Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 17


    
    ఎప్పుడో చదివిన ఒక చిన్న వార్తను గుర్తుపెట్టుకుని అలా లక్షరూపాయలు సంపాదించాడు అతను.
    
    మరుసటి రోజు సాయంకాలం డైరెక్టుగా లిఖిత దగ్గరికి వెళ్ళాడు.
    
    ఓ పేపర్ లో చుట్టుకొచ్చిన డబ్బును ఆమె ముందు పోశాడు. అంతా వందరూపాయల నోట్ల కట్టలు మొత్తం పది.
    
    ఆమె ఆశ్చర్యపోయింది.
    
    తను అనుకున్నది సాధించే గొప్ప వ్యక్తిలా కనిపించాడతను.
    
    ఆమెకి నోట మాట రాలేదు.
    
    చివరికి తేరుకుని "ఎలా సంపాదించావ్?" అని అడిగింది.
    
    అతను మొత్తం వివరించి "ఇందులో మోసం ఏమీ లేదని నమ్ముతున్నారుగా" అన్నాడు.
    
    నమ్ముతున్నట్టు తల వూపింది.
    
    "మరి వెళ్ళొస్తానండి..... గుడ్ నైట్" అని వచ్చేశాడు.
    
    ఆమె అలా గుడ్లప్పగించి చూస్తోంది.
    
    లిఖిత ఇంటి నుండి వచ్చిన జితేంద్ర రాత్రి ఎనిమిది గంటల ప్రాంతాన తనకు సద్దలిచ్చిన రైతులందరినీ సమావేశపరిచాడు.
    
    "నేను ఈ వూరి వాడిని కాకపోయినా సద్దలిచ్సిన మీకు కృతజ్ఞతలు నేను మీ సద్దల్తో లక్ష రూపాయలు సంపాదించాను. ఇప్పుడు ఆ డబ్బును మీకు సమానంగా పంచేస్తున్నాను" అన్నాడు.
    
    రైతుల ఆనందానికి అవధుల్లేవు. బస్తాకు పదకొండు వందల రూపాయలు లాభమన్న మాట. అయినా వేరే వ్యక్తి లాభాన్ని తీసుకోవడానికి మనసొప్పడం లేదు.
    
    "ఆ లాభం నీదే నువ్వే ఆ డబ్బును వుంచుకో" అన్నారు ఒకరిద్దరు రైతులు లేచి. మిగిలిన రైతులు కూడా వాళ్ళకి వంతపాడారు.
    
    "ఒకసారి దైవదర్శనం జరిగాక మాయమైన ఈ జగత్తు మీద ఇంట్రెస్ట్ పోతుంది. అలా నేడు ఈ ప్రపంచంలో డబ్బు కన్నా విలువైన విషయాలు వున్నాయని తెలిసిపోయింది. అందుకే ఈ డబ్బు కేవలం రంగు కాగితాలు కనిపిస్తున్నాయి. కనుకే మీ అందరికీ పంచేస్తున్నాను" అని మరో మాటకు తావివ్వకుండా రైతులకు పంచేశాడు.
    
    ఇంటికొచ్చిన జితేంద్రను చిన్నస్వామి అరిచాడు.
    
    "డబ్బు చేదైన మనిషిని ప్రపంచంలో నిన్నొక్కడ్నే చూశాను. ఎందుకంత పొగరు?" అని గద్దించాడు.
    
    చిన్నస్వామి లాంటి వ్యక్తికి చెప్పినా అర్ధంకాని విషయం అందుకే మౌనంగా వుండిపోయాడు.
    
    సబిత మాత్రం అన్నం వడ్డిస్తూ ఎవరూ లేరని నిర్ధారణ కొచ్చాక "డబ్బు మీద వ్యామోహం లేదంటే నువ్వు ఎవర్నో ప్రేమిస్తున్నావన్న మాట" అంది.
    
    అంటే ఈ ఇంట్లో తనని అర్ధం చేసుకున్నది సబితా ఒక్కటేనన్న మాట, ఆమె కూడా తను వున్న అవస్థలో వుంది కాబట్టే ఆమెకి మాత్రమే అర్ధమైంది. "శేఖర్ కి లెటర్ ఇచ్చాను" అని చెప్పాడు. "థాంక్స్" అంది ముక్తసరిగా.
    
    మరుసటి రోజు నుంచి అతను తన దినచర్యలో మునిగిపోయాడు.
    
    అయితే లిఖిత మాత్రం ఇంకా తేరుకోలేదు.
    
    ఉదయం పదిగంటల ప్రాంతాన వీరాస్వామి భార్య సులోచన హడావిడిగా వచ్చింది. ఆమెలో ఆనందం పొంగుతోంది.
    
    "ఏమిటే సులోచనా... ఏదో రాజ్యానికి రాణి అయిపోయినట్టు సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నావ్?" లిఖిత ఆమెను కుర్చీలో కూర్చోమన్నట్లు సైగ చేస్తూ అంది.
    
    "సద్దల్లో పదివేల రూపాయలు ఎక్ స్ట్రాగా వచ్చాయ్. అనుకోకుండా వచ్చిన డబ్బుతో బంగారు సరుకు చేసుకొమ్మని మా ఆయన నాకిచ్చాడు. బంగారం గొడవ నాకంతగా తెలియదు. నువ్వు తోడు వస్తే టౌన్ వెళ్ళి సరుకు కొనుక్కొందాం. మరి వస్తావా?" అని అడిగింది ఆమె.
    
    "అనుకోకుండానా....ఎలా?"
    
    జితేంద్ర విషయమంతా చెప్పింది ఆమె.
    
    "అలా ఆ కుర్రాడు తనకు వచ్చిన లక్షరూపాయల లాభాన్ని రైతులకు పంచేశాడు...."
    
    ఆ తరువాత సులోచన ఏదో చెబుతోంది గాని లిఖితకు విన్పించలేదు. ఆమె అక్కడే ఆగిపోయింది.
    
    పదిరోజుల్లో లక్షరూపాయలను సంపాదించిన గొప్ప బిజినెస్ మాన్.... అలా సంపాదించిన సొమ్మును పది నిముషాల్లో తిరిగి రైతులకు ఇచ్చేసిన మంచివాడు..... ఇలా తన కోసం ఈ పల్లెటూర్లో వుండడాన్ని తలుచుకుంటే చప్పున ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    
    ఏదో బాధ గుండెను వుండలా చుట్టేస్తోంది.
    
    "మరి రెడీగా వుండు. పావుగంటలో తయారై వస్తాను. ఈలోపు నువ్వు కూడా ప్రయాణానికి సిద్దంగా వుండు. మధ్యాహ్నం బస్సుకి తిరిగి వచ్చేద్దాం.
    
    సులోచన ఆమె భావాల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది.
    
    అలా చూస్తున్న లిఖితకు ఒకటే ఆలోచన బుర్రలో తిరుగుతోంది.
    
    "పందెంలో గెలిచాడు కదా మరి ఏం ఇమ్మని కోరుతాడో" అన్నదే ఆమెను తొలుస్తున్న సమస్య.
    
    ఆకాశం తన ఒంటిమీద పేరుకుపోయిన మబ్బులన్నిటినీ స్నానం చేసి తుడిచేసుకున్నట్టు నిర్మలంగా, నీలంగా వుంది. చిన్నగా నడిచే పందెంలో పాల్గొనడానికి ప్రాక్టీసు చేస్తున్నట్టు గాలి మెల్లగా వీస్తోంది. ఎవరి ఇంటి పెరట్లోంచో గానీ మల్లెపూల వాసన ఎగిరొచ్చి ముక్కులను తాకుతోంది లోకానికంతా ఎర్రటి ట్రాన్స్ పరెంట్ బురఖా కప్పినట్టు సంధ్య కాంతి పరుచుకుని వుంది.
    
    అలాంటి సమయంలో జితేంద్ర తప్ప మరో ఆలోచన రావడం లేదు లిఖితకు. క్రితం రోజు టౌన్ కి వెళ్ళిరావటం వల్ల గడిచిపోయింది గానీ ఆరోజు బొత్తిగా ఏమీ తోచడం లేదు. ఇక అక్కడే వుంటే ఆలోచనలతో మెదడు కొవ్వొత్తిలా కరిగిపోతుందేమోనని భయపడి రంగనాయకి దగ్గరికి బయల్దేరింది.  

 

    ఆమె వెళ్ళేసరికి రంగనాయకి స్నానం చేసి తయారవుతోంది.
    
    "ఈరోజు నిజంగానే శుభదినం. నీలాంటి పిల్ల ఈ పేదరాలింటికి రావడం" అంటూ ఎంతో అభిమానంతో ఆహ్వానించింది.
    
    "ఏమీ తోచడం లేదు. నువ్వేమో నల్లపూసవైపోతివి. ఇక లాభం లేదని నేనే వచ్చాను"

    "ఒక్క అయిదు నిముషాల్లో వచ్చేస్తాను" మంచం వాల్చి కూర్చోమంది రంగనాయకి.
    
    మరో అయిదు నిముషాలకి ఇద్దరూ మట్టి రోడ్డెక్కారు.
    
    "ఇంటికే వెళదామా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS