Previous Page Next Page 
అగ్ని పరీక్ష పేజి 17

   
    "సరే యిన్నాళ్ళు లేనిది, నిన్న కొత్తగా ఏం జరిగిందని ఆయన మిమ్మల్ని అంతలా అర్దరాత్రి యింట్లోంచి తరిమారు!"
    "నిన్న న్యూ యియర్ డే కదండి. మా కంపెనీ గెస్ట్ హౌస్ లో పెద్ద పార్టీ యిచ్చారు. దానికి వెళ్ళక తప్పలేదు. అసలు కాస్త పాప పెద్దదయిందగ్గరనించి మళ్ళీ రెండు మూడు సార్ల నుంచి చైర్మన్ స్వయంగా ఫోనుచేస్తే తప్పించుకోడానికి వీలులేక వెడుతున్నాను. పాప పెద్దదయింది. యింకేమీ ఎక్సూజెస్ లాభంలేదు, రావాల్సిందే తప్పకుండా అంటూ ఫోను చేస్తుంటే యీయనే రమ్మని తీసికెళ్ళారు. గత రెండుసార్లు ఎందుచేతో అట్టే మాటలనలేదు పార్టీనుంచి వచ్చాక, మొహం ముడుచుకున్నారు తప్ప. నిన్న న్యూయియర్ కదా అంతా 'గే' మూడ్ లో వున్నారు. అందరూ బాగా డ్రింకులు పట్టించారు. యీయన ఫుల్ గా గ్లాసు మీద గ్లాసు తాగారు రాత్రి పన్నెండు వరకు తాగుడు, గేమ్స్ ఆ తరువాత డిన్నరు, ఆ తరువాత డాన్సు.....ప్రతివాళ్ళూ చాలా జాలీ మూడ్ లో వున్నారు. నేనూ చాలా రోజుల తర్వాత మంచి పార్టీ ఏమో గేమ్స్ అన్నింట్లో సరదాగా పాల్గొన్నాను. ఆఖర్న జంటలందరూ డాన్స్ చేశారు.....మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ఒకరి తరువాత ఒకరు వచ్చి డాన్స్ కి చేయి అందించి ఆహ్వానిస్తే అలాంటి పార్టీలో తప్పదుకదా! మేనేజింగ్ డైరెక్టర్ నిజానికి చాలా మంచివాడు ఏభై దాటినవాడు-చాలా సరదాగా 'అర్చనాజీ' అంటూ మాట్లాడతాడు ఎప్పుడూ ఆ రోజు డోసు ఎక్కువైనట్లుంది......మాటిమాటికి వచ్చి నా భుజంచుట్టూ చేయివేయడం, డిన్నరు తింటూంటే యిది తిను, అది తిను అంటూ అన్నీ వడ్డించడం డాన్సు చేస్తున్నప్పుడు కాస్త మితిమీరడం... నాకు చాలా ఎంబ్రాసింగ్ గా అన్పించినా అలాంటి స్థితిలో ఏం అనాలో, ఏం చెయ్యాలో తోచక వీలయినంతవరకు మృదువుగా వదిలించుకు తప్పించుకున్నా ఆ రోజంతా నా వెంట పడ్డాడు అతను. ఈయన ఫుల్ డోస్ మీదున్నా అదంతా గమనిస్తూనే వున్నట్టున్నారు. పార్టీ అయి యింటికి వచ్చాక ఇంకా ఆయన నోటికి హద్దు లేకుండా పోయింది నిన్న-అనని మాట, అనకూడని మాట అని లేకుండా 'వాడితో కులుకు ఏమిటి, అందరిముందు వాడినలా కౌగలించుకుని డాన్స్ చేస్తావా, మొదట వాడు నీ రంకుమొగుడా' అనే వరకు వెళ్ళి నానా తిట్లు తిట్టారు. అవన్నీ విని భరించే శక్తి లేక నేను తిరగబడ్డాను-అసలు పాప పుట్టిందగ్గరనుంచి నేనూ ఆయనన్నదానికల్లా ధైర్యంగా ఎదిరించి జవాబునిస్తున్నాను, వూరుకుంటే మరీ రెచ్చిపోతారని.
    "పార్టీకి తీసుకెడ్తున్నది మీరు, రానంటే మీపై అధికార్లు బలవంతం చేస్తున్నారని వస్తున్నాను.....పార్టీకి తీసికెళ్ళి వాడలా వీడలా అంటే అది నా తప్పా, అంటూ నేను ఎగిరాను. "మీరొక్కమాట అంటే సహించను యిప్పుడే మీరిలా నన్ను హింసిస్తున్నారని మీచైర్మన్ కి చెప్పి మీ ఉద్యోగం ఊడబీకిస్తాను. వాళ్ళు మీ బాస్ లు, వాళ్ళని నిర్లక్ష్యంచేస్తే మీపట్ల వాళ్ళకి యింప్రషన్ పోతుందని మీ ఉద్యోగంకోసం వాళ్ళని, మిమ్మల్ని సహించాను యిన్నాళ్ళు - మీ ప్రవర్తన అంతా చెప్పితే మీ ఉద్యోగం ఊడడానికి అరక్షణం పట్టదు. నన్నిలా అడుగడుగునా హింసించడం ఆపకపోతే నేను చేసేది చేసి చూపిస్తాను." అని గట్టిగా అరిచాను. నా మాటలకి ఆయన మగ అహం దెబ్బతింది. అసలే కోపిష్టి దానికి తోడు తాగుడు ఎక్కువైంది. యింకేముంది కట్లు తెగిన కోతిలా గెంతి "నీకెంత పొగరు, ఆడముండవి నువ్వు నా ఉద్యోగం ఊడబీకిస్తావా? నీకెంత పొగరు, నీ అందం చూసుకుని కదూ యీ బుర్రతిరుగుడు, ఏసిడ్ పోసి నీ మొహం కాలుస్తాను...... ఫో ముండా, ఆ చైర్మన్ దగ్గరకి పోయి చెప్పు ఫో వాడి దగ్గరికే పో. వాడితోనేవుండు నీకు మొగుడెందుకు...." అంటూ నానా మాటలు అని చెయ్యిపట్టుకు లాక్కెళ్ళి గుమ్మంలోకి యీడ్చారు గొడవకి నిద్రలేచి ఏడుస్తున్న పాపని రెక్కపట్టుకు తీసుకొచ్చి నావళ్ళో విసిరేశారు "ఫో, చావు-ఎవడితో చస్తావో అంటూ తలుపు ఛటాలున మూసుకున్నారు. అర్దరాత్రి... యింతపనిచేసి యింట్లోంచి గెంటుతారనుకోలేదు......సరే, మిగతాదంతా మీకు తెలుసుగదా" అర్చన నిట్టూర్చి అంది.
    "బాగుంది.. హాయిగా పెద్ద ఉద్యోగం, చక్కని భార్య ఎంతో హాయిగా గడపాల్సిన జీవితాన్ని ఆయన యిలా కుక్కలు చింపిన విస్తరిలా చిందరవందర చేసుకున్నారు."
    "నా అదృష్టం యిలావుంది రాజేష్ గారూ, ఏదో బాగా చదువుకున్న వారు. పెద్ద ఉద్యోగి, మంచి కుటుంబం అనుకుంటాంగాని యిలాంటి ప్రవృత్తి ఆయనదని ఎవరు మాత్రం అనుకుంటారు. ఆయనకేం మగవాడు, నా బతుకు కుక్కలు చింపిన విస్తరిలా అయింది. ఎంత పురోగమించాం అనుకున్నా యీనాటికీ భర్తని, కాపురాన్ని వదిలిన స్త్రీకి సంఘంలో గౌరవం వుండదు - గౌరవం సంగతి అటుంచి ఎన్నో యిబ్బందులు యింకెన్నో సమస్యలని ఎదుర్కోవాలి - పట్టుమని పాతికేళ్ళులేని నాకు అపుడే జీవితంలో అన్ని అనుభవాలూ పూర్తి అయిపోయాయి-" అర్చన గొంతు పట్టుకుంది. కళ్ళలో తిరిగిన నీరు అతనికి చూపలేక మొహం పక్కకి తిప్పుకుంది. రాజేష్ కి కూడా నిజమే అనిపించింది అతని మనసు కూడా వికలమైంది. అయినా ఆమెకి ధైర్యం చెప్పాలని "బలేవారేమీరు. ఏదో జీవితం సమస్తం అయిపోయినట్లు అంత బాధపడ్తున్నారేమిటి. అపుడే మీముందు ఇంకా ఎంతో బతుకుంది - రోజులు మారాయి. ఓ స్త్రీ భర్తతో విడిపోయినంత మాత్రాన ఆమెకి అన్నీ సమస్యలే ఎదురౌతాయని అంత భయపడడానికి ఏముంది. చదువుకున్నారు. ఏదో ఉద్యోగం చేసుకుని మీ పాపని పెంచి పెద్దచేసుకోగలరు. -- ఏ సహృదయుడో కాస్త సంస్కారం ఉన్నవాడో తటస్థ పడి మిమ్మల్ని మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు - ఓదార్పుగా అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS