స్వామి సాంబారు యజ్ఞానికి పరాకాష్ట! తిరగమోత పరిమళం గుభాళించింది. 'భళి భళి' అంటూ చప్పట్లు కొట్టిన పావని 'మాష్టారూ! సాంబారు ఎలా పెట్టాలో కాస్త చెబుదురూ . సరదాకి మా అమ్మని చచ్చేలా హడలగోట్టాలనుంది వంట చేసి' అంటూ కుంపటి దగ్గర కొచ్చి - పీటమీద మునికాళ్ళ తో గెంతి కూర్చుంది.
గెలుపు తప్పదనుకుంటూ యుద్ధంలోకి ఒరుకుతున్న సైనికుడి సమరోత్సాహం లాంటిది వచ్చింది స్వామికి. చదువు విషయంలో గాని, బాడ్ మింటన్ లాంటి ' గొడవల్లో' గాని తన గొప్పతనం అందరూ అంగీకరించక పోయినా , క్లాసు పిల్లలంతా ముష్టి - వారి తోటకు విహారం వెళ్ళిన రోజున తాను కాసిన సాంబారు త్రాగి ఆ లలితకళలో తానకున్న ప్రజ్ఞాను ప్రాభవాన్ని గుర్తించారు. తమకు రవ్వంత సమర్ధత వుందనుకున్న విషయం గురించి సలక్షణంగా వర్ణించి చెప్పాలనే ఉబలాటాన్ని మహాయోగులు మాత్రమే జయించారు. స్వామి మహాయోగి కాదు.
అందుకనే ఉడుకుతున్న సాంబారును సుతారముగా, కలుపుతూ, మామూలు కంటే మరికొంత చనువుగా పావని కళ్ళల్లోకి చూసి "మీరు ఉల్లిపాయలు తింటారాండి" అన్నాడు స్వామి.
"అయ్యో! ప్రాణమండీ బాబూ ఉల్లిగడ్డలంటే.'
స్వామి ఉత్సాహంగా చెపుతున్నాడు!
పావని ఆసక్తితో వింటున్నది.
'సాంబారున్నది చూశారా పావని గారూ! దానికి ప్రాణం ఉల్లిగడ్డ. ముందు పప్పు వేయించాలండీ.తర్వాత కాటుకలా వండాలి. బడ్డ నలక్కపోతే ఎనపాలి మెత్తగా -- వింటున్నారా'
'జన్మలో ఏ పంతులు చెప్పిన పాఠమూ విననంతగా వింటున్నానండోయ్ -చెప్పండి - ఎనపాలి మెత్తగా - ఊ తర్వాత?'
'తర్వాత కూరముక్కల సంగతండి. ఉల్లిగడ్డలు, వంకాయ, టమోటాల ముక్కలూ సమపాళ్ల లో వేయించి , పులుసు లో వేసి - కొత్తిమీర, కరివేపాకు వేసి- అంత బెల్లం కూడా వేయాలి. సన్నటి సెగమీద గిన్నెడు సాంబారు నెమ్మదిగా మరిగి నాలుగోవంతు చిక్కపడేలా చేసి- ఇంగువ - అన్నీ వేసి తిరగమోత దట్టించి ...'
విరగబడి నవ్వుతున్నది పావని యింకా ఆగక -
'ఎందుకండీ అలా నవ్వుతారు . చెప్పమన్నారని చెబుతున్నా.'
తెల్లబోయాడు స్వామి.
'చెపుతున్నారానుకోండి ' అంటూ కడుపు చెక్కలయ్యేలా నవ్వుతున్న పావనిని చూడగానే స్వామికి సమరోత్సాహం లా పొంగిన ఉబలాటం చల్లారి, అంతకు ముందున్న అన్న హితవు తప్పింది.
'ఇంతచావు నేను చావలెను మాష్టారూ! అయినా అసలు గట్టిగా పసందుగా చేయాలంటే మీలాటి భుజబలమున్న మగదీరులే చేయాలండీ వంట. అందుకనే నలపాకం- భీమ పాకం అంటూ లొట్టలు వేస్తూ పురాణం చెప్పేవారు దాసుగారు. పూర్వజన్మలో మీచేతి చలవ వలన -- ఈపాడు తడిబొగ్గుల వంట బాధ తప్పించుకున్న అదృష్టవంతురాలు ఆ దమయంతో - ఆ ద్రౌపదో కాస్త వివరించి చెబుదురూ ! విని తరించేడను' అంటూ నాటక ఫక్కీలో లేచి వంగి నమస్కరించింది.
'ఉసేయ్! కొరకంచూ! కణతల నొప్పోచ్చి నాలుగు పెండలం ముక్కలు వేయించి తగలబెట్టవె అంటే - అబ్బ- మాడి తగలబెట్టినట్లుందే -- వేపుడు మూకుడు పొయ్యి మీద పెట్టి ఆ కబుర్లేమిటే-'
శారదమ్మగారు కేకపెట్టి మూలిగింది.
'చూశావా సైరన్ కూత! - ఈవిడగారు తల్లో - సవతతల్లో అంతు చిక్కక మతి పోతుంది మాష్టారూ' అంటూ విసురుగా వంటింట్లోకి తరలి పోయింది పావని.
'మాడ్చి తగలబెట్టావే తల్లి మళ్ళీ జన్మలో పని చెప్పకుండా. లెంప;లేసుకుంటున్నా పూర్వజన్మలో -- ఖర్మ మొగరాయుడ్ని కన్నానే తల్లీ - నీకు నడుమెక్కడ వంగుతుందే - నాలుగు వేపుడు ముక్కలు వేయించి, ఉద్దరించేడు చారు నీళ్ళు తగలెట్టవె అంటే - పాయిఖానా చేశావుగదుటే వంటిల్లంతా.ఎక్కడ రాసి పెట్టిందో గానీ -- ఆకట్టు కున్నవాడి కొంపపీకి పందిరేయ్యవుటే నువ్వు -'
-- అంటూ బాధపడుతున్న శారదమ్మ గారి మాటలు- గుర్రం తోకలా జడ కట్టుకుంటూ కూనిరాగం తీస్తున్న పావని సంగీతమూ - రెండూ రెండు చెవులతో వింటున్న స్వామి -- సాంబారులో ఉప్పు పడలేదనే విషయం గుర్తుకు రాకుండానే నాలుగు ముద్దలు తిని చెయ్యి కడుక్కున్నాడు.
8
ఇంచుమించు రోజూ తల్లికి కూతురుకూ యిటువంటి పోట్లాటలూ - వాగ్యుద్దాలు జరగడం తాను వినడం స్వామికి అలవాటై పోయింది. పావని ప్రవర్తన తల్లికి నచ్చదు. తల్లి ధోరణి పావనికి గిట్టదు.
ఒకనాడు స్వామి యింటికి వచ్చేసరికి - తల్లీ బిడ్డ లమధ్య అంతకుముందు తాను విననంత తీవ్రంగా - యుద్ధం జరుగుతుంది. ఉద్రేకాలు రెచ్చి - ఒకరు వింటారనే భయం కూడా లేకుండా పెద్దగా కేకలు పెట్టుకుంటున్నారు.
రఘుపతి గారికి యింటి గొడవలు ఎన్నడూ పట్టేవికాదు. ఆ కోనేటి రావు కోపరేటివు బాంకు - ప్రసిడెంటు గా ఉన్నంతకాలం ఆయనగారి ఆత్మకు శాంతి లభించేటట్లు లేదు. అతగాడి అంతం చూడాలనే పట్టుదలతో యింటి పట్టుపట్టకుండా తిరుగుతున్నారు. కాసేపటికి అసలు విషయం అర్ధమయింది స్వామికి.
పెళ్ళిళ్ళ పేరయ్య గారు శారదమ్మ గారి దగ్గర పచ్చనోటు తీసుకెళ్ళి - 'తిరిగి తిరిగి' - - ఒక సంబంధాన్ని మూట కట్టుకొచ్చారు. 'రెండో పెళ్ళి అన్నమాటే గాని - నలభై దాటలేదమ్మా చెల్లమ్మా. కావలసినంత ఆస్తి వుంది.' అని చెప్పడం మొదలు పెట్టాడుట. పావనమ్మకూ అయనకూ మధ్య మహాసంగ్రామమే జరిగింది . చివరకు అయన కూడా సహనాన్ని కోల్పోయినా మంచితనం వలన గానీ లేకపోతె ఈ గయ్యాళి గంపను ఏ బడుద్దాయి చేసుకుంటాడే? కాళ్ళకు బలపాలు కట్టుకుని - దేశమంతా తిరిగి - సహాయం చేద్దామని వచ్చా . చావనీ చెల్లమ్మా. దాని చావు అది చావనీ" అంటూ లేచి వెళ్ళిపోయాడు పేరయ్య గారు, శారదమ్మ గారు ఎంత బ్రతిమాలాడుతున్న వినిపించుకోకుండా .
'పెద్దా చిన్నా లేకుండా యింటి కొచ్చిన పెద్దమనిషిని - అంతేసి మాటలంటా వుంటే పాపిష్టి దానా' అంటూ మెడ వంచి లేని వోపిక తెచ్చుకుని నాలుగంటించింది కుమార్తె ను శారదమ్మ గారు.
ఈ యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో రఘుపతి గారు లోపలికి వస్తూ - విషయం గ్రహించి 'నేను బ్రతికున్నానే యింకా. దానికి పెళ్ళి చేయవలసిన వాణ్ణి - సంబంధం చూడవలసిన వాణ్ణి- నేనా ఆ పేరయ్యా? అసలు ఆగాడిదను మళ్ళీ యింట్లో ఎందుకు అడుగు పెట్టనిచ్చావ్? నిక్షేపం లాంటి సంబంధం చూస్తా చూడు' అన్నారు.
భర్త నోటి నుండి అటువంటి చల్లని మాట వినడం అంతకుముందు శారదమ్మ గారికి అలవాటు లేక 'నే బ్రతికుండగానే నంటారా?' అంది వ్యంగ్యంగా.
'అంత తొందరగా పోవులే మన ఘటాలు'స్వామి గదిలో కొచ్చి - 'ఇవాళ నూజివీడు వెళ్ళానయ్యా , మీ అమ్మగారు కనిపించారు అవధాని గారింట్లో . నువ్వు రాలేదేమిటని ఎదురు చూస్తున్నారట ' అన్నారు.
'అవధానిగారింట్లో తల్లి వంటలు చేసుకు బ్రతుకున్నదన్న విషయం రఘుపతి గారికి తెలిసిందన్నమాట' అనుకున్నాడు. అది తప్పని కాదు. కానీ చెప్పుకోవలసిన విషయమనిపించలేదు స్వామికి.
మర్నాడు తల్లి సీతమ్మ గారు 'కుమారునికి చిరాయువుగా దీవించి వ్రాయిన్చునది.' అంటూ శాస్త్రి గారితో వ్రాయించిన ఉత్తరం స్వామికి అందింది.
ఆ ఉత్తరంలో మొదటి భాగం స్వామి ఊహించినదే. సమాధానం కోసంమల్లీ వచ్చిన మేనమామ కు - సంబంధం యిష్టం లేదనీ మరొక సంబంధం పెందరాళే చూసుకోవడం మంచిదనీ -- స్పష్టంగా చెప్పడం జరిగిందిట.
రెండవ భాగంలో తల్లి వ్రాయించిన విషయం మాత్రం స్వామి ఊగించింది కాదు.
శాస్త్రిగారు కొనసాగిస్తూ లేఖను 'నువ్వు బస చేస్తున్న యింటి యజమాని రఘుపతి గారు నిన్న యిక్కడ అమ్మగారితో మాట్లాడారు. ఆ కుటుంబం గురించి అమ్మగారు చాలా ఆశలు పెట్టుకున్నారు. పిల్ల బావుంటుందనీ-- సంప్రదాయం సలక్షణమైనదనీ- ఆమె గారి అభిప్రాయం. నీకూ ఉద్యోగం అయింది గనుక ఆమెకూ పెద్దరికం వచ్చింది గనుక అంతా బాగుండగానే నీ వివాహం జరగడం అత్యవసరమనుకుంటున్నారు మీ అమ్మగారు. మూడ మాసానికి ముందే ఆ మూడు ముళ్ళూ వేయించడం జరగాలని అభిప్రాయం. నీ ఉద్దేశం తిరుగు టపాలో వ్రాస్తే - మేము ఉభయులమూ వచ్చి రఘుపతిగారితో మాట్లాడగలం . నిన్న వచ్చినప్పుడే అయన చెవిన ఈ విషయం వేయడం జరిగింది. అయన కూడా సుముఖంగా ఉన్నట్టే కనిపించారు.' అంటూ ఉటంకించారు.
ఇది స్వామికి ఊహించని పరిణామం.
తల్లి మాట కాదనే అధికారం తనకి జీవితంలో లేదని నమ్మిన మనిషి స్వామి.

సృష్టిలో ప్రతి తల్లికీ ఋణపడి వుండక తప్పదు బిడ్డగా జన్మమెత్తినప్పుడు. కాని తన ఋణం అంతకు మించినది. తండ్రి లేని లోటు తల్లి తీర్చింది. ఎంత సుదీర్ఘకాలం ఆ బరువు భారించిందో తృప్తిగా తానాకు తెలుసు. ఈ ప్రపంచానికి ఆ ప్రాణిని కట్టి నిలబెట్టిన బంధమేమిటో గూడా అతడు మరిచిపోలేడు. అబలగా పుట్టినా, నిరూపించుకుంది సబలగా. అంతకు ముందు యింట్లో నుంచి కాలు బయట పెట్టిన మనిషి కాకపోయినా - మొండి ధైర్యంతో ఉన్న ఊరు వదిలి - నూజివీడు చేరింది. మండుటండలో బస్సు దిగి , తల్లి వెంట నడుస్తూ -- జమీందారు గారి సత్రానికి నడిచిపోయిన రోజు తనకి గుర్తుంది. చెప్పులు లేని యిద్దరి కాళ్ళూ పెనం మీద పడిన టమోటాల మాదిరి ప్రేలిపోతున్నప్పుడు - పది క్షణాలు చెట్టు క్రింద నిలబడి- కందిన తన కాళ్ళ బాధ గుర్తుకు రాక, తనను దగ్గరకు తీసుకుని నిట్టుర్చు విడిచిన తల్లి ఊపిరి తనకు కరిగించిన ఊరట అల్పమైనది కాదు.
