Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 17


    "మిమ్మల్ని నేను అభినందించటంలేదు శివగారూ! ఇలాంటి యిండస్ట్రీలో మీలాంటి వ్యక్తులు వుంటారని తెలిసినందుకు ఆనందిస్తున్నాను."
    "ఇండస్ట్రీలో లోపం లేదు సుకృతీ! సమస్యంతా యిక్కడ పేరుకున్న హిపోక్రిట్స్ తోనే....."
    శివ వెళ్ళిపోయాడు.
    అతడన్న హిపోక్రిట్స్ కి ఉదాహరణలా ఫ్లోర్ లో ఓ చోట సుదర్శనరావు సినిమా జర్నలిస్టులతో మాట్లాడుతున్నాడు రమ్యశ్రీతోపాటు కూర్చుని.
    "అంటే ఇది టీనేజ్ లవ్ స్టోరీ అన్నమాట?" ఓ విలేఖరి అడిగితే వెంటనే జవాబు చెప్పాడు సుదర్శనరావు.
    "టీనేజ్ లౌ స్టోరీ మాత్రమే కాదు.....ఈ సినిమాలో స్త్రీలను గౌరవించని సంఘంపై సందేశాత్మకమైన పోరాటాన్ని సాగించబోతున్నాను."
    "అంటే?"
    "ఆడదంటే అనుభవించదగ్గ వస్తువని భావించే పురుషాహంకారాన్ని ప్రశ్నించే కథ యిది! స్త్రీలను పూజించే తోట దేవతలుంటారన్న సత్యమే నిజమైతే, ఆడదాన్ని భోగ్య వస్తువుగా భావించడం ఎంతవరకూ సమంజసమన్న యితివృత్తంతో తయారుచేశాం యీ కథని!"
    సుదర్శనరావు చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంటే చకచకా నోట్ చేసుకుంటున్నారు జర్నలిస్టులంతా. ఇప్పుడు ఆడది దేవతనే సుదర్శనరావు మూడేళ్ళ క్రితమే పెళ్ళాన్ని అవమానించి పిల్లలతో సహా ఇంటి నుంచి గెంటేశాడు. కారణం.....అతడి తిరుగుళ్ళను ఆమె ప్రశ్నిస్తూందన్న ఒకే ఒక్క అభియోగంతో.
    ఆ విషయం అక్కడున్న జర్నలిస్టులందరికీ తెలిసినా ప్రశ్నించరు. కారణం..... అతను పెద్ద డైరెక్టర్ కాబట్టి. ఇంతకు మించిన హిపోక్రసీ ఏం కావాలి?
    "సినిమా టైటిల్ నిర్ణయించావా?" ఓ వృద్ద విలేఖరి అడిగాడు.
    "పూట ప్రేమని నిర్ణయించాం....."
    విస్మయంగా చూశాడా విలేఖరి. "పూట ప్రేమ....అర్ధంకావటం లేదు."
    "ఈ రోజు ప్రేమంటే క్షణాలలో నిర్ణయించబడుతున్న ప్రక్రియ అయిపోయింది. తొలి చూపులోనే మాట్లాడేసుకోవడం, వెంటనే తోటలో పాడేసుకోవడం, ఆనక తొందరపడి కాలుజారడం.... ఆ తరువాత మోసపోవడం, ప్రస్తుత ప్రపంచంలోని వేగం ప్రేమలదాకా విస్తరించిందనే భావముతో యిలాంటి టైటిల్ పెట్టడం జరిగింది."
    "ఈ టీనేజ్ లవ్ స్టోరీలో కథానాయిక....."
    "ఇంకెవరు? రమ్యశ్రీ...."
    రమ్యశ్రీ చిరుగర్వంగా అందర్నీ చూసింది.
    ఇప్పటికి మూడుసార్లు అబార్షన్ చేయించుకున్న విషయం ఒక్కటే కాదు. ఆమె వయసు ముఫ్ఫయ్యోవడిలో పడుతూందన్న విషయం ప్రతివాడికీ తెలుసు.....అలాంటి ప్రౌడముగ్ధగా సినిమాలో నటించడం బాధనిపించిందేమో జోవియల్ గా అనేశాడా వృద్దుడు. "అప్పుడు ప్రేమకన్నా ప్రౌడ ప్రేమ టైటిల్ బాగుంటుంది."
    ఘోల్లున నవ్వేరంతా.
    సుదర్శనరావు ఇరుకునపడ్డా అందరితోబాటు రమ్యశ్రీ కూడా నవ్వడంతో తనూ శృతి కలిపేశాడు.
    అక్కడ ఆ వృద్ద విలేఖరి చేసుకున్న అదృష్టం రమ్యశ్రీకి ప్రౌఢ అనే పదానికి అర్ధం తెలియకపోవడం.
    "కథానాయికగా మీరేం చెబుతారో వినాలనుంది" అన్నాడు విలేఖరి రమ్యశ్రీని చూస్తూ.
    అంతసేపూ ఆ అవకాశం కోసమే చూస్తున్నట్టు ముందుకు జరిగింది రమ్యశ్రీ. "ఇంత గొప్ప ప్రేమ కథలో నటిస్తున్నందుకు ఆనందముగా వుంది. తప్పకుండా సూపర్ హిట్టవుతుందన్న నమ్మకం నాకుంది."
    "మీరేం అనుకోకపోతే చిన్న ప్రశ్న."
    "దానిదేముంది. అడగండి" అంది రాగాలుపోతూ.
    "మీరు జీవితంలో ఎవర్నయినా ప్రేమించారా?"
    మురిపెంగా నవ్వింది. అర్ధనిమీలిత నేత్రాలతో ట్రాన్స్ లోకి వెళ్ళి పోతున్నట్టు అభినయించింది. "ఎప్పుడో సినిమారంగానికి రాకముందు మా ఎస్టేటులోని బంగళాలో కూర్చుని కన్నెగా చాలా కలలు కన్నమాట నిజం."
    "ఇప్పుడు మీరు కన్నె కాదని తెలియచేస్తున్నారా" అనలేదా విలేఖరి. ఆదిలో తన పేరు 'అప్పలకొండ'ని తెలిసిన విలేఖర్ల ముందు కూర్చుని వాళ్ళమ్మ పేడతో పిడకలు చేస్తూ తనను పెంచి పెద్దచేసిన వైనాన్ని బంగళా ఎస్టేటు అంటుంటే అబ్బురంగా చూస్తున్నారంతా.
    "అయితే ఇప్పుడు నా వృత్తిని ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమించే అభిమానుల్ని ప్రేమిస్తున్నాను. ఇకముందు యిలా ప్రేమిస్తూనే వుంటాను."
    "అయితే పెళ్ళి చేసుకోరన్న మాట."
    "ఇప్పుడు తొందరదేనికి?" అంది రమ్యశ్రీ.
    "అవున్లేండి....." సర్కాస్టిక్ గా అన్నాడు విలేఖరి. "ఆ సంతృప్తి ఏదో యిప్పుడూ మీకు దక్కుతూనే వుందిగా?"
    అతడి మాటల్లోని మర్మం గ్రహించక అలవాటయిన ఉన్మాదాన్ని ఆవేశంగా ప్రదర్శించింది. "ఇది చాలదు ఇంకా మరింతగా  దక్కించుకోవాలనుకుంటున్నాను."
    అందరూ తెల్లబోయి చూస్తుంటే విలేఖరి మాత్రం ఉత్సాహంగా ఓ జోక్ చెప్పాడు- "వెనకటికి ఓ ఆడది డాక్టరు దగ్గరికి వెళ్ళి నేను ప్రతి క్షణమూ ద్రౌపదిలా ఫీలైపోతూ ఒక్క మొగుడితో కాలక్షేపం చేయలేకపోతున్నానని తన మానసిక రుగ్మత గురించి చెప్పిందట. నెలరోజుల ట్రీట్ మెంటిచ్చాడు డాక్టర్. ఆ తర్వాత ఇకనుంచీ మీరు ద్రౌపదిలా వారూ అన్నాడట ధీమాగా. ఆమె ఉత్సాహంగా ఓ కాగితాన్ని అందుకుంది అయితే ఆ శుభవార్త అనకాపల్లిలో వున్న అర్జునుడికి రాస్తానూ అందట.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS