Previous Page Next Page 
ఏటి ఒడ్డున నీటిపూలు పేజి 19


    "నిరుడు పెళ్ళి అయింది, ఈ ఏడు పాపని ఎత్తుకుంటున్నావు. బాగుందమ్మా. మీ పద్మకి కూడా ఏదో విశేషం ఉండేఉంటుంది. అందరికి పెళ్ళిళ్ళూ అవుతాయి, పిల్లల్నీ కంటారు. మా అమ్మాయిలకే ఏ దిక్కూ కనిపించటం లేదు" అంది శాంతమ్మ దిగులుగా.
    అంతా మౌనంగా ఉండిపోయారు కాస్సేపు.
    "మీ గది అద్దెకి ఇచ్చారా? నువ్వు నాకు రాయనే లేదు." శ్రీదేవి నిశ్శబ్ధాన్ని భంగం చేస్తూ అంది.
    "అవును, రామారావుగారని, హైస్కూలు టీచరు ఆయన. మా ఇంట్లో దిగి ఏన్నర్ధం అయింది." చారుమతి వివరాలు చెప్పింది.
    "ఆయన ఉండబట్టే మా కెంతో సహాయంగా ఉందమ్మా. మా శంకరం వెళ్ళిపోయాక మా ఇంట్లో మగదిక్కు అయ్యారు." శాంతమ్మ విచారంగా అంది.
    "శంకరం ఎక్కడికి వెళ్ళాడు?"
    "నీకు తెలియదు కదూ! శంకరం ఇల్లు విడిచి వెళ్ళి ఏడాది అయిపోతూ ఉంది. ఉద్యోగం సంపాదించుకుని వస్తానని వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు ఒక్క ఉత్తరం రాయలేదు, ఎక్కడున్నాడో, ఏమైపోయాడో అని అమ్మకి, మామ్మకి దిగులు." చారుమతి పాత సంగతులు తలుచుకుంటూ మాట్లాడింది.
    "అయ్యో, నాకు తెలియదు ఈ సంగతి. అన్నట్టు, మీ మామ్మగారు ఎలా ఉన్నారు?"
    "రా, చూద్దువుగాని. నువ్వు వచ్చావంటే సంతోషిస్తుంది."
    చారుమతి శ్రీదేవిని లోపలికి తీసుకుని వెళ్ళింది. ముసలమ్మగారు ముల్లులా మంచంమీద పడుకుని ఉన్నారు. ఆవిణ్ణి చూస్తూనే ఎవరికేనా జాలివేస్తుంది.
    "మామ్మా, శ్రీదేవి వచ్చింది" అంది చారుమతి మంచం దగ్గిరికి వెళ్ళి.
    "ఎవరూ?" అంటూ కళ్ళు తెరిచింది ఆవిడ. కాని శ్రీదేవిని గుర్తుపట్టలేకపోయింది.
    "ఎవరూ?" అంది తెల్లబోయి చూస్తూ.
    "శ్రీదేవి......మా స్నేహితురాలు, సూర్యారావుపేటలో ఉండే అమ్మాయి" అంది తిరిగి చారుమతి.
    "క్రిందటేడు పెళ్ళి అయి, ఇప్పుడు బిడ్డని కనబోతూంది." శాంతమ్మకూడా దగ్గిరికి వచ్చి చెప్పింది.
    "ఆహాఁ, మంచిది చాలా బాగుంది" అంది ముసలమ్మ మెల్లిగా "తిరిగి మా మనవడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు చూశావా అమ్మా!దేవుడికి మామీద దయ లేదు. ఎక్కడున్నాడో ఏమో? తింటున్నాడో, పస్తే ఉన్నాడో! ఆడపిల్లలంతా పెళ్ళీడు దాటిపోతున్నారు. ఒక్కళ్ళకీ మొగుడు దొరకలేదు. పెళ్ళిళ్ళు ఎప్పుడౌతాయో! చెట్టంత కొడుకునిమింగి, నేనిలా మంచంలో పడి బ్రతుకుతున్నాను. నారాయణుడికి నామీద దయ ఎప్పుడు కలుగుతుందో, ఎప్పుడు రమ్మంటాడో?" ముసలమ్మ ఆగి ఆగి అంటున్న మాటలు ఎంతో హృదయ విదారకంగా ఉన్నాయి.
    "మామ్మా, నువ్వు పడుకో మేం వెళతాం" అంది చారుమతి.
    శ్రీదేవి వంగి ముసలమ్మ పాదాలు ముట్టుకుని నమస్కారంచేసి, "వస్తాను, మామ్మగారూ" అంది.
    "సుఖీభవ! చిరంజీవ! నలుగు కాలాలపాటు పసుపు కుంకుమలతో బ్రతుకు, కడుపునిండా కొడుకులని కను." ముసలమ్మ ఆశీర్వదించింది.
    శ్రీదేవి కాస్సేపు శాంతమ్మతో, భానుమతితో, మాలతితో మాట్లాడి "వెళతాను" అంటూ లేచింది.
    "అప్పుడేనా?" అంది చారుమతి.
    "చారూ, సత్యనారాయణమూర్తి కోవెలకి వెళదాం, వస్తావా?" అంది శ్రీదేవి.
    చారుమతి చీర మార్చుకుని బయలుదేరింది. శాంతమ్మ చారుమతిని లోపలికి పిలిచి ఒక పళ్ళెం చేతిలో పెట్టి, శ్రీదేవికి ఇవ్వమంది. అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, చిన్న కాగితంలో పంచదార వేసి ఉంది.
    "కడుపుతో ఉన్నవాళ్ళని వట్టి చేతులతో పంపకూడదంటారు. తీపి పెట్టాలి. మాకున్న దేదో మేం ఇచ్చాం. ఏమీ అనుకోకు, శ్రీదేవి" అంది శాంతమ్మ.
    "ఇవన్నీ ఇప్పుడెందుకండీ?" అంటూనే అన్నీ తీసుకుని, వంగి శాంతమ్మకి నమస్కరించింది శ్రీదేవి.
    గుమ్మం దాటబోతూవుంటే భగవతి ఇంట్లోకి వచ్చింది. "భగవతీ, నువ్వెప్పుడు వచ్చావు?" అంది శ్రీదేవి ఆశ్చర్యంగా.
    భగవతికి విశాఖపట్నం నీళ్ళు బాగా పట్టినట్టు ఉన్నాయి. కొంచెం ఒళ్ళు చేసి, అందంగా తయారైంది.
    "నేను వచ్చి రెండు నెలలు అయింది" అంది భగవతి.
    "ఏం చేస్తున్నావు? ఎస్. ఎస్. ఎల్. సి. పాసయ్యావా?"
    "పరీక్ష పోయింది."
    "అయ్యో, మళ్ళీ పరీక్షకి కట్టవా?"
    "లేదు. ఇంక చదవాలని లేదు."
    శ్రీదేవి అందరి దగ్గిర సెలవు తీసుకుని చారుమతితో సత్యనారాయణమూర్తి కోవెలకి బయలుదేరింది.
    "భగవతి ఏమందో చూశావా? ఇంక పరీక్షకి కట్టదుట. చదవాలని లేదంటుంది." చారుమతే ఎత్తింది సంభాషణ.
    "మరేం చేస్తుందిట?"
    "పెళ్ళి చేసుకుంటుందిట, ఏమిటో, దేవీ! భగవతిని అనవసరంగా విశాఖ పంపించాం అనిపిస్తుంది. అది అక్కడ రెండేళ్ళు ఉండిపోవడంవల్ల, మా కుటుంబంలో కష్టసుఖాలు తెలియలేదు. దాని దృష్టిఅంతా పెళ్ళిమీదే. పైన ముగ్గురు పెళ్ళికాని అక్కలు ఉన్నారు, వాళ్ళకి ముందు పెళ్ళిళ్ళు కావాలి అనే ధ్యాసే లేదు. ఎప్పుడేనా అమ్మ ఆ మాట అంటే, "ఇంత మంది ఆడపిల్లలని ఎందుకు కన్నావమ్మా?" అని అడుగుతుంది. అమ్మ ఎంతో బాధపడుతుంది. ఇంట్లో రోజూ కూర చెయ్యకపోతే విసుగు; కొంచెం కూర చేస్తే విసుగు. ప్రతిదానికీ విసుగే. రేవతక్కా, బావా దీన్ని కష్టసుఖాలు తెలియకుండా పెంచేశారు. ఇప్పుడు మేం చస్తున్నాం."
    మాట్లాడుకుంటూనే కోవెల చేరారు ఇద్దరూ. కోవెలపక్కనే ఉన్న బాలాజీ చెరువు కోవెలకి అందాన్ని ఇస్తూంది. కాకినాడలో మధ్యమధ్యన ఉండే చెరువులు, వంకరలేని తిన్నని విశాలమైన వీథులు ఊరికి ఎంతో అందాన్ని ఇస్తాయి.
