Previous Page Next Page 
పిల్లలతో ప్రేమయాత్ర పేజి 17

 

    బాబు కళ్ళ నీళ్ళతో, ముక్కు చీమిడి తో తండ్రి పాంటు ను తడిపేస్తూ ఏడుస్తుంటే పాప కన్నీటి తో కళ్ళను తడుపుకోవటమే కాక చెడ్డీ ని కూడా తడుపుకుంది -- అమ్మ వళ్ళో కూర్చుని. దాంతో కళ్యాణి కట్టుకున్న పట్టు చీరంతా ఖరాబై పోయింది. ఆ బట్టలతో తడిచి పోయిన పాప చెడ్డీని పట్టుకుని యూనివర్శీటీ కి ఎలా వెళ్ళటం? తొందరలో ప్లాస్టిక్ బుట్టను కూడా తెచ్చుకోలేదు, పోనీ చెడ్డీని అందులో పడేద్దామంటే-- కళ్యాణి కి కళ్ళ నీళ్ళ పర్యంతమయింది.
    అంతలోకే యూనివర్శీటీ ముందు టాక్సీ ఆగింది. చెడ్డీని పట్టుకుని, దిగి వోసారి తన చీర వంక, చెడ్డీ వంక , పాప వంకా మార్చి మార్చి చూసుకుంది కళ్యాణి. కోపం, దుఃఖం అమితంగా పొంగి రాబోయి గొంతు దగ్గరే ఆగిపోయినాయ్. కాంతారావు ఆమె అవస్థ చూడలేక ముఖం పక్కకు తిప్పుకున్నాడు.
    చివరికి తన కసి నంతా భర్త మీదకు చూపిస్తూ 'తండ్రి పిల్లలు వెళ్ళి రండి. హాయిగా తిరిగి రండి. నేనిక్కడే పడి చస్తాను. ఈ చీరతో, చెడ్డీ తో యూనివర్శీటీ లోకి రావాలంటే ....' ఆమె కంఠం పూడుకు పోయింది దుఃఖం తో.    
    కాంతారావు వోసారి కళ్యాణి ముఖంలోకి చూసి అన్నాడు. 'పిల్లలన్న తరువాత ఎవరికైనా యిలాటి పాట్లు తప్పవు. ప్రతి చిన్న విషయాన్ని ఎందుకంత సీరియస్ గా తీసుకుని బాధపడ్తావు కళ్యాణి! అన్నీ తెలిసిన దానివి ఇంతకంటే నేను నీకేం చెప్పను? ఐనా యిది వేసవి కాలం . యూనివర్శీటీ సెలవులు. జనం కూడా ఎక్కువ మంది ఉండరు. మన బట్టలేలా ఉన్నాయో చూసే వోపిక ఎవరికీ లేదులే యిక్కడ. పద' అన్నాడు.
    'మీకేం కబుర్లు బాగానే చెప్తారు. మీదాకా వస్తే గాని మీకు తెలియదు.'
    'చూడు నా పాంటు నిండా మీ అబ్బాయి ముక్కు చీమిడే! నా షర్టు మీద వాడి తల నూనె మరకలు..... చూస్తున్నావా సరీగ్గా?' అంటూ ఆమె దగ్గరగా వచ్చి నిలబడి చూపించేడు.
    భర్తతో పోట్లాటానికి అవకాశం జారి పోయినందున యింక చేసేది లేక ముఖం పక్కకు తిప్పుకుని 'సరే పదండి' అంది ముక్తసరిగా.
    అంతా బయల్దేరేరు. ఒక్కొక్క బిల్డింగే చూసుకుంటూ. అప్పటికి కళ్యాణి కోపం తాత్కాలికంగా అణిగి పోయింది. అంతా చూట్టం అయినాక 'బోడి.... మన ఉస్మానియా యూనివర్శీటీ ఆర్ట్సు కాలేజీ ఒక్కటి చాలు. దాని ముందు యివన్నీ దిగదుడుపే! " అన్నాడు కాంతారావు గర్వంగా. 'ఔను ఎంతైనా అది నవాబులు కట్టించినది కదా. ఆ ఠీవి , రాజసం, ఆర్టు అన్నీ..... వాటికవే సాటి' అంది కళ్యాణి.
    వాళ్ళలా యూనివర్శీటీ అంతా తిరుగు తుంటే కళ్యాణి కి తను కాలేజీ లో చదివిన రోజులు గుర్తుకు వచ్చినాయ్. అ బిల్డింగు లు, మధ్య మధ్య చెట్లు, చెట్ల నీడల్లో గుంపులు, గుంపులుగా నిలబడే విద్యార్ధులు వయ్యారంగా నడిచి పోతూ అబ్బాయిల జోక్సు తో కూడిన విసుర్లను విననట్టే నటించి వింటూ, ముసిముసి నవ్వులు నవ్వుకుని పోయే అమ్మాయిలూ, స్టాఫ్ రూములు, క్లాసు రూములు, ఆడిటోరియం, బొటానికల్ గార్డెన్.... వాటన్నిటి సమక్షంలో సాగిన తమ ప్రణయ గాధ, మూగ చూపులు , మనసుల సంభాషణ లు అన్నీ గుర్తుకు రాసాగినాయ్ కళ్యాణి కి. కాంతారావు కి కూడా సరీగ్గా అవే విషయాలు జ్ఞప్తి కి వస్తున్నాయ్. జనసంచారం లేనిచోటు చూసి వోసారి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మెత్తగా వత్టేడు కాంతారావు. కళ్యాణి శరీరం గగుర్పొడిచింది. ఇద్దరూ ఒకరినొకరు అనుకుని నడవ సాగేరు కొంత దూరం.
    బాబు విశాలంగా ఉన్న ఆవరణ లో పరుగులు పెడ్తున్నాడు. పాప కూడా తప్పటడుగులు వేస్తూ అన్న ననుసరిస్తోంది.
    కాంతారావు , కళ్యాణి ఒకరి నొకరు తాకుతూ ఒకరకమైన తన్మయ భావంతో నడుస్తున్నారు. 'ఆరోజులు గుర్తుకు వస్తున్నాయి కదూ.... యిదంతా చూస్తుంటే?' ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగేడు కాంతారావు.
    కళ్యాణి బుగ్గలు ఎరుపెక్కినాయ్. కళ్ళలో మెరుపులు కురిపిస్తూ అతని వంక వోసారి చూసి చటుక్కున తల దించేసుకుంది.
    ఇంతలో పాప అన్నతో పాటు పరుగెత్తబోయి చటుక్కున వో కంకర రాయి తగిలి కింద పడింది.
    'అమ్మో!' అంటూ యిద్దరూ పరుగెత్తు కెళ్ళేరు. పాప మోకాలు కొంచెం గా చీరుకు పోయింది. కళ్యాణి గుండె కలుక్కుమంది. పాప నెత్తుకుని ఒక్కసారి గుండెకు హత్తుకుంది. 'అయ్యో తల్లీ! ఎంత దెబ్బ తగిలిందే!" అంటూ.
    నిజానికి ఆ దెబ్బ అంత పెద్దది కాకపోయినా తల్లి కంగారు పడటం చూసి మరింత గట్టిగా ఏడవటం మొదలెట్టింది పాప. బాబు బిక్క మొహం వేసుకుని నిల్చున్నాడు. చివరకు దాని చేతికి బిస్కెట్టు యిచ్చి సముదాయించి , ఏడుపు మాన్పించేరు. ఇంతలో ఏదో కలకలం వినిపిస్తే అటుగా చూసేరు వాళ్ళు. 'వెంకట సుబ్బలక్ష్మీ టూరిస్టు బస్సు' అక్కడ ఆగటం అందులో నుండి బిలబిల మంటూ వో పాతిక, ముప్పై 'గుండ్లు ' గల మనుషులు దిగటం కనిపించింది.
    ఆ వచ్చిన వాళ్ళు వేషధారణ అదీ చూస్తుంటే తీర్ధయాత్రల కోసం వచ్చిన పల్లెటూరి శ్రమ జీవుల్లా వున్నారు. అందులోని ఆడవాళ్ళలో చాలామంది ఆడవాళ్ళ కు జాకెట్లు లేనే లేవు. కొందరికి ఉన్నా దానిని స్వేచ్చగా పైకి పెట్టేసి, పిల్లల నోట్లో రొమ్ము పెట్టి నోళ్ళు తెరచుకుని తన్మయత్వంతో పరిసరాలను గమనిస్తున్నారు. మగవాళ్ళు నోట్లో చుట్ట పెట్టుకుని కొంచెం పెద్ద పిల్లలను భుజాల మీద ఎక్కించుకుని పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడుస్తున్నారు. చిన్నా, పెద్దా, ఆడా, మగ అన్న తేడా లేకుండా అందరికీ నున్నటి గుండ్లు ఉన్నాయ్. వాళ్ళ అవతారాలు చూసేసరికి కళ్యాణి కి నవ్వొచ్చింది. ఆ నవ్వును ఆపుకోవడం చేత కాక ఫక్కున నవ్వేసింది కూడా. 'చూడండి! వీళ్ళు కూడా  'యూనివర్శీటీ చూసే వాళ్ళే! అసలు వీళ్ళకు యూనివర్శీటీ , చార్ మినార్ కి తేడా యేమిటో తెలిస్తేగా. రెండూ పెద్ద పెద్ద కట్టడాలే వీళ్ళ దృష్టి లో ' అంది.
    'హుష్! గట్టిగా నవ్వకు. వాళ్ళు చూస్తె బాగుండదు. పాపం వాళ్ళకి చదువు లేకపోతె నేం, వాళ్ళూ మనుషులే కదా! కష్టపడి సంపాదించినా డబ్బును కూడబెట్టుకుని తీర్ధయాత్రల నెపంతో ఊళ్ళన్నీ తిరుగుతున్నారు. చూడు ఎంత అక్షర జ్ఞానం లేకపోతేనేం! వాళ్ళలో కూడా యేవో దేశ దేశాలు తిరగాలనీ, ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఎంత జిజ్ఞాస ఉందొ! మనం యిద్దరు పిల్లలకే మానసికంగా వృద్దు లమయిపోయినాం. వాళ్ళు చూడు ఒక్కొక్కళ్ళ కి అరడజను మంది పిల్లలన్నా ఉండి ఉంటారు. ఐనా వాళ్ళలో శారీరక దారుడ్యం గాని, మానసికమైన ఆరోగ్యం గాని ఏ మాత్రం సన్నగిల్లి నట్లులేవు.' అన్నాడు కాంతారావు.
    కళ్యాణి నిట్టూర్చింది. 'ఔను. వాళ్ళు మనకంటే చాలా అదృష్ట వంతులు. వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించే మాట నిజమే కాని, వాళ్ళు సంపాదించిన వాటిలో పొట్టకు పోగా యింకా మిగుల్చుకుని యిలా ఆనందించగలుగుతున్నారు. కాని మనం యిన్ని డిగ్రీలు తెచ్చుకుని, యింత కష్టపడి చదువుకున్నాం కాని కనీసావసరాలను తీర్చే స్తోమతను కూడా యివ్వ లేకపోతున్నాయ్ ఆ డిగ్రీలు. ఏమిటో యీ చిత్రం!' అంది కళ్యాణి. అంతటితో ఆమె ఆలోచనలు మరో వైపుకు మళ్ళినాయ్. మెదడుకు పని కలగడం వల్ల కాసేపు ఆమె నోరు మూత పడింది.
    యూనివర్శీటీ అంతా చూట్టం అయినాక పద్మావతీ కాలేజీ కి వెళ్ళేరు.
    చెదురు మదురుగా కొందరమ్మాయిలు కనిపించేరు. కాలేజీ బిల్డింగు చాలా అందంగా ఖరీదుగా కనిపిస్తోంది.
    కొందరమ్మాయిల పిల్లలను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటుంటే కళ్యాణి గర్వపడింది. 'ఫరవాలేదు. నా పిల్లలు యితరులకు కూడా ముద్దు వస్తారు.' అనుకుంది.
    ఆ మాటే తిరిగి వచ్చేటప్పుడు భర్తతో అంటే "నీ పిల్లల అందం చూసి కాదులే వాళ్ళు ముద్దు పెట్టుకుంది. ఏదో చిన్న పిల్లలు. ఆ పసితనం చూస్తె ఎంత అందవికారంగా ఉన్నా ముద్దు పెట్టుకో బుద్ది అవుతుంది ఎవరికైనా.' అన్నాడు కాంతారావు.
    దాంతో మూడో కన్ను తెరిచింది కళ్యాణి. కాంతారావు ఎంతోసేపు బ్రతిమాలితే గాని ఆమె అలుక మానలేదు. చివరకు టాక్సీ వాళ్ళు ఉండే హోటలు దగ్గర ఆగేసరికి కళ్యాణి కోపమంతా మర్చిపోయి, భర్త వేసే జోకులకు కిలకిల నవ్వుతూ టాక్సీ దిగింది.
    భోజనం చేసేక కాసేపు విశ్రమించేరు.
    అలసిపోయిన పిల్లలు కడుపులు నిండగానే కంటి నిండుగా నిద్రపోయేరు.
    కళ్యాణి బడలికగా వళ్ళు విరుచుకుంటూ 'యింకా అలవేలు మంగ తయారు గుడి చూసేమంటే రేపు ప్రొద్దున్నే తిరుపతి వదిలి వెళ్ళవచ్చు.' అంది.
    'రేపు ఉదయం కాళహస్తి చూసి మధ్యాహ్నమే కంచి బస్సు ఎక్కాలి' బద్దకంగా పక్కకు వత్తిగిలి ఎడమ చేతిని భార్య నడుం చుట్టూ వేసేడు కాంతారావు.
    'అలివేలు గుడి క్రింద ఎందుకుందో! పైనే ఉంటె ఆ వెంకటేశ్వరస్వామితో పాటు ఆవిడ ను కూడా చూసేవాళ్ళం కదా!' అంది కళ్యాణి.
    'ఆవిడకు కూడా నీలాగానే ముక్కు మీదే కోపం జాస్తిట. వో రోజు భర్త మీద అలిగి కొండ దిగి చర్రున క్రిందకు దిగివచ్చేసి వేరింటి కాపురం పెట్టిందిట.' అంటూ ఆమెను మరింత దగ్గరగా లాక్కున్నాడు కాంతారావు.
    'పట్టపగలు ఏమిటా సరసాలు పొండి.' అంటూ అతనిని అవతలికి నెట్టి వేసింది. 'ఆవిడ దేవత కాబట్టి సరిపోయింది మొగుడి మీద కోపం వచ్చి వేరే యింట్లో ఉన్నా ఎవరూ ఏమీ అనరు పైగా అదో గొప్ప విషయంగా భావించి ఆవిడను మరింత భక్తీ శ్రద్దలతో పూజిస్తున్నారు. మాలాటి మానవ కాంతలను మొగుడి మీద ఎంత కోపం వచ్చినా చచ్చినట్లు అయన గారి పాదాల దగ్గరే పడి వుండాలి . హు' అంది విరక్తి గా కళ్యాణి.
    'పాదాల దగ్గర ఎవరు పడి ఉండమన్నారోయ్ నిన్ను గుండెల్లో దాచుకుంటాను రా తల్లీ అంటున్నా యింకా గొణుగుతూనే ఉన్నావు నేనేం చేసేది?" అంటూ ఆమెను తన బాహువులతో బంధించి వేసేడు కాంతారావు.
    "అయ్యో రామా! పట్టపగలు ...మీకేన్ని సార్లు చెప్పాలి? ఏం మగవాళ్ళో! కాసేపు కోపం తెచ్చుకుని దూరంగా ఉందామన్న ఉండనీయరు. వివాహబంధం బంగారు పంజరం లాంటిది స్త్రీకి.....' అని పైకి గొణుగుతూనే ఆ బంగారు పంజరానికి మనస్పూర్తిగా తనని తాను అర్పించుకుంది కళ్యాణి.

                                *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS