Previous Page Next Page 
ఇంద్రధనుస్సు పేజి 17

 

    చక్రవర్తీ సునందలను చూశాక ఉమాపతి మనసులో అలజడి ప్రారంభమైంది. ఆలోచించిన కొద్దీ అందుకు కారణం తెలియకపోగా, అలజడి మరింత పెరగసాగింది. మాటిమాటికి 'నాకేం తక్కువ?" అని తన్ను తాను ప్రశ్నించుకోవడం ప్రారంభించాడు. ఒకసారి తనకేమీ తక్కువ లేదని పిస్తుంది. మరొక్కసారి తనకేమీ లేదనిపిస్తుంది. విమల ఉత్తరం తను చదవకుంటే? దాన్ని చదవటం తోటే తన మనస్సులో సుడిగాలి ప్రారంభమైంది. దానికి తోడు చక్రవర్తీ , సునందా కనిపించారు. వారిని చూడగానే తనేందుకో మరింత దిగులు పడిపోయాడు. విమల ఉత్తరం చదవకుంటే వారిలో ప్రత్యేకత తనకు కనిపించేది కాదేమో? ఆలోచించిన కొద్ది అశాంతి ఎక్కువయింది ఉమాపతికి. లేచి అలా బీచి కి వెడదామనుకున్నాడు. అక్కడ మళ్ళీ చక్రవర్తీ , సునందా కనిపిస్తారేమోనని మానుకున్నాడు. కానీ గదిలో ఉండలేక పోయాడు. అలా కాస్సేపు తిరిగి వద్దామని బయలుదేరాడు.
    ఉమాపతి మళ్ళీ గది చేరేసరికి రాత్రి రెండు గంటలైంది. ఉదయం మెలకువ వచ్చే సరికి తొమ్మిది గంటలవుతుంది. శరీరమంతా నలియగొట్టినట్టుగా బాధగా ఉంది. జ్వరం కూడా వచ్చినట్లుగా ఉంది. లేచి ముఖం కడుక్కొని టిఫిను కు బయలు దేరాడు. కాఫీ త్రాగి మళ్ళీ గదికి వస్తుంటే ఎదురుగా వస్తున్న కారొకటి తన ప్రక్కనే అకస్మాత్తుగా ఆగింది. అందులోంచి సారధి దిగాడు.
    "హల్లో ఉమాపతి గారూ! అలా ఉన్నారేం? ఒంట్లో బాగా లేదా? ఒంట్లో బాగా లేకపోతె డాక్టర్ని చూడలేక పోయారా? అదిసరే గాని కనిపించడమే మానేశారేం? పదిహేను రోజులైందనుకుంటాను. మనం కలుసుకొని" అన్నాడు.
    ఉమాపతి కి అసలు సారధిని గుర్తు పట్టడమే కష్టమై పోయింది. ఎప్పుడూ మామూలు పైజమా , షర్టు తో తృప్తి పడే సారధిని సిల్కు షర్టు, ఫాంటు ధరించాడు. ఏ రంగో తెలీకుండా దుమ్ము కొట్టుకుని ఉంటున్న చెప్పులు అతని కాళ్ళకు లేవు. వాటి స్థానంలో నీడ కనిపించేలా పాలిష్ చేయబడ్డ బూట్లు ఉన్నాయి. కళ్ళకు లేతాకు పచ్చ చలువ జోడు ఉంది. ఉమాపతి సారధి వేషాన్ని చూసి దిమ్మెర పోయాడు.
    "బాబోయ్!క్ నేను! సారధిని! అలా చూస్తారేం?"
    "ఏం లేదు. చప్పున గుర్తు పట్టలేకపోయాను" అన్నాడు ఉమాపతి.
    "ఔను! ఆకారం మారిపోయింది."
    ఆశ్చర్యంగా చూశాడు ఉమాపతి.
    'అలా ఆశ్చర్యం ప్రకటించకండి. మీకు కొన్ని విషయాలు చెప్పాలి. సాయంకాలం మీ గదికి వస్తాను. గదిలోనే ఉంటారా?"
    "సారధీ, మనం ఈరోజు సినిమా కెళ్లాలనుకున్నాం గా? వారి గది కేలా వెడతావు?"
    ఉమాపతి కారులోకి చూశాడు. స్టీరింగు వద్ద ఒక యువతి కూర్చుని ఉంది. ఆవిడే ఆ మాట అంది.
    "ఓ! ఆయామ్ సారీ! నువ్విలా దిగిరా!" కారులోని యువతితో అన్నాడు సారధి.
    ఆవిడ కారు దిగి వచ్చింది. కారులోంచి దిగటానికి ఆవిడ కాస్త అవస్థ పడవలసి వచ్చింది. ఆవిడకు ఏ అవయవమూ ఉండవలసిన ప్రమాణం లో లేదు. ఆవిడ రంగు నిగనిగలాడే నలుపు. ఎత్తైన నుదురు. మాడు కంటుకుపోయిన పలుచని వెంట్రుకలు. ఆవిడను మరింత అంద వికారంగా చూపుతున్నాయి.
    "ఈవిడ పేరు సౌదామిని. మా అత్తయ్య కూతురు." పరిచయం చేశాడు సారధి.
    నమస్కారం చేశాడు ఉమాపతి. ఆవిడను చూస్తుంటే తనకు స్త్రీ మీద ఉన్న కోరిక నశించి పోతుందేమో ననిపించింది ఉమాపతికి.
    "నేను నిలబడ లేకుండా ఉన్నాను. మీరు మా గదికి ఎప్పుడు వస్తారు?"
    అలోచించి "రేపు" అన్నాడు ఉమాపతి.
    ఉమాపతి ని కారులోనే గదిదాకా తీసుకువచ్చి వదిలాడు సారధి.
    "ఉమాపతి గారూ , ఆరోగ్యం బాగా చూసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. రేపు బాగా తలంటి స్నానం చేయండి. ఈ సుస్తీ పరుగెత్తి పోతుంది." కారు రివ్వున వెళ్ళిపోయింది.
    ఉమాపతి గదిలోకి వచ్చి చాప మీద కూర్చున్నాడు. ఎంత మరిచి పోదామన్నా సౌదామిని రూపం మరుపుకు రాలేదు. ఆవిడకు, సారధి కి ఉన్న సంబంధం బోధపడలేదు. సారధి ఎంత మారిపోయాడు! అతడిలో అదో రకమైన ఠీవి కనిపించింది. ఎక్కడి నుంచి వచ్చిందా ఠీవి? సారధి తలంటి స్నానం చేయమన్నాడు. ఎలా చేస్తాడు తాను? తన కెవరున్నారు తలంటే వాళ్ళు? నీళ్ళు కాగపెట్టి పోసే వాళ్ళెవరు? ఎందుకో ఉమాపతి కళ్ళలో నీళ్ళు నిండాయి. దుప్పటితో కళ్ళు తుడుచుకొని అదే దుప్పటిని రొమ్ము దాకా కప్పుకొని శూన్యంలోకి చూస్తూ పడుకున్నాడు.
    మధ్యాహ్నానానికి జ్వరం బాగా ఎక్కువయింది. భోజనం చెయ్య బుద్ది కాలేదు ఉమాపతి కి. రొట్టె తింటే బాగుంటుందనుకున్నాడు. కానీ వెళ్ళే శక్తి లేదతనికి. ప్రక్క గదిలో ఉంటున్న హైస్కూలు కుర్రవాళ్ళ కోసం చూశాడు. వాళ్ళు లేరు. అలాగే పస్తు పడుకున్నాడు. కుర్రవాళ్ళు ఏదో పీరియడ్ ఎగ్గొట్టి మూడున్నర గంటలకు గదికి వచ్చారు. వాళ్ళను రొట్టె , పా;లు తెచ్చిమ్మన్నాడు. ముఖం నల్లగా చేసుకొని ఇష్టం లేకున్నా విధి లేక బయలుదేరాడు ఒక కుర్రవాడు. అతడు రొట్టె, పాలు తెచ్చేసరికి నాలుగు దాటింది. పాలలో ముంచి రొట్టె నోట్లో పెట్టుకోబోతే ఏడుపు వచ్చింది ఉమాపతికి. ఎంత అపుకుందామన్నా ఏడుపు ఆగలేదు. రొట్టె తినలేకపోయాడు. తన ఒంటరి తనం తలచుకొని కుమిలి పొయ్యాడు. ఆరోజు రాత్రి గూడా ఆకలితో అలాగే పడుకున్నాడు.
    రెండవరోజు మధ్యాహ్నం సారధి వచ్చాడు. ఉమాపతి స్థితి చూసి ఆశ్చర్యపోయాడు. ఉమాపతి చాలా నీరసంగా ఉన్నాడు. "లెండి, ఉమాపతి గారూ. కారు తెచ్చాను. మైలాపూర్ లో నాకో స్నేహితుడు ఉన్నాడు. అతడి నర్సింగ్ హోమ్ లో చేరుదురు గానీ" అన్నాడు.
    'అతని పేరు?"
    'చక్రవర్తి."
    'అతని భార్య పేరు సునందేనా?"
    "ఔను. కానీ , మీకెలా తెలుసు?"ఉమాపతి జవాబు చెప్పలేదు.
    "వాళ్ళిద్దరూ నాకు చాలా స్నేహితులు. అగ్ని గుండం లాంటి ఈ ప్రపంచంలో వాళ్ళ ఇల్లు నా పాలిటికి కానుగమాను నీడ! సునంద ముఖం చూశారా, ఎంత ప్రశాంతంగా ఉంటుందో! ఆవిడ సాన్నిధ్యంలో వెయ్యి వెదనల్ని మరిచి పోవచ్చు."
    "వాళ్ళ సంగతి నాకు అంతగా అవసరం లేదు. ఆవిడ ముఖంలోని శాంతి జ్ఞాపకం వచ్చినప్పుడెల్లా నా ముఖంలో ఎంత అశాంతి ఉందో తెలిసి వస్తుంది. నాకు కావలసింది మీ కధ. చెప్పండి." ఆయాసంతో అన్నాడు ఉమాపతి.
    సారధి కాస్సేపు తల వంచుకొని అలోచించి మంద్రస్వరం లో ప్రారంభించాడు.
    "నాకు మా అమ్మ ముఖం తెలీదు. నేను చాలా చిన్ననాడే అమ్మను పోగొట్టు కున్నాను. మా నాన్న నా కా లోటు తెలీయనివ్వకుండా పెంచాడు. నేను, మా అన్నయ్య హైస్కూల్లో చదువుతుండే వాళ్ళం. మా నాన్న లాయరు గుమస్తా. వచ్చే ఆదాయంతో మమ్మల్ని సాధ్యమైనంత చక్కగా పెంచాడు. మా అన్నయ్య మెట్రిక్ పూర్తీ చేసి నాన్న ఎంత వద్దంటున్నా వినకుండా మిలిటరీ లో చేరిపోయాడు. అప్పుడు నేను ఫోర్టు ఫారం కాబోలు చదువుతున్నాను. అన్నయ్య అంతో ఇంతో డబ్బు పంపేవాడు. నేను మెట్రిక్ పూర్తీ చేసి కాలేజీలో చేరాను.
    "ఇంతలో మా గ్రామానికి కలరా వచ్చింది. మనుషులు పురుగుల్లా చనిపోయారు. మందూ మాకూ లేవు. చచ్చిన వాళ్ళని పూడ్చటానికి తావు కరువయింది. అసలు పూడ్చే వారూ, చచ్చిన మనిషిని తాకి మోసుకెళ్ళే వారూ లేకపోయారు. అప్పడు మా నాన్న మరికొందరి స్నేహితుల సాయంతో ఆ పనికి పూనుకున్నాడు. కలరా తగిలిన వాళ్ళకు మందు, మాకూ ఇచ్చాడు. చనిపోయిన వాళ్ళను మోశాడు. కానీ , దేవుడు ఎందుకో మంచి వాళ్ళను కష్టాల పాలు చేస్తాడు. మా నాన్నకు కలరా తగిలింది. మూడు రోజుల తరువాత చనిపోయాడు.
    'అప్పుడు నేను బియ్యే మొదటేడు చదువు తున్నాను. నేను చాలా దిగాలు పడిపోయాను. కానీ మా అన్నయ్య నన్ను మనిషిగా నిలబెట్టాడు. ప్రకాశం అప్పుడు కాలేజీ లో నాతో గూడా చదివేవాడు. అతడే నాకు విశ్వాసం పోశాడు. అలా ధైర్యాన్ని చిక్కబట్టుకుని కోలుకుంటుండగా తిరుగులేని దెబ్బ మళ్ళీ తగిలింది. కాశ్మీరు సరిహద్దు లో జరిగిన ఒక చిన్న పోట్లాట లో మా అన్నయ్య చనిపోయాడు.
    ఒకటి తరువాత ఒకటి అలా నా జీవితానికి దెబ్బలు పడ్డాయి. ఎందుకో ఈ ప్రపంచమంటే నాకు తీరని కసి ఏర్పడింది. మానవులందరూ నామీద కుట్ర చేసి నన్ను అన్యాయం చేశారనిపించింది. అందుకే అంత మంచి కవిత్వం ఆ రోజుల్లో రాశాను. ప్రకాశం దాన్ని ఏనాడూ మెచ్చుకునేవాడు కాదు. తిట్టడం, కసి , విధ్వంసం అభ్యుదయం కాదనేవాడు.
    'అన్నయ్య ప్రావిడెంట్ ఫండు కొంచెం నాకు అందింది. దానితో బి.య్యే పూర్తీ చేశాను. తర్వాత ఉద్యోగంలో చేరాను. అనేక రకాల మోసాల్ని నా కళ్ళారా చూశాను. ప్రపంచం మీద నాకున్న కసి మరింత ఎక్కువయింది. ప్రతి వాడూ తప్పుచేయడం డబ్బు కోసమని గమనించాను. అందువల్ల ప్రపంచంలో అన్నిటికీ మూలం డబ్బని తెల్చుకోన్నాను.
    "మొన్న నా ఉద్యోగం ఊడింది. కష్టాలంటే గానీ , ఆకలంటే గానీ నా కంతకు ముందు సరిగా తెలీదు. చాలా రోజులు కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకున్నాను. మరోవిధంగా నా పాత సిద్దాంతం నిజమే ననిపించింది. కానీ, నిర్వచనం మార్చుకున్నాను! చివరికి ఓ కంపెనీ లో ఉద్యోగం దొరికింది.
    "ఈలోగా నాకు సౌదామిని తో పరిచయం ఏర్పడింది. ఆవిడ మా కంపెనీ ప్రోప్రయిటరు కూతురు. నన్ను చాలా గాడంగా ప్రేమించింది. నేను కూడా ప్రేమించాను. ప్రేమ లేని బ్రతుకు చాలా నీరసమనీ, జీవితంలో మనకున్న ధ్యేయాన్ని  సాధించటం కోసం మన జీవిత నౌక కోక చుక్కానీ కావాలనీ నిశ్చయించుకున్నాను."
    "ఎవరు సౌదామీనంటే? నిన్న కనుపించినావిడే కదూ?" ప్రశ్నించాడు ఉమాపతి.
    'అవును. ఆవిడే! చాలా అంద వికారంగా ఉంటుంది కదూ! కానీ, ఉమాపతి గారూ, ఆవిడ మనస్సు వెన్నండి. అంత గొప్ప మనసున్న స్త్రీని నేనింత వరకూ చూడలేదు."
    ఉమాపతి జవాబు చెప్పలేదు. కాస్సేపు గదిని నిశ్శబ్దం పరిపాలించింది. సారధికి విసుగేసింది ఉమపతి మౌనంతో.
    "ఏమీ జవాబు చెప్పరేం?" అనడిగాడు.
    "మీరు చెప్పినట్టు మన మిద్దరం జీవితం తో పోరాడుతున్నాము." అన్నాడు ఉమాపతి, నిట్టురుస్తూ. ఆ మాట సారధికి నచ్చలేదు.
    "నే వెడతాను. కాస్త పనులున్నాయి. ఆ!.... ఒకమాట! నేను మారిపోయాననీ, నా ఆదర్శాలకు తిలోదకాలు వదిలేశానని మీరు అనుకున్నారులా ఉంది. అది శుద్ధ అబద్ధం! దారి మార్చానంతే! కానీ ఏనాటి కైనా ఈ పాడు సాంఘిక వ్యవస్థను నాశనం చేసి తీరుతాను." సారధి వెళ్ళిపోయాడు.
    ఉమాపతి ఆలోచిస్తూ అలాగే కూర్చున్నాడు. తలలో ఆలోచనలూ, కడుపులో ఆకలీ మెలికలు తిరుగుతున్నాయి. జ్వరం కూడా కాస్తూ ఉంది. హటాత్తుగా ఉమాపతికి ఒక ఆలోచన కలిగింది. పుస్తకంలోంచి కాగితం చించి ఉత్తరం వ్రాశాడు. ఉత్తరాన్ని జేబులో ఉంచుకున్నాడు. ఉత్తరాన్ని తక్షణం పోస్టు చేయాలి. గబగబా బట్టలు వేసుకుని, తల దువ్వుకోవటానికి అద్దం ముందుకు వెళ్ళాడు. మూడు రోజులుగా జ్వరం కాస్తున్నా, రెండు పూటలుగా ఆహారం లేకున్నా అతడి మనస్సు ఉత్సాహంగా ఉరకలు వేస్తుంది. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. కళ్ళలో అనిర్వచనీయమైన కాంతి, శాంతి కనబడ్డాయి. ఉమాపతి మనస్సుకు ఊరట కలిగింది. నీరసంగా నడక సాగించాడు పోస్టాఫీసు వైపు.

                                 *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS