Previous Page Next Page 
పిల్లలతో ప్రేమయాత్ర పేజి 18

 

    అందరూ నిద్ర లేచేసరికి సాయంత్రం నాలుగు దాటింది. అప్పుడు స్నానం చేసి, లైట్ గా టిఫిను తీసుకుని చల్లబడే వేళ అలివేలు మంగ తాయారు గుడి చేరుకున్నారు.
    అక్కడ జనం ఎక్కువగా లేరు. పైగా చల్లని సాయం సమయం. అగరువత్తుల ధూప సువాసనలతో నిండిన వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
    గుళ్ళో పని అయినాక, బయటకు వచ్చి చాలాసేపు అక్కడనే మాట్లాడుకుంటూ కూర్చున్నారు-- ఆ వాతావరణాన్నుండి త్వరగా వెళ్ళడం యిష్టం లేక.
    ఐతే ఆ ప్రశాంతతకు భంగం కలిగిస్తూ పిల్లలు ఒక ఘాతుక కృత్యం చేసేరు. ఎలా వచ్చిందో అక్కడ - యింత ఆవు పెడ ఉంటె అందులో కాలు వేసి జర్రున జారేడు బాబిగాడు.
    నడుం నొప్పి పిట్టి వాడు ఏడుస్తుంటే వాడు బట్టలు, కాలి బూట్లు పాడు చేసుకున్నదుకు చిరాకు పడింది కళ్యాణి ఎలాగో వాడి చొక్కాకి , లాగు కి అంటిన పేడను తుడిచి, నీళ్ళతో కడిగి , తడిసిన చెప్పులను తొడుక్కోనని బాబిగాడు సత్యాగ్రహం చెయ్యటం వల్ల వాటిని చేత్తోనే పట్టుకుని విసుగు చెందిన మనసుతో తిరుగు ప్రయాణం ప్రారంభించేరు ఆ దంపతులు.
    'పాడు పెడ! ఎక్కడ్నించి వచ్చిందో!' అంది కళ్యాణి విసురుగా.
    'ఎక్కడ్నించి వస్తుంది పెడ? పశువుల దగ్గర నుండి!" అంటూ తాపీగా సమాధాన మిచ్చేడు కాంతారావు.
    'సర్లే. మీ తెలివి తేటలకు సంతోషించెం. పెడ పశువులదేనని నాకూ తెలుసు. ఆ పశువులు అక్కడకు ఎలా వచ్చినాయీ అంట!' అంటూ భర్తని గద్దించినట్టు అడిగింది కళ్యాణి.
    'ఏమో, నన్నడిగితే నాకేం తెలుస్తుంది? ఈరోజుల్లో మనుషులకు దేవుడి మీద భక్తీ సన్నగిల్లెసరికి పశువులకే భక్తీ పుట్టుకొస్తున్నట్టుగా ఉంది. బహుశా దేవి దర్శనం కోసం వచ్చిన భక్త పశువులలో ఎవరో ఆ పుణ్యం కట్టుకుని ఉంటారు.' అన్నాడు కాంతారావు.
    కళ్యాణి పకపక నవ్వింది. 'ఫరవాలేదు. మీరు జోక్స్ బాగానే వేస్తారు.' అంటూ సర్టిఫికేట్ యిచ్చేసింది భర్తకు.
    'థాంక్స్' అంటూ ఆ సర్టిఫికేట్ ను సవినయంగా అందుకున్నాడు కాంతారావు.
    హోటలు కి తిరిగి వెళ్ళేక భోజనం చేసి త్వరగా నిద్రపోయేరు. మర్నాడు ఉదయం కాళహస్తి వెళ్ళవలసి ఉంది కనుక త్వరగా లేవాలి కదా అని త్వరగా నిద్రపోతే మంచిదని ఆడుకుంటున్న పిల్లలను బలవంతాన నిద్రపుచ్చింది కళ్యాణి.
    పగలు చాలాసేపు నిద్రపోవటం వల్ల పిల్లలకు త్వరగా నిద్ర రానే లేదు. వాళ్ళు నిద్రపోయేదాకా చేత్తో చిచ్చు కొట్టి కొట్టే ఆమె కుడి చెయ్యి కాస్తా నొప్పి పుట్టింది. వాళ్ళు నిద్రపోయేసరికి అరగంటకు పైగా పట్టింది.
    'అమ్మయ్యా! ఇప్పటికి నిద్ర పోయేరు!' అనుకుంటూ నొప్పి పుడుతున్న చేతిని ఫ్రీగా వదిలేసి వెల్లికిలా పడుకుంది కళ్యాణి.
    'పిల్లలనైతే నిద్రబుచ్చేవు. మరి నన్నుకూడా నిద్రపుచ్చవూ?' అంటూ కాంతారావు వచ్చి ఆమె గుండె మీద తలానించి పడుకున్నాడు.
    అతని తల మీద ముద్దు పెట్టుకుని 'నిజం కాంతం! నువ్వు కూడా నా కంటికి చిన్న పిల్లాడి లాగానే కనిపిస్తావు. నా పెద్ద కొడుకువి నువ్వే!' అంటూ కండ్లు అర్ధ్రమవుతుండగా అతని తలని తన గుండెకు మరింత దగ్గరగా హత్తుకుంది కళ్యాణి.
    కాంతారావు పసిపిల్ల వాడిలా ఆమె శరీరపు ఓంపులలో వదిగిపోయేడు. మరో అరగంట గడచేసరికి వాళ్ళిద్దరూ కూడా గాడ సుషుప్తి లోకి మునిగిపోయేరు.
    తెల్లవార గానే స్నానాలు, టిఫిన్లు అన్నీ   ముగించుకుని ఎనిమిది గంటలకు కాళహస్తి వెళ్ళే బస్సులో లగేజీ తో సహా వెళ్ళి కూర్చున్నారు కాంతారావు కుటుంబ సభ్యులంతా. ప్రయాణం ఆహ్లాదకరంగా క్లుప్తంగా జరిగిపోయింది. వేసవి కాలం అవటం వల్ల పది గంటలకే ఎండ చర్రుమని కాల్చి వేస్తోంది.
    దేవాలయం లోకి వెళ్ళాలంటే ముఖ ద్వారం నుండి మూడు ఫర్లాంగుల దూరం నడచి వెళ్ళాలి. ముఖ ద్వారం దగ్గర ఉన్న కొబ్బరి కాయల దుకాణాల వాళ్ళు చెప్పులు అక్కడనే విడిచి వట్టి కాళ్ళతోనే లోపలికి పోవాలి అన్నారు. 'దేవుడిక్కడ లేడు కదయ్యా! దేవాలయం దగ్గరకు వెళ్ళేక అక్కడ విడుస్తాం. ఈ ఎండలో వట్టి కాళ్ళతో ఎలా నడచేది?' అన్నాడు కాంతారావు.
    'ఇదంతా దేవాలయానికి సంబందించిన ప్రదేశమే! ఏమైనా సరే చెప్పులతో ఈ ప్రదేశంలో నడవటానికి వీల్లేదు" అంటూ ఖచ్చితంగా చెప్పేరు వాళ్ళు.
    ఇక చేసేది లేక చెప్పులు విడిచి కాళ్ళు  బొబ్బలేక్కుతుండగా కల్యాణి కళ్ళ నీళ్ళను బలవంతాన నిగ్రహించుకుంటూ గబగబ నడుస్తూ వెళ్ళింది . కాంతారావు బాబుని, కళ్యాణి పాపను ఎత్తుకుని వడివడిగా నడుస్తున్నారు.
    కాంతారావు మనసు విలవిల లాడిపోతుంది. కళ్యాణి కాళ్ళు ఆ ఎండకు ఎలా కంది పోతాయో అతనికి బాగా తెలుసు. ఎండలో రెండు నిమిషాల పాటు నిల్చుంటేనే మనిషి మహా అయాసపడి పోతుంటుంది. అలాటిది ఈ మూడు ఫర్లాంగులు దూరం పాప నెత్తుకుని కాళ్ళకు చెప్పులు లేకుండా బాగా కాలిన బండల మీద నడవాలంటే.......
    వాళ్ళ ముందు పరుగులు పెడ్తూ నవ్వు కుంటూ పోతున్న గుండ్ల ను చూసి అంత బాధలో కూడా ఫక్కున నవ్వి 'వెంకట సుబ్బలక్ష్మీ టూరిస్టు సర్వీసు వాళ్ళు కూడా వచ్చేరందోయ్. వీళ్ళు కూడా మనతో పాటే ప్రయాణం చేస్తున్నారు.' అంది భర్తతో.
    'ఔను వాళ్ళు చూడు ఎంత సునాయాసంగా నడుస్తున్నారో! వాళ్ళకీ ఎండ ఒక లెక్కా? అసలు వాళ్ళెప్పుడన్నా చెప్పులేసుకున్న వాళ్ళయితే కదా! ఇంత కన్న పెద్ద ఎండలో కూడా వాళ్ళు రోజూ చెప్పులు లేకుండా నడుస్తారు. అదృష్టవంతులు.' అన్నాడు కాంతారావు. భర్త  అలా అనగానే కళ్యాణి కి తన కాళ్ళ మంటలు జ్ఞప్తికి వచ్చి, చిందులు వేస్తూ నడవసాగింది.
    చివరి కేలాగైతే నేం దేవాలయం వద్దకు నీడలోకి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళగానే పాపని అరుగు మీద కూలేసి కల్యాణి కూడా చతికిలపడి మాటామంతీ లేకుండా పదినిమిషాల పాటు కూర్చుండి పోయింది.
    కాస్త మంచి నీళ్ళిప్పించేడు భార్యకి. పిల్లలకు కాంతారావు. భక్తులందరి తో కలిసి వాళ్ళు కూడా దేవాలయంలోకి ప్రవేశించారు.

                                       8

    లోపలికి ప్రవేశిస్తూనే ఎంతో ఎత్తుగా విశాలంగా ఉన్న దేవాలయాన్ని చూసేసరికి ఆశ్చర్యపోయింది కళ్యాణి. ఎన్నో వందల సంవత్సరాలుగా చెక్కు చెదరక నిల్చున్న రాతి స్తంభాలను వాటి మీద నిలబడిన ఆలయాన్ని చూస్తుంటే కల్యాణి మనసు చలించిపోయింది. ఎంతో కఠినం గా , నిశ్చలంగా ఉన్న ఆ రాతి కట్టడాన్ని చూస్తుంటే నిజంగా భర్త చెప్పినట్లు అచంచలము, అద్భుతమూ అయిన భారతీయ సంస్కృతీ కి సాటియైనదేదీ లేదనిపించింది.'
    ఆలయం నిండా ఎక్కడా చూసినా శివలింగాలే! గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి, గర్భగుడి దగ్గరకు వెళ్ళేసరికి పదిహేను నిమిషాలు పట్టింది. ఆ దేవుడికి శ్రీకాళహస్తిశ్వరుడన్న పేరు ఎందుకు వచ్చిందో చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన కళ్యాణి , శివలింగం దగ్గర ఉన్న సాలెపురుగు ను, పామును ఏనుగును చూడాలని ఎంతో ఆత్రంగా గర్భగుడి వైపుకు నడిచింది.
    గర్భగుడి లో కటిక చీకటి. ద్వారం దాటి లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. శివలింగానికి , తమకీ మధ్యా కొన్ని అడుగుల దూరం. ఆ దూరం. చీకటి ఆమె కంటికి ఏమీ కనబడకుండా చేసినయ్.
    'సాలీడు పాము ఏనుగు అన్నీ ఉన్నాయా అక్కడ?' అనడిగింది కళ్యాణి ఆత్రంగా .
    'ఉన్నాయి కాని మీకు కనపడవు.' అన్నాడు పూజారి నిర్లక్ష్యంగా.
    'ఎందుక్కనపడవు ? మేం అంత పాపాత్ములమా?' అని లోలోపల కసిగా అనుకుని పైకి మాత్రం 'మేం యింత దూరం ఎండలో వచ్చింది దైవాన్ని చూట్టానికే కదండీ!' అంది కళ్యాణి వినయంగా.
    'ఏడాది కోసారి మాత్రమే భక్తులకు చూపిస్తాం. మామూలు రోజుల్లో దేవుడు ప్రజలకు కనపడడు.' అన్నాడు పూజారి.
    'గుడి కట్టించిన రోజుల్లో నైతే ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి గర్బగుడి చీకటిగా ఉండేది. ఈ స్పుట్నిక్ యుగంలో కూడా యింకా మీరు గర్బగుడి లో ఎలక్ట్రిక్ దీపాలు పెట్టించడం లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఐనా 'శ్రీ కాళహస్తి ' ని గూర్చి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. ఆ మూడు జంతువుల భక్తీ ని గురించి పుస్తకాల్లో చదువుకుని పరమశమవుతారు. అందునా యీ దేవుడు మామూలు వాడు కాడు. భోళా శంకరుడు. ఈయనకు కూడా భక్తుల యెడల అంత కాఠిన్యం ఉందంటే నేన్నమ్మను. మీరు అబద్దమాడుతున్నారు....' అని ఆమె యింకా ఏదో అనబోతుండగా కాంతారావు ఆమె చేతిని నొక్కాడు. 'ఇంకా మాట్లాడవద్దు అన్నట్లు.
    పూజారి కల్యాణి వంక వోసారి ఎగాదిగా చూసి మౌనంగా తీర్ధం యిచ్చేడు.
    కర్పూరం వెలిగించి హారతి దైవానికి పెడుతుంటే ఆ గుడ్డి వెలుగులో లింగం ఆకారం మాత్రం లీలగా కనపడింది. కాని సాలెపురుగు, పాము, ఏనుగు యే మాత్రం కనపడక పోయేసరికి నిరుత్సాహపడి పోయింది కళ్యాణి.
    ఇవతలకు వచ్చేక మనం 'యిక్కడకు రావటం శుద్ధ దండగ. అసలు నేను వచ్చిందే వాటిని చూట్టానికి. నాలుగైదు సంవత్సరాల వయసులో ఉండగా చదువుకున్న ఆ పాఠం లోని విచిత్ర దేవాలయాన్ని చూడాలని ఎంత ఆరాట పడ్డానో తెలుసా? వీటి కోసం కాకపోతే నేను అసలు ఈ ఎండలో కాళ్ళు బొబ్బలెక్కించుకుని యింత దూరం నడిచి వచ్చేదాన్నే కాదు' అంది దీనంగా కళ్యాణి.
    'పోన్లే కళ్యాణి! ఊరుకో బాధపడకు. వాళ్ళ రూల్సు వాళ్ళవి. పాపం ఆ పూజారి మాత్రం ఏం చేస్తాడు?' అని వోదార్చేడు కాంతారావు.
    'అది కాదండీ! అసలు గర్భ గుళ్ళో ఎలక్ట్రిక్ దీపాలు ఎందుకు పెట్టరంట! గాలి వెలుతురూ లేనిచోట దేవుణ్ణి బంధిస్తే ఈ మనుషులకు వచ్చే ముక్తి ఏమిటీ అంట? పోనీ ఆ రోజుల్లో ఏదో వాళ్ళ నమ్మకాలను బట్టి అలా కట్టించేరనుకోండి . ఇప్పుడైనా కాస్త దేవాలయాలను మోడ్రనైనా చెయ్యవచ్చు కదా. ఆ గర్భగుళ్ళో ఫాను పెట్టి వో ట్యూబ్ లైటు పెడ్తే పోయిందేముంది చెప్పండి?' అంది కళ్యాణి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS