"హు....మీరు చాలా ఉదారంగా ఆలోచిస్తున్నారు. ఈదేశంలో ఓసారి పెళ్ళయిన ఆడదాన్ని అందులో పిల్ల తల్లిని పెళ్ళాడడానికి వచ్చే మగవారు ఎవరండి బాబూ..." విరక్తిగా నవ్వి అంది.
"ఎందుకుండరండి - మనుషులలో మార్పు వస్తుంది. అందరూ మీరనుకున్నంత కుసంస్కారంగా ఆలోచించరు - మీరు రెండో పెళ్ళి అయినా మీ అందంచూసి, లేక మీ ఉద్యోగం చూసి ఆశపడి వచ్చే వాళ్ళుండరంటే నేను నమ్మను."
"సర్లెండి. యిప్పుడా మాటలు అప్రస్తుతం.... ఇప్పుడసలు నేనేమీ ఆలోచించే స్థితిలోలేను యింటికెళ్ళాలి. మా వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి. వాళ్ళు నేనిలా రావడంలో తప్పులేదని నమ్మాలి. నాకనీ దారిదొరికే వరకు ఆదుకోడానికి సిద్దపడాలి. నాకంటూ ఏదో ఉద్యోగం దొరికి పాపని పెట్టుకు వుండాలి. చాలా చాలా రోజులు పడ్తుంది. యివన్నీ జరగడానికి, లేక యిటు అటు అందరూ కలిసి నన్ను తిట్టి ఆయనని మందలించి కాపురానికి పంపిస్తారో, అందరి మాటలకి ఎదురు చెప్పలేక మళ్ళీ బలిపశువు మాదిరి యిక్కడికి వస్తావో.... రేపు అన్నది ఎలా వుంటుంది ఆలోచించలేకపోతున్నాను."
"ఆలోచించకండి- అనవసరంగా మీరెక్కువ ఆలోచిస్తున్నారు. కాలానికే వదిలేయండి."
4
"రాజేష్ గారూ... ఈ రోజు మీ సహాయం నేనెన్నడూ మరువను...."మీరుండబట్టి నేనిలా ధైర్యంగా నిలబడి రైలెక్కాను. "కంపార్ట్ మెంట్ లో కూర్చుని, రైలు కదలబోయే ముందు మరోసారి కృతజ్ఞతలు చెప్పింది అర్చన. నేను వెళ్ళాక మీ టిక్కెట్టు డబ్బు పంపిస్తాను"
"మీరు ఆ డబ్బు పంపిస్తే నేను చాలా ఫీలవుతానని మరోసారి చెప్తున్నాను. నన్ను మరీ అంత తక్కువ అంచనావేసి అవమానించకండి. మీరు వెళ్ళాక క్షేమంగా చేరినట్టు రాయండి నన్ను స్నేహితుడిగా భావిస్తే అక్కడ జరిగింది, మీ వాళ్ళ నిర్ణయం అది రాయండి. అఫ్ కోర్స్ నన్ను మిత్రుడిగా అంగీకరిస్తేనే అనుకోండి."
"తప్పకుండా రాస్తాను నామనసువిప్పి చెప్పుకున్నది మీ ఒక్కరి తోనే ఇప్పటి వరకు, వీలుచూసుకుని అన్ని విషయాలూ రాస్తాను. అదిగో విజిల్ వేశారు. రైలు కదులుతూంది. మరి మీరు వెళ్ళండి నాకోసం చాలా శ్రమపడ్డారు." అభిమానంగా చూస్తూ అంది.
రాజేష్ పాప బుగ్గలు నిమిరి "పూజా, టా....టా...అర్చనగారూ బై గుడ్ లక్ టూయూ" అంటుండగా రైలు కదిలింది అర్చన, పూజ చేయి ఊపారు.
ఆటోలో ఇంటికి తిరిగి వస్తూండగా గాని అరే, అర్చనని ఆమె అడ్రసు అడగలేదే ఎడ్రసు తీసుకోవలసింది. అన్నదీ తట్టి అయ్యో...మరిచేపోయాను ఆ మాట అనుకున్నాడు సరే, ఆమె ఉత్తరం రాస్తానంది గదా ఎడ్రసు రాయకుండా వుంటుందా అనుకుని సమాధానపడ్డాడు.
