"వీడు ఎక్కడికేనా తీసుకువెళతాడని నాకేం నమ్మకం లేదు. అమ్మా, నువ్వే మాధవున్ని లేవగొట్టాలి. బలవంతపెట్టి బయటికి ఈడ్చుకువెళ్ళి బయటి ప్రపంచంలోకూడా ఆనందం ఉందని చూపించాలి."
మూర్తి చెపుతూ ఉండగానే మాధవరావు వచ్చాడు.
పద్మ లోపలికి వెళ్ళి అత్తగారితో సినిమాకి వెళుతున్నట్టు చెప్పింది. ఆవిడ ఏమీ మాట్లాడలేదు.
టాక్సీలోనూ, సినిమాహాలులోనూ భర్త పక్క కూర్చున్నప్పుడు మనసు సంతోషంతో నిండి పోయింది పద్మకి. సినిమా మొదలు పెడుతున్నప్పుడు ఒక పంజాబీ అతను భార్య నడుంమీద చెయ్యి వేసి అతి జాగ్రత్తగా జనంలోనించి తప్పించుకుని తీసుకురావడం చూసి, 'ఎంత అదృష్టవంతురాలు' అనుకుంది పద్మ. మాధవరావుమాత్రం భార్యని తగిలితే ఎక్కడ అపవిత్రం అయిపోతానో అన్నట్టు దూరంగా జరిగి కూర్చున్నాడు.
"పెళ్ళి అయి రెండేళ్ళు దాటినా నీకు సిగ్గు పోలేదు, మాధవా" అన్నాడు మూర్తి మెల్లిగా.
మౌనంగా ఉన్న భార్యాభర్తల్ని తన మాటలతో నవ్వించాడు మూర్తి. సినిమాలో లైట్లార్పి, న్యూస్ రీలు చూపిస్తూంటే మూర్తి మాధవరావుతో రహస్యంగా అంటున్న మాటలు పద్మకి వినిపించాయి.
"నీ భార్యని చూసిన మన స్నేహితులు చెప్పారు, 'ఆవిడ అప్సరస. చాలా అందంగా ఉంటుంది' అని. కాని నేను నమ్మలేదు. వాళ్ళు అతిశయోక్తులు చెప్పలేదని ఇప్పుడు అనిపిస్త్జూంది."
మూర్తిని మధ్య దారిలో వదిలేసి పద్మ, మాధవరావు తలుపు కొడితే కాంతమ్మ ఎంతకీ తలుపు తియ్యలేదు. "అమ్మా, తలుపు తియ్యి" అంటూ మాధవరావు గట్టిగా పిలిస్తే, పావుగంట గడిచాక వచ్చి కాంతమ్మ తలుపు తీసింది.
అత్తగారిని చూసి ఆశ్చర్యపోయింది పద్మ. ఆవిడ కళ్ళు ఎర్రగా ఉబ్బి, కొన్ని గంటలుగా ఏడుస్తున్నట్టు ఉన్నాయి. చెదిరిపోయిన జుత్తుతో దెయ్యంపట్టిన మనిషిలా ఉంది. కోడల్ని చూస్తూనే ఆవిడ పూనకం పట్టినట్టు మాట్లాడింది.
"మహ అప్సరసని నేనే ఉన్నానంటూ టింగురంగా మని మొగుడితో ఊరు తిరగడానికి బయలుదేరానే! లోకంలో ఎనే అందగత్తె నని అనుకుంటున్నావా? ఏమిటా బోగం వేషాలూ, ఒళ్ళు కనిపించే చీరెలూను?"
పద్మని వీథిలోనే నిలబెట్టి మాటలు సాగించింది కాంతమ్మ. పద్మకి సిగ్గుతో, భయంతో నోట మాట రాలేదు. అప్పుడే చీకటి పడుతూంది. వీథిలో వచ్చే పోయే జనం ఎక్కువగా ఉన్నారు. 'ఈ గొడవ విని చుట్టుపక్కల అంత చేరతారేమో?' అనుకుని అడ్డంగా నుంచున్న అత్తగారిని తప్పించుకుని మెల్లిగా లోపలికి వెళ్ళింది పద్మ.
"ఏమిటా మిడిసిపాటు! ఇంట్లో పెద్ధముండ ఒకర్తి ఉందని జ్ఞానం ఉందా? నా ఎదురుగానే మొగుణ్ణి రాసుకుంటూ సినిమాలకి ఊరేగుతావా? మా రోజుల్లో మేం ఇవన్నీ ఎరుగుదుమా? నేను నీకంటే లక్షరెట్లు బాగుండేదాన్ని, తెలుసా!"
పద్మ తన గదిలోకి వెళ్ళిపోయి ఏం చెయ్యాలో తెలియక అలాగే గోడ నానుకుని నిలబడింది.
కాంతమ్మ హిస్టీరియా వచ్చిన మనిషిలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూంది.
"అవును. సినిమాలకీ వెళతావు, షికార్లకీ తిరుగుతావు. అన్ని సరదాలూ తీర్చడానికి నా కొడుకు ఉన్నాడుగా! పాతికేళ్ళు అష్టకష్టాలూ పడుతూ పెంచాను. వాడి కేమైనా విశ్వాసం ఉందా? ఇప్పుడు పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతాడు. నా కెవరున్నారు? సరదాలు తీర్చడానికి, సరసం చెయ్యడానికి నా కెవరున్నారు? ఆ మహానుభావుడు మూడు నెలలు కాపరంచేసి, నన్ను బోడిముండని చేసి పోయాడు. తన దారి తను చూసుకున్నాడు. పదిహేనేళ్ళకే విధవరాలిని చేసేశారు అంతా!"
"అమ్మా, ఆ మాటల్ని ఇప్పుడు ఎందుకమ్మా! నీకు వచ్చిన కొరత ఏమిటి? ఊరుకో, అమ్మా. నే నున్నాను నీకు. ఏడవకమ్మా." మాధవరావు తల్లి కళ్ళనీళ్ళు తుడుస్తూ ప్రాధేయపడుతున్నాడు.
"నా కెవరూ లేరు, బాబూ, ఎవరూ లేరు. అందరూ నన్ను అన్యాయం చేశారుగా. నిన్ను నా కడుపులో పడేసి తప్పుకున్నాడు మీ నాన్న. ఇన్నాళ్ళూ, నా రక్తమంతా ధారపోసి పెంచితే, ఇప్పుడు నన్ను అన్యాయం చేస్తున్నావు నువ్వు. నేను ఎవరికీ అక్కరలేదు!" వెక్కి వెక్కి ఏడుస్తూంది కాంతమ్మ. మాధవరావు తల్లిని ఓదార్చాడు. ఆవిడ కొడుకు భుజం మీద వాలిపోయి విపరీతంగా ఏడుస్తూంది. అరగంటకి కాని ఆవిడ ఏడుపు తగ్గుముఖం పట్టలేదు.
పద్మ కొయ్యబొమ్మలా నుంచుని ఆశ్చర్యంగా చూస్తూంది. చిన్నపాపని బుజ్జగించినట్టు మాధవరావు తల్లిని ఓదారుస్తున్నాడు.
ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లినట్టు పడుకుంది కాంతమ్మ. ఆ రోజు ఎవరూ భోజనం చెయ్యలేదు.
పద్మ పక్కమీద ఎంత దొర్లినా నిద్ర పట్టలేదు. "అమ్మకూచి", "అమ్మ కొంగు పట్టుకు తిరిగేవాడు" అంటూ భర్తని గురించి చెప్పిన మూర్తి మాటలు జ్ఞాపకానికి వస్తున్నాయి. దానికితోడు అత్తగారి ప్రవర్తన, అత్తగారి మనస్తత్వం, భర్త మనస్తత్త్వం అర్ధం కావడంలేదు. కోడలు ఒక్క రోజు కొడుకుతో సినిమాకి వెళితేనే చూసి సహించలేకపోతే, అత్తగారు కొడుక్కి పెళ్ళి ఎందుకు చేసినట్టు?
పద్మకి హఠాత్తుగా ఏదో బోధపడినట్టు అయింది. తల్లి ఎన్నిసార్లు శోభనం మాట ఎత్తినా అత్తగారు వాయిదాలు వేసింది ఎందుకో ఇప్పుడు తెలుస్తూంది.
కాని ఎన్నాళ్ళీ కాపరం? మద్రాసు వచ్చి ఏడాది పైన అయిపోయింది. బి.ఎ. మొదటి సంవత్సరం పాసై రెండవ సంవత్సరంలోకి వచ్చింది. తన జీవితంలో మాత్రం ఏ మార్పూ లేదు. భర్తకి తన ఎడల ఎటువంటి అభిప్రాయమో తెలియదు. భర్త ప్రేమకి నోచుకోలేదా? అతనికి తన ఎడల ఆకర్షణ లేదా? అందరికీ అందంగా కనిపించిన తను భర్తలో చలనం కలిగించలేదా? జీవితమంతా అడివి కాచిన వెన్నెలేనా?
పెళ్ళి అయి మూడేళ్ళయినా మనసారా ప్రేమగా "పద్మా" అని ఒక్కసారీ పిలవని భర్త, తనని చూసి ఈర్ష్యపడి అసహ్యించుకునే అత్తగారు, తన సుఖంకోసం రాత్రింబగళ్ళు ఆధుర్దాపడే తల్లిదండ్రులు - ఎవరికి సంతోషం కలిగించాలని బ్రతుకుతూంది? తనవల్ల ఎవరికీ సుఖం లేదు. జీవించి సాధించేది ఏమిటి?
ఎక్కడైనా, ఎలాగైనా చచ్చిపోతే బాగుండును. కాని చావుని గురించిన ఆలోచనలు తల్లి, తండ్రి గుర్తుకిరాగానే ఆగిపోయాయి. ఆశలన్నీ తనమీదే నింపుకుని, ప్రేమంతా కుమ్మరించి, తన సుఖం కోసం అన్నీ త్యాగంచేసిన తల్లి, తండ్రి కూతురు ఆత్మహత్య చేసుకుందని వింటే ఎంత కుమిలి పోతారు? ఎంత కడుపుశోకం! కష్టమో, సుఖమో వాళ్ళకోసం ఈ లోకంలో తాను జీవించిఉండాలి.
ఏం చెయ్యలేక, ఎటూ పాలుపోక అసహాయురాలిలా దిండులో తల దూర్చుకుని ఏడ్చింది పద్మ.
22

శ్రీదేవి కాకినాడ వచ్చింది. ఉత్తరం రాయకుండా హఠాత్తుగా వెళ్ళి స్నేహితురాలికి సంతోషం కలిగించాలనుకుంది. సాయంత్రం రిక్షా చేయించుకుని గంజాం వారి వీథికి వచ్చింది.
రిక్షా దిగుతూనే 'ఇల్లంతా మారిపోయిందే' అనుకుంది శ్రీదేవి, తెరిచి ఉంచిన మొదటి గదిలో ప్రవేశిస్తూ ఎదురుగుండా పడకకుర్చీ, పక్కనే బల్లమీద పుస్తకాలు కనిపిస్తున్నాయి. బల్లకి అటువైపు నుంచుని పేపరు తిరగవేస్తున్న రామారావుగారు శ్రీదేవిని చూస్తూనే ఆశ్చర్యపోయారు. "ఇంటివారు కావలిస్తే పక్కసందుగుండా పెరటివైపు వెళ్ళండి" అన్నారు.
'గది అద్దెకి ఇచ్చారా?' అనుకుంటూ శ్రీదేవి పెరటివైపు వెళ్ళింది.
వరండాలో మాలతి పిల్లలకి పాఠాలు చెబుతూంది. శ్రీదేవిని చూడగానే సంతోషంగా, "అక్కా, మీశ్రీదేవి వచ్చింది" అని గట్టిగా కేకవేసి తను లేచి, చాప తీసుకువచ్చి వేసింది. భానుమతి, చారుమతి గదిలోనించి, శాంతమ్మ వంటింటిలోనించి ఒక్కసారే బయటికి వచ్చారు. శాంతమ్మకి నమస్కారం చేసి, "బాగున్నారా?" అని, భానుమతిని పలకరించింది శ్రీదేవి.
చారుమతి ఆప్యాయంగా శ్రీదేవి చెయ్యిపట్టుకుని కూర్చోపెట్టింది.
"ఎప్పుడు వచ్చావు? ఉత్తరమేనా రాయకుండా ఊడిపడ్డావే!"
"నిన్న సాయంత్రం వచ్చాం అమ్మా, నేనూ."
"ఏమిటమ్మా, శ్రీదేవీ ఏదో విశేషం ఉన్నట్టుందే! ఎన్నో నెల?" అంది శాంతమ్మ, శ్రీదేవిని ఎగాదిగా నవ్వుతూ చూస్తూ.
శ్రీదేవి సిగ్గుపడుతూ చెప్పింది, "ఏడవనెల."
"కంగ్రాచ్యులేషన్స్" అంది చారుమతి, శ్రీదేవి చెయ్యి తన చేతిలోకి తీసుకుని, శ్రీదేవి చేతినున్న రంగు రంగుల గాజులు చూస్తూ.
"పురుడు ఎక్కడ పోసుకుంటావమ్మా? ఈ ఊళ్ళో నేనా?" శాంతమ్మ అడిగింది.
"మా నాన్నగారిప్పుడు విశాఖపట్నంలో ఉన్నారు. అక్కడ పెద్ద ఆసుపత్రి ఉంది కదా! అక్కడే పోసుకోవాలనుకుంటున్నాను."
శాంతమ్మ అలాంటి ప్రశ్నలే చాలా అడిగింది. శ్రీదేవి జవాబుగా, తన తల్లి హైదరాబాద్ లో సూడిదలు ఇచ్చినట్టు, వరంగల్లులో అత్తవారింట్లో సీమంతం చేసినట్టు, ఇప్పుడు విశాఖ తీసుకువెళుతున్నట్టు చెప్పింది. దారిలో మేనత్త దిగమని రాస్తే, రెండు రోజులుండడానికి కాకినాడ వచ్చారు. రేపే తిరిగి విశాఖ వెళుతున్నారు.