    కోవెల మెట్లదగ్గిర ఉన్న కొట్లో కొబ్బరికాయ కొన్నది శ్రీదేవి. లోపల ప్రదక్షిణం చేసి, దేవుడి విగ్రహానికి ఎదురుగా వచ్చి, కొబ్బరికాయ కొట్టి, గంట వాయించి, రెండు కొబ్బరి చిప్పలు పూజారికి ఇచ్చారు. భగవంతుడికి నమస్కరించి ప్రసాదం తీసుకు వచ్చి కూర్చున్నారు. సత్యనారాయణమూర్తి కోవెల ఎప్పుడూ భక్తులతో నిండుగానే ఉంటుంది. ముఖ్యంగా విద్యార్ధులకి ఈ దేవుడిమీద చాలా నమ్మకం. పరీక్ష రాసే ముందు విధిగా దేవుడికి కొబ్బరికాయకొట్టి ప్రసాదం, కుంకుమ తీసుకుని వెళతారు. పరీక్ష పాసవగానే మళ్ళీ వచ్చి కొబ్బరికాయ కొడతారు. చదువుకుంటున్నప్పుడు తాము ముగ్గురూ వచ్చి కొబ్బరికాయలు కొట్టడం జ్ఞాపకం వచ్చింది శ్రీదేవికి, చారుమతికి.
    "పద్మ ఎలా ఉందో? నీ కేమైనా ఉత్తరాలు రాస్తుందా?" అంది శ్రీదేవి.
    "నాకేం రాయదు. వెళ్ళాక ఒకటి రెండు రాసింది. కాని అందులో చదువు విషయం తప్ప ఇంకొకటి లేదు. నాలుగు ముక్కలు రాస్తుంది."
    "పద్మ సుఖపడటంలేదనిపిస్తూంది చారూ!"
    "అవును. నాకూ అలాగే అనిపిస్తూంది. నీ ఉత్తరాలలో నువ్వు మీ ఆయన్ని గురించి బోలెడు సంగతులు రాస్తావు. హైదరాబాద్ విశేషాలు రాస్తావు. కాని పద్మ వాళ్ళాయన పేరే ఎత్తదు ఎప్పుడూ మద్రాసు కూడా పూర్తిగా చూసినట్టు కనిపించదు."
    ఇద్దరు పద్మ గురించే మాట్లాడుకుంటూ కూర్చున్నారు కాసేపు.
    "పద్మ సుఖపడాలని మనం దాని పెళ్ళిరోజున గుడిలో ప్రార్ధించాం. జ్ఞాపకం ఉందా? కాని అదే కరువైనట్టుంది పద్మకి. ఇలాంటివి చూస్తూ ఉంటేనే దేవుడి మీద నమ్మకం పోతుంది" అంది చారుమతి.
    "దేవుడిమీద నమ్మకం మాత్రం పోగొట్టుకోకు, చారూ! నా కెంతో నమ్మకం భగవంతుడి మీద."
    'ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి' అనుకుంది చారుమతి.
    బాగా చీకటి పడిందని లేచారు ఇద్దరు.
    "బాబు పుట్టగానే ఉత్తరం టాయి" అంది చారు మతి, శ్రీదేవి రిక్షా ఎక్కుతూంటే.
    "ఆఁ అలాగే రాస్తాను. నువ్వూ ఉత్తరాలు రాస్తూండు. అశ్రద్ధ చెయ్యకు" అంది శ్రీదేవి.
    ఇద్దరికీ విడిపోవడం కష్టమనిపించింది శ్రీదేవి రిక్షా బాలాజీ చెరువురోడ్డు దాటేదాకా అక్కడే నుంచుంది చారుమతి. శ్రీదేవి రిక్షా వెనక తెర ఎత్తి చెయ్యి ఊపింది.
    శ్రీదేవిలో ఒక నిండుదనం, ఒక తృప్తి, పెద్దరికం వచ్చాయి. శ్రీదేవినే తలచుకుంటూ ఇంటిముఖం పట్టింది చారుమతి. కోవెలదగ్గిరనించి ఇల్లు చాలా దగ్గిర. పది నిమిషాలలో ఇల్లు చేరింది.
    వంటింటిలోనించి గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి. కాళ్ళు కడుక్కుని, చారుమతి కూడా ఇంట్లోకి వెళ్ళి పీటవాల్చుకుని కూర్చుంది. శాంతమ్మ కంచం పెట్టి, కూతురికి అన్నం వడ్డించింది. తన రాకతో హఠాత్తుగా ఆగిపోయిన మాటలకి ఆశ్చర్యపోతూ, "ఏమిటి మాట్లాడుతున్నారు?" అంది చారుమతి.
    "ఏమీలేదు. భగవతి ఏదో వాగుతూ ఉంటుంది. మామూలే కదా!" అంది శాంతమ్మ.
    "నేనేమైనా తప్పు మాట అన్నానా? నాది వాగుడా?" అంది భగవతి ఉక్రోషంగా.
    "తల్లీ, మళ్ళీ పురాణం విప్పకు." శాంతమ్మ విసుక్కుంది.
    "నిజం చెబితే పురాణం ఏమిటి? అందరూ అడుగుతూంటే జవాబు చెప్పలేక చస్తున్నాను. ఇంట్లో ముక్కు మూసుకుని కూర్చున్న నీకేం తెలుస్తుంది?" తల్లివేపు కోపంగా చూస్తూ అంది భగవతి.
    
    "బయట అందరూ ఏమని అడుగుతున్నారే?" చారుమతి ఆశ్చర్యంగా అడిగింది.
    "ఏం మీ అక్కలు పెళ్ళి చేసుకోరా? ముసలివాళ్ళు అయ్యేదాకా అలాగే ఉండిపోతారా అంటున్నారు."
    "వాళ్ళ కెందుకు బాధ? 'పెళ్ళి కొడుకుల్ని తీసుకు రండి, మా అక్కలు పెళ్ళిచేసుకుంటారు' అని చెప్పునువ్వు." చారుమతి కోపంగా అంది.
    "ఊరివాళ్ళెందుకు చూసి పెడతారు? అమ్మా, నాన్నా చూడాలి. కాని, అమ్మ కూతుళ్ళ పెళ్ళివిషయమే పట్టించుకోదు. అయిదుగురు కూతుళ్ళనిమాత్రం కంది."
    "అస్తమానం అమ్మ విషయం ఎత్తుతా వెందుకు? అమ్మ ఏం చేస్తుంది? నీకు బొత్తిగా జ్ఞానం లేదు. మాకు పెళ్ళిళ్ళు కాకపోతే నీకేం బాధ?" ఎప్పుడూ కోపగించుకోని భానుమతి తారాజువ్వలా లేచింది.
    "నాకేబాధ. నువ్వయితే సన్యాసినిలా పెళ్ళీ గిళ్ళీ లేకుండా ఉండిపోయావు, మమ్మల్ని అందరినీ అలాగే ఉండమంటావా?" భగవతి రెట్టించింది.
    "నువ్వు ఊరుకుంటావా లేదా, భగవతీ? ఏమిటా మాటలు?" శాంతమ్మ కేకలేసింది.
    "ఎందుకు ఊరుకోవాలి? అక్కలందరు ఊరు కున్నారు కనకనే వాళ్ళంతా అలా పెళ్ళిళ్ళు లేకుండా ఉండిపోయారు. నేను అలా ఊరుకోను. నాకు పెళ్ళి చేసెయ్యి."
    భగవతి మాటలు విన్న అక్కలకి, తల్లికి నోట మాట రాలేదు. ఆశ్చర్యం, కోపం, అసహాయత్వం అన్నీ వాళ్ళని స్తబ్దుల్ని చేశాయి.
    ఎవరి ఆలోచనలలో వాళ్ళు ఉండిపోయి, భోజనాలు ముగించి లేచారు. పిల్లలందరు వెళ్ళిపోయాక శాంతమ్మ ఒక్కర్తే వంటింట్లో కూర్చుని కుళ్ళికుళ్ళి ఏడ్చింది.
    భగవతిని గురించే ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది చారుమతి. భగవతిది అజ్ఞానం ఇంకా వదలని వయస్సు. అలవాట్లు, ఆలోచనలు, చదివే పుస్తకాలు మనిషి ప్రవర్తన మీద ప్రభావం చూపుతాయి. భగవతికి చదువులోకంటే, ఇరుగుపొరుగు ఇళ్ళలో పెత్తనాలు చెయ్యటం ఇష్టం. ఉదయం లేచినదగ్గిరనించి సాయంత్రం చీకటి పడేదాకా పొరుగు ఇళ్ళలో గడుపుతుంది. దానికితోడు ఆమె స్నేహితురాలు సీత ధనవంతుల బిడ్డ. వారి మేడ భగవతి ఇంటికి నాలుగిళ్ళ అవతల ఉంది. రోజులో చాలాభాగం భగవతి సీతతోనే గడుపుతుంది. సీతకి ఇద్దరన్నలు ఇద్దరక్కలూను. అక్కలికి ఎనిమిదేసి వేలు కట్నం ఇచ్చి, అన్నలకి పదేసి వేలు కట్నం తీసుకుని పెళ్ళిళ్ళు చేశారు. సీత ఇంట్లోవారికి భగవతి ఇంటి పరిస్థితులు చూస్తే హేళన. ఆడపిల్ల లందరూ పెళ్ళి లేకుండా ఇంట్లో ఉండిపోయారని ఈసడిస్తూ మాట్లాడతారు. ఆ మాటలు విని రెచ్చిపోతుంది భగవతి.
    సినిమా కథల పుస్తకాలు, చవకబారు డిటెక్టివ్ పుస్తకాలు మాత్రమే చదివే భగవతిలో సంస్కారం, జ్ఞానం పెరగలేదు.
    భగవాతిని తలుచుకుని భయపడింది చారుమతి. ఇంటి పరిస్థితులకి, భగవతి కోరికలకి అగాథం అంత అంతరం ఉంది. ఈ అగాథం పైన ఆనకట్ట ఎలా కట్టడం అని నిట్టూర్చింది చారుమతి.
    ఇంట్లో అందరూ నిద్రపోయినా, భానుమతి మేలు కునే ఉంది. నిద్రపట్టక బయటికి వచ్చి వరండాలో నిలుచుంది. బయట వెన్నెల ఎంతో ఆహ్లాదంగా ఉంది. మనసు సంతోషంగా ఉంటేనే ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించగలం.  లేకపోతే మనసులోని చీకటి బయటి వెన్నెలనికూడా చీకటిగానే మార్చేస్తుంది.
    భానుమతి రెండు అడుగులు ముందుకు వేసి సందులోకి వచ్చింది. ఒక్క నిమిషం ఆగి, వెనక్కి వచ్చి వరండాలో కూర్చుంది. అరగంట తరవాత మళ్ళీ ఒక నిశ్చయానికి వచ్చినట్టు గబుక్కున లేచి గబగబా సందులో గుండా ఇంటి ముందుభాగానికి వచ్చి నిలిచింది. తిరిగి ఏదో తటపటాయింపు. కాళ్ళు ముందుకీ వెనక్కీ వెళతాయి. చివరికి ముందుగది దగ్గిరికి వెళ్ళి తలుపు కొట్టింది మెల్లిగా.
    అప్పటికి రాత్రి పదకొండున్నర గంట లయింది. ఊరంతా సద్దుమణిగింది. వర్షాకాలమేమో, అంతా ఇళ్ళలోనే నిద్రపోతున్నారు.
    రామారావుగారు వచ్చి, "ఎవరూ?" అంటూ తలుపు తీసి, గదిముందు ఆడపిల్లని చూసి ఆశ్చర్యపోయారు.
    భానుమతి చటుక్కున లోపలికి వచ్చింది. లైటు వేసి, వచ్చింది భానుమతి అని పోల్చిన రామారావుగారి ఆశ్చర్యం రెండింతలైంది. భానుమతి ఆయనతో ఎప్పుడూ ఎదటబడి ఒక్క మాట మాట్లాడలేదు.
    "ఏమండీ, ఇలా అర్ధరాత్రి వచ్చారు?"
    "ముందర గది తలుపు దగ్గిరికి వేస్తారా?" భానుమతిలో మొండిధైర్యం కనిపిస్తూంది.
    రామారావుగారు తలుపు చేరవేసి వచ్చి, భానుమతికి ఎదురుగా నిలుచున్నారు. 'ఏమిటి సంగతి?' అన్నట్టు ఉన్నాయి ఆయన చూపులు.
    "మాస్టారూ, మీరు నన్ను పెళ్ళి చేసుకుంటారా?" భానుమతి తొందరగా చెప్పి, ఒక్కసారి ఆయనని చూసి, కళ్ళు దించుకుంది.
    "ఏమిటి అంటున్నారు?" అర్ధం కానట్టు అడిగారు రామారావుగారు.
    "నన్ను పెళ్ళి చేసుకోమంటున్నాను, మాస్టారూ!" మృదువుగా చెప్పింది భానుమతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS