Previous Page Next Page 
శరన్మేఘం పేజి 17

 

    "దీన్ని బట్టి అర్ధం చేసుకోవే పిచ్చి తల్లీ. అతనికి ఎవరి మాట అంటే గౌరవం ఉందొ." చల్లగా సమిధ వెయ్యబోయింది రాజమ్మ . "నువ్వు ఊరుకోవే. నీకు ఎప్పుడూ ఒకటే ధ్యాస' అంటూ రత్నం రాజమ్మ మాటలు వినిపించు కోకుండా బాబి గాడి పుట్టిన రోజు ఏర్పాట్లు గురించి ఆలోచించుకుంటూ ఊహల్లో తేలిపోతూ వెళ్ళిపోయింది.
    అనుకున్న ప్రకారం ఆ మర్నాడు బజారు నుంచి సరుకులన్నీ తేవడం పడింది గాని పిలుపు కి వెళ్ళడం కుదరలేదు. అందువల్ల పుట్టిన రోజు నాడే పొద్దుట చంటాడి కి తలంటి నీళ్ళు పోసి కొత్త బట్టలు తొడిగి, ఇన్ని బిస్కట్లయితే వాడి ముందు పోసి, గోపాలానికి వాడిని అప్పగించి, తోటి కోడళ్ళు ఇద్దరూ పిలుపు కి బయలు దేరారు. గోపాలం, సునంద ఆరోజు ఆఫీసు లకి శలవుపెట్టారు. మెట్లు ఇంకా దిగకుండానే సునంద కట్టుకున్న చీర చూసి, "అదేవిటి అక్కయ్యా పేరంటం పిలుపుకి ఆ నూలు చీర కట్టుకుని బయలుదేరావు" అంది రత్నం.
    నూలు చీరేమిటి , పట్టు చీరేవిటి. ఏదో ఒకటి పోనిద్దూ అంది విరక్తి గా సునంద.
    "అదేవిటి? పేరంటం పిలుపు కి వెళుతున్నాం కదా ఓ శుభ్రమైన చీర కట్టుకోవద్దూ?
    "నిజానికి శుభ్రమైన చీరే లేదు సునండకి. ఏడాది ఎన్నార్ధం అయి శివరాం జబ్బు పడిన తర్వాత శుభ్రమైన చీరేవితి, అసలు చీరే కొత్తది కొనుక్కోలేదు. ఇంక మిగిలిన వన్నీ నలుగుపోయిన పాత చీరలు పెళ్ళికి అత్తారు పెట్టినవీ, తనవీ. నాలుగైదు పెద్ద చీరలు పెట్టె అడుగున ఉన్నాయి కాని...కొన్ని చిరుగు పట్టీ కొన్నికపదిగి పోయి వెలవెల పోతూ కొన్ని అసహ్యంగా బాగా నలిగిపోయీ ఉన్నాయి. ఓక్కటీ బైట కెళ్ళే టప్పుడు కట్టుకోడానికి వీలుగా లేవు.
    అందుకే సునంద ఏం మాట్లాడకుండా ఊరుకుంది పైగా ఆయనలా మంచం మీద ఉండగా తను పెద్ద చీరలు కట్టుకుని ఊళ్ళో ఊరేగడం ఏవిటి?
    నిర్లిప్తంగా ఉండిపోయిన సునంద ని చూసి రత్నం "ఏం అక్కయ్యా.... మంచి చీరాలెం లేవా నీకు?" అంది సమాధానంగా సునంద ఒక నీరసమైన నవ్వు నవ్వింది. "పోనీ నా చీర ఒకటిస్తాను కట్టుకో"
    "ఇన్నాళ్ళ నుంచీ చూస్తున్నావు కదా నేను ఎప్పుడైనా నా చీర తప్ప ఇంకొకటి కట్టుకున్నానా"
    "మరెలాగ?"....ఆ ...ఆ మధ్య శాంత పెట్టిన చీర కట్టుకో పోనీ"
    సునంద అదిరిపడి.... "అదా....? అది.... అది ఇప్పుడు వద్దులే"
    "ఏవిటి అక్కయ్యా నీ భావం నాకు అర్ధం కావడం లేదు. నాతొ సరదాగా రావడం నీకిష్టం లేదా? లేకపోతె పదిమంది లోనూ నన్ను అవమాన పరచాలనే ఉద్దేశం ఉందా చెప్పు"
    "చీర కోసం ఇంత రాద్దాంతం ఎందుకు? అయినా ఇలా రావడం లో నిన్ను అవమాన పరచడం ఏముంది?"
    "ఏం లేకేం? నేనీ జరీ పువ్వుల పెద్ద చీర కట్టుకుని వస్తుంటే, నువ్వు పేద ముత్తైదువులాగ వెలిసిపోయిన ఆ నూలు చీరతో బయలుదేరితే . అర్ధం ఏమిటి? నన్ను అవమాన పరచడం కాదూ?"
    "అలా అనుకోకు రత్నం" ప్రాధేయ పూర్వకంగా అంది.
    "అనుకోను మరి.... లోపలికి వెళ్ళి ఈ చీర మార్చుకుని ఆ శాంత పెట్టిన చీర కట్టుకురా.... పోనీ నాతొ నీకు సరదాగా పిలుపుకి రావడం ఇష్టం లేదంటే అ మాటేనా చెప్పు"
    "ఛ....అదేమ మాట!..ఉండు అయితే ఆ చీరే కట్టుకొని వస్తా"
    శాంతా జగపతీ పెట్టిన ఆ చీర కట్టుకుని బయలు దేరిందన్న మాటే కాని సునంద కి ఏం ఇష్టం లేదు. బరువుగా , బాధగా గొంగళీ కట్టుకున్నట్టుంది ఆ చీర. ఏదో వెర్రి అభిమానంతో పట్టుకొచ్చి ఆ చీర తనకి పెట్టించాడే కాని అది ఎన్ని సమస్యలకి దారి తీస్తుందో ఊహించలేకపోయాడు అమాయకుడు జగపతి. అది చూసే శివరాం తనని చీదరించుకున్నాడు. అది కారణం గానే శాంతా రవణమ్మ గారూ అపార్ధం చేసుకొని ఆరోజున తనని అలా అవమాన పరిచారు.....
    "అక్కయ్యా......అందరినీ పిలిచేశాం. ఇంక మీ మేనేజరు గారింటికి వెళ్ళి శాంతని వాళ్ళ అమ్మగారిని పిలుద్దామా?" రత్నం మాటలకి , తన ఆలోచనల్లోంచి తేరుకుని, "ఏమిటి అందరినీ పిలవడం అయిపోయిందా?" అంది సునంద , తను ఎంత యాంత్రికంగా ఇంతసేపటి నుంచీ పేరంటం పిలుపులో పాల్గోన్నదో తెలుసుకుని ఆశ్చర్యంతో.
    "ఆ...ఇంక మీనేజరు గారింట్లో పిలవడమూ ఇంటికి వెళ్ళి పోవడమూ "అన్నది రత్నం.
    ఆరోజున అంత జరిగాక ఇంక వాళ్ళింటికి వెళ్ళడం సునంద కి ఇష్టం లేదు. పైగా ఆ చీర కట్టుకుని, అందుకే అంది రత్నం తో "వాళ్ళ ఇంటికి అక్కర్లేదు లెద్దూ" అని.
    "అదేవిటి? అందర్నీ పిలిచి వాళ్ళని పిలవక పొతే బాగుంటుందా? అయినా వాళ్ళకి సునంద అంటే ఎంత అభిమానం? నీకు పండక్కి ఈ చీర తీసుకువచ్చి పెట్టారు కూడా"
    'అయితే వద్దులే -- వెనక్కి వెళ్ళిపోదాం"
    "ఏం? ఏమైనా సరే. వెళ్ళి పిలవవలసిందే"
    "అయితే నువ్వు వెళ్ళు....నేను రాను"
    "నువ్వు రాకపోతే ఇల్లు అనమాలు చెప్పు నేను వెళ్తాను"
    "అవతల వీధిలో ఎడం చేతి వేపు చివర మేడ. రెండస్తులది" అంటూ రోడ్డు పక్క నున్న ఓ చెట్టు నీదని ఆగింది. ఈ పేరంటం పిలుపు కి తిరిగేటప్పటికి ఆమెకు ఎక్కడ లేని నీరసం వచ్చింది. కాళ్ళు పీకుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయి. ఉన్నట్లుండి శూలం తో పొడిచినట్లు పక్కలో నెప్పి వచ్చింది. అసలే వంట్లో శక్తి లేక నీరసించి పోయిన సునంద ఆ నెప్పి కి తట్టుకోలేక "అమ్మా?"అని మూలిగింది.
    ఇంటికి వెళ్ళడానికి ఓపిక లేదు.
    కనుచూపు మేరలో రిక్షా కనిపించడం లేదు.
    మొగ దాటితే హాస్పిటల్ -- ఎలాగో అలాగ శరీరాన్ని అక్కడికి చేరిస్తే , కాస్సేపు అక్కడ సేదదీరి , ఆ తర్వాత ఇంటికి నెమ్మదిగా బయలుదేరి వెళ్ళవచ్చు. అడుగు కదిపింది. మళ్ళీ నెప్పి వచ్చింది. ఈమాటు నెప్పితో దగ్గు కూడా వచ్చింది. కొంచెం సేపు ఆగింది తగ్గింది కదా అని బయలు దేరబోతే తిరిగి నెప్పీ దగ్గూ వచ్చాయి. ఊపిరి బిగపట్టి ఎలాగైతేనేం. నడుస్తూ ఆగుతూ చివరికి హాస్పిటల్ వార్డ్ లోకి అడుగు బెట్టింది సునంద.
    ఆమెని ఆ స్థితిలో చూసి కంగారుగా బెడ్ దిగి వచ్చాడు శివరాం. వస్తూనే ఆదుర్దాగా "ఏమిటి  సునందా ....అలా అయిపోతున్నా వేమిటి?.... ఏమైందీ?..... ఈ స్థితిలో ఎందుకు వచ్చావు ఇలా ఒక్కతైవీను?" అంటూ ఒక్క గుక్కలో అడిగేశాడు ఆయాసం వల్ల మాట్లాడలేక చేత్తో సంజ్ఞ చేసి మంచినీళ్ళు కావాలంది....
    మంచినీళ్ళు తాగాక ఎంతో సేపటికి కాని స్థిమిత పడలేదు సునంద. అంతసేపూ శివరాం సునంద కేసి జాలిపడి చూస్తూ "నాకోసం ఏం అవస్థలు పడుతోంది! కావాలని నన్ను పెళ్ళి చేసుకొని ఏం సుఖపడింది బంగారు బొమ్మలా ఉండేది ఈమనో వేదన వల్ల , అహోరాత్రులు చాకిరీ వల్లా, ఎంత దయనీయంగా తయారైంది! అయ్యో నా వెఱ్రి సునందా ఎంత కష్ట పడుతున్నావు నాకోసం" అంటూ మౌనంగా బాధపడ సాగాడు.
    ఎంతో ప్రయత్నం మీద పెదిమల మీదకి చిరునవ్వు తెచ్చుకుని "ఏమిటండీ అలా చూస్తున్నారు నాకేసి?" అంది సునంద.
    'అది కాదు సునందా-- నువ్వు ఎంత చిక్కి పోయావో , ఎలా తెల్లగా పాలి పోయావో తెల్సా? నిన్ను చూస్తె మనస్సులోంచి ఏదో వెఱ్రి బాధ వస్తోంది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS