అప్పటికి గుర్తుకొచ్చింది కిన్నేరకు- తనేదో మాట్లాడాలనుకుని మరేదో మాట్లాడుతోంది. పైగా తను కూడని మోడెస్టిని ప్రదర్శించి తన వ్యక్తిత్వాన్ని తనే కించపరుచుకుంటుంది.
అసలు ఫోన్ లో యింతసేపు మాట్లాడటంమేమిటి?
అతడిని చూడాలని ఉందన్న కోరిక బలంగా కలుగుతుంటే బలవంతంగా ఆలోచనల్ని అదిమి పెట్టుకుంటూ - "మీతో పర్సనల్ గా మాట్లాడాలి మిస్టర్ రాఘవా!" అంది.
"వద్దు"
"అదేం?"
"నన్ను చూస్తే నా కవితల మీద మీకున్న ఇంప్రేషన్ చచ్చిపోతుంది."
"పర్వాలేదు, నేను మీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను."
చిత్రమైన కాంట్రడిక్షన్!
"నే నుహించని జవాబు చెప్పాను" అన్నాడు రాఘవ.
"మీరోసారి కలిస్తే నా నుంచి ఉహించని పరిస్థితులను చాలా ఎదుర్కోవలసి వస్తుంది."
"వెల్!"
"ఎక్కడ కలుద్దాం?"
"మీరు కావాలనుకున్న చోట" అన్నాడు రాఘవ.
"సాయంకాలం అయిదున్నర , ఆరు గంటల మధ్య బొజ్జన్న కొండ దగ్గర."
"ప్రమాదం లేదుగా?"
"అది అక్కడికి మీరు రాగలిగితే అర్ధమవుతుంది" టక్కున ఫోన్ పెట్టేసింది.
అప్పటికి గాని ఆమెకు బోధపడలేదు తను చెమటతో పూర్తిగా తడిసిపోయిందని.
* * * * * * * *
"అమ్మాయిగారూ!"
అసుర సంధ్యా సమయాన హటాత్తుగా మంగ కిన్నెర పడకగదిలోకి అడుగు పెట్టి దిగ్భ్రాంతిగా చూస్తూ ఉండిపోయింది.
నిజానికి ఆ సమయంలో "మంగా!" అంటూ కేక పెట్టి, కిన్నెర కవిత గురించి ఆవేశంగా మాట్లాడటం ఈ మధ్య ఆనవాయితీ కాని, ఇదేమిటి పెళ్ళి చూపులకు తయారైనట్లు అలంకరించుకుని వుంది?
అసలు 'అతడిని 'టైట్' చేసే ప్రయత్నంలో కిన్నెర ఎంతవరకూ సాధించింది?
ఇలాంటి ప్రశ్నలు చాలా చాలా మెదడుని దొలిచేస్తున్నా నిభాయించుకుంది మంగ. "అసలు నేను ఎందుకొచ్చాను అంటే......'
"నేను యింకా పెలవలేదని కావచ్చు"
కిన్నెర మాటలు వింతగా వున్నాయి. "అవునమ్మా! ఈ పాటికి పిలిచి మీ కోపాన్ని ప్రకటించేవారుగా?"
"అలా జరగలేదని నీ అంతట నువ్వేవచ్చి నన్ను పరామర్శిస్తున్నావన్న మాట!" రోషంతో అంది కిన్నెర. "అసలు నీ సహాయం లేకుండానే ఏ సమస్యనూ పరిష్కరించుకోలేనని నీ అభిప్రాయమనుకుంటాను."
పరిష్కరించుకోగలిగితే రాఘవ చిరునామా తెలుసుకునేదాకా నన్నెందుకు వేధించారని అడగలేకపోయింది మంగ.
అసలు ఇంతకాలం లేనిది, ఈ మధ్య కిన్నెర ఎందు కింతగా మారింది? ఈరోజు మరీ మార్పు కనిపిస్తుందేమిటి?
వికసిత సుమ చందనంలా ఈ సమయాన కిన్నెర నుంచి వస్తున్న గుభాళింపుకు అర్ధమేమిటి?
ఇందు బింబ సమ శోభిత వదనం లాంటి ఆమె మొహంలో ఆ గగుర్పాటేమిటి?
దిగంత రేఖ లాంటి నిర్భీతితో ప్రత్యూష సిందురాంబరంలా కనిపించే ఆమెలో ఆ సన్నని ప్రకంపన లెందుకని?
అగ్ని లాంటి అహంతో కదిలే ఆమె కనుపాపల్లో ఇంకా సుషుస్తి నుంచి తెరుకోనట్టు చిలిపి పరుగుల ఒరిపిడి ఏమిటి?
"మీ కేమైందమ్మా?" అడిగింది.
"వచ్చాక చెబుతాను." సాయంకాలం అయిదున్నర కావాస్తున్నట్టు గోడకున్న డిజిటల్ వాచ్ సూచిస్తుంటే నెమ్మదిగా కదిలింది- "నాన్నగారడిగితే సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళానని చెప్పు."
మరింత విస్మయంగా అనిపించింది మంగకు.
"ఇప్పుడా?"
"ఏం? నాకేం భయం? అసలు నేనేవర్నని?"
అది ఏ వాస్తవాన్నో దాస్తున్నట్టుంది తప్ప ధైర్యంగా చెబుతున్నట్టు లేదు.
ఎంతైనా చెలికత్తె లాంటి చెలిమి ఉన్న మనిషాయే. అందుకే కాంటెస్సాలో కూర్చున్న కిన్నెరతో చివరిగా అంది --"జాగ్రత్త, చిన్నమ్మ గారూ! గుర్తుంచుకోండి."
"ఏమిటి?"
"మీ వంశ ప్రతిష్ట!"
అక్కడికి తనేదో తప్పుచేస్తున్నట్టు సలహా యివ్వడాన్ని భరించలేని కిన్నెర చాచి మంగ చెంప పగలకొట్టాలనుకుంటూనే నిగ్రహించుకుంది.
కారు పది నిమిషాల్లో వీధుల్లో నుంచి మెయిన్ రోడ్డును చేరుకుంది. ఆమె లైబ్రరీకే వెళ్తున్నట్టు మంగని మభ్య పెడుతూ , ఆ తర్వాత మరో వీధి గుండా ఊరి వెనుక భాగంలోని మట్టి రోడ్డు గుండా అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బొజ్జన్న కొండని చేరుకుంది.
అప్పుడే అస్తమించిన సూర్యుడి కిరణాలు బౌద్ధారామమైన బొజ్జన్న గుట్టపై అరుణ రేఖల్ని నింపుతున్నాయి.
కారాపింది ఐ వారగా.
నిర్జన ప్రదేశం.
కనుచూపు మేర దాకా విస్తరించిన పంట పొలాలు, కనిపించని పల్లె నెమ్మదిగా ఇప్పుడిప్పుడే మొదలవుతున్న కీచురాళ్ళ రొద.
చుట్టూ కలియజూసింది.
లేడు, వస్తానన్న రాఘవ అక్కడికి రాలేదు.
