Previous Page Next Page 
తామరకొలను పేజి 17


    కూతురి ఆటపాటల్లో మైమరచిన రత్నను చూసి అసూయ కలిగింది రమేశుడికి.
    రత్న ఎంతమందిని ప్రేమించగలదు? తన కూతుర్ని అంతగా ప్రేమించే రత్నకు తనమీద కూడా ప్రేమ ఉండటం సాధ్యమా?'
    'ఏమయినా సరే. ఈరోజు ఈ సంగతి తప్పకుండా తేల్చేయాలి.' అనుకున్నాడు రమేశ్.
    "రమేశ్! అటు చూడండి. నీళ్ళలో చెట్టు, మబ్బుల ప్రతిబింబం ఎంత బావుందో ....."
    "సరిగ్గా వినిపించుకోని రమేశ్ "ఏమిటి? ఎక్కడా?" అని కంగారుపడ్డాడు.
    ఇహ రమేశుడిని మాట్లాడించాలనే ఆశ వదులుకుంది నళిని. తనూ రమేశుడితోబాటు రత్న, ఆశలను వెతకసాగింది.
    చెట్టు-నీడలో గడ్డిమీద కూర్చున్న రత్నను చూడగానే:
    "ఎక్కడికి వెళ్ళారు మీరు? వెతకలేక చచ్చాం." అంది.
    "నిజంగా?"
    "ఊఁ. కావాలంటే వీరిని అడుగు"-అంటూ రమేశుడివైపు చూసింది నళిని. రమేశ్ "నిజంగా?" అంటున్న రత్న మోహక భంగిమను చూస్తూ నిల్చున్నాడు.
    నళిని మొహం తెల్లగా పాలిపోయింది. ఆమె మొహంలోని వెలుగు, నూనె అయిపోగానే ఆరిపోయే దీపంలా, ఆరిపోయింది.
    మరుక్షణంలోనే తేరుకుంది నళిని. మామూలు గానే నవ్వుతూ వెళ్ళి, రత్న పక్కన కూర్చుంది.
    పొద్దెక్కుతున్నకొద్దీ వేడి ఎక్కువ కాసాగింది. సోడా అమ్మేవాళ్ళ వ్యాపారం బాగా సాగుతోంది.
    "అమ్మా! నాకు ఐస్ క్రీమ్."
    "రా; ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను" అంటూ లేచింది రత్న.
    నళిని "నువ్వుండు రత్నా! నేను ఇప్పిస్తాను" అని ఆశ-చెయ్యి పట్టుకుని బయల్దేరింది.
    రమేశ్-రత్న ఇద్దరే మిగిలారు.
    రత్నే మాటలు ప్రారంభించింది:
    "నళిని చాలా మంచిపిల్ల కదూ?"
    "అవును."
    "రూపం, విద్య, బుద్ధి అన్నీ ఉన్నా, గర్వంలేదు."
    "నిజం."
    "ఆమెను చేపట్టే వరుడు అదృష్టవంతుడు."
    "అవును."
    రత్న అర్ధగర్భితంగా రమేశుడివైపు చూసింది. రమేశ్ ఏమీ తెలీనట్లే నటుంచాడు.
    "రత్నా! మీకు ఆశంటే చాలా ప్రేమకదూ?"
    రత్న ఆశ్చర్యంతో తలెత్తి "అదేం ప్రశ్న!" అంది.
    "చెప్పండి."
    "ఏ తల్లి కుండదు తన పిల్లమీద ప్రేమ? దీనిలో అడగటానికేముంది?"
    "కాని, మనిషి హృదయం ఎంతో చిన్నది, ఒకేసారి ఎంతమందిని ప్రేమించగలదు?"
    "హృదయపు ఆకారం చిన్నది. కాని అందులోని భావనలు విశ్వాన్నంతా ఆవరించగలవు. ప్రేమకు మరో పేరే దేవుడు అనటం అబద్ధం కాదు. దేవుడు సర్వశక్తి సంపన్నుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాసి అని వినే ఉన్నారుగా."
    "రత్నా! మీరు ఆశను ఎంతగా ప్రేమిస్తున్నారు?"
    "ఒక తల్లి తన పిల్లను ఎంతగా ప్రేమించగలదో అంతగానూ ప్రేమిస్తున్నాను."
    "రేపు మీకు నలుగురు పిల్లలు పుట్టినా, ఆశను ప్రేమించినట్టే వాళ్ళనూ ప్రేమించగలరా?"
    "ఏం ప్రశ్న లడుగుతున్నారు మీరు. నలుగురు పిల్లల తండ్రయ్యాక మిమ్మల్ని ఇదే ప్రశ్న అడుగుతాను. మీ రప్పుడేం జవాబు ఇస్తారో, నేనూ అదే ఇప్పుడు ఇవ్వగలిగేది."
    రమేశ్ గడ్డి కొసను పంటితో కొరుకుతూ:
    "నేను తండ్రిని కాబోను" అన్నాడు.
    "అంటే?"
    "నేను పెళ్ళి చేసుకోను.
    రత్న నవ్వి "పెళ్ళి కాకముందు యువతీ యువకు లందరూ ఇదే మాట అంటారు" అంది.
    "ఖచ్చితంగా చెపుతున్నాను నేను."
    "కారణం తెలుసుకోవచ్చా?"
    "ఆ. నిరాశే కారణం."
    "ఎలాంటి నిరాశ."
    "నేను అపురూపమైన రూపవతిని పెళ్ళాడాలని కోరుకునేవాడిని. రూపం కోసం అన్వేషిస్తున్న నా మనసు కెవరూ నచ్చలా....."
    రత్న మధ్యలో అందుకుని "మీకు నచ్చే రూపసిని నేను తేగలను" అంది.
    "కావచ్చు కాని, ఇపుడు రూపసిని మెచ్చుకునే మనఃస్థితిలో లేను నేను."
    కారణం అడిగే ధైర్యం రాలేదు రత్నకు. అతడి దృష్టిని ఎదురించలేక తల వంచుకుని కూర్చున్నది.
    "నాకు నచ్చిన యువతికి......పెళ్ళయిపోయింది" మెల్లిగా అన్నాడు రమేశ్.
    ఆమె ఎవరని అడగటానికి ప్రయత్నించి, చివరికి మౌనమే మంచి దనుకుంది రత్న.
    "రత్నా! ఇపుడు నేనేం చెయ్యాలో చెప్పండి" రమేశ్ ఆమెనే అడిగాడు.
    "ప్రేమ గుడ్డిది. నిజం; కాని, ప్రేమకు కూడా కొంచెం విచక్షణా జ్ఞానం ఉండాలి."
    "ఇపుడేం చేయను?"
    "ఏమీ చేయకండి. ఆమెను మరిచిపోయి ఇంకో అందగత్తెను పెళ్ళాడి సుఖంగా ఉండండి."
    "రత్నా! మీరు మనఃపూర్వకంగా ఈ సలహా ఇస్తున్నారా?"
    రత్న తలెత్తి అతడివైపు చూసింది. ఆమె కళ్ళలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. అతడి మీది అభిమానం, వ్యధా ఆమె మొహంలో గూడు కట్టుకున్నాయి.
    "నా ఆత్మను హింసించకండి రమేశ్! నాకు అంత శక్తి లేదు."
    "మనఃపూర్వకంగానే ఇస్తున్నారా ఈ సలహా?"
    "అవును; పెళ్ళి ఒకటే మీరు పాతదాన్నంతా మరిచి, జీవించటానికి సాయపడుతుంది. మీ సంసారమూ, వృత్తి వీటి సహాయంతో అన్నీ మరిచిపోగలరు."
    "నాకు మీ మాటలమీద నమ్మకం కలగటం లేదు."
    "నా మాట నమ్మండి. మొదట కొన్ని రోజులు పాతవాటిని మరిచిపోలేక పోవచ్చు. కాని, క్రమేణా అన్నీ సరిపోతాయి. ఒక స్త్రీ కాని, పురుషుడు కాని ఒకర్నొకరు పోగొట్టుకుని జీవితమంతా ఏడవ దగింది ఏమీలేదు. ఎవరికీ అంతటి విలువ నివ్వరాదు."
    "నోటితో చెప్పటం సుళువే. ఆచరణలో పెట్టటమే కష్టం."
    "కష్టమంతగా ఏం ఉండదు. పోనుపోను అన్నీ మీకే తెలుస్తాయి."
    రమేశుడికి దూరంలో నళిని, ఆశా రావటం కనిపించింది. వెంటనే తను అడగాలనుకున్న ప్రశ్న గుర్తుకు వచ్చింది.
    "రత్నా! నే నొకటి అడుగుతాను, చెప్పాలి" అన్నాడు.
    "ఏమిటది?"
    "మీరు నన్ను ప్రేమిస్తున్నారా?"
    రత్న చిన్నగా నవ్వి "కొన్ని ప్రశ్నలు అడగరాదు. వాటికి జవాబు దొరకదు" అంది.
    "కాదు చెప్పండి."
    "మీ కేమనిపిస్తోంది?"
    "మన మిద్ధరమే ఉన్నప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నారనే అనిపిస్తుంది. కాని, మీరు ఆశతో కలిసి ఆనందంగా ఆడుకుంటున్నపుడు ఆశను ప్రేమించినంతగా నన్ను ప్రేమించటం లేదనిపిస్తుంది. మీరు నిజం చెప్పండి."
    "నిజం తెలుసుకుని ఏం చేద్దామని?" కొంటెగా అడిగింది రత్న.
    "నన్ను బాధపెట్టక చెబుదురూ" అన్నాడు రమేశ్.
    రత్న చుట్టూ చూసి మెల్లిగా "వీలయితే మిమ్మల్ని నా కంఠహారంగా మార్చి మెళ్ళో వేసుకునేదాన్ని" అంది.
    "కంఠహారంగానా? ఎందుకూ?"
    "హృదయానికి దగ్గరగా ఉంటుందని."
    రమేశుడి ఆనందానికి అంతులేదు. నళిని, ఆశా దగ్గరగా లేకపోతే తన సంతోషాన్ని ఏవిదంగా చూపేవాడో?
    మోకాలి మీద తల ఆన్చి పచ్చగడ్డిమీద కూర్చుంది రత్న. పెద్ద ముడిమీద మల్లెపూల దండ అమర్చుకుంది. ముడి మధ్య కెంపుల బిళ్ళ మెరుస్తోంది.
    వెనుకనుండి చెక్కిన ప్రతిమలా ఉన్న రత్నను చూస్తూ, నళిని నిదానంగా నడిచి వచ్చింది. ఆశా పరుగెట్టుకుంటూ వచ్చి తల్లి ఒళ్ళో పడి:
    "అమ్మా! ఐస్ క్రీమ్ ఎంత బావుందో" అంది.
    "ఇంతసేపయిందేం?" నళిని వైపు తిరిగి అడిగింది రత్న.
    "నళిని అక్కయ్య నన్ను నీళ్ళ దగ్గరకు తీసికెళ్ళింది. అమ్మదగ్గరకు వెడదాం అంటూంటే వినకుండా ఎక్కడెక్కడికో తీసికెళ్ళింది......"
    రత్న గుండె దడదడ లాడింది. గబుక్కున నళిని-మొహం చూడాలనిపించింది. కాని, తలెత్తి చూసే ధైర్యం రాలేదు. కాసేపయ్యాక ఏదో మాట్లాడుతూ నళినివైపు చూసింది.
    అందమైన ఆ మొహంమీద రాసిన కథ స్పష్టంగా కనిపించింది రత్నకు. నల్లటి ఉంగరాల జుత్తు ఆవరించిఉన్న ఆ ముద్దు మొహంలో నిరాశ చోటు చేసుకుంది.
    ఇలాంటి పిల్లవైపు తలెత్తి చూడలేని రమేశ్ ఎంతటి మూర్ఖుడు!
    రమేశుడికి బాగా బుద్ధి చెప్పాలి అనుకుంది రత్న.
    ఒక విధమైన నిరాశ, అసంతృప్తి, వ్యధలతోనే ముగ్గురూ ఇంటిదారి పట్టారు. ఐస్ క్యాండి తింటున్న ఆశా మాత్రం ఆనందంగానే ఉంది.
    దోవలో ఎవరూ ఎక్కువగా మాట్లాడలేదు.
    రమేశుడివైపు ఆకర్షించబడిన నళినికి అతడి దృష్టి వేరే చోటులో ఉందని తెలిసినపుడు, తన అందం, చాతుర్యం అంతా వ్యర్ధ మనిపించి నిరాశ చెందింది.
    నళిని - మౌన కారణం గ్రహించి రత్న నొచ్చుకుంది. నళిని తన ఇంటివైపు తిరిగినపుడు,
    "సాయంత్రం మెట్రో వెడదాం రా మంచి పిక్చరే వచ్చింది" అంది.
    "లేదు రత్నా! నేను రాలేను. నా స్నేహితురాలింటికి వస్తానని మాటిచ్చాను. క్షమించు" అని రమేశుడివైపు తిరిగి:
    "వస్తాను" అని చేతులు జోడించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS