Previous Page Next Page 
ముద్ద మందార పేజి 17

 

    రెండు రోజులు గడిచాయి. సుశీల పాఠానిక్కూడా రాలేదు.
    అంటే ఆమెకు యిష్టం లేదన్నమాట. నాలో నిద్రపోతున్న అహం పైకి తన్నింది. నావంటి లక్షాధికారి అడిగితె తిరస్కరిస్తుందా.ఎంత అహంకారం? అనిపించింది. వెంటనే నరసమ్మ గారిని పిలిచి, "సుశీల పాఠానికిరావడం లేదు. ఆవిడ ట్యూషను మానుకుంటుందో, లేక వస్తుందో కనుక్కునిరండి. కారణం చెప్పకుండా నాగాలు పెడ్తే కుదరదు అని చెప్పండి. బాబుని ఎత్తుకుని వెళ్ళి, కనుక్కురండి" అన్నాను.
    'అలాగే బాబూ" అని ఆవిడ వెళ్ళిపోయింది.
    నేను కుర్చీలో కూర్చుని, రెండు చేతుల మధ్యా బుర్ర పెట్టుకుని, నా ఖర్మను గురించి ఆలోచించసాగాను. కాసేపటికి "నమస్తే" అంటూ సుశీల వచ్చింది. నాలో కోపం పది రెట్లయింది. కూర్చోండి అని కూడా అనకుండా, "మీకు పాపం మా వాడికి పాఠం చెప్పడానికి తీరుబడి లేదను కుంటాను. అంతగా కుదరకపోతే మానేయ్యచ్చు. మీకు మొన్నటి వరకూ రావాల్సినది లెక్క చూసి పారేస్తాము. మాకు మేష్టార్లు దొరక్కపోరు, మీకు చెప్పించుకునే వాళ్ళు దొరక్క పోరు" అంటూ డ్రాయరు లోంచి డబ్బు తీసి, "ఇదిగో మీకు రావాల్సింది' అని మూడు పది రూపాయల కాగితాలు టేబులు మీద పెట్టి, "తీసుకుని మీరు వెళ్ళచ్చు" అన్నాను.
    గదంతా నిశ్శబ్దం.
    నా నిశ్వాస, ఆమె శ్వాస శబ్దాలు తప్ప మరే శబ్దమూ లేదు. ఆమె కేసి చూశాను.తల వంచుకుని, టేబులు మీద చూపుడు వేలుతో సున్నాలుగా చుడుతోంది. నాకు కోపం పెట్రేగి పోయింది. "ఇహ మీరు వెళ్ళచ్చు" అన్నాను. ఆమె తలయెత్తి నాకేసి చూసింది. కళ్ళనిండా నిండిన నీరు. సభ్యతను చూసుకుని, అక్కడి నిలచింది. సుశీల కన్నీళ్ళను కుడి చేతి మధ్య వేలుతో తుడుచుకుంటూ "క్షమించండి, మీ మనస్సు కష్టపెట్టాను"అంది.
    "క్షమించడానికి నేనెవర్ని? తెలివి తక్కువగా ప్రవర్తించి , మీ ముందు చులకనయ్యాను. వెధవనయ్యాను. సరేలెండి. అయ్యిందేదో అయిపొయింది. వెళ్ళండి.' అంటూ నుదుట పట్టిన చెమట తుడుచుకున్నాను. సుశీల తన ముక్కు మీద పై పెదిమి పై భాగంలోనూ పట్టిన చెమట తుడుచుకుంటూ "ఒక్కమాట చెప్పి వెళ్తాను." అంది.
    "ఏవిటది" అన్నాను అరిచినంత గట్టిగా.
    "మీరు చెప్పిన విషయం ఆలోచించుకోడానికి మీరే టయిమిచ్చారు. రెండు రోజులు పాఠానికి రాలేదని యింత ఆగ్రహంగా మాట్లాడుతున్నారు." అంది.
    నేను గతుక్కుమని , తమాయించుకుని 'అంటే పాఠానికికూడా రావద్దని చెప్పానా." అన్నాను.
    "తప్పే" అందామె.
    "కూర్చోండి" అంటూ నేనూ కూర్చున్నాను. ఓ క్షణం నిశ్శబ్దంగా గడిచాక 'ఆలోచించుకున్నమీదట అసమ్మతి తెలియజేయడానికి వచ్చారు అవునా, అన్నాను.
    "లేదు" అందామె.
    నా హృదయం పరవళ్ళు తొక్కింది.
    "అంటే" అన్నాను.
    అంటే ఏవిటో చెప్పడానికి సుశీల సిగ్గు పడింది. ఆమె ముఖంలో వింత కళ వచ్చింది. నా ముఖంలోకి చూసి, గమ్మున తల దించుకుంటూ, "నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని" అంది. నా శరీరం గగుర్పొడిచింది.
    "నిజంగానా' అన్నాను.
    "నిజం" అందామె.
    "వెరీ గుడ్, కంగ్రాచ్యులేషన్స్ " అన్నాను. అన్నాక, "మీరు తప్పనిసరిగా వొప్పుకోలేదు కదూ?' అన్నాను. సుశీల నాకేసి ఆశ్చర్యంగా చూసింది.
    "లేదు. త్రికరణశుద్దిగానే వొప్పుకున్నాను. ఇంతకన్నా ఒక ఆడపిల్లకు కావాల్సిన అదృష్టం ప్రపంచంలో లేదు. మా అమ్మ కూడా మొదట్లో నమ్మలేదు. నాకు పిచ్చి పట్టిందనుకుంది. తరువాత నా అంత అదృష్టవంతురాలు లేదని మురిసిపోయింది" అంది సుశీల.
    నేను....నేనే అదృష్టవంతుణ్ణి.

                              *    *    *    *
    నెల తిరక్కుండానే వివాహం అయిపొయింది.
    సుశీల యింట్లో అడుగు పెట్టిన వేళ విశేషం అన్నారు. మా వ్యాపారం విజ్రుంభించింది. సుశీల మా యింటికి వచ్చిన నెల తిరక్కుండానే నాన్నగారు పాతకారు మార్చేసి కొత్త కారు కొన్నారు.
    నేనలా నాన్నగారూ కలిసి, విసుగూ విరామం లేకుండా పని చేసేవాళ్ళం. ఓ సంవత్సరం తిరిగేసరికి  లాభాలు విపరీతమయియాయి! బెజవాడలో రెండు మేడలు కొన్నాము. ఒకటి సుశీల పేర, ఒకటి రామం పేరా పెట్టారు నాన్నగారు.
    కాలం అతి హాయిగా సాగుతూ, తనని చూసి తనే అసూయ పడింది. ఆగి, వెనక్కి తిరిగి చూసుకుని దిష్టి కొట్టింది.
    విపరీతంగా పని చేయడం వల్ల , విశ్రాంతి తీసుకోపోడం వల్లా నాన్నగారి ఆరోగ్యం బహుముఖంగా పాడయింది. బ్లడ్ ఫ్రెషర్ వంటి వన్నీ ఆయన్నిచుట్టు ముట్టాయి. డాక్టర్లు నాన్నగారికి విశ్రాంతి అవసరమని చెప్తే, "ఏదో ఒకటి చెప్పకపోతే వాళ్ళవసరం మన కేముంటుంది? అందుకని ఏవో ఒకటి చెప్తూనేవుంటారు వాళ్ళు" అనేవారు నాన్నగారు.
    నాలుగునెలలు నలబై నెలలుగా నడిచాయి. నాన్నగారు మంచం దిగని స్థితికి వచ్చి, తన స్థితిని గ్రహించి, "నా పనియిపోయింది. ఇక నాకే బెంగా లేదు. నువ్వు మనిషివి అయ్యావు. వ్యాపారం మెలకువతో చేసుకుంటే అదేన్నడూ మనని మోసం చేయదు. జీవితంలో పోరాడడం నేర్చుకో.భయపడి పారిపోయే వాళ్ళకు జీవితం ఏమీ యివ్వదు. ఇది నేను నీకు చెప్పే పాఠం-- రామాన్ని జాగ్రత్తగా చూసుకో. వాడిని డాక్టరు చేయించు. సుశీలని ప్రాణంగా, చూసుకో" అన్నారు.
    'అలాగే నండి" అన్నాను.
    రామాన్ని డాక్టరు చదివించాలన్నది నాన్నగారి కోర్కె.
    తన కొడుకును డాక్టరు చేయించాలన్నది సింహచాలం కోర్కే.
    కర్తవ్యాలను మననం చేసుకునే లోగా నాన్నగారు పోయారు. ఇల్లంతా బావురుమంది. ఎక్కడ చూసినా , నాన్నగారిని గుర్తు చేసే వస్తువులే... రాత్రి పూట సుశీల పలవరించేది. "భయంగా వుందండి" అనేది.
    ఇల్లు మారాము.
    మళ్ళీ నాకు మనశ్శాంతి పోయింది.
    సింహాచలాన్ని నే పెట్టిన వుసురు పిశాచై నన్ను తరిమి తరిమి కొడుతున్నట్టనిపించింది. మళ్ళీ నా జీవితం యాంత్రికమయ్యింది. రామాన్ని చూసినప్పుడల్లా సింహాచలం కొడుకు గుర్తుకు వచ్చేవాడు. సింహాచలం కొడుకును నా బిడ్డడనిసంబోధించుకుందామని చాలాసార్లు ప్రయత్నించి విఫలడుయ్యాను. నాలో మార్పు సుశీలను కలవర పెట్టింది. "ఏవిటీ మధ్య అదోలా వుంటున్నారు ?' అంది సుశీల ఒకనాడు. ఏమని చెప్పగలను. "రాధక్కయ్య గుర్తుకు వచ్చిందా" అంది తనే. "అవును సుశీలా" అన్నాను. నేనంత కిరాతుణ్ణి! రాధ పేరు మర్చిపోయాను.
    సుశీలని సంతోష పెట్టడానికి నేను నా ప్రవర్తన మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. మాచవరంలో పెద్ద మేడ కట్టించి అందులోకి మారాము. సుశీలకి ఒక కారు కొన్నాను. సుశీలని, రామాన్ని, చూచుకుంటూ మనస్సును బండ చేసుకోడానికి ప్రయత్నించాను.
    సుశీల తోటంతా మందార వనంగా మార్చింది. "మందార చూస్తె నాకు ప్రాణం" అంది సుశీల. ఆమె గొంతులో ఏదో ఆవేదన కనుపించింది. "ఏం?" అన్నాను తోటలో గడ్డి మీద కూర్చుంటూ. సుశీల కూడా నా పక్కనే కూర్చుని, "దాని వెనుక బలమైన కధ .....కధ కాదు , చరిత్ర వుంది.
    నా వీపు మీద ఎవరో చరిచి నట్టయ్యింది.
    "చెప్పనా" అంది సుశీల. చెప్పమన్నాను. సుశీల గడ్డి పువ్వును కోసి, దాని కేసి చూస్తూ  ప్రారంభించింది.
    "--అవి నేను నాలుగో ఫారం చదివే రోజులు . మా క్లాసులో ఒకమ్మాయుండేది. అమ్మాయి ఎవ్వరితోనూ మాట్లాడేది కాదు.అలాంటిది ఒకనాడున్నట్టుండి నన్ను పలకరించి, "మీ యింట్లో మందార, చేట్టుందా! నాకో పువ్వు తెచ్చి పెట్టవా" అంది. నాకు బలే గర్వం వచ్చింది. "వో" అన్నాను. "మీ యింటికి రానా' అనడిగింది. నేను తలూపాను. ఆరోజు నుంచి ఆమె రోజూ మా యింటికి వచ్చి రోజుకో పువ్వు కోసుకునేది. ఇద్దరం యస్సేల్సీ లోకి వచ్చాం. ఆ సంవత్సరం దీపావళి కి ఆమె మా యింటికి వచ్చి బోలెడు మందార పుప్పులు కోసుకుంది. "అన్నెందుకు హేమా" అన్నాను. కావాలంది. రాత్రి మా యింట్లో భోజనం చేశాము. భోజనాలయ్యాక పెరట్లో కూర్చున్నాము. హేమ అటూ యిటూ చూసి, "నాకు పెళ్ళి నిశ్చయ మయ్యింది. మా మేనమామ పెళ్ళాం చచ్చిపోయింది. అతనికి బాగా డబ్బుంది. యాభై ఏళ్ళు ఉంటాయనుకుంటాను. నలుగురు పిల్లలున్నారు. సుశీలా, యీ పెళ్ళి నయమా చావు నయమా" అంది. నేను ఆవేశంతో చావే నయం అన్నాను. ఆమె నవ్వేసి , "తీరా నేను చచ్చిపోతే మండారపువ్వు చూసినప్పుడన్నా గుర్తుకు తెచ్చుకుంటావా" అంది. "ఛ, అవెం మాటలు!" అన్నాను. మరి కాసేపటికి వెళ్ళి పోయింది. తెల్లారి ఆమె శవం నూతి లోంచి తీశారు. ఆనాటి నుంచీ హేమ స్నేహానికి నాకీ మందార పువ్వు ఆనవాలు." అంది సుశీల.ఆమె కళ్ళవెంట నీరు కారుతోంది. నేను నిట్టుర్చాను. ప్రతీమనిషి జీవితంలోనూ ఓ విషాద సంఘటన వుంటుందేమోననిపించింది.
    "నాకూ మందారంటే యిష్టం. కానీ ఎందు కిష్టమంటే మాత్రం చెప్పలేను" అన్నాను.
    
                               *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS