శలవుల కొచ్చినప్పుడల్లా వో దస్తా తాజా ప్రేమ లేఖలు హిందీ - యింగ్లీషు - తెలుగూ -- రకరకాలభాషలూ - ముద్దు పేర్లూ -- నానా రభసా అనుకోండి- వినివిని మాకు బోరెత్తి పోయింది లెండి. ఇంత వినేవాళ్ళు దొరక్క - పల్లెనా టులు సరిగ్గా వేసుకోడం చేతకాని కుర్ర కుంకల్ని డాబా మీద కూర్చోబెట్టి - అ వూళ్ళోనే వుంటాట్ట. ఆ డాక్టరు మరి - రోజూ ఒక ప్రేమలేఖ యిచ్చి పోతాట్ట.అది దిండు కింద పెట్టుకు కలవరిస్తే గాని- ఈవిడ గారి కళ్ళు మూతపడవట. అన్నీ చదివి వినిపిస్తుంది సిగ్గు లేకపోతె సరి . పాడు గోలనుకోండి. మా భారతమ్మ చెల్లెలు -- నాకంటే నాలుగేళ్ళు చిన్నది- ఆపాడు హరికధ విని వినీ -- బుర్ర తిరిగి - ప్రాణపతీ- అంటూ మొదలుపెట్టి - నీవు లేనిది బ్రతుకు ఎడారి పువ్వు - అంటూ కవిత్వం రాసి- కవరు కట్టి - ఎవరి కివ్వాలో అంతుచిక్కక - టీకాల ఇన్స్ పెక్టరు ఆరారిని పోతుంటే అతగాడి మీద - చిన్న రాయి మీద దాన్ని చుట్టి - గిరావాటేట్టి - చలి జ్వరమొచ్చి కంబళీకప్పుకు పడుకున్నదట-'
వింటున్నాడు స్వామి అయోమయంగా ,
చెబుతున్నది పావని అంతులేని ఉత్సాహంతో-
'తర్వాత ఏమయిందో తెలుసా మాష్టారూ?'
మనస్సాక్షిగా స్వామికి బొత్తిగా తెలీదు -
'ఆ టీకాల ఇన్స్ పెక్టర్ అది నిజమనుకుని- మర్నాటి సాయంకాలానికి బదులుగా- ప్రాణేశ్వరీ - అంటూ మరో ప్రేమలేఖ వ్రాసి- ఆ యింటి చుట్టూ పారాకాయడం మొదలు పెట్టాడు. చివరకు ట్రాజడీ అనుకోండి. మా భారతమ్మ అన్న పళ్ళు ఊడేలా వాయించాడు లెండి. ట్రాన్స్ ఫర్ చేయించుకుపోయాడా భగ్నజీవి - హా లైలా -- అనుకుంటూ '
పావని చెబుతున్న ముచ్చట్లు ఒక్కసారిగా -- ఆపి ' ఇవాళ బడికి వెళ్ళరా మాష్టారూ ?' అంది.
'ఔనండి టైమంది' అంటూ లేచాడు స్వామి.
స్కూలుకు పోవాలన్నా, హెడ్ మాష్టారిని చూడాలన్న భయం వేసింది స్వామికి. కాని వెళ్ళక తప్పలేదు.
'బళ్ళో అడుగుపెట్టగానే హెడ్ మాష్టారు పిలుస్తున్నాడండీ' అంటూ ఆహ్వానం అందింది. బిక్కుబిక్కుమంటూ గుండెలను అదిమి పెట్టుకుంటూ వెళ్ళాడు.
చిత్రంగా -- భయంకరంగా కనిపించింది హెడ్ మాష్టారి ముఖం.
'కూర్చో" అన్నారు క్లుప్తంగా.
భయంగానే కూర్చున్నాడు కుర్చీలో ఓ ,మూలకు ఒదిగి. నిశ్శబ్దాన్ని కాసేపు భరించి, చివరకు తలెత్తి చూశాడు. తన ముఖాన్ని పరీక్షిస్తున్నాయి మాష్టారి చూపులు.
'క్షమించండి మాష్టారూ.'
'ఎందుకు?'
' మీ దగ్గర అబద్దం చెప్పాను'
'ఎప్పుడు?'
'నిన్న'
'ఏ విషయం?'
'మా అమ్మకు సుస్తీ చేసిన విషయం.'
'ఎలా వుంది నాయనా- అబద్దమే గదా? ఊరు వెళ్తునన్నవాడివి -- వచ్చావంటే మనస్సు పరిపరివిధాల పోయింది. పోనీ అబద్దమే కదా? బ్రతికించావు పో. కానీ బాబూ! అప్పు అడగడానికి అటువంటి అబద్దాలా ఆడేది? నాకంటే వేర్రివాడివి కాకపొతే ఏమిటి చెప్పు? మీ అమ్మగారికి ఈ విషయం తెలుస్తే ఎంత బాధ పడుతుంటావు? తప్పు నాయనా తప్పు--'
గదిలోంచి బయటపడ్డాడు స్వామి. కాని ఆ అపనింద తనని చాలాకాలం బాధపెట్టింది. పరాంకుశం గారిని చూస్తె మరీ భయం వేసింది. ఆ అప్పును తీర్చకుండా తనకు నిద్ర పట్టలేదు. హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన రఘుపతి గారు - తీసుకున్న డబ్బు విషయం మరిచి పోయాడని పించింది. చివరికి జీతం రాగానే -- అందులోంచే --పరాంకుశం గారికి- హెడ్ మాష్టారు గారికి యివ్వవలసినది యిచ్చి - మిగిలిన పది రూపాయల కాగితం తాలూకు చిల్లరతో యింటికి చేరాడు స్వామి.
'ఏమయ్యా నల్లపూసై పోయావు నిన్నటి నుంచి వెతుకుతున్నా నీకోసం ?" అన్నారు రఘుపతిగారు. తాను యింట్లోనే వున్నాడు మరి. 'నాడబ్బు ' అని అగుడుదా మనిపించింది. సాహసం నీరసించింది అంతలోనే. ఊరి రాజకీయాల గురించి ఎన్నో సంగతులు చెప్పారు మూడు తరాల వెనుక నుంచి. ఎంతో ఓపికగా విన్నాడు. చెప్పి చెప్పి 'ఇదుగోవయ్యా! నీ డబ్బు ' అంటారనే ఆశతో, అనక పోగా ఒక సన్నివేశం వర్ణించి 'ఆ కోనేటి రావు త్రాష్టుడంటావా కాదా నువ్వు చెప్పు?' అని నిగ్గదీసేవారు. మరొక సంఘటన సంభాషణ లో ఉంటంకించి 'ఈ మున్సబు చవట దద్డమ్మంటావా లేదా?' అని నిలదీసి అడిగేవారు.
గొంతు పలమారి నోటరాక బాధపడుతున్న స్వామి గోడు ఆయనకు అర్ధంకాదు. ఏనుగు గున్నల మధ్య లేగ దూడ లాంటి బడిపంతులు గోడు!
ఆ విధంగా నూరు సంవత్సరాల పాటు ఎకదాటీన ఉపన్యసించటానికి సరిపడినంత సంభారముంది. రఘుపతి గారి బుర్రలో. మరికొన్ని కధలూ గాధలూ వ్రేళ్ళగ్రక్కి చివరకు 'అమ్మాయికి కాస్త శ్రద్దగా చెప్పాలయ్యా ట్యూషనూ' అంటూ హెచ్చరించి 'అన్నట్టు కొత్త సబ్ న్సిపెక్టర్ వొచ్చాట్ట. మున్సబింటికీ మరిచేపోయా' అనుకుంటూ ఊపిరి ఆడక కొట్టుమిట్టాడుతున్న స్వామికి విముక్తి ప్రసాదించి చకచక అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయారు రఘుపతి గారు.
'రెడీ మేష్టారూ!' అంది పావని, ఎదురు చూస్తున్నట్లు తండ్రి వెళ్ళగానే గదిలోకి దూకినట్టు అంగవేసి చెంగున.
"ఇవాళ నుంచీ నాకు పట్టుదల వచ్చేసిందండి. నాకు జన్మలో యింగ్లీషు రాదంటూ ఆ భూతద్దాల కళ్ళజోడు - ఆ వెధవ యింగ్లీషు ముక్కలు అదీను-- ఉత్తిపుణ్యానికి దులిపేసిందండి-- నేనూ మాదేకి పారేశాననుకోండి . కెంటాంగరస్ అంటే ఏమిటండి?'
'ఎందుకండి?'
'నన్ను తిట్టిందిలెండి అది'
'అది అంత పెద్ద తిట్టు కాదండి'
'దాని మొఖం పెద్ద తిట్టు తిట్టే ధైర్యం ఆ నీరస రాణి కేక్కడుంది లెండి. ఆ అర్ధం చెప్పండి."
'గయ్యాళి- అనండి'
'ఆహా , తనకంటే గయ్యాళినా? ఇంట్లో యిష్టం లేకపోయినా ఆ డాక్టర్ - అసలు కులం కూడా ఒకటి కాకుండా - చూపెడ్తా. మాష్టారూ చదివి తీరాలండి. కాస్త గట్టిగా చెప్పాలి యింగ్లీషు నాకు. ఊ మొదలెట్టండి.'
స్వామి నవ్వాడు పావని తొందర చూసి.
'మీకు నవ్వుగానే వుంటుంది మాష్టారూ! నాకు మాత్రం కసిగా ఉంది. రాత్రి నిద్ర పట్టటంలా మొదలు పెట్టండి.'
ఆరోజు పాఠం బాగానే నడిచింది. 'ఈ పట్టుదల ఎన్నాళ్ళో' అనుకున్నాడు స్వామి. కాని పది రోజులు గడిచినా ఆ పావని పట్టుదల తగ్గింది కాదు. ఈ పదిరోజుల్లో స్వామి చెవులు బోసి పోయాయి. చిన్ననాటి అంటుజోడు అదృశ్యమై పోయింది. మరొక మహాపాపం చేశాడు స్వామి. రఘుపతి గారి కోసం చేసిన అప్పులను వెతుక్కుంటూ మొదటి నెల జీతం నడిచి చక్కా పోయింది . 'మొదటి జీతమంతా తల్లి దోసిట్లో పోయాలను కున్న స్వామి ఆశ నేరవేరిందికాదు. 'ఫస్టు అయాక శని ఆదివారాల్లో నూజీవీడు వస్తానమ్మా' అంటూ బస్సు ఎక్కేముందు తల్లికి చేసిన వాగ్దానం నిలబెట్టు కోలేక పోయాడు. అంతకుమించి నెల గడిచే ఎత్తు కనిపించలేదు. 'ఇంక జన్మలో అప్పు చేయకూడదని' నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయాన్ని నిలబెట్టు కుంటానికే చిన్ననాటి అంటు అంటు కోడు చిల్లరకొట్టు వీరాసామి కి అమ్ముకోవలసి వచ్చింది. దాచుకుంటానికి వీలులేని విషయమయింది.
'కంగ్రాచ్యులేష నండోయ్ - కాస్త ఫేషన్ వంట పడుతుంది. ఈ జ్ఞానవరం నీళ్ళు మున్నాళ్ళు త్రాగితే చాలు - జ్ఞానోదయం అయి తీరుతుంది ఎటువంటి మనిషికైనా' అంటూ కొంత వేళాకోళం పట్టిస్తూనే స్వామిని అభినందించింది పావని జోడు తీసినందుకు.
స్వామి అంతకుముందు రెండు రోజుల పాటు గొడ్డు కారం నంచుకుంటూ అప్పలమ్మ పోసిన పుల్ల చల్లతో కాలక్షేపం చేశాడు. మాడిన పెగుకే తెలుస్తాయి రుచుల పసలు, కమ్మగా పప్పుచారు పెట్టుకోవాలనిపించింది స్వామికి. అంటూ జోడు కొన్న వీరాస్వామి ఆప్యాయంగా వెచ్చాలయిచ్చి - మిగిలిన డబ్బు - నూట యాభై ఎడుంబావలా చేతులో పెట్టాడు కంసాలి కామయ్య చెవులు నమిలి నమిలి కొరికిం తర్వాత.
