మీర శామువేపు చూసింది పూర్తి రుచి చూసే లోపుగానే మామిడిపండును కింద పడవేసుకొన్న కుర్రాడి మొహంలావుంది. శాము ముఖ భావం. మీర అది గమనించి కొంటెగా నవ్వుతూ.
"మనం కూడా వెడదాం. పద్ధక్క ఉదయమే రైలుకు వెళ్ళిపోతారు. మనం వెళ్ళకపోతే బావుండదు." అంది.
"నేను రాను. కావాలంటే నువ్వు వెళ్ళు"
"తప్పకుండా వెడతాను" అంటూ వెళ్ళి పోయింది మీర.
ఇక మైసూరిలో ఉండలేకపోయాడు శాము. పల్లెటూరి పిలుపు బలమయింది. అందరూ సినిమాకు వెళ్ళిపోయాక, కృష్ణయ్యగారి దగ్గరికి వెళ్ళి,
"రేపు వెడుతున్నాను మావయ్యా" అన్నాడు.
"అప్పుడే తొందరేమిటయ్యా వెడుదువు గానిలే"
"వీల్లేదు మావయ్యా చాలా పనులున్నాయ్. ఇప్పటికే ఆలస్యమయింది. ఫలానా రైలుకు వస్తున్నానని ఉత్తరం కూడా రాసేశాను."
"సరయితే అలాగే వెళ్ళు. కొద్ది రోజులాగి మీరను తీసుకొస్తాను."
శాము సంకోచంతో "మీర కూడా నాతోనే వస్తుంది" అన్నాడు.
కొత్తగా పెళ్ళయిన దంపతుల మనోభావాలను అర్ధం చేసుకున్న కృష్ణయ్యగారు మనసులోనే నవ్వుకుంటూ, వారి ప్రయాణానికి అనుమతించారు.
ఉధయపు రైలుకే ప్రయాణం నిశ్చయమయింది. ఇంత త్వరగా ప్రతి గృహానికి వెళ్ళాలన్న కోరిక లేకపోయినా, ప్రతిఘటించలేక తన సామాన్లను సద్దుకుంది మీర. కమలమ్మగారు బుట్టనిండా ఫలహారాలు నింపి ఇచ్చారు. మీర వెళ్ళేముందు పెద్దమ్మకూ, పెదనాన్నకూ నమస్కరించింది. తల్లి తండ్రిలేని అనాధ మీరను అత్తవారింటికి పంపేటపుడు, కృష్ణయ్యగారి కళ్ళు చెమర్చాయి.
"మీరను బాగా చూసుకో శామూ" అన్నారు రుద్ధకంఠంతో.
మీర వెళ్ళిపోతుందన్న ఊహనే భరించలేని శ్రీపాదు తన దుఃఖాన్ని ఆపుకోలేక లోపలెక్కడో దాక్కున్నాడు.
శాము సెకెండ్ క్లాసు కంపార్ట్మెంటులో తమ సామాన్లను సర్దాడు. మీర,
"ఏవైనా పుస్తకాలు తీసుకుంటే బాగుండేది. ప్రయాణమంటే విసుగు నాకు" అంది.
"ఏం? నే నున్నానుగా" అంటూ పుస్తకాల కోసం దిగాడు శాము. మీర కూడ అతనివెంట నడిచింది.
శాము ఆ నెలవి "కధెగార", "కధావళి" తీసుకుని పర్సుతీశాడు.
మీర "పెర్ల్ బక్ పుస్తకాలున్నాయా?" అంది.
"పెవిలియన్ ఆఫ్ ఉమన్', 'ది ప్రామిస్', "డ్రాగన్ సీడ్", "ది మదర్" అంటూ నాలుగు పుస్తకాలు తీసి మీర కిచ్చాడు. మీర పేజీలు తిప్పుతు శాము వేపు చూసింది. అతను ఆ పుస్తకాలనే చూస్తున్నాడు.
మీర మెల్లిగా "ఈ పుస్తకాలు తీసుకోనా?" అంది. తనకు కావలసిన ఓ పుస్తకంకోసం భర్తని డబ్బడగాల్సిన సన్నివేశం మీరకు అవమానకరంగా తోచింది. శాము ఎక్కడ వద్దంటాడో ఎక్కడ కొట్టువాడిముందు అవమానపడాల్సివస్తుందోనని అనిపించినా, చదవాలన్న బలవత్తరమయిన కాంక్షను అణచుకోలేక ధైర్యంచేసి అడగింది. శాము,
"ఓ, దానికేం తీసుకో" అన్నాడు.
మీర హాయిగా నిట్టూర్చింది. పుస్తకాలతోవచ్చి పెట్టెలో కూర్చుంది. శాము కాస్సేపు బయటనే తిరుగుతూ ఉండి తరువాత పెట్టెలో ఎక్కి తలుపు వేశాడు.
"హమ్మయ్య, మన మిద్ధరమే ఉన్నాం. ఇంకెవరూ రాకపోతే బాగుండును" అంటూండగానే తలుపు తెరుచుకుని, యూనివర్శిటీ ప్రొఫెసర్ ఒకాయన హిందూపత్రిక చేతిలో పట్టుకొని లోపలికి ప్రవేశించాడు. శాము మొహం వెల వెల బోయింది. మీర చిన్నగా నవ్వి మొహం అటు తిప్పుకుంది.
హీరోడే స్టేషన్ వస్తూండగానే శాము లేచి తలుపు దగ్గర నుంచుని బయటికి చూడసాగాడు. బండివాడు వచ్చాడా అని చూస్తున్నాడు. వీరి కోసమే చూస్తున్న నింగడు యజమాని కనిపించగానే మొహం చాటంత చేసుకొని, "దండంఅయ్యా" అన్నాడు. మీరనుచూసి, "దండాలు అమ్మగారు" అన్నాడు.
మీర ఏమనాలో తోచక వూరకే నుంచుంది. ఎండకు ఎండి నల్లబడిన చర్మం, అర్ధ నగ్నంగా నున్న దేహం, ఆ మురికి బట్టలు ఇవన్నీ చూసి జాలివేసిందామెకు. చీపురుపుల్ల లాంటి చేతులు కాళ్ళు, నూనె మొహ మెరుగక జడలు కట్టిన వెంట్రుకలు, పసుపురంగు కళ్ళు, బానలాంటి కడుపు, ఎలాటివారిలోనైనా జాలి పుట్టించేటట్టున్నాయి.
నింగడు లోపలికొచ్చి సామానులంతా బయటికి చేరవేశాడు. కూలివాడిని పిల్చి, ఇద్దరూ కలసి సామానులంతా బయటికి చేరవేశాడు. కూలివాడిని పిల్చి, ఇద్దరూ కలసి సామానులంతా బండిలో సర్దారు.
శాము తన ప్రియమయిన గిత్తలను చూసి సంబరంతో ఎన్నో రోజుల తరువాత చూచిన స్నేహితుడిని పలుకరించినట్టుగా,
"ఏవిట్రా రాముడూ ఎలా ఉన్నావ్, నిమ్గాలక్ష్మణుడింకా అల్లరి చేస్తున్నాడా?" అనడిగాడు. నింగడు అక్కరతో గిత్త మెడ నిమురుతూ,
"పులిలాంటి గిత్తను, గొర్రెలా మచ్చిక చేశావయ్యా" అన్నాడు. గిత్త తన యజమానిని గుర్తించినట్టుగా మొహాన్నిశాము దగ్గరగా పెట్టింది. చేతులు కట్టుకుని దూరంగా నిలబడి చూస్తున్నమీర బెదిరిపోయి,
"అయ్యో! ఇటురండి. పొడుస్తుంది" అంది.
శాము దాని మొహం, గంగడోళ్ళను చేత్తో నిమురుతూ.
"ఇంటి బిడ్డలా పెంచాము. మీరా దీన్ని నన్ను ఎప్పటికి పాడవదు. నిమరాలన్న కోరికతో ముందు కొస్తుందంతే"
"పశువుల మనసు, దాయాదుల మనసు కనుక్కోలేరంటారు. మీతో చెప్పుకుందేమిటి అలా అని?"
"నోటితో చెపితేగాని అర్ధంకాదా?"
"మీ భాష నా కర్ధంకాదు, బాబూ ఎంతైనా మీరూ మీరు ఒకటి"
"ఆ మాట నిజమే. మా భాష నీ కర్ధంకాదు."
శాము గిత్తలను ఆప్యాయంగా నిమురుతూ, వాటినే పరీక్షగా చూడసాగాడు. గిత్తలు ఎంతో ముద్దొస్తున్నాయి. తెల్లగా, నిండుగా మెరుస్తూ దేవలోకపు గిత్తల్లా ఉన్నాయి.
"రోజూ కడుగుతున్నావట్రా, గిత్తల్ని?"
"చిత్తం బాబయ్యా" నామకం కన్పిచ్చేలా కడుగుతున్నానండయ్యగోరు."
గిత్తల క్షేమ సమాచారా లడగడంలో నిమగ్నమయిన శామును హెచ్చరించింది, మీర.
"ఊ ఇక మనూరి 'కారు' ఆరోహించండి దేవిగారూ"
మీర బండి దగ్గరగా వచ్చి నుంచుని శాము వేపు చూస్తూ, "ఎలా ఎక్కను?" అంది.
"ముందో కాలు పెట్టు. తరువాత ఇంకో కాలు పెట్టి ఎక్కేసేయ్."
అలాగే ఎక్కబోయి ముగ్గురించింది మీర. శాము జబ్బ పట్టుకుని, పడకుండా ఆపాడు.
"పోనివ్వు. నే నెక్కించేస్తాను, ఒక్కేసారి"
మీరకు తను చదివిన ఇంగ్లీషు నవలలు, చూసిన ఇంగ్లీషు చిత్రాలు గుర్తుకొచ్చాయి.
"ఊరుకోండి బాబూ, మీకు పుణ్యముంటుంది. మీతో బయటికి రావడానికి భయమేస్తుంది నాకు. మీరు దూరంగా నుంచోండి. నే నెలాగో ఎక్కుతాను."
శాము దూరంగా నుంచున్నాడు. మీర రెండు సార్లు ప్రయత్నించి, ఆఖరికి ఎలాగో ఎక్కగలిగింది. మీర లోపల కూర్చున్నాక, శాము,
"నేను రావచ్చునా, ఇక" అన్నాడు.
"ఆ!"
శాము ఒక్క గంతువేసి బండిలోకి ఉరికాడు.
"ఇక పోనివ్వవోయ్. కాస్త నెమ్మదిగా తోలు మరి. మీ అమ్మగారికివన్నీ కొత్త భయపడు తారు."
"నాకేం భయంలేదు."
నింగడు చాటీతో గిత్తల్ని స్ప్రుశించగానే అవి పరుగు లంకించుకున్నాయి. మెడలో కట్టిన మువ్వలు మధురంగా గలగలమనసాగాయి. గడ్డి పరచిన బండిలో హాయిగా కూర్చోలేక అవస్థ పడుతున్న మీరనుచూసి, శాము.
"నింగా, బండిలోకి రెండు తలగడలు వేసుక రాలేకపోయావా?" అన్నాడు,
"ఎందుకండయ్యగోరూ. గడ్డి మోపుగా ఏసి నక్కలా తయారు జేసానుగదా"
"పక్కట! ముళ్ళకంపలా ఉంటేనూ" అని గొణుక్కుంది మీర.
"అయితే నేను చెప్పిన చోటులో కూర్చుంటావా మరి. గుచ్చుకోదు" అన్నాడు కొంటెగా శాము.
మీర కోపంగా అతనివేపు చూసింది.
శాము నింగనివేపు చూసి,
"వర్షం పడినట్టుంది కదరా" అన్నాడు,
"చిత్తం నిన్న భారీగా వర్షం పడిందయ్యా. మనం నాటిన కొబ్బరి చెట్లంతా బలేగా వస్తాయి. కానీ ఇంకా వర్షం పడాలండయ్యా."
"ఇంకా ఎంతదూరం బాబూ వూరు?" విసుగుతో అడిగింది మీర.
"ఇంకా రెండు మైళ్ళు పోవాలి"
వెనుకటిరోజు బాగా వర్షం పడినందువలన ప్రకృతి నిర్మలంగా ఉంది. రెండు వేపులా పచ్చటి వరిచేల మధ్య బండి నెమ్మదిగా సాగుతూంది. నింగడు ఉత్సాహంగా పల్లెపదాలు పాడుకుంటూ బండి తోలుతున్నాడు.
