వాళ్ళకోపం నా మంచికోరే అని నాకు తెలుసు. కాని ఆయన మారే మనిషి కాదని, కుక్క తోక వంకరపోదని, అందరూ మందలిస్తే నాల్గురోజులూరుకొని ఐదోరోజు మళ్ళీ మొదలుపెట్టె మనస్తత్వం ఆయనదని నాకు తెలిసినట్టు వాళ్ళకి ఎలా తెలుస్తుంది. ఏ వంకా దొరక్కపోతే కూర తగలెట్టావని, నీళ్ళు చల్లగా వున్నాయని, షర్టు బొత్తం కుట్టలేదని, పంట్లాం ఇస్త్రీ లేదని ఇంకేమీ లేకపోతే నవ్వానని, ఏడ్చానని ఇలా ప్రతి దానికి అనుక్షణం ఆయన కట్టుకున్న భార్యని మానసికంగా హింసించే శాడిస్ట్ అని ఎంతకని చెప్పి నమ్మించను. ఇవన్నీ అనుభవించిన వారికి అర్ధంకాని విషయాలు.....నాకిలాంటి సర్దుకుని బతికే కాపురం అక్కరలేదని నన్ను మనసా వాచా కోరి నన్ను అలరించి మురిపించే భర్త కావాలి కాని, కట్టుకున్నందుకు కలకాలం ఏడుస్తూ, రోజూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ సర్దుకు బతికే బతుకు వద్దని చెపితే ఎవరూ అర్ధం చేసుకోరే.
"పూజకోద్దీ పురుషుడన్నారు-నీవింతే చేశావు, ఇంతే దొరికింది, దొరకినదాన్ని కాదనుకుని పోతే ఇంకేదో దొరుకుతుందని ఆశ వుందానీకు. నిన్ను అలరించి మురిపించే భర్త మళ్ళీ వస్తాడా-అలాంటి పిచ్చిఆశలు వుంటే మానుకో. ఈ దేశంలో ఓ పెళ్ళయిన ఆడదాన్ని అందులో పిల్లతల్లిని చేసుకోడానికి ముందుకు వచ్చే మగాడున్నాడా. ఏదో నీ అందానికో, డబ్బుకో ఆశపడి చేసుకున్నా పిల్ల తల్లిని చేసుకున్నానని అనుక్షణం నిన్ను సాధించి, వేధించి నీ బతుకు మరోసారి నరకం చెయ్యడని ఏమన్నా వుందా" అంటూ నేను అనుకోని, ఆలోచించని విషయాలన్నీ వాళ్ళే ఆలోచించేసి నా భవిష్యత్తు ఇది అని రాసిచ్చేసినట్టే భయపెడుతూ...మా అత్తగారిని పిలిపించారు. మాటలు, సంప్రదింపులు, వాద ప్రతివాదాలు అన్నీ అయ్యాయి. వాళ్ళు మంచి వాళ్ళు, సంస్కారవంతులు. తమ కొడుకుదే తప్పని వప్పుకున్నారు. ఏదో మూడీగా వుంటాడు, రిజర్వ్ డ్ టైప్ అనుకున్నాం. కాని వాడి మనస్తత్వం మారకపోగా ఇంకా ఇలా తయారవుతాడని అనుకోలేదమ్మా అని వారే తప్పుచేసినట్టు నొచ్చుకున్నారు. కొడుకుని ఎన్నిసార్లు రమ్మని పిలిచినా, ఫోన్లుచేసినా రాకపోయేసరికి వాళ్ళే వెళ్ళి మాట్లాడారు. ఏం అడిగినా, ఎంత తిట్టినా తప్పు వప్పుకోని కొడుకుని వప్పించలేక, సంధి కుదర్చలేక వాడి ఖర్మ అంతే అని సరిపెట్టుకున్నారు ఆ తల్లిదండ్రులు.
నా ఖర్మానికి నన్ను వదిలేసి, ఏ రకంగానూ నన్ను వప్పించలేక అమ్మ నాన్న అలిగి నామీద సత్యాగ్రహం ప్రకటించి మాటలు మానారు. రాజేష్ గారూ, అందరూ ఈ విధంగా దండెత్తేటంత తప్పు, పాపం నేనేం చెయ్యలేదని వాళ్ళని ఎలా నమ్మించను. నేను వాళ్ళకి భారం కాను, ఓ ఏడాది పాటు నన్ను కాస్త ఆదుకుంటే ఏదో ఉద్యోగం చూసుకుని నా బతుకు నేను బతుకుతానన్నా వాళ్ళకి నేనేదో బరువయిన గుదిబండ అయినట్టు బాధపడుతున్న అమ్మ నాన్నలని నేనేం చెప్పి నమ్మించగలను. నా కోసం మీరేం ఖర్చుపెట్టినా ఉద్యోగంలో చేరాక తీరుస్తాను అని చెప్పినా, "కూతురికి అన్నం పెట్టలేకకాదే, నీవు సంపాదించి డబ్బుతెచ్చేటంత గొప్పదానివి అవుతావులే..నీ డబ్బు కోసమే ఏడుస్తున్నాం" అంటూ కటువుగా మాట్లాడే వాళ్ళని ఎం చెయ్యను. నన్నెవరో వచ్చి పెళ్ళాడేస్తారని, ఇంతకంటే మంచివాడు వచ్చి నన్ను ఆనంద డోలికల్లో తేలియాడిస్తాడని ఆశపడడం లేదని-నాకు ఇంకేం వున్నా లేకపోయినా కనీసం మనశ్శాంతి అయినా వుండాలని అన్నింటిని వదులుకుని వచ్చానని వాళ్ళకెందుకు తట్టలేదు. నా కనీస కోరిక అది, నాకు భర్త వద్దు-అని ఓ ఆడది అంటే ఎంత మనసు విరిగిపోయి అని వుంటుందన్నది తల్లి దండ్రులకైనా ఎందుకు తట్టదో నా కర్ధం కావడం లేదు. రాజేష్ గారూ.....ఏది, ఏమయినా నేను ఎవరి మాటా వినదలుచుకోలేదు. మంచో చెడో కష్టమో నిష్టూరమో రేపు ఏం జరగబోయినా నేను ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకుని ఆ సంగతి నా తల్లిదండ్రులతో చెప్పేశాను. ఇంక లాభం లేదని నా వాళ్ళు నా ఖర్మానికి నన్ను వదిలేశారు. నేను కాస్త పరిస్తితులు చల్లబడ్డాక ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభిస్తాను. అపుడే రెండు మూడింటికీ అప్లయ్ చేశాను. బి.ఇడీ చెయ్యమంటున్నారు మా లెక్చరర్ ఒకావిడ. ఎమ్మే.బి.ఇడి వుంటేగాని లెక్చరర్ ఉద్యోగం రాదు ఈ రోజుల్లో. "ఆ ఉద్యోగం నీకు సరిపోతుంది ఆఫీసుల్లో వాటికంటే" అన్నారు. సీటు దొరికితే చదువుతాను. లేకపోతే ఏదో ఉద్యోగం దొరికేవరకు ట్యూషన్స్ అయినా చెప్పాలని నిర్ణయించుకున్నాను.
ఇదీ జరిగిన సంగతి. ఈ ఇరవై రోజులుగా అందరినీ ఎదుర్కొని మానసికంగా, శారీరకంగా అలిసిపోయాను. నన్ను అర్ధం చేసుకున్న మీ రొకరైనా వున్నారని సంతోషం, నాకు ధైర్యం చెబుతూ నాలుగు మాటలు రాస్తే సంతోషిస్తాను. 'అర్చన'-ఉత్తరం చదివి నిట్టూర్చాడు రాజేష్.
"తప్పకుండా అర్చనా, తప్పకుండా ధైర్యం చెప్పడానికి నేనున్నాను ధైర్యం చెప్పడానికే కాదు చేయూతనివ్వడానికి కూడా సిద్దంగా వున్నాను అర్చనా" అనుకున్నాడు రాజేష్ పదే పదే. గత ఇరవైరోజులుగా అర్చన వెళ్ళిందగ్గిరనించి అతని మనసులో మెదలిన ఆలోచనలకి ఈ ఉత్తరం రూపు కల్పించింది. అర్చన కాపురం వదిలేస్తే...తను ఎందుకు అర్చనని పెళ్ళాడకూడదు? అర్చన అందం అతని కళ్ళముందు కనపడి నిద్రదూరం చేసినపుడు అతనికీ ఆలోచన వచ్చింది ఒక రాత్రి! నిజమే ఎందుకు పెళ్ళాడకూడదు? తప్పేమిటి? భర్తని వదిలేసిన స్త్రీని మళ్ళీ పెళ్ళాడకూడదని రూలు ఏమన్నా వుందా? ఆ పెళ్ళిలో ఆమెకి దొరకని ఆనందాన్ని, అనురాగాన్ని తనందిస్తాడు! ఇన్నాళ్ళు సుఖానికి నోచుకోని ఆమెకి సుఖం అందిస్తాడు. ఆమెని ఆరాధిస్తాడు. అలరిస్తాడు, మురిపిస్తాడు. భవిష్యత్తుతో అర్చన ఇంక దుఃఖపడే అవసరం రానంతగా ప్రేమిస్తాడు! తను చాలా దూరం ఆలోచించేస్తున్నాడు అపుడే. కళ్ళెంలేని గుర్రంలా పరుగెడ్తున్న అతని ఆలోచనలని బలవంతంగా ఆపుతున్నాడు ఏమో అర్చన ధైర్యం సన్నగిలి అందరూ బలవంతం చేస్తే మళ్ళీ కాపురానికి వస్తుందేమో-భర్త అంత తేలిగ్గా ఆమెని వదిలేస్తాడా? ఆమె తల్లిదండ్రులు అతని వాళ్ళు అందరూ అంత సులభంగా కాపురం వదులుకోడానికి అంగీకరిస్తారా ఆమె నిజంగా ఆ భర్తనించి విముక్తురాలయి వస్తే తను తప్పకుండా ఆమెకి పునర్జన్మ ఇస్తాడు. అర్చన అందం వ్యర్ధమై పోకూడదు.
