ఓ మంచి చెట్టు చూసి కారు ఆపించాడు అభినయ్. ఆ చెట్టుకు ఉన్న కాయలు చేతికి అందేలా వున్నాయి. గుత్తులు గుత్తులుగా ఉన్న వాటిని చూస్తే విరజకు చెప్పలేనంత ఆనందం కలిగింది.
తోటలోకి నడిచి వచ్చారు ఇద్దరూ. అప్పుడు గమనించాడు విరజను. ఆమె ఒంటిమీద ఉండాల్సిన చున్నీ లేదు.
కెవ్వున అరిచి అడిగాడు అభినయ్.
"ఏయ్... వీరూ.... నీ చున్నీ ఏమైంది?"
"చున్నీనా? పోయిందే.... గాయబ్..... యిట్స్ గాన్...." అంది తాపీగా.
"చున్నీ పోవడమేమిటి?" తలపట్టుకు అడిగాడు అభినయ్.
"బుర్రా కేవ్స్ లో నువ్వేమన్నావ్....చున్నీ చికాగ్గా వుందని నేనంటే.... తీసి విసిరేయ మన్లేదూ!"
"అంటే....!"
"నువ్వు చెప్పేక, నేను వినకుండా వుంటానా? వెంటనే విసిరి పారేసాను. వెధవ చున్నీ... దానికి బుద్దొచ్చేలా... ఇక నుంచీ బుర్రా కేవ్స్ విశేషాల్లో నా చున్నీ ఒక్కటవుతుంది" ఓరగా అభినయ్ రియాక్షన్స్ చూస్తూ అంది.
"ఛీ... ఛీ... అంటే... ఇంకా ఉక్కపోస్తోంది అంటే... అని కూడా తీసేయమంటే..." అనుమానంగా విరజ వంక చూస్తూ అడిగాడు.
"డౌటా?" అడిగి చూడరాదూ" అంది చుడీదార్ మీద చేయి వేస్తూ.
"అమ్మో! నీకు దండం పెడతా.... అంతపని చేయకు.... అయినా నీ సిన్సియారిటీ బుర్రా కేవ్స్ లో హేంగ్ చేయా" అంటూ మొత్తుకున్నాడు. అప్పటికే డ్రైవర్ ఆసక్తిగా తమ సంభాషణ వింటున్నాడని అర్ధమై... కామ్ అయిపోయేడు.
వీళ్ళు తోటవైపు రావడం చూసి తోటమాలి వచ్చాడు. "ఏం కావాలి సర్" అన్నాడు. అభినయ్ వాళ్ళు కారులో దిగడం అతను చూశాడు.
"తోట బావుందయ్యా! ఓ ఫోటో దిగుదామని అన్నాడు.
"అభీ! కిందికి వాలిన ఈ మామిడి కొమ్మని నేను పట్టుకుంటాను. కాయని కోస్తున్నట్టు. నువ్వు ఫోటో తియ్యి" అంది విరజ హుషారుగా.
అభినయ్ సరేనన్నాడు.
వీడియో కూడా తీశాడు అభినయ్ విరజ సరదా చూసి. గుత్తులుగా ఉన్న ఆ కాయల్ని సరదా తీరా కోసింది.
తోటమాలి చేతిలో ఓ వందనోటు పెట్టింది. అతని సంతోషానికి అంతులేదు.
"తమరికి ఎన్ని కావాలంటే అన్ని కోసుకోండి తల్లీ" అన్నాడు.
విరజ తోటంతా తిరిగింది. అభినయ్ పట్టుకోలేక పోతున్నాడు. అరగంట ఎంజాయ్ చేశాక "నడు ఇక వెళదాం" అన్నాడు.
విరజ ఆ తోటని వదిలి అతికష్టంమీద వచ్చింది. పట్నాలలో ఎప్పుడూ బిజీతో ఉండే విరజలాంటి వాళ్ళకు పల్లెలూ, అక్కడి పచ్చని చెట్లూ ఇలానే ముచ్చటనిస్తాయి.
"నేను మామిడికాయలు కోసేటప్పుడు బాగా తీసావా వీడియో..." అడిగింది అభినయ్ ని విరజ.
"బ్రహ్మాండంగా.... గ్రాఫిక్స్ లో తీసానులే..."
"వెళ్ళగానే కలిసి చూడాలి. ఎలా వచ్చిందో?" అంది విరజ సంతోషంగా.
"అలాగే చూద్దాం" అన్నాడు ఒప్పుకుంటున్నట్టుగా.
"ఇలాంటి తోటలు మనం వెళ్ళే దారిలో చాలా వున్నాయి అమ్మాయిగారూ." అన్నాడు డ్రైవర్.
"అవునా... అయినా ఇక వద్దులే తొందరగా వెళ్ళాలి" అంది ఓ మామిడికాయను కొరుకుతూ.
ఆమె పక్కనే ఉన్న బ్యాగ్ లో చెయ్యి పెట్టి 'చున్నీని చూసుకుంది ఓసారి మురిపెంగా..."
"థాంక్యూ... చున్నీ...." అనుకుంది. అభినయ్ ని ఉడికించడం అప్పుడప్పుడూ అలవాటే విరజకు. అదే సరదా ఆమెకు!
* * *
సన్నటి వానతుంపర పడుతూనే ఉంది. రోడ్డుకు ఇరువైపులా పచ్చటిపంట పొలాలు. రోడ్డుపై పెద్దగా జన సంచారం లేదు. స్పీడ్ పెంచాడు డ్రైవర్.
అక్కడక్కడా వర్షానికి భయపడి కాబోలు చెట్టుకింద వెహికల్స్ పార్క్ చేసి నిలబడ్డారు కొందరు.
"అభీ!" మెల్లిగా పిలిచింది విరజ.
ఆమె భుజం మీద తలపెట్టి కళ్ళు మూసుకున్న అభినయ్ విరజ పిలుపుతో కళ్ళు తెరిచి "ఏమిటన్నట్టు" చూసేడు.
"ఈ వర్షాన్ని చూస్తుంటే నీకేమనిపిస్తోంది?" అడిగింది అతని రియాక్షన్ గమనిస్తూ.
భయం భయంగా చూస్తూ.... "ఇక్కడ నీ తింగరబుచ్చి బుర్రకు వర్షంలో తడవాలనే కోరిక పుడుతుందేమోనని భయమేస్తోంది" చెప్పాడు సిన్సియర్ గా అభినయ్.
"ఎగ్జాక్ట్ లీ... నీ అంచనా... నీ భయం కరెక్టే..." అంది రెట్టించిన ఉత్సాహంతో.
"ఏంటీ కరెక్ట్. ఇప్పుడు వర్షంలో తడుస్తూ హోటల్ వరకూ వెళ్దామా? చస్తామే.... ఎంత లేదన్నా నలభై కిలోమీటర్లు వుంటుంది." గుండె చేత్తో పట్టుకొని బిక్కుబిక్కుమని విరజ వంక చూస్తూ అన్నాడు.
"మరదే నన్ను అండర్ ఎస్టిమేట్ చేయడమంటే.... ఎప్పుడూ రిటీన్ గా వర్షంలో నడుస్తూ వెళ్ళడమేనా?"
"హమ్మయ్యా....! అయితే ఇలా కారులో మనబదులు కారును వర్షంలో తడిపిస్తూ వెళ్దామేం" అన్నాడు బుజ్జగింపు ధోరణిలో.
"అబ్బా అది కాదు అభీ! నువ్వూ, నేనూ...."
"ఆఁ! నేనూ... నువ్వూ..."
"అదిగో కోపంగా చూస్తున్నావు"
"అబ్బ! చూడన్లే".
"నువ్వలా కోపంగా అడిగితే నేను ఏమీ చెప్పనంతే..." అంది బుంగమూతి పెట్టి.
"విరూ.... నువ్వు చెబుతావా? ప్యాంటు, షర్టూ విప్పి, స్ట్రీకింగ్ చేసి, 'అడల్ట్స్ ఓన్లీ' షో పెట్టనా?" ఒళ్ళుమండి అన్నాడు అభినయ్.
"హమ్మయ్యా.... కామెడీ చేసేసావా... ఇప్పుడు చెబుతాను. మరేం లేదు... నువ్వూ, నేనూ స్కూటర్ మీద ఈ వర్షంలో వెళ్ళాలి. నేను నీ నడుం చుట్టూ చేతులువేసి, నీ వీపుమీద తలపెట్టి హాయిగా అలా ఒదిగిపోతానన్నమాట. నువ్వేమో జాగ్రత్త విరూ' అంటూ స్కూటర్ డ్రైవ్ చేస్తుంటావు" చెప్పి రియాక్షన్ కోసం అభినయ్ మొహంలోకి చూసింది.
అభినయ్ దీనాతిదీనంగా మొహం పెట్టి, "అసలు నీకిలాంటి చిత్రవిచిత్రమైన, నీచనికృష్ణమైన, అష్ట దరిద్రపు పాప సంకలపు ఆలోచనలు ఎలా వస్తాయో...?" అన్నాడు.
"అదిగో... నన్ను తిడుతున్నావు" అంది విరజ.
"ఇవి తిట్లు కాదు. నోటికొచ్చిన విచిత్ర పదాలు... అయినా ఇప్పుడు మనకు స్కూటరెవడిస్తాడు?"
"స్కూటర్ ఎవరిస్తాడా? ఎవడో ఓ గన్నాయ్ గాడు ఇస్తాడు. ఇవ్వక ఛస్తాడా... ఇచ్చే ఛస్తాడు.... స్కూటర్ రెస్పాన్సబుల్టీ నాది... సరేనా..."
"సరే" అన్నాడు నీరసంగా.
"డ్రైవర్ కారాపు" అంది విరజ.
డ్రైవర్ కారు రోడ్డు వారగా ఆపాడు. విరజ, అభినయ్ దిగారు.
"విరజ.... చాదస్తం కాకుంటే... స్కూటర్ ఎలా సంపాదిస్తావ్?" అనుమానంగా అడిగాడు అభినయ్.
"సింపుల్ టెక్నిక్. రోడ్డుమీద వెళ్ళే స్కూటరిస్ట్ ని ఆపి, కాసేపు స్కూటర్ అరువివ్వమని అడుగుతాను".
"నువ్వా...నువ్వడిగితే బావోదు. బ్యాడ్ మీనింగ్ తీసుకుంటే కష్టం... అయినా నువ్వడిగితే ఎందుకు ఇస్తారు? నేను జెంటిల్మన్ గా అడుగుతాను" అంటూ రోడ్డుకు అడ్డంగా నిలబడ్డాడు.
అప్పుడే ఓ స్కూటర్ వస్తోంది.
అభినయ్ అపమన్నట్టు చేయి అడ్డం పెట్టాడు. ఆ స్కూటరిస్ట్ కు ఏదో అనుమానం. దారి దోపిడీ చేసే దొంగలు కాదు కదా... అనుకుంటూ ఆపినట్టే ఆపి, మరింత స్పీడుగా తీసుకెళ్ళాడు. రోడ్డు మధ్య ఉన్న గుంతలో నుంచి జంప్ చేసి ఫాస్ట్ గా వెళ్ళిపోయిందా స్కూటర్.
ఆ గుంతలో ఉన్న నీళ్ళు అభినయ్ ని మొత్తంగా తడిపేసాయ్... మొహాన్ని వికారంగా మార్చాడు. విరజ పకపకా నవ్వుతూ...
