Previous Page Next Page 
బాంధవ్య బంధితులు పేజి 17


    "నువ్వు చూడలేని వ్యక్తులను ఇతరులు చూచేటట్లు చెయ్యమనే నేను చెప్పేది. నీలో ఉన్న భావాలు ఇతరులు అనుసరించేందుకు వీలు చెయ్యమనే నేను అడిగేది. ఇలాటి వాటన్నిటికి అన్నివిధాలా అర్హులైన నీలాంటివాళ్ళు అర్దంలేని అనుమానాలతో వెనక్కి తగ్గుతూ ఉంటే, చదువు పూర్తి అయ్యేసరికి అప్పులపాలై ఇంట్లో చెంబూ, చెక్కా అమ్మి చదివి, వెనక పోషించవలిసిన వాళ్ళు న్నప్పుడు ఎలా ప్రాక్టీసు పెట్టగలడు? ప్రజాసేవ ఆదర్శాలు ఎలా పాటించగలడు?"
    ఈ వాదనకు అంతం లేదని, ఇంక వాదించదలుచుకోక మౌనం తాల్చాడు శ్రీనివాస్. కాని ఆవేశపు కోప చిహ్నాలు వీడిపోలేదు. అరుణవరం దాల్చిన ముఖం తోపాటు కళ్ళు ముకుళితములయ్యాయి. రకరకాల భావాలు కదలసాగాయి. వివర్ణ మయిన అతని ముఖం చూస్తూ మౌనం తాల్చారు కృష్ణమూర్తిగారు. ఆయన ఆశించింది అదే! తాము చేస్తున్న పనులలో తప్పులు గోచరిస్తేగాని, ఆత్మవిమర్శనకు లోనుఅవరు. ఆత్మవిమర్శన జరిగినప్పుడే పొరపాట్లనుండి వేరుకాగలుగుతారు.
    అతన్ని మరోమాట మాట్లాడించకుండా అతని గదిముందు కారాపారు గుడ్ నైట్ అని ముభావంగా చెప్పి తలుపు తీసుకుని లోపలికి పోయాడు శ్రీనివాస్.
    మంచంమీద వాలి ఆలోచనా నిమగ్నుడయిన అతనికి ఆ రోజు ఆకలికూడా తెలియలేదు. ఇక బయటికి వెళ్లేందుకు ఇష్టపడలేదు! 'ఏమిటీ గొడవ తనకు! ఏ చాటునుండి ఏ మూలకు పోయినా తన్ని గురించి తెలుసుకోవాలనుకున్నవాళ్ళు కనిపించక మానరా? ఏమిటి కృష్ణమూర్తిగారి కీ అవసరం? ఇవాళ ఆయన ఇంతగా వాదించవలిసిన అవసరం ఏమిటి? ఒక డాక్టరుగా మరో డాక్టర్ని తయారుచెయ్యాలన్న కాంక్షా? ఇవాళ ఎలా జరిగిందో! ఏ ఒక్కరితో వాదించని నేను ఆయనతో ఎలా వాదించాను? ఛ....తనలో ఏదో మార్పు వస్తూంది. తను దేనికో లొంగిపోతున్నాడు. ఇక్కడనుండి పారిపోవాలి. ఏ ఒక్కరి బాధకు కారకుడవడం తనకు ఇష్టంలేదు.....లేదు!
    తను వీళ్ళకి ఎందుకు భయపడాలి? తాను కానిపని ఏం చేస్తున్నానని వీళ్ళకు దూరంగా ఉండాలి? లేదు ... తను ఎక్కడినుండి... ఎవరినుండి పారిపోడు! తన కా అవసరం ఇక లేదు. అసలు ఇవాల్టి వాదన అంతటికి కారణం అనూరాధ. ఈసారి కలిసినప్పుడు గట్టిగా అడిగెయ్యాలి. 'అనూరాధా, నేను నిజంగా నీ దగ్గిరనుండి పారిపోగలనా? నన్ను ఇలా దేనితో కట్టివేస్తున్నావు? నేను ఇంక ఎంతోకాలం నీకు దూరంగాకూడా ఉండలేననిపిస్తూంది. ఈ పరిస్థితుల్లో నీ నుండి ఎలా పారిపోతాను? పరిస్థితులకు ఎదురుగా నిలుస్తానుగాని నీ దగ్గిరనుండి పారిపోలేను!'

                                                        21

    "అబ్బబ్బా, అనూరాధా, మీతో మరీ చిక్కుగా ఉంది."
    కళ్ళు ఆశ్చర్యంగా తిప్పింది అనూరాధ, "ఇదేమిటండీ. మధ్య నేనేం చేశాను?"
    "ఏం చెయ్యడం ఏమిటి? అసలు నా విషయం అందరితో చెప్పవలిసిన అవసరం ఏమిటి?"
    "అయ్యో! ఇదా ఇంతకీ? ఏమిటో అనుకున్నాను. జిజ్ఞాస సముద్రంలో కొట్టుకుపోతున్నవారికి నిజం చెప్పి రక్షించడం నా ధర్మం అనుకున్నాను, ప్రాణాపాయంనుండి రక్షించే డాక్టరులాగ!" అంది తను చేసిన పని సమర్ధించుకుంటూ చిలిపిగా.
    "చాల్లెండి! పైగా సమర్ధించుకుంటారు!"    
    "బావుంది. సమర్ధించుకోక క్షమాపణ కోరుకోమన్నారా ఏం?"
    "క్షమాపణ అక్కరలేదు. సమర్ధింపు అక్కరలేదు. కాని ఇంకెప్పుడూ మళ్ళీ ఇలా చెయ్యకండి."
    "చిత్తం. అబ్బ, బొత్తిగా చిన్నపిల్లవి చివాట్లు వేసినట్టు వేస్తాలేమిటండి? ఆరా-------------- చెప్పకూడనివి నాకు చెప్పకండి" అంది బుంగమూతి.
    ఆమె ముఖం చూడగానే నవ్వు వచ్చింది. అయినా పైకి కనిపించనియ్యకుండా, "నేను తీవ్రంగా చెబుతున్నాను, అనూరాధా!" అన్నాడు.
    "మీరిలా అంటారు. వాళ్ళందరూ మీ గురించి ఎంతో ఇదిగా ఉన్నప్పుడు చెప్పకుండా ఎలాగ చెప్పండి?"
    "మీరు చెప్పినందుకుకాదు నా బాధ! మొన్న కృష్ణమూర్తిగారు ప్రశ్నించారు. ఇంకనించి ప్రతిసారి ఇదో చర్చనీయాంశం అవుతుంది. అదే నా కిష్టంలేదు."
    "ఇందులో తప్పేముంది చెప్పండి?"
    "మీ కర్ధంకాదు రాధా!" అన్నాడు కుర్చీలోనించి వెనక్కి వాలుతూ.
    
                                *    *    *

    "అయ్యా, డాక్టరుగారూ!"
    తలఎత్తి చూచాడు అనూరాధ కళ్ళల్లోకి పుస్తకంలోనుంచి.
    అప్పుడే గదిలోకి వస్తున్న అనూరాధ ఎప్పుడూ కంటే అందంగా కనుపించింది. కళ్ళల్లో ఏదో కొత్త వెలుగు మెరుస్తూంది. ఎక్కువగా చదువుతున్న ట్లుంది, కొలుకులు కొంచం ఎర్రబడ్డాయి.
    "మీరు డాక్టర్ గా నాకొక సలహా ఇవ్వాలి." అంది రాధ.
    "నేనా! మీకా? నాకంటే మంచి డాక్టరే కనుపించలేదా?"
    "మంచి డాక్టర్లు లేరనికాదు. నాకు నచ్చిన డాక్టరు మీరొక్కరే! అదీకాక మిమ్మల్ని అడిగినంత చనువుగా ఇతరుల నడగలేను కదా!"
    "అయితే సెలవియ్యండి మీ వ్యాధి లక్షణాలు."
    "బొత్తిగా చదువుమీద ధ్యాస ఉండటంలేదు. పుస్తకం ముట్టుకో బుద్ధి కావడంలేదు. కొంచం మంచి మందు చెప్పండి."
    కొద్ది క్షణాలు ఆమెవంక నిశ్చలంగా చూచి, ఆలోచించి అన్నాడు. "దీనికి నేను కాదండి మందు ఇవ్వవలిసింది. మీ నాన్నగారు. చిన్నప్పుడు చూచారూ, చదువుకో బుద్దిపుట్టని పిల్లలకి మంచి పేముబెత్తంతో ఒక్కటి అంటిస్తే పారిపోయిన బుద్ధి వెనక్కి పరిగెత్తుకువస్తుంది. మీ నాన్నగారితో చెబుతానుండండి మంచి బెత్తం తెమ్మని!"
    "మంచివారే! ఏదో స్నేహితులు కదా అని నే నడిగితే ఇదా మీరిచ్చే సలహా? అయినా పుట్టాక ఇంతమటుకు ఎప్పుడూ దెబ్బలు తినలేదండి. ఇంక ఇప్పుడా చదువు, ఫైనలియరులోకి వచ్చాక? ఇంకొంచం మంచి మందు చెబుదురూ తేలికగా ఉండేందుకు."
    "మంచి మందు ఉందికాని అది కొంచెం ఖర్చుతో కూడిన పని."
    "ఫరవాలేదు చెప్పండి. మీ అంత గొప్ప స్నేహితులుండగా ఆ భయమేమిటి?"
    "ఇదయినా నేను చెయ్యవలిసిందికాదు. మంచి అబ్బాయిని చూచి పెళ్ళి చేసుకోండి" అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ.
    ఆమె కళ్ళు కిందికి దించుకుంది. "చదువుకునేందుకు మందిమ్మంటే పెళ్ళి చేసుకోమంటారేమిటి?" అంది.
    "ఏం చేసుకోదలుచుకోలేదా?"
    చదువుకు ముందుమాత్రం కాదు. చదువు పూర్తికావాలి."
    తేలిగ్గా శ్వాస వదులుతూ చేతిలో ఉన్న మాగజైన్ బల్లమీద పడేశాడు.
    అతను విసిరివేసిన పుస్తకం తిరగవేసి అతను చదువుతున్న వ్యాసం చూచింది. అది ఒక ప్రఖ్యాత వైద్యవేత్త, 'లంగ్ కాన్సరు, సిగరెట్ స్మోకింగ్' మీద రాసిన వ్యాసం.    
    "మీరు మళ్ళీ డాక్టరు కావాలి, శ్రీనివాస్!"    
    "అదిమాత్రం ఇంక జరగని పని, అనూరాధా!"    
    "ఎందుకని!"
    "ఎందుకనో మీకు తెలుసు. ఇంతవరకు కలిగిన అనుభవాలు చాలు."
    "అదంతా మీ భ్రమ ఏమో అనిపిస్తూంది నాకు."
    "భ్రమ ఏదో, నిజమేదో తెలుసుకోలేనివాన్ని కాదు. దయచేసి నా నిర్ణయం మార్చాలని ప్రయత్నించకండి, రాధా!"
    "మీ నిర్ణయాన్ని మార్చేటంత అర్హత నాకు లేదు. నాది కేవలం సలహా మాత్రమే. కాని మీ రా నిర్ణయం చెయ్యాలని నా కోరిక."
    "నా నిర్ణయాలలో సగభాగం మీరు పంచుకోవాలనే నా కోరిక. మీ సలహాలు నా జీవితంలో ప్రతి విషయంలో ఇవ్వగలిగేందుకు అవకాశం ఇవ్వాలనే నా అభిప్రాయం. కాని నాలో లేనిది ఉన్నదని నమ్మాలని నాకు లేదు."
    "మీలో లేనిది ఏమిటని మీ ఉద్దేశం? మెడిసిన్ మీద ఉత్సాహం మాటేనా? మీకు అది చదవాలన్న కోరిక లేకపోయినా, ప్రపంచంలో నలుమూలలా ఎక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకావాలన్న కాంక్ష, కుతూహలం మీలో ఉన్నాయి. కాదనగలరా?"
    "........."
    "చూడండి, నేను ఈ గదిలోకి వచ్చేసరికి మీరు దీనిలో లీనమయి ఉన్నారు. ఈ వ్యాసం ఎంతో ఉత్సాహంతో చదువుకుపోతున్నారు. నేను వచ్చి పలకరించే దాకా నా రాకకూడా మీరు గమనించలేదు. మీకు ఏమాత్రం కుతూహలం లేకపోతే ఆ ఆర్టికిల్ అంతగా ఎందుకు ఆకర్షించాలి?"
    "నేను ఏ విషయం చదివినా అలాగే చదువుతాను. మీరుమాత్రం ఇలాంటివి చదవరా?"
    "ఎందుకు చదవనూ? చదువుతాను. కాని మీలాగ కాదు. మామూలుగా ఎక్కడేం జరుగుతూందో చూస్తానుగాని, మీలాగా ప్రతి విషయం ఆకళింపు చేసుకోను. కాని ముఖ్యంగా చుట్టు ఇన్ని మాగజైన్స్ ఉంటే మెడికల్ జర్నల్ మాత్రం ముట్టుకోను."
    "దానిదేముంది. మీరు లాను గురించి ఏదైనా మంచిది కనిపిస్తే అది తెరుస్తారు. నాకు కొంచం మెడిసిన్ లో ప్రవేశం ఉంది కాబట్టి అది చూశాను."
    "కరెక్ట్! అదే నేననేదీను! మీకు తెలియకుండానే మీలో ఈ ఉత్సాహం ఎక్కువగా ఉంది. కొద్దిగా ఉన్న మీ ప్రవేశం వైద్యంలో ఎక్కువ కావాలనే నా కోరిక. దయచేసి మీరు మరొకసారి ప్రయత్నించి చూడండి. కనీసం ఈ విషయంపై బాగా ఆలోచించండి. నేను చెప్పినదాంట్లో నిజం మీకే గోచరిస్తుంది. తెలిసో, తెలియకో మనలో కొన్ని భయాలు నాటుకుపోతాయి. వాటిని పారద్రోల ప్రయత్నించాలి. చీకటి అంటే నాకు భయం, నాకు భయం అనుకున్నంతకాలం ఆ భయాన్ని దాటి పోలేము. కాని ఆఁ, ఏం భయంలే అని దులుపుకు తిరిగితే గాని అది వదిలిపోదు."
    "ఇది పారదోలలేని భయంకాదు, అనూరాధా. వదలని అపనమ్మకం. నేను చేస్తున్న పనిమీద నాకు సంపూర్ణమయిననమ్మకం లేదు. అందుకే నాకు నమ్మకంలేని పని నేను చెయ్యదలుచుకోలేదు. అంతిమదశలో ఉన్న ఒక రోగికి కనక నేను న్యాయం చెయ్యలేకపోతే నన్ను నేను క్షమించుకోలేను."
    "మీరు న్యాయం చెయ్యలేరన్న అనుమానం మీకు ఎందుకు రావాలి? ఆ రోజున మిమ్మల్ని ఎవరు అడిగారని, ఎవరు ఉసిగొలిపారని ఆ అమ్మాయికి ట్రికియాటమి చేశారు? మీతోబాటు మేమిద్దరమూ ఉన్నాము కదా! మాకు అసలు ఏమి చేయాలో, మీరెందుకు చేస్తున్నారోకూడా అంతుబట్టలేదు. ఆ రోజు ఆఖరిదశలో ఉన్న ఆ అమ్మాయికి మీరు ఆ పని చేయబట్టి కదా ఈనాడు ఆమె బతికి ఉంది? మీరు చేస్తున్న పనిలో నమ్మకం ఉండి, ఆ పని చెయ్యవచ్చని తెలియబట్టి కదా మీరు చేసింది? కాని మీరు మరోవిధంగా ఊహించుకు చూడండి! ఆరోజే ఆమెకు చెయ్యవలసిన ప్రథమచికిత్స మీకు తెలిసినా, అది అవునో కాదో అన్న మీమాంసతో నిలబడిపోయి ఆ ఆపరేషన్ కనక చేసి ఉండకపోతే మీ కళ్ళఎదట ఆ అమ్మాయి ప్రాణాలు పోయిఉండేవి. అప్పుడుమాత్రం మిమ్మల్ని మీరు క్షమించుకోగలిగేవారా?"
    "........."
    "పోనీ ఈ విషయం ఆలోచించండి. మరొక ఛాన్సు ఇవ్వండి. మీకు ఒంటరిగా మీ అంతట నిలబడి వైద్యం చెయ్యడానికి ఇష్టంలేకపోతే మరొక పెద్దడాక్టరు దగ్గిర చేరి కొన్నాళ్ళు ప్రయత్నించవచ్చు. ఎప్పుడు  ఇష్టంలేకపోతే అప్పుడే మానేయవచ్చు."
    అనూరాధ మాటలతో నిశ్చలంగా పారుతున్న ఏటిలో మట్టిబెడ విసిరినట్లయింది. శ్రీనివాస్ ఆలోచనలు సుళ్ళు తిరగసాగాయి. ప్రతి ఆలోచన బహు మార్గాలలో పయనించి, తిరిగి యథాప్రకారంగా స్థిరం కాసాగింది. తన ఆలోచనలు అరికట్టనూలేక, దరిచేర్చనూలేక సతమతమయ్యాడు. ఆమె అభిప్రాయాలు అతని మనస్సులో మునుపులేని కల్లోలాన్ని తెచ్చినమాట వాస్తవమే అయినా, వాటిని అతను అంగీకరించలేకపోయాడు. 'ఎందుకిలా మభ్యపెడతావు, అనూరాధా? నాలో లేనిదాన్ని ఉందని ఎందుకు నమ్మింప జూస్తావు? నాకు నా మీద లేని నమ్మకం నీకెలా కలిగింది? నీలో ఏదో నిగూఢమయిన శక్తి ఉంది. నువ్వు చెప్పింది ప్రతిఒక్కటి యథార్ధమనిపిస్తున్నది. తేలికగా తీసిపారెయ్యాలనిపించదు. నీలో ఏముంది, అనూ? నాలో ఎందుకిలా మార్పు వస్తూంది?' ఒకనాడు ఎంతో ఖచ్చితంగా చేసుకున్న నిర్ణయాలు సడిలిపోతాయేమోననిపించింది. 'ఉహూఁ...లేదు.....లేదు. నా నిర్ణయాలు మారనివ్వను. రాధకు అర్ధమయ్యేలా చెబుతాను. ఈ కారణంగా అనూ దూరమవుతుందేమో!
    చివరికి అతని ఆలోచనలు ఒక దరి చేరకుండానే, మనసులోని అలజడి చల్లారకుండానే కళ్ళు మూతలుపడ్డాయి. 'ఎందు కింత తాపత్రయం నీకు? నాలో ఏదో ఉందని ఎందుకు భ్రమిస్తావు?

                                                          *    *    *   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS