"వర్షా.....ఆ విషయం నేను మరిచిపోదామనుకున్నా నువ్వే గుర్తుచేసావు. కాబట్టి మాట్లాడ్తున్నాను. నా ఈగో హర్ట్ చేసేమాటలూ, చేతలూ ఆవిడ చెయ్యకపోతేనే బావుంటుంది. అసలు నా భార్యని నేను పిలిస్తే ఆ విషయంలో కూడా ఆవిడ కలగజేసుకుంటుందేవిటీ?" కోపంగా అన్నాడు.
"నీభార్య కాకముందునుండే ఆవిడ కూతుర్ని కాబట్టి!" నవ్వుతూ అంది వర్ష.
"అయినాసరే......భార్యాభర్తల విషయాల్లోకి ఆవిడ రావటంనాకిష్టం లేదు" ఖచ్చితంగా చెప్పేశాడు.
"సంజయ్! పెళ్ళికి ముందు మా అమ్మంటే నీకు చాలా గౌరవం, ఆరాధనా అన్నావుగా! అవన్నీ నా కోసం చెప్పిన అబద్దాలా? నిజంగా నీకు ఆవిడంటే ఇష్టంలేదా?" అనుమానంగా అడిగింది.
"కాదు ఆవిడంటే నాకు ఎప్పుడూ గౌరవమే! కానీ ఆవిడది నిలబెట్టుకోవాలిగా!" అన్నాడు.
"అమ్మని ఏమీ అనకు నేను భరించలేను!" అంది వర్ష.
"నిన్ను అంటే ఆవిడ భరించలేదూ, ఆవిడ్ని అంటే నువ్వు భరించలేవూ! ఇద్దరూ కలిసి నాతో ఫుట్ బాల్ ఆడాలనుకుంటే నేనూ భరించలేను.....తెలిసిందా?" అన్నాడు.
"అంటే.......ప్రేమగా కూడా పెద్దావిడ ఏమీ సలహాలివ్వకూడదన్నమాట!" కోపంగా అడిగింది వర్ష.
"సరే......సరే.....ఈ టాపిక్ ఇంతటితో వదిలేయ్! లేచి ఐదు నిమిషాల్లో తయారై క్రిందికి రా మనండిన్నర్ కి వెళ్దాం" అని వెళ్ళిపోయాడు.
వర్షలేచి ముఖం కడుక్కుని, డ్రెస్ ఛేంజ్ చేసుకుని తయారైక్రిందకి వచ్చింది.
"వర్షా.......భోజనం రెడీగా ఉంది. బాబుకి వడ్డించి నువ్వు భోంచెయ్యమ్మా, ప్రొద్దుట్నుంచీ ఏమీ తినలేదుకూడానూ!" అంది ఆప్యాయంగా విద్య.
వర్షగిల్టీగా ఫీలవుతూ "అమ్మా - మేము డిన్నర్ కి బైటికి వెళ్దామనుకుంటున్నాం" అంది.
విద్య ఆశ్చర్యంగా "నాకు తెలీదే....." అని అంతలోనే సర్దుకుని "సరే వెళ్ళిరండీ" అంది.
వర్షకి తల్లిని వదిలిపెట్టి అలా అతనితో వెళ్ళడం నరకప్రాయంగా ఉంది! అయినా తప్పదు. అతను ఆవిడ తమ మధ్యలోరావడం ఇష్టం లేదని కరాఖండీగా చెప్పేశాడు.
"వెళ్ళొస్తాం.......నువ్వు భోంచెయ్యమ్మా" అని వర్ష సంజయ్ తోవెళ్ళిపోయింది.
రాత్రివేళ ఫోన్ మోగడంతో కంగారుగా ఫోన్ తీసింది వర్ష.
వసుంధర కొడుకు మాట్లాడాడు. "అమ్మకి బాగా జ్వరం ఎక్కువైతే నర్సింగ్ హోమ్ లో ఎడ్మిట్ చేశాం ఆంటీ మామయ్యని రమ్మను. నాకూ అక్కకీ కంగారుగా ఉంది" అన్నాడు.
వర్ష సంజయ్ ని నిద్రలేపి ఫోన్ చేతికిచ్చింది.
ఫోన్లో విషయం వినగానే అతని మత్తంతా వదిలిపోయింది. "నేను వస్తున్నాను. ఏ నర్సింగ్ హోమ్?" అడిగాడు.
గబగబాలేచి బట్టలుమార్చుకుంటూ "నేను ఏదైనా అవసరం అయితే ప్రొద్దుట ఫోన్ చేస్తాను" అని వెళ్ళిపోయాడు.
ఉదయం ఏడుగంటలకి నర్సింగ్ హోమ్ కి వర్ష ఫోన్ చేసి "ఆంటీకి ఎలా ఉంది?" అని అడిగింది.
"నువ్వు నాకు కాఫీ, ఇంటికి వెళ్ళి అక్కకి వేరేబట్టలు పట్టుకుని హాస్పిటల్ కిరా" అన్నాడు సంజయ్.
వర్ష తల్లితో చెప్పి హాస్పిటల్ కి అతను చెప్పినట్లే అన్నీ తీసుకువెళ్ళింది. వసుంధరకి వైరల్ ఫీవర్ వచ్చింది. టెంపరేచర్ ఎంతకీ కంట్రోల్ అవక కంగారుపడ్డారు.
వర్షని మధ్యాహ్నం దాకా అక్క దగ్గరే ఉంచి, పిల్లల్ని తీసుకుని సంజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మధ్యాహ్నంతను వెళ్ళి ఆమెని ఇంటికి పంపాడు.
విద్య కూతురి పీక్కుపోయిన ముఖంచూసి "ఇంతసేపు భోజనం చెయ్యకుండా అక్కడే ఉన్నావా?" అని అడిగింది.
"ఔనమ్మా, సంజయ్ ఉండమన్నాడు" అంది వర్ష.
ఆ సాయంత్రానికి వసుంధర కూతురికి కూడా ఫీవర్ ఎటాక్ అయింది. ఆమెని కూడా అదే నర్సింగ్ హోమ్ లో చేర్పించి వర్షని రమ్మని సంజయ్ ఫోన్ చేశాడు.
విద్య ఈ విషయం వినగానే "వర్షా! అది అంటుజ్వరంలా ఉంది. నువ్వు వద్దమ్మా వరమ్మని పంపిద్దాం. తను రాత్రికి అక్కడే పడుకుంటుంది" అంది.
"కానీ సంజయ్....." అంటున్న వర్ష మాటలని అడ్డుకుని "బాబుకి తెలీదు చిన్నతనం! వచ్చాక చెప్దాం. నువ్వు ఉండి మాత్రం ఏం చెయ్యగలవు? నీకేమైనా అనుభవమా ఏమన్నానా?" అంది విద్య.
వర్షతల్లికి ఎదురుచెప్పలేకపోయింది. వరమ్మ బుట్టలో పక్కబట్టలు పెట్టుకుని ఆస్పత్రికి వెళ్ళిపోయింది.
కాసేపటికి సంజయ్ మండిపడ్తూవచ్చి "వర్షా నీకేమైంది? నువ్వెందుకు రాలేదూ? అయినవాళ్ళకి ఒంట్లోబాలేకపోతే పనిమనిషిని పంపించి నీ స్టేటస్ చూపిస్తావా? ఇది నీకు పుట్టిన ఆలోచనేనా?" అని అరిచాడు.
వర్ష భయంగా "అమ్మ....." అని చెప్పబోయింది.
"ఓ! మీ అమ్మ సలహానా? అనుకున్నానులే. రేపు ఒకవేళ నేను రోగంతో పడి ఉన్నా మీ అమ్మ నీకు నా దగ్గరికి వచ్చే పర్మిషన్ ఇవ్వదు!" అన్నాడు.
విద్యవిని భరించలేక ఏమిటి బాబూ? నోటికొచ్చినట్టల్లా పెద్దా చిన్నా లేకుండా అనేస్తావు. అది చిన్నపిల్ల. రాత్రంతా అది హాస్పిటల్ లో ఉండి ఏం చేస్తుందీ? అదుంటే ఒకటీ, వరమ్మ ఉంటే ఒకటీనా?" అంది.
"శభాష్! చూడబోతే ఇలా అన్ని పనులూ వరమ్మచేత చేయించేటట్లున్నారే. అయినా నాకు తెలీక అడుగుతానూ, నాకు భార్యతో మాట్లాడుకునే స్వతంత్రం, ఆమె మీదహక్కూ లేవా?" అడిగాడు.
"హక్కు అంటే అంటురోగాలున్న వాళ్ళ దగ్గర అట్టిపెట్టిదానికా రోగం తెప్పించడమా? అదైతే లేదు. నా బిడ్డ నాకు ప్రాణం కన్నా ఎక్కువ" విద్యకూడా తగ్గకుండా అంది.
"అమ్మా ఊర్కో, నీకు అసలే ఒంట్లో బావుండదు. ఏమిటి సంజయ్ నువ్వుకూడానూ.... అన్నింటికీ గొడవ చేస్తున్నావు" అంది విసురుగా వర్ష.
"మీ అమ్మకి ఒంట్లో బాలేకపోతే తల్లడిల్లిపోతావు. మరి మా అక్కకి బాలేకపోతే చూడటానికొస్తేనే నీకు రోగం అంటుకుంటుందని భయపడిపోతున్నావా?" అడిగాడు కోపంగా.
"చిలికిచిలికి గాలివానచెయ్యకు. గదిలోకి పద ముందు......" అంది వర్ష.
"నువ్వు రేపు మొత్తం హాస్పిటల్లో అక్కా, సుజీల దగ్గరే ఉండాలి" శాసనంలా అన్నాడు. "ఉండదు! ఏమిటా దౌర్జన్యం......అదేమైనా నీ పనిమనిషా?" విద్య ఆవేశంగా అడిగింది.
