పెదవులను బాగా అదిమిపెట్టి ఆ తర్వాత ముఖాన్ని పైకి లేపాడు.
"డౌన్"
తిరిగి ఆమె మామూలుగా అయిపోయింది.
"స్టాట్యూ ఆటను అలా వాడుకోవడం ధారుణం" అంది చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ.
"మరిక ఏం చేయను? నీ చేతులు ఆడుతుండగా ముద్దుపెట్టుకోవడం సాధ్యం కాదనిపించింది"
"ఎప్పుడో నిన్నూ ఇలా 'స్టాట్యూ' ఆటతో ఇబ్బంది పెడతాను"
"అలానే పురుషులతో పాటు స్త్రీలకూ సమానంగా అవకాశాలు వుండాలని కోరుకునేవాడ్ని. ఎప్పుడో సమయం వచ్చినప్పుడు నువ్వూ దీన్ని వాడుకోవచ్చు"
కానీ ఆమె ఆ తర్వాత ఎప్ప్దుఓ 'స్టాట్యూ' ఆటతో ఇబ్బంది పెట్టలేదు. పాశుపతాస్త్రంలా దాన్ని దాచుకుంది. మరి దాన్ని ఎప్పుడు ప్రయోగిస్తుందో తెలియదు.
"ఏమిటి వంశీ? ఇక్కడున్నావ్" మాటలు వినపడడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు వంశీ.
ఎదురుగా సుజన తండ్రి సత్యనారాయణ.
చేతిలోని సిగరెట్ ముక్కను హడావుడిగా పారేసి "ఊరకనే ఇలా నిలుచున్నానండి" అన్నాడు.
ఆయన పక్కన మరో వ్యక్తి వున్నాడు.
ఎక్కడో చూసినట్లుందిగానీ ఎక్కడ చూసిందీ గుర్తు రావడం లేదు.
"ఐయామ్ శరవణన్. మద్రాసు కిల్ పాక్ సబ్ ఇన్ స్పెక్టర్ ని" వంశీ తనవేపు చూస్తుంటే చెప్పాడు ఆ అపరిచిత వ్యక్తి.
అప్పుడు గుర్తొచ్చింది వంశీకి. పెళ్ళి పందిట్లో ద్వారం దగ్గర కుర్చీలో కూర్చుని అదేపనిగా సిగరెట్లు వూదుతూ వున్నాడు. ఈయన డిప్పకటింగ్, కిందకు దిగిన మీసాలను బట్టి పోలీసు మనిషని పోల్చుకున్నాడు.
ఆయన అలా ద్వారం దగ్గర కూర్చుని వచ్చే ఆహుతులందర్నీ పరీక్షగా చూడడం వలన బాగా గుర్తుండిపోయాడు. ఎవరీ పోలీస్ మనిషి? ఎందుకలా ద్వారం దగ్గర నిలుచుండిపోయాడో అర్ధంకాలేదు. కానీ ఎవర్నీ అడగలేకపోయాడు.
"పెళ్ళికి వచ్చాడు. ఎలానూ ఇంతదూరం వచ్చాంగదా అని తిరుమలస్వామి దగ్గరకు వెళ్ళి వచ్చాడు. ఇప్పుడు తిరిగి మద్రాసు వెళ్ళిపోతున్నాడు" సత్యనారాయణ చెప్పాడు.
ఆయనను షేక్ హ్యాండ్ ఇచ్చి "గ్లాడ్ టు మీట్ యు" అన్నాడు వంశీ.
"విష్ యు హేపీ మేరీడ్ లైఫ్. కళ్యాణంలో చిన్న ప్రాబ్లమ్ వస్తుందేమోనని మీ అంకుల్ నన్ను రమ్మని పిలిచాడు. అందుకేనప్పా మద్రాసు నుంచి మీ కళ్యాణం కోసం వచ్చాను. కానీ ఆ మురుగుడి దయ వల్ల ఆ ప్రాబ్లం రాలేదప్పా. అందుకే అందరం రొంబా హ్యాపీ...." ఎస్.ఐ. ఇంకా తమిళ యాసలో ఏదో చెప్పబోతుంటే సత్యనారాయణ రావు అడ్డు తగిలాడు.
"రండి శరవణన్ గారూ! బస్ కి టైం అయిపోతుంది" అన్నాడు.
శరవణన్ ఆయన్ని పట్టించుకోకుండా "మాప్పిళే...." అంటూ పొడిగించబోయాడు. సత్యనారాయణరావు కంగారు పడిపోతున్నాడు. అప్పటికే ఆయన ముఖంలో చెమట ఊరడాన్ని గమనించాడు వంశీ.
"యస్.ఐ.గారూ! మీరు కదలండి" కసురుకుంటున్నట్లు అనడంతో శరవణన్ విధిలేక "ఓకే మాప్పిళే.... సీయు ఎగైన్" అని బయల్దేరాడు.
ఇద్దరూ వెళ్ళిపోయారు.
వంశీ మాత్రం నిలబడిపోయాడు.
పెళ్ళిలో ఎదురవుతుందనుకున్న ఆ సమస్య ఏమిటో అతనికి బోధపడడం లేదు.
మద్రాసు నుంచి పోలీస్ ఆఫీసర్ ని పిలిపించారంటే సమస్య జటిలమైందే. అది ఏమిటో ఎంత ఊహించినా తట్టడం లేదు.
అప్పుడు గుర్తుకొచ్చింది అతనికి - సుజన అక్కడికి రాకముందు మద్రాసు కీల్ పాక్ లోని ఓ కాలేజీలో చదువుకుందన్న విషయం తన మామయ్య ముఖంలో కనపడిన కంగారును బట్టి తనకు తెలియకుండా ఏదో దాచారని అతను పసికట్టాడు.
ఇక అక్కడ వుండలేక ఇంటివేపు కదిలాడు.
* * * * *
కైవల్య కోసం పదినిముషాల నుంచీ వెయిట్ చేస్తోంది సుజన. ఎలానూ ఫస్ట్ నైట్ కాకపోయినా కనీసం తన రీసెర్చి అన్నా నిరాఘటంగా కొనసాగితే బావుండునన్న ఆలోచనతో ఆరోజు కైవల్యను ఆహ్వానించింది.
అంతకుముందు రోజు రాత్రే వంశీ ప్లాన్ ఫెయిలయింది. వంశీ ఎందుకు రాలేదో, ఎక్కడ ఎదురు దెబ్బ తగిలిందో అర్ధం కాలేదు ఆమెకి.
వంశీ ఏదయినా మరో ప్లాన్ వేసాడో లేదో కూడా తెలియడం లేదు.
తన అక్కయ్యల ముందు తన ఛాలెంజ్ నెగ్గదేమోనన్న సందేహము కూడా కలుగుతోంది. ఈ టెన్షన్ నుంచి కాసేపైనా రిలాక్స్ పొందుదామని కైవల్యని పిలిచింది.
ఆమె కోసం చూస్తూ పెరట్లో కూర్చుంది.
రాత్రికీ, పగలుకీ వంతెనలా అనిపించే సాయంకాలం మెల్లగా కరిగిపోతోంది.
ఆకాశాన్ని చుట్టేసిన చీకట్లు మెల్లగా భూమి మీదకు దిగుతున్నాయి. చెట్లలో చేరిన పక్షులు గుసగుస లాడుకుంటున్నాయి.
ఇలాంటి వాతావరణంలో కాఫీ తాగడం బ్రహ్మాండంగా వుంటుందనిపించి కాఫీ తెమ్మని సుబ్బుల్ని కేకేసింది.
అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన కైవల్యను చూసి మరో కప్పు కూడా తెమ్మని పురమాయించింది.
వరండాలోకి వచ్చి సుజన ఎక్కడో వుందో తెలియకపోవడంతో అక్కడే ఆగిపోయిన ఆమెను చూసి చేతులు తట్టి తన ఉనికిని తెలియజేసింది.
"ఇక్కడున్నావా? నీ గదిలో వున్నావేమోనని డాబా మీదకు వెళదామని అనుకుంటూ వుండగా చేతులు చైర్చిన శబ్దం వినిపించింది" కైవల్య చెబుతూ ఎదురుగా వేసి వున్న కుర్చీలో కూర్చుంది.
"సాయంకాలం గదా అలా ఫ్రెష్ గాలి పీలుద్దామని"
"పనులన్నీ చక్కబెట్టుకుని తీరిగ్గా రమ్మని కబురంపావ్ - ఏమిటి విషయం?"
"ఏమీలేదు - ఊరకనే - కాలక్షేపం కావడం లేదు. సాయకాలం కదా అలా సరదాగా నీతో మాట్లాడదామని" అంది సుజన.
వాళ్ళు మాటల్లో వుండగానే సుబ్బులు కాఫీ కప్పులతో వచ్చింది. చెరొకటి తీసుకుని సిప్ చేయడం ప్రారంభించారు.
కైవల్యకు ఇరవై ఆరేళ్ళు వుంటాయి. చామన ఛాయ కావడంతో కాస్తంత సెక్సీగా కనిపిస్తుంది. అటు లావూ గానీ, ఇటు సన్నమూ గానీ ఒద్దికైన కళ్ళు.
"నీ శోభనం వాయిదా పడిందట కదా. అమ్మలక్కలు చెప్పుకుంటుంటే విన్నాను. కారణం ఏమిటి?" కప్పు కింద పెడుతూ అడిగింది కైవల్య.
"ముహూర్తం కుదరక" నవ్వుతూ చెప్పింది సుజన.
"ఏదో సినిమాలో చెప్పినట్లు శోభనానికి కావలసింది ముహూర్తం కాదు మూడ్"
