Previous Page Next Page 
అన్వేషి పేజి 17

 

    "నేను చేసుకోను, నాన్నా."
    "ఎందుకని, గిరీ?"
    "అప్పుడే వద్దు!"
    "నేను పోయాక ఆలోచిస్తావా? ఇది నీకు కలిగిన ఆలోచనేనా?"
    "చెళ్ళున ఎక్కడో గురి చూసి కొట్టినట్లయింది. "నాన్నా!" అని మాత్రం అనగలిగాను. ఇంకేమీ అనలేక లోపలికి వెళ్ళిపోయాను.
    "గిరి!' పిన్ని బియ్యంలో రాళ్లేరుతుంది.
    "ఏం పిన్నీ?"
    "నాకీ గుప్పెడు మెతుకులూ, ఒంటికి బట్టా దొరకాలంటే నీవు పెళ్ళి చేసుకోవాలి. నేను పుట్టింటికి పొతే, ఆరెండింటికి కూడా ముఖం వాయాల్సి వస్తుంది."
    "చేసుకుంటాను, పిన్నీ! తప్పకుండా చేసుకుంటాను."
    పిన్ని జాలిగా నవ్వింది. ఇరవై ఏళ్ళ పిన్ని అరవై ఏళ్ళ నవ్వు నవ్వింది. అంతకన్నా మా మధ్య జరిగిందేమీ లేదు. అయినా నాన్న లోపలికి వచ్చి కేకలు వేశారు.
    "ఏం జరిగిందని అంత రభస చేస్తారు మీరు? నేనైనా పెళ్ళి చేసుకోమన్నాను కాని, మరేమీ అనలేదే!" అంటూ.
    "ఎవరు మాత్ర మేమన్నారని? అసలేమీ ఆరోగ్యం సరి అయినది కాదు. ఉద్రేక పడకండి! లేనిపోని అనుమానాలతో మనసు పాడు చేసుకోకండి! ఒకరి కర్మ కొకరు కర్తలు కారు" అంది పిన్ని గంబీరంగా.
    "ఊహు! అది కాదు. నువ్వైనా వాడికి కాస్త నచ్చ చెప్పు! పెళ్ళి వద్దంటాడేమిటి? ఏ వయసు కా ముచ్చట."
    "కాదా మరి? వయసు కేమొచ్చింది లెండి! పెళ్ళికి వయసంటూ ఉందా అసలు! అయినా చెప్పవలసిన మాటలు చెప్పాను. గిరి పెళ్ళి కొప్పుకున్నాడు."
    "ఎరా?' అన్నారు నాన్న. అవునన్నట్లు తల ఆడించాను.

 

                                                          26

 

    అ రాత్రి -- నాకు నిద్ర రావడం లేదు. లేచి లైటు వేశాను. సాయంత్రం లైబ్రరీ నుంచి తెచ్చిన నవల కోసం వెదికాను. కనిపించలేదు. పిన్ని చదువు తున్నట్లుంది. ఆ గదిలో లైటు వెలుగుతూనే ఉంది. పదకొండు గంట లవుతుందేమో?
    పిన్ని తలుపు తీసుకుని బయటికి వచ్చింది. తలుపు చప్పుడు వింటూనే చప్పున పడుకున్నాను. "నిద్ర పోయావా, బాబూ!" అంటూ పలకరించింది.
    "ఇంకా లేదు. ప్రయత్నిస్తున్నాను." తప్పుకోలేక లేచి కూర్చున్నాను.
    "లైటు వెలుగుతుంటే లేచే ఉన్నావనుకున్నాను. నాకూ నిద్ర రాలేదు. కాస్సేపు కబుర్లు చెప్పుకుందామని ఇలా వచ్చాను." అక్కడున్న కుర్చీ నా మంచం దగ్గరగా జరుపుకుని కూర్చుంది.
    నేను నాన్న గది వేపు చూశాను. ఆ తరవాత చూడలేక, వద్దనుకుంటూనే ఆమెవంక చూశాను. నిర్లక్ష్యంగా నవ్విందామే.
    "చెప్పు! ఏమన్నా సంగతులూ. విశేషాలు చెప్పు!"
    "అలా అంటే ఏదని, ఎక్కడని ఎత్తను? నీవు అడుగుతూ ఉండు, నేను చెబుతాను."
    "ఏ విషయాలో ఎందుకు, నాయనా! మనవి మనకు చాలకనా? మీ అమ్మగారు పోయేసరికి నీవు ఎన్నేళ్ళ వాడివి? నీ ఆలనా పాలనా ఎవరు చూశారు? ఎలా పెరిగావు?"
    "సుమారు తొమ్మిదో, పదో కాదులే! పదికి లోపే నెమో!లోకేశ్వరి ఎక్కువగా వస్తూ, పోతూ ఉండేది. అమ్మ అంటే ఊళ్ళో అందరికీ అభిమానంలే! దానివల్ల వారికొకరు తలంటి పోసేవారు నాకు. అడపా తడపా ఎవరే పిండి వంటలు చేసినా నన్ను పిలిచి పెట్టేవారు. నా ఈడు పిల్లలతో ఆడుకునే వాడిని. ఇంట్లో వంట మనిషి ఉన్నది కదా? ఆమె కూడా నన్ను ప్రేమగానే చూసేది. ఉన్నట్టుండి లోకేశ్వరి పిన్ని రావడం మానుకుంది." అంటూ నాన్న గది వంక చూశాను.
    ఆమె పెదవి బిగబట్టి నవ్వు ఆపుకుంటూ , "కానీ-- చెప్పు!" అన్నది.
    "ఇంక చెప్పటాని కేముంది? అలా అయిదారేళ్ళు గడిచాయి. నా స్కూలు చదువు అయిపొయింది. కాలేజీకి వెళ్ళిపోయాను. ఇంక ఇక్కడి విషయాలేవీ నాకంతగా తెలియదనే చెప్పాలి."
    "అప్పుడే అయిపోయిందా?"
    నేను నవ్వి, "ఇంక నీ విషయాలు చెప్పు! మీ అమ్మా, నాన్నా ఉన్నారా?' అన్నాను.
    "ఉన్నారు! మీ నాన్నకు , మా నాన్నకూ వయసులో పెద్ద తేడా ఉండదనుకుంటాను. మీ అమ్మగారి ఫోటో చూసినప్పుడు అందులో మా అమ్మే కనిపించింది నాకు."
    గదిలో నుంచి నన్నగారి దగ్గు వినిపించింది. అది వెంటనే తగ్గలేదు.
    "ఇదుగో ఎక్కడున్నావు? కాసిని మంచినీళ్ళుచ్చి వెళ్ళు!" అంటూ పిన్నిని పిలిచారు.
    ఆమె వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి, "నిద్ర రాకపోతే గిరితో పిచ్చాపాటీ మాట్లాడుతున్నాను." అన్నది. ఆ మాట అంటూనే తిరిగి వచ్చింది.
    కూర్చుంటూనే ప్రారంభించింది. "ఇద్దరన్నలున్నారనుకో! ఎవరి దారి వారిది. ఎవరి బ్రతుకు వారిది. నాన్న పెన్షను మీద, కొద్దిగా వచ్చే ఇంటి అద్దె మీద రోజులు గడుపుతున్నారు అమ్మా, నాన్నా. వాళ్ళిద్దరిని చేరోకరి దగ్గరా ఉంచుకుని ఆ పెన్షన్ , అద్దె డబ్బూ కూడా చేరోకరు తీసుకుందామనుకున్నారు అన్నయ్యలు. కాని నేను సమస్య అయ్యాను. నేనోకదారి అయిందాకా ఆగడం మంచిదని పించినట్లుంది వాళ్ళకు. "సరే! మీ నాన్నగారి దయ వల్ల నేనొక ఇల్లాలి నై వారికీ భారం తగ్గించాను. కట్నం లేకపోయినా అంతో ఇంతో అప్పు చేయక తప్పలేదు. నాన్న పొదుపుగా  గడుపుతూ అది తీరుస్తున్నారు. బహుశా అది తీరాక అమ్మా, నాన్నా చెరొక కొడుకు దగ్గరా ఉంటారేమో?"
    నేనొక నిట్టుర్పు వదిలాను.
    "జీవితంలో అదృష్టానికి ఐశ్వర్యానికీ సంబంధం లేదు, గిరీ! దేని దారి దానిదే!ఏమంటావు?"
    "ఏమనను, పిన్నీ-- నాకున్న అనుభవ మెంత?"
    "ఉన్నది చాలదూ? కావలసిన వయసులో కన్నతల్లి  కరువయింది. అవసరం తీరిన వయసులో  నీ కన్నా చిన్న పిన్ని దొరికింది. అంతేకాదు , భవిష్యత్కాలంలో నా బరువు బాధ్యతలన్నీ చూడవలసిన వాడు నా కన్నా పెద్ద కొడుకు. తలుచుకొంటేనే వింతగా ఉంది."
    "ఎప్పటి సంగతులో ఇప్పుడెందుకు?"
    "గతాన్ని తవ్వి తల పోసుకున్న దానికన్నా భవిష్యత్తును గురించి ఆలోచించటం మంచిది కదూ?"
    నాన్న పిలిచారు పిన్నిని. "గుండెల్లో నొప్పిగా ఉంది. కాస్త అమృతాంజనం మర్దించు" అన్నారు.
    "బనియను విప్పండి!"
    "ఊ! అబ్బ!" అంటూ నాన్న మూలుగులు, పిన్ని చేతుల గాజుల చప్పుడు.
    "పన్నెండయిందిప్పుడు" అన్నారు నాన్న.
    "అయితే?"
    "ఇంక వాడిని పడుకోనీ, నిద్ర తక్కువైతే ఆరోగ్యం చెడుతుంది."
    "నాక్కాదు ఈమాట చెప్పవలసింది! రాబోయే కోడలికి. అప్పుడు గుమ్మంలో కుర్చీ వేసుకు కూర్చుంటారో , వాళ్ళ గదిలోనే మంచం వేయించుకుంటారో మరి!" పిన్ని కసిగా అన్నది.
    "పిచ్చిగా మాట్లాడకు! జగ్రత్త! నేనొక్కడినే కాదు లోకం కూడా ఉంది."
    "ఉంటె ఏం? ఇప్పుడేమైందని?" రెట్టించింది పిన్ని.
    "ఏదో అయ్యాక చేసేదేమీ లేదు. కాకమునుపే ఏ జాగ్రత్త అయినా--"
    "ఎంత సంకుచిత మనస్తత్వాలు! ఛీ! ఇంతకన్నా చావు నయం."
    "అరుంధతీ!" నాన్న అరిచారు. ఆగ్రహం, అజ్ఞా, మందలింపు అన్నీ ప్రతిధ్వనించా యందులో. ఉద్వేగాన్ని అణుచుకోలేక ఆమె వెక్కి ఏడవటం వినిపించింది.
    నాకా రాత్రే పారిపోవాలని పించింది ఎక్కడికి? ఎక్కడి కైనా సరే! ఏ ఉద్యోగమూ లేకపోయినా సరే! అనక అడుక్కుతిన్నా సరే! కాని, నేను వెళ్ళిపోలేదు. అప్పుడే పొతే ఎంతో బాగుండేది. ఆ తరువాత కధకు పాత్ర ఎలా? ఏ బలవత్తర శక్తో నన్ను కట్టి పడేసింది.
    మరురోజు ఉదయం పిన్ని ఏమీ జరగనట్లే ప్రవర్తించింది. నన్ను శ్రద్దగా కనుక్కుంటుంది. కాని, నాన్న చూపులో నా పట్ల ఏదో మార్పు, ఇది అని చెప్పలేనిది.

 

                                       27


    రోజు తరవాత రోజుగా కాలం దొర్లి పోతున్నది.
    నాన్న నా పెళ్ళి ప్రయత్నాలలో చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. వారానికి ఒకటి రెండు పెళ్ళి చూపులకు వెళ్ళి వస్తున్నాము.
    చివరికి ఒక సంబంధం నాన్నకు నచ్చింది. నేను ఆయన ఇష్టానికే వదిలేశాను.
    పెళ్ళి జరిగింది. అనుభూతి రహితంగా, యాంత్రికంగా నేను కుసుమ మేడలో మూడు ముళ్ళూ వేశాను. అది నాన్న మీద కోపమా? నా జీవితం పట్లా, పరిస్థితుల పట్లా కలిగిన నిర్లిప్తతా? పిన్ని మీద సానుభూతా? అర్ధం కాని అయోమయ స్థితి.
    పెళ్ళి జరిగిందని తట్టి చెబుతున్నట్లు మీద అక్షింతల వర్షం కురిసింది.
    కుసుమ నా జీవితంలో ప్రవేశించింది. ఇక్కడ ఆమెను గురించి కొంత చెప్పాలి. ఆమె నలుపు. వికారంగా ఉండదనే కాని, అందగత్తెల జాబితాలోకి మాత్రం చేరదు. స్వభావం కూడా అనడరితో కలుపుగోలుగా ఉండేది కాదు. డేగకళ్ళు! తనకు సంబంధించినంత వరకూ ఆ కళ్ళతో కాపలా కాసుకుంటుందా అనిపిస్తుంది.
    ఇంతందుకు? పిన్నినీ, ఆమెనూ వరసగా నిలబెడితే పిన్ని ఆధిక్యం అన్ని విధాల వెయ్యింత లవుతుంది.
    పెళ్ళి కాగానే కుసుమ మా ఇంటికి వచ్చేసింది.
    ఆమె కొత్తది కనక మాకు కావలసినవన్నీ పిన్ని చూస్తుంది. కుసుమకూ, పిన్నీకి మూడు నాలుగేళ్ళ వయసుకన్నా ఎక్కువ తేడా ఉండదు.
    కుసుమ ఆ రాత్రి అడిగింది.
    "మీకు ఉద్యోగం ఎప్పుడవుతుంది?"
    "చెప్పలేను."
    "అంతవరకూ మన మిక్కడే ఉండాలా?"
    "అంతేగా మరి?"
    "మీరు ఆమెతో మరీ అంత ఇదిగా ఉండద్దు!"
    ఆమె ఎవరో నేను కుసుమను అడగక్కర్లేదు . "ఎలా ఉండాలో నాకు తెలుసు!"
    "తెలవబట్టేనా అంత రాసుకు తిరుగుతున్నారు? పెళ్ళిలోనే మా వాళ్ళు ఎంత చెవులు కోరుక్కున్నారో తెలుసా?"
    "వాళ్ళకు ఆ సంబంధమైన జబ్బేదో ఉండి ఉంటుంది."
    "చాల్లెండి ఉలుకు! తను అందంగా, చలాకీ గా ఉంటానని ఆమె కెంత గర్వమో, ఎంత ఆహాన్కారమో!"
    "పిన్నికా!" ఆశ్చర్యంగా అన్నాను.
    "అవును, ఆమెకే! ఏం? మీకు కోపం వస్తుందని నాకేం భయం లేదు, తెలుసా?"
    "భయపడమని ఎవరూ అనలేదు గాని ఇంత ఆసహ్యంగా మాట్లాడటం తగ్గించుకో. ఆరోగ్యానికి మంచిది."
    కుసుమ ఈసడింపుగా ఒకమారు నా వంక చూసి, "అవునులెండి! అనాకారి వాళ్ళు ఏది మాట్లాడినా అసహ్యంగానే ఉంటుంది. అందమైన మీ పిన్నిగారి లాంటి వాళ్ళైతే...."
    "ఛ! ఛ! ముందుగా మనసులో విషం నింపుకునే మరీ వచ్చావన్న మాట."'
    భార్యా భర్తల కొత్త రోజులు ఇలా ఉంటాయని నాకు తెలియదు.
    "నా ఖర్మ ! ఏం చేయను? మా వాళ్ళు ముందుగా అన్నీ విచారించవలసింది. తొందరపడి నా గొంతు కోశారు."
    "జాగ్రత్తగా మాట్లాడు, కుసుమా! ఇప్పుడు నీవు మాట్లాడేది నీవు జీవితాంతం కలిసి ఉండవలసిన భర్తతో." ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటూ కొంచెం బెదిరింపుగా అన్నాను.
    కళ్ళనిండా నీళ్ళతో ఆమె నా వంక చూసింది.
    "ఏం కొడతారా?"
    నాకేదో నరాల బలహీనత వచ్చినటైంది. విసుగ్గా, అలసటగా కళ్ళు మూసుకున్నాను. పెళ్లై పదహారు రోజుల పండుగ ఇంకా దాటలేదు.
    కుసుమ స్నానానికి వెళ్ళినప్పుడు పిన్ని నా దగ్గరికి వచ్చింది. "ఏమిటయ్యా! కొత్త కోడలేదో సాగదీస్తోంది? మా అయన లాగా నిన్నూ నీ పెళ్ళాం పుండులా సలుపుతోందా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS