడి పోరూ. సురేఖ." అని వ్రాసి వుంది. ఆమె వ్రాసిన మీ రేఖ అను సంబోధన అతనిని యేవో లోకాలకు తీసుకు పోయింది. కాసేపు అలోచించి వెను తిరిగాడు. గది గుమ్మములో నిలబడి చూస్తుంది. అతన్ని చూడగానే ఆమె ముఖము ప్రసన్న మయింది.
"కోపము పోయిందా? రండి" దారి వదిలింది.
"అనేటి వన్నీ అంటావు. శాసిస్తావు. పైగా నాకే కోపమంటావా?"
"పోనిద్దురూ . నేనే మతి లేనిదాన్ని. అమ్మా వాళ్ళంతా కులసేనా. ఉత్తరాలు వస్తున్నాయా ఇంటి నుండి?"
"ఉన్నట్టుండి ఈరోజు ఇంటి మీదికి వెళ్ళిందేం నీ దృష్టి?' ఆమె వాల్చిన మంచం పై చేరబడి భుక్తాయసము తీర్చుకున్నాడు.
"మీ వాలకము చూస్తె అడగాలని పించింది లెండి చదువు కొమ్మంటే నాపై కోపగించారు. అలాగే జాగ్రత్త నాయనా అని వ్రాస్తే అమ్మ గారి పై కోపగించవచ్చుగా?"
"మాటలు నేర్చావు." ఆమె వడ్డించుకు వచ్చి క్రింద కూర్చుంది.
"నీ భోజనము ఇంతలాస్యమవుతుందా?"
"లేదు. మీరలా వెళ్ళిపోతే భోజనము చెయ్యాలని పించలేదు. ఇప్పుడు ఆకలి వేస్తుంది." అన్నది పచ్చడి కలుపుతూ.
"అలాగే వెళ్లి పోవాల్సింది . ఓ పూట అన్నము మిగిలేది." కొరకొర చూచింది. అతను నవ్వేశాడు. భోజనము ముగించి వచ్చింది. అతని కోర్కె పై రెండు సినిమా పాటలు పాడింది. కబుర్ల లో కాలము కరిగిపోయింది. "తన్నా....తనా-----నానానాం......." అనే సన్నని రాగము వినిపించింది. వెంటనే ఆనంద్ లేచి బుద్ది మంతుడిలా కూర్చున్నాడు.
ఆలస్యము చేశారేం నాన్నా? ఆనంద్ గారు మీ కోసము ఎదురు చూస్తున్నారు."
"నాకు తెలియదు పాపా. దారిలో ఎవరో మాట్లాడుతుంటే ఆలస్య మైపోయింది." త్వరగా వచ్చి ఆనంద్ ను పరామర్శించాడు. ఆనంద్ గుండె కొట్టుకోసాగినది. నాతొ ఏదన్నా పనా, అని అయన అడిగితె ఏం జవాబు చెప్తాడు? కోపంగా ఆమె వంక చూచాడు.
"నాన్నా, మీకేమో, ఆదివారము కూడా తీరికగా ఉండదు. వారు మీతో మాట్లాడదామని వచ్చారుట. కడుపు నిండుగా మాట్లాడాలంటే తెలుగువారే లేరమ్మా అంటావు" అన్నది.
"అలాగా, నాయనా చాలా సంతోషము. ఈ ప్రయివేట్లు చప్పటమంత మర్యాదహీనమైన పని మరొకటి లేదు. బడిలో పాటలకు బాణీలు కుదుర్చాలట . తెచ్చేది పాటో పద్యమో తెలియదు." అన్నారు నిట్టురుస్తూ.
"పోనివ్వండి. మీరింటి వద్ద ఉంటారని వచ్చాను." అన్నాడు.
"సాయంత్రము అరవమేళాని కెక్కడో విందుట, మన వాళ్ళే కదా. ఎంతలో వంటవుతుంది? అలా బీచ్ కు వెళ్దామా?' ఆశగా చూచింది సురేఖ.
"అవును మాష్టారూ . యెన్నాళ్ళనుండో మిమ్మల్ని పిలుచుకు పోవాలను కున్నాను.
మీ అమ్మాయిని ఇంటిలో వదిలి వస్తారా , అని సందేహించాను. ఓరగా రేఖ వంక చూచాడు. ఆమె పెదవులు బిగించి వెక్కిరించింది. అందరూ తయారయి, బస్సులో మెరీనా బీచ్ చేరుకున్నారు. ఆదివారమని కాబోలు జనము విపరీతము గా కనిపించారు. ముగ్గురూ ఓ చోట కూర్చున్నారు. వేయించిన సెనగలు, వేరు శనగకాయలు, కారప్పూస అమ్మేవారి గొంతులు చెవులలో గింగురు మంటున్నాయి. ఆనంద్ అందరి వంకా చూచాడు అందరూ చక్కని దుస్తులు ధరించి, రవ్వల ముక్కు పుడకాలతో గమ్మత్తుగా వున్నారు. కొందరు చవకబారు నైలాన్ లో మెరిసిపోతున్నారు. అతను రేఖ వంక చూచాడు. శుభ్రంగా ఉతికిన పాత వాయిలు చీర , దానిలో నుండే చించి కుట్టిన రవికె. బారుగా అల్లుకున్న జడ . కళకళ లాడే ముఖాన కుంకుమ. మరే అలంకారము లేదు. చేతులకు రెండేసి మట్టి గాజులు ఉన్నాయి.
"ఏమిటి నావంక అంత తీక్షణంగా చూస్తున్నారు" లాజ్జితుడై మరో దిక్కు తిరిగాడు. సీతారామయ్య గారు తన్మయత్యంతో తరంగాల వంక చూస్తున్నాడు.
"నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పరేం?"
'అందరూ ఆడంబరంగా వచ్చారు. అందరిలో నువ్వే చాలా సాధారణంగా వున్నావు.అదే చూస్తున్నాను.
"అందరూ నాలాంటి వారేనా ఏం? అదృష్టవంతులు" నిట్టూర్చింది. "పోనిద్దురూ నాకు నీళ్ళ దగ్గరకు వెళ్లాలని ఉంది" లేచి నీళ్ళ దగ్గరకు వెళ్ళింది. చురుకుగా వచ్చిన అల ఆమె పాదాల్ని తాకి వెనక్కి వెళ్ళిపోయింది. చీర కుచ్చెళ్ళన్నీ తడిశాయి. ఆమె సంతోషంగా చప్పట్లు కొట్టింది. ఆమెకు దూరంగా నల్గురు యువకులు నిల్చుని ఆమె వంకే చూస్తున్నారు. ఆనంద్ కదెంత మాత్రం నచ్చలేదు.
"రేఖా వచ్చేసేయి" గట్టిగా అరిచాడు. తిరిగి వచ్చింది. చీర కుచ్చెళ్లు పిండుకుంది.
"మీరు ముసలి తాతయ్య లా ఒక చోట కూర్చుంటే యెలా తోస్తుంది?"
"పాపా?' ఈసారి సీతారామయ్య అరిచాడు" "యెంతవస్తే అంతా అనేయ్యటమేనా? భయభక్తులు బొత్తిగా లేవు."
"నీళ్ళ దగ్గర చాలా బావుంది నాన్నా"
"నీకు బాగుండవచ్చు. అందుచేత అందరిని ముసలి వారంటావా?"
"పోనివ్వండి. నేను ఆంక్షలు పెడితే కోపం వచ్చిందిలా వుంది."
"కాదు నాయనా. నువ్వంటే సహన మూర్తివి ఊర్కుంటావు . రేపు పెళ్ళి అయి అత్తావారింటికి వెళ్ళితే ఇలాగే మాట్లాడితే ఎంత ప్రమాదము."
"అయితే త్వరలో పప్పన్నము వుందన్నమాట."
రోజూ పప్పన్నము తింటున్నట్టు. నాన్నా! మాటామాట కి నా పెళ్ళో, పెళ్ళో అంటావు. అందరికి హేళన చెయ్యటానికి అవకాశమిస్తావు."
"ఇప్పుడు నిన్నెవరు హేళన చేశారమ్మా . ఆనంద్ బాబు ఈసారి సెలవులకు వెళ్ళినప్పుడు మన వైపు ఏదైనా సంబంధముంటే చూడు. రెండు పూటలా అన్నం పెట్టె వాడయితే చాలు."
"నాన్నా! నాకు కాఫీ టిఫిన్లు కూడా కావాలి." నవ్వును బిగబట్టింది."
"మరేం పరవాలేదు. భోజనము, కాఫీ ఫలహారాలతో పాటు, వీపుకు తద్దినము పెట్టేవారిని చూస్తాను."
"పరవాలేదు. అవన్నీ నేను చూచుకుంటానుగా?"
"ఏమిటమ్మా మరీ పరిహాసము. నేను చెప్పేది అర్ధం చేసుకుని ఈ విషయము లో సాయము చెయ్యాలి. నాయనా, పడుకుంటే పాపను గురించి అన్నీ పీడ కలలే వస్తాయి." వృద్దుని ఆవేదనను అర్ధం చేసుకున్నాడు. "మీరేం విచారించకండి." నేను చూస్తాను. అప్పుడే నూరేళ్ళు నిండినట్టు మాట్లాడుతారేం మాష్టారూ?"
"యేమో నాయనా మృత్యువు నాదగ్గర కొచ్చినట్టే బాధపడతాను కొన్నిసార్లు. నిజంగా వయసు మీరినాక కల్గిన సంతానము వల్ల సుఖము లేదు."
'అయితే నేను మిమ్మల్ని కష్టపడుతున్నానన్నమాట. బుంగమూతి పెట్టింది."
"నువ్వు కష్ట పెట్టావని కాదు పాపా. నీకేం చేయలేక పోయానే అనే దిగులు. మీ అమ్మ బ్రతికి ఉండగా, నిన్ను గూర్చి యెన్ని కలలు కన్నది. ఆ కాలములో మాకేం తక్కువ లేదు బాబూ, ఉన్నదాంట్లో అందరికీ పెట్టాము. నా బంధువులు , నా భార్య బంధువులు నెలలు తరబడి ఉన్నారు. వారికిప్పుడుత్తరము వ్రాసినా జవాబు ఇవ్వరు."
"లోకము తీరే అంత లెండి." సమాధాన పరిచినాడు. వారి దృష్టి మరో వైపు త్రిప్పాలని తాపత్రయము.
"మాష్టారు ? మీ అమ్మాయి చేత ఒక పాట పాడించండి."
"అదేం మాటయ్యా? శిష్యురాలుగా నువ్వు అడుగు"
"నాన్నగారూ! నేను పాడాలని మొదటే ముందు కాళ్ళకు బంధము వేస్తున్నావన్న మాట. గురువు, శిష్యురాలంటూ" రేఖ నవ్వింది. తనకొచ్చిన సినిమా పాటలు పాడింది.
"తన కంఠమింత బావుంది. శాస్త్రీయముగా నేర్పకూడదా?"
"నేను కూర్చుని నేర్పుతానన్నా నేర్చుకునే ఓపిక లేదు" అతను చెబుతుండగా , నీలము కంచి పట్టు చీరలో , తళతళమనే రవ్వల దిద్దులు పెట్టుకుని వచ్చిందో అరవ స్త్రీ . ఆమె సీతారామయ్య తో మాటలు మొదలుపెట్టింది.
"ఇక్కడ చెవిటి వారెవరో, ఆముదము త్రాగినట్టు ముఖము పెట్టాడు ఆనంద్.
"ఆ మాట ఆవిడను అడగనా" నవ్వు పెదాల మధ్య బిగించి అడిగింది.
"అడుగు భయమా? ఇసుక తీసి ఆమె పైకి దులిపాడు కళ్ళు ఎఱ్ఱగా చేసింది. నువ్వలా చూచినా ఏం కాదన్నట్టు నవ్వాడు.
"సముద్రము దగ్గరే వుంది."
"పడి చావమంటారా?"
"కాదు నీ చూపులు నన్ను కాల్చి వేస్తె వెళ్ళి చల్లార్చు కుంటాను."
"కొట్టుకు పోగలరు జాగ్రత్త" ఈసారి నవ్వింది. ఆమె పలువరుస దానిమ్మ గింజల్లా అమర్చినట్టు కనిపించింది.
"ఏమిటలా చూస్తారు."
"భగవంతుడు అన్నీ ఇచ్చాడు గానీ ఒకే లోపము చేశాడని......"
"ఏమిటో.."
"డబ్బు. అదుంటే నిజంగా నీ పాట, నీ తెలివి తేటలు రానించేవి , అందము దిగ్విణికృతమయ్యేది" అన్నాడు.
"మీ కుందిగా , రాణించరెం?"
"నాకేం వచ్చని పాటా, ఆటా?"
"అందాన్ని ద్విగుణీకృతము చేసుకోవాలనే తాపత్రయముండదా? యెప్పుడూ ఉన్న అందాన్ని చేడుగొట్టుకుంటావు.....సారీ కుంటారు"
"యెలా చెడగొట్టుకున్నాను?"
"చక్కని పొట్టి జుట్టు మీ ముఖానికి అందాన్నిస్తుంది. ఆముదము రాసి లొంగదీసినట్టు వెనుకకు యెందుకు నున్నగా దువ్వుతారు? చిన్న చిన్న జెడలు అల్లే అంత పొడవుగా ఉంటాయి. మీకు స్పోర్ట్స్ షర్ట్స్ బావుండవు."
"అమ్మాయి గారు మాలాంటి వారి దుస్తులను హెర్ స్టైల్ ను గమనిస్తారన్న మాట .' నవ్వాడు.
"అందరిని ఏం కాదు, ముఖము త్రిప్పుకుంది.
