"నో వెకెన్సీ"
---మల్లాది వెంకటకృష్ణమూర్తి.
ఇంటర్వ్యూకోసం వచ్చిన అమరేంద్ర తనకు పోటీలో వచ్చిన అభ్యర్దుల వంక చూశాడు. ఖాళీగా వున్న ఒక పోస్ట్ కు ముప్పైమంది వచ్చారు!
వాళ్ళలో ఆడవాళ్ళు కూడా వున్నారు.
ఆ ఆడవాళ్ళలో ఆమెకూడా వుంది.
అమరేంద్ర ఆశ్చర్యపోయాడు ఆమెనిచూసి. ఇంటర్వ్యూకి వచ్చేందుకు బస్ కోసం నిలబడి వుంటే వరలక్ష్మి రిక్షాలో వెళ్తూండటం గమనించాడు కూడా.
ఇంటర్వ్యూ పదిన్నరకి మొదలైంది. మూడున్నరకి పూర్తయింది. ముందర ఆడవాళ్ళని ఇంటర్వ్యూ చేసి పంపించి తర్వాత మొగవాళ్లని పిలవసాగారు.
నాలుగింటికి గదికి చేరుకొన్నాడు అమరేంద్ర. డూప్లికేట్ తాళంచెవితో గది తలుపు తెరుచుకొని లోపలికి వెళ్లాడు. గుమ్మంలో ఓ కార్డు పడివుండటం చూసి అందుకొన్నాడు వంగి.
తన మిత్రుడి ఉత్తరం కాదది తనదే. తన వూరినుండి తల్లి వ్రాసింది వుద్యోగప్రయత్నాలు ఎంతదాకా వచ్చాయో తెలియచేయమని, తరచూ క్షేమ సమాచారాలు తెల్సుతుండమని.
సాయంత్రం ఆరున్నరకి అతని మిత్రుడు వచ్చి అడిగాడు.
'నమ్మకం లేదు. పై ఇంటావిడ కూడా వచ్చింది ఇంటర్వ్యూకి.'
"ఎవరు? సేల్స్ టేక్స్ ఆఫీసులో పనిచేసే ఆయన భార్య?
'ఉహు వరలక్ష్మి.'
'అవును. ఆవిడ వుద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడామె భర్త.'
"ఇద్దరు పిల్లలు కన్నది కదా. ఇప్పుడెందుకో చెప్పు వుద్యోగం హాయిగా ఇంటిపట్టున వుండకుండా?"
'ఎవరిష్టం వారిది.'
పదిహేనురోజుల తర్వాత రిగ్రెట్ లెటర్ వచ్చింది అమరేంద్రకి. కొద్దిగా నిరుత్సాహపడ్డాడు. ఆ రోజంతా బాధ పడ్డాడు. స్మశాన వైరాగ్యం స్మశానం దాటాక తగ్గేటట్లుగా. ఇంకో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోగానే ఆ బాధ తగ్గిపోయింది.
రోజూ వరలక్ష్మి వుదయం బయటకి వెళ్లటం అమరేంద్ర కళ్లబడ్డది.
ఉదయం తొమ్మిదింపావు కల్లా వెళ్లిపోతుంది. మళ్లీ సాయంత్రం అయిదున్నర, ఆరింటికి వస్తుంది అలసిపోయిన మొహంతో.
'ఆవిడకి వుద్యోగం వచ్చిందనుకుంటాను' అన్నాడు అమరేంద్ర రూమ్ మేట్.
'ఎక్కడ?'
'ఆర్టీసీలో'
"అంటే మొన్న మేం వెళ్లిన ఇంటర్వ్యూలో వరలక్ష్మి సెలెక్ట్ అయిందన్నమాట."
"దేనికయినా అదృష్టం వుండాలి."
అమరేంద్ర తీరికగా వుంటాడు ఉదయం. ఆఫీసు కెళ్లాల్సిన తొందర లేదుకాబట్టి. మేడ మెట్లదగ్గర నిల్చుంటే పై పోర్షన్ లోంచి మాటలు వినబడుతుంటాయి.
ఉదయం ఎనిమిదింటినుంచి ఆ ఇంట్లో త్వరగా త్వరగా అన్న వరలక్ష్మి మొగుడిమాటలు, 'అయిపోయిందండీ' అన్న వరలక్ష్మి సమాధానం వినబడుతుంటాయి ప్రతి అయిదు నిముషాలకీ.
వాళ్లిద్దరి పిల్లలకీ నీళ్లుపోసి, బట్టలు తొడగాలి. వాళ్లిద్దరూ నీళ్లు పోసుకోవాలి, వంట చేసుకోవాలి మధ్యాహ్నం లంచ్ అవర్ లో తినడానికి టిఫిన్ లేదా కూరున్నమో, సాంబారన్నమో కలుపుకొని టిఫిన్ బాక్స్ ల్లో సర్దుకోవాలి - వేడి వేడిగా బాక్స్ లో పెడితే వాసన వేస్తుంది కాబట్టి ఆరపెట్టాలి అన్నాన్ని ఫేన్ వేసి.
భోజనాలు వడ్డించుకొని తిని, కంచాలు కడుక్కొని తొమ్మిదింటికల్లా బయలుదేరాలి. పిల్లల్నిద్దరినీ అరమైలు దూరంలో ఓ ప్రయివేట్ సంస్థ నడుపుతున్న 'చైల్డ్ కేర్ సెంటర్ ' లో దింపాలి. ఆ తర్వాత ఆఫీసుకెళ్లాలి.
మళ్లీ సాయంత్రం ఆఫీసునుంచి వచ్చేటప్పుడు ఎవరు ముందు వస్తే వాళ్ళు సెంటర్ నుంచి పిల్లల్నిద్దరినీ తీసుకురావాలి.
వరలక్ష్మి మొగుడికి పేపర్ చదివేందుకు ఆఫీస్ నుంచి వచ్చాక దొరుకుతుంది తీరిక. ఆవిడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని వంట ప్రయత్నం ప్రారంభిస్తుంది.
"టిఫిన్ ఏమయినా చేయరాదూ? ఆకలేస్తుంది"అని అడిగితే "నేను మీలానే ఆఫీస్ లో అలసిపోయి వచ్చాను. కొంచెం సేపట్లో అన్నం అయిపోతుంది. అవ్వంగానే తినేద్దాం. నాకు ఆకలేస్తోంది... పోనీ ఏదయినా టిఫిన్ కొనుక్కురారాదూ?" అంటుంది.
ఆయన ఫర్లాంగు దూరంలోవున్న హోటల్ కి వెళ్లి టిఫిన్ తీసుకొచ్చే లోపల కాఫీ తయారుచేస్తుంది వరలక్ష్మి.
నెలరోజులు వాళ్ల దినచర్య తనకి తెలియకుండానే గమనించాడు అమరేంద్ర.
ఉదయం తొమ్మిదిన్నర దాకా వాళ్లింట్లో వురుకులూ పరుగులూ. ఆదివారాలే ఉదయం విశ్రాంతిగా వుంటుంది వాళ్లింట్లో.
అమరేంద్ర ఇంకా వుద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. నాలుగునెలలు గడిచాయి. అయిదారు ఇంటర్వ్యూలకు వెళ్లివచ్చాడు. కాని ఫలితం సున్నా.
వరలక్ష్మి అలంకరణలో క్రమంగా మార్పు వచ్చింది. ఇదివరకు అమరేంద్ర ఎన్నడూ చూడని కొత్తచీరలు కడుతోంది కొత్త చెప్పులు, కొత్త హేండ్ బాగ్.
వరలక్ష్మి ఇంటికి చుట్టాలు వచ్చారు ఓరోజు. ఆ రోజు శెలవుపెట్టింది. ఇంట్లో వుండిపోయింది వాళ్లకోసం.
మర్నాడు వుదయం బయటకు వెళ్తూంటే వరలక్ష్మి సణుగు తొన్నట్లుగా మొగుడితో చెప్పటం విన్నాడు అమరేంద్ర.
"అనవసరంగా నిన్న ఆ దరిద్రగొట్టు మొహాలకోసం ఒక సి. యల్. వాడాల్సి వచ్చింది. పిల్లాడి పుట్టినరోజుకి కూడా శెలవ పెట్టలేదు నేను."
'మా వాళ్ళు దరిద్రగొట్టు వాళ్లా?' కస్సు మన్నాడాయన.
ఆవిడ జవాబు చెప్పలేదు.
అమరేంద్ర చాలాసేపు ఆలోచించాడు. ఇదివరకు ఆర్టీసీ వుద్యోగం ప్రకటన కట్టింగ్ వెదకి పెట్లోంచి బయటికి తీసాడు. స్కేల్స్ గురించిన వివరాలను చదివాడు. ఆ పోస్ట్ లో పని చేసేవాళ్లకి ఎంత జీతం చేతికివస్తుందో లెక్కవేశాడు.
