20

శాంతమ్మ ఉదయం లేస్తూనే శంకరం పక్క ఖాళీగా ఉండటం చూసింది. 'వీడింత పెందరాళే ఎందుకు లేచాడు?' అనుకుంటూ పెరటిలోకి వెళ్ళింది. పెరటిలో లేడు. ఆవిడికి కొద్దిగా భయం వేసింది. భానుమతిని లేపి, "శంకరం ఎక్కడికి వెళ్ళాడు?" అంది.
భానుమతి ఆశ్చర్యపోయింది. "పెరట్లో ఉన్నాడేమోనమ్మా" అంటూ బయటికి వచ్చింది. "పెరట్లో లేడమ్మా" అంది శాంతమ్మ భయాందోళన లతో. వీళ్ళ మాటలు వినిపించి చారుమతి, మాలతి లేచారు.
సంగతి విన్న చారుమతి గుండె ఒక్కసారి భయంతో కంపించింది. రాత్రి తను అవివేకంగా కోపంతో తిట్టిన తిట్లకి శంకరం మనస్సు చెదిరి ఆత్మహత్యలాంటిదేమీ చేసుకోలేదు కదా?
పైకిమాత్రం తల్లికి ధైర్యం చెప్పాలనే ఊహతో అంది: "ఎక్కడికి వెళతాడమ్మా! మునుపు ఒకసారి రాత్రి అంతా ఎక్కడో తిరిగి వచ్చాడు, జ్ఞాపకం లేదూ? ఇప్పుడూ అలాగే వస్తాడు. నువ్వేం గాభరాపడకు."
"అన్న పక్కమీద ఎర్రదుప్పటీ ఏదమ్మా?" అంది మాలతి. అందరు అప్పుడే శంకరం పక్క గమనించారు. శంకరం పక్కమీద వేసిన ఎర్రదుప్పటీ, కప్పుకునే గళ్ళదుప్పటీ, దిండూ లేవు. పక్కదగ్గిరికి వెళ్ళిన మాలతి ఒక చీటీ చూసింది. అందులో శంకరం ఉత్తరం రాసి పెట్టాడు.
"అమ్మకు,
నేను ఉద్యోగం కోసం వెళుతున్నాను. ఉద్యోగం దొరికితేగాని ఇంటికి రాను. మీరు ఏమీ కంగారు పడకండి.
-శంకరం."
మాలతి ఉత్తరం తల్లి చేతికి ఇచ్చింది. ఉత్తరం తల్లి చేతికి ఇచ్చింది. ఉత్తరం చూసి భోరుమని ఏడ్చింది శాంతమ్మ. "నా బాబు ఎక్కడికి వెళ్ళాడో, ఎలా వెళ్ళాడో, ఎప్పుడు తిరిగి వస్తాడో?" అంటూ శోకాలు పెట్టింది. ఆవిడికి చారుమతి మీద కోపం కట్టలు తెంచుకు వచ్చింది.
"నీ వల్లే శంకరం ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఎంతెంత మాట లన్నావు! నీ మాటలకే బాబు మనస్సు విరిగి వెళ్ళిపోయాడు. నాలుగు రాళ్ళు సంపాదిస్తావని మరీ అంత పొగరా నీకు!"
"అబ్బ! ఊరుకో, అమ్మా! నీకు తెలియకుండానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మాస్టారిని అడుగుదాం, ఉండు. ఆయన శంకరాన్ని తీసుకువస్తారు" అంటూ ఓదార్చింది భానుమతి.
చారుమతి వెంటనే శంకరం రాసిన చీటీ తీసుకుని చుట్టూ తిరిగి రామారావు గారి గదికి వెళ్ళి, తలుపు కొట్టింది.
నిద్రపోతున్న రామారావుగారు, "మాస్టారూ"అన్న ఆడగొంతుక విని, లేచి తలుపు తీసి, చారుమతిని చూసి ఆశ్చర్యపోయారు.
చారుమతి నిద్ర లేచింది లేచినట్టే వచ్చేసింది. రేగిన జుత్తు, నిద్రకళ్ళు.
"ఏమండీ, ఏం కావాలి?" అన్నారు రామారావు గారు.
"మా శంకరం ఈ చీటీ పెట్టి, ఇల్లు విడిచి వెళ్ళిపోయాడండి" అంది చారుమతి చీటీ ఇస్తూ.
"అరెరే! ఇలా ఎందుకు చేశాడు?"
చారుమతి ఏమి మాట్లాడలేదు.
"నిన్న రాత్రి పదిగంటలకి నా దగ్గిరికి వచ్చి ఇరవై రూపాయలు ఉంటే ఇమ్మన్నాడు. ఇంటికి అవసరమేమోనని ఇచ్చాను. ఇలా చేస్తాడని అనుకోలేదు" అన్నారు రామారావుగారు.
"అమ్మ చాలా దిగులుపడుతూందండీ, శంకరం ఏమైపోతాడోనని." చారుమతి దిగులుగా చెప్పింది.
"అమ్మని దిగులుపడవద్దని చెప్పండి. శంకరం ఉద్యోగంకోసమై వెళ్ళిఉంటాడు. అయినా నేను స్టేషన్ కీ, బస్ స్టాండు కీ వెళ్ళి చూస్తాను, ఎక్కడేనా ఉన్నాడేమో!"
రామారావుగారు బట్టలు మార్చుకుని చెప్పులు వేసుకు బయటికి వెళ్ళారు. చారుమతి ఆ సంగతి తమ ఇంటి భాగానికి వచ్చి తల్లితో చెప్పింది.
చారుమతి స్కూలుకి వెళ్ళలేదు. మాస్టారికోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు అంతా.
చారుమతి 'శంకరాన్ని ఎందుకు తిట్టానా' అని మథనపడింది. ఏదో తప్పు చేశానన్న భావం పీడిస్తూంది. భానుమతి దగ్గిరికి వెళ్ళి కూర్చుంది.
"భానక్కా, నేను చాలా తప్పు చేశాను కదూ? శంకరాన్ని అలాంటి మాట లనకుండా ఉండవలిసింది. అమ్మకి చాలా కష్టం కలిగించాను."
"నువ్వు అన్నదానిలోకూడా తప్పు లేదు, చారూ!"
"ఏమో, అక్కా! నిన్న శంకరాన్ని ఏదో కోపంలో అనేశాను. కాని, ఇవ్వాళ బాధపడుతున్నాను. డబ్బు ఇబ్బందులు నన్ను కఠినురాలిగా మార్చేస్తున్నాయి. నేను తెచ్చిన జీతంలో సగం మామ్మ మందులకే ఖర్చు అవుతూంది. ఆవిడ మందులు లేకపోతే మనం డబ్బుకి ఇంత ఇబ్బందిపడం."
"నువ్వేం బాధపడకు. శంకరం ఉద్యోగం సంపాదించుకుని క్షేమంగా ఇంటికి వస్తాడు" అంది భానుమతి. నిన్న విన్న మాస్టారి కథే శంకరాన్ని ఈ పనికి ప్రోత్సహించిందని, శంకరం అభివృద్దికి వస్తాడని నమ్మింది భానుమతి.
నిన్న జరిగిన సంగతులు ఏమీ తెలియని చారుమతి మాత్రం 'అక్కకి ఎంత ధైర్యం! ఎంత నిశ్చింత!' అనుకుంది.
మధ్యాహ్నం పన్నెండుగంట లవుతూఉండగా రామారావుగారు వచ్చారు. ఆయన గది తలుపు చప్పుడు వినగానే చారుమతి, మాలతి బయటికి వచ్చారు.
"ఎక్కడా లేడండీ. నేను స్వయంగా స్టేసన్ కీ, బస్ స్టాండ్ కి వెళ్ళి చూశాను. కాని మీరేం భయపడ కండి. శంకరం తొందరలోనే వచ్చేస్తాడు" అన్నారు రామారావుగారు.
"ఆ మాట మీరే మా అమ్మతో వచ్చి చెప్పండి, మాస్టారూ, ధైర్యంగా ఉంటుంది ఆవిడికి. మా మాట కొట్టిపారేస్తూంది" అంది చారుమతి.
మాస్టారు అక్కచెల్లెళ్ళతోకూడా లోపలి ఇంట్లోకి వెళ్ళారు. శాంతమ్మ శోకదేవతలా వంటింటి గుమ్మంలో కూర్చుని ఉంది.
"అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. శంకరం మంచి ఉద్యోగం సంపాదించుకుని తొందరలోనే మీదగ్గిరికి వస్తాడు. శంకరాన్ని గురించి మీరు బెంగపెట్టుకోకండి. కుర్రవాడు బుద్దిమంతుడు; తెలివైనవాడూను. పైకివస్తాడు" అన్నారు రామారావుగారు.
తమ ఇంట్లో ఆరునెలల బట్టీ అద్దెకి ఉంటున్నా, ఆయనతో ముఖాముఖీగా మాట్లాడటం శాంతమ్మకి అదే ప్రథమం.
ఆత్మీయుడిలా వచ్చి ఆప్యాయంగా తనకి ధైర్య వచనాలు చెప్పగానే శాంతమ్మకి కొంచెం భయం తగ్గి, మనస్సు కుదుటపడింది.
ఆయన వెళ్ళగానే, 'నాకే ఇలాంటి తమ్ముడు, కష్ట సుఖాలలో ఆదుకునేవాడుంటే, నా సంసారంలో ఇన్ని పాట్లు ఉండకపోనా!' అనుకుంది శాంతమ్మ. ఆ మాట గట్టిగానే అంది.
"అవును, ఇంత మంచి మామయ్య ఉంటే కొండంత ధైర్యం మనకి" అంది చారుమతి.
అప్పటి దాకా అపరిచితులుగా ఉండిన ఇంటివారికి, రామారావుగారికి మధ్య గోడ తొలగించినట్టయి పరిచయం ఏర్పడింది. ఇంటికి ఆయనే మగదిక్కు, స్నేహితుడు అయ్యారు. ఇంట్లో ఏ కష్టం, ఏ ఇబ్బంది కలిగినా శాంతమ్మ, "బాబూ" అంటూ, చారుమతి "మాస్టారూ" అంటూ రామారావు గారితో చెప్పి, సలహా అడిగేవారు. మాలతి చనువుగా వెళ్ళి మాస్టారిదగ్గిరినించి పత్రికలు, పుస్తకాలు తెచ్చుకునేది.
21
ఆ రోజు ఆదివారం. మధ్యాహ్నం పద్మ తన గదిలో కూర్చుని చదువుకుంటూ ఉంటే, మాధవరావు గది గుమ్మం దగ్గిరకి వచ్చి నిలబడ్డాడు. మొదటిసారిగా తన ఎదురుగా వచ్చి నిలుచున్న భర్తని చూసి తడబాటుతో లేచి నిలుచుంది పద్మ.
"నా ఫ్రెండ్ వచ్చాడు, కాఫీ తీసుకురా. మంచి చీరకట్టుకుని మరీ రా" అని గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు మాధవరావు.
పద్మ ఆశ్చర్యపోయింది. "మంచి చీర కట్టుకురా" అని చెప్పాలా? తనకి తెలియదా!
కాఫీ కలుపుతూంటే ఎన్నో ఆలోచనలు వచ్చాయి. గులాబీ రంగు ఫుల్ వాయిల్ చీర కట్టుకుని, కాఫీ కప్పులు ట్రేలో పెట్టి ,మాధవరావు గదిలోకి వెళుతూంటే కాంతమ్మ కోడల్ని ఆశ్చర్యంగా, కోపంగా చూసింది.
"ఈవిడ నా భార్య, పద్మ" అని పరిచయం చేశాడు మాధవరావు, స్నేహితుడికి.
పద్మ నమస్కారం చేసి తల వంచుకుని బయటికి పోబోతూఉంటే, "చూడండమ్మా!" అంటూ అతను ఆపాడు.
"మాధవుడు సగంపరిచయమే చేశాడు. నన్ను మీకు పరిచయం చెయ్యనేలేదు. నా పేరు మూర్తి. మేం ఇద్దరం చిన్నతనంనించి స్నేహితులం. మీరు కొంచెం కూర్చుంటే మా మాధవుడి చిన్నప్పటి కథలు చెబుతాను" అన్నాడు మూర్తి.
పద్మకి మూర్తి చనువుగా మాట్లాడటం ఎంతో సంతోషం కలిగించింది. అక్కడే కూర్చుని అతని మాటలు వినాలని ఉంది. కాని భర్తకి ఇష్టమో, కాదో! పద్మ తటపటాయిస్తూ అక్కడే నుంచుని భర్త ముఖం వంక చూసింది.
"ఇంట్లో పని ఏమైనా ఉందా? మధ్యాహ్నం పనేమి ఉంటుంది?" అన్నాడు మూర్తే తిరిగి.
"పనేం లేదు" అంది పద్మ మెల్లిగా.
"అయితే ఇకనేం! కూర్చోండి. మీరు మాధవుడి వంక చూడకండి. వాడి చిన్నతనం అంతా చెప్పేస్తానని వాడి భయం. మిమ్మల్ని కూచోనివ్వడు." మాధవరావు వీపు మీద ఒకటి చరుస్తూ, నవ్వుతూ అన్నాడు మూర్తి.
పద్మ పెదవులమీద ఇన్నాళ్ళకి చిరునవ్వు మెరిసింది అక్కడే కూర్చుంది.
"వీడమ్మా - మా మాధవుడు-చిన్నప్పటినించీ ఉట్టి 'అమ్మకూచి' అనుకో ఎప్పుడూ అమ్మ కొంగు పట్టుకుని తిరిగేవాడు. టీనగర్ లో మేం వీళ్ళ ఇంటి పక్క ఇంట్లోనే ఉండేవాళ్ళం. బడినించి ఇంటికి రాగానే మేం అంతా ఆడుకోడానికి గౌండ్సుకి పరిగెత్తే వాళ్ళం. వీడుమాత్రం వంటింట్లో అమ్మకి ఎదురుగా కూర్చునేవాడు. దొంగతనంగా మా గాంగ్ అంతా సినిమాలకి చెక్కేసేవాళ్ళం. మీ ఆయనమాత్రం సత్యహరిశ్చంద్రుడనుకో. సినిమాలకి కూడా అమ్మతోనే వెళ్ళాలి అనేవాడు. వీడు ఎవ్వరితో చేరకుండా ఇంట్లోనే కూర్చునేవాడని 'అమ్మకూచి', 'ఒంటిపిల్లి రాకాసి' అని ముద్దు పేర్లతో పిలిచేవాళ్ళం."
మూర్తి ఆగాడు. పద్మవేపు తిరిగినవ్వుతూ, "మీ ఆయన్ని వీడూ, వాడూ అంటున్నానని కోపగించుకోకమ్మా మాధవుడు నాకు చిన్నప్పటినించీ తెలిసినవాడే!" అన్నాడు.
"ఇంక చాలు నీ చాడీలు. ఇందుకేనా మా ఇంటికి వస్తానని ప్రాణంతీశావు!" అన్నాడు మాధవరావు అసహనంతో.
"పోనీలే, నీ కథలు చెప్పనులే. వాడి గుట్టు ఎక్కడ బట్టబయలు చేస్తానేమోనని ఈ ప్రబుద్దుడు భార్యని నాకు పరిచయం చెయ్యడానికి కూడా భయపడ్డాడు. నేను పోరితే తీసుకువచ్చాడు. రేపు నేను మళ్ళీ వెళ్ళిపోవాలి. పదండి, మాట్నీషోకి వెళదాం. ఇంకా గంట టైముంది. అమ్మా, మీరు తయారుగానే ఉన్నారు కదూ! పదరా, మాధవా, నువ్వు బట్టలు వేసుకురా తొందరగా" అంటూ మాధవరావుని తొందరచేశాడు మూర్తి.
పద్మకి అయోమయంగా ఉంది. గుండెల్లో ఏదో భయం. భర్తతో కలిసి ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు తను.
"ఇప్పుడు సినిమాలు ఎందుకురా? మంచి సినిమాలు ఏవీ లేవు" అన్నాడు కదలకుండా మాధవరావు.
"సినిమా చూడటం కాదురా ముఖ్యం. పాత స్నేహితుడితో కాసేపు సరదాగా గడపటం కావాలి. నువ్వు ముందర లేస్తావా, లేదా! లేకపోతే మీ ఆవిడ దగ్గిర నీకు పరాభవం జరుగుతుంది" అంటూ మూర్తి మాధవరావు మెడపట్టి గెంటాడు. చేసేది లేక మాధవరావు బట్టలు తీసుకుని వేరే గదిలోకి వెళ్ళాడు.
అతను అలా వెళ్ళగానే మూర్తి అన్నాడు: "వీడెప్పుడూ యింతేనమ్మా. బయటికి కదలమంటే పెద్ద గొడవ చేస్తాడు. నిన్ను ఎప్పుడేనా సినిమాలకీ, బీచికీ తీసుకువెళతాడా?"
పద్మ సమాధానంగా చిన్న నవ్వు నవ్వింది. అతను నువ్వూ, మీరూ అని కలగాపులగంగా సంబోధిస్తూ చనువుగా మాట్లాడుతూ ఉంటే, ఎవరో అన్నయ్యతో మాట్లాడుతున్నట్టు ఉంది.