* * *
"రాజేష్ గారూ....." ఇరవై రోజుల తర్వాత అర్చననించి ఉత్తరం అందుకోగానే ఆరాటంగా చదివాడు......క్షేమంగా చేరాను. మీరు చేసిన సాయానికి ఉత్తరం ద్వారా ఇంకోసారి థాంక్స్ చెపుతున్నాను. టిక్కెట్టు డబ్బు పంపితే మిమ్మల్ని అవమాన పరిచినట్లవుతుందన్నారని భయపడి పంపడంలేదు.
"రాజేష్ గారూ గుమ్మంలో కాలుపెట్టినది మొదలు ఈ ఇరవైరోజులుగా ఇంట్లోవాళ్ళు నన్ను ఎదుర్కొంటూ, నమ్మించాలని, ఒప్పించాలని, ఇదంతా నాలుగు రోజులుంటాయి, తరువాత గొడవలు అవే సర్దుకుంటాయని నచ్చజెప్తూ, మందలిస్తూ, బతిమాలుతూ, కోపగిస్తూ నానా రకాల అస్త్రాలూ ప్రయోగించి నన్ను తిరిగి ఎలాగినా ఆయన దగ్గిరకి పంపాలని ప్రయత్నిస్తూనే వున్నారు. నా మొగుడిలాంటివాడు అని సిగ్గు విడిచిచెప్పుకున్నా "ప్రతి మగవాడిలో ఏదో బలహీనతలుంటూనే వుంటాయని" సమర్దిస్తారు. "నీవు కాస్త అణకువగా వుంటే అతనే నాల్గు రోజులు అని, దారికి వస్తాడు తరువాత" అని నచ్చచెపుతారు. "కాపురం వదులుకుంటే నష్టపోఏది నీవేగాని అతడుకాడు. మగాడు అతనికేం నీవుపోతే మరొకర్తిని చేసుకుంటాడు. రేపొద్దున ఈ పిల్లని పెట్టుకుని కష్టాలు పడాల్సింది నీవే అని భవిష్యత్తుని భూతద్దంలో చూపించి ఎన్ని రకాలుగా భయపెట్టాలో అన్ని రకాలుగా భయపెట్టారు, "నీవు అందగత్తెవి. నీ అందం తనకి దక్కకుండా ఇంకెవరి కన్నా దక్కుతుందేమోనని అతని భయం అర్ధం చేసుకుంటే అతని మన స్థితి నీకు అర్ధం అవుతుంది." మగవాడిగా నాన్న అల్లుడి మనస్తత్వాన్ని విపులీకరించి నమ్మించాలని ప్రయత్నించారు.
"కాపురం వదిలిన ఆడదాన్ని కన్నతల్లి అయినా ఆదరించదే, నా మాటవిను. తల్లిగా కాకున్నా ఆడదానిగా చెపుతున్నా నీకు, గౌరవం, మర్యాద పుట్టింటి ఆడపడుచుగా ఆదరణ భర్త దగ్గిరున్నప్పుడుగాని లభించదు." చదువుకున్న అమ్మ కూడా ఆడదాని బాధ అర్ధం చేసుకోకుండా కేవలం అమ్మలా భవిష్యత్తుని చూపించి భయపెట్టి వప్పించాలని ప్రయత్నించింది.
"మేం వెళ్ళి అతనితో మాట్లాడుతాం. ఇకముందు ఇలా జరగడానికి వీలులేదనిచెప్పి వప్పిస్తాం. నీకు తెలియదు చిన్నతనం ఆవేశంతో మాట్లాడుతున్నావు ఈ ఆవేశం తగ్గాక కావాలనుకున్నప్పుడు నీకు మళ్ళీ దొరకదు కాపురం ఎల్లకాలం మేం వుండం నిన్ను ఆదుకోడానికి, ఆదరించడానికి - బిడ్డని, అందులో ఆడపిల్లని వంటరిగా పెంచి పెద్దచేసి పెళ్ళి చెయ్యడం అంటే మాటలుకాదు. చదువుకున్నాను. ఉద్యోగం చేస్తానంటావు. ఎంత సంపాదించినా ఏం చేసినా ఈ సమాజంలో స్త్రీ వంటరిగా నెగ్గుకు రావడం కష్టమే తల్లీ నీ మేలుకోరేవారం మా మాట విను" అభిమానం, కోపం, నచ్చచెప్పలేని నిస్సహాయత, వప్పించలేని అసమర్ధత అన్నీ కలిసి అమ్మ నాన్నలని నామీద దండెత్తింపచేశాయి.
