దీపం ఎప్పుడు ఆరిపోయిందో గుర్తించలేదు. ఆయనే ముందుకు కదిలాడో నేను ముందుకు అడుగువేసానో తెలియదు.
ఇద్దరం దగ్గరయ్యాం.
ఆ సన్ సైడ్ చీకట్లోనే మా శోభనం జరిగిపోయింది."
బామ్మ చెప్పడం ఆపింది.
మామూలుగా అయితే ఆ సంఘటనకు కదిలిపోయేవాడే వంశీ. కాని అతనిని మొదట నుంచీ ఓ అనుమానం పీకుతోంది. బామ్మ చెప్పడం ఎప్పుడు పూర్తి చేస్తుందా, తన సందేహాన్ని ఎప్పుడు తీర్చుకుందామా అనే తపనలోనే వున్నాడు.
అందుకే ఆమె ముగించగానే "బామ్మగారూ! ఓ చిన్న డౌట్ తీరుస్తారా?" అని అడిగాడు.
"అడుగు నాయనా-"
"రాత్రి మా అమ్మ పంపిన స్వీట్స్ మీరు తినలేదా?" అడిగాడు వంశీ.
"తిన్నాను బాబూ"
అతను అదిరిపడ్డాడు. స్వీట్ తిని అలా నిద్రపోకుండా వుండడం ఇంపాజిబుల్. ఈమె నిజంగా బామ్మేనా లేక భూతమా అన్న మరో అనుమానం కలిగింది అతనికి.
"మరీ...మరీ...." అంటూ నసిగాడు.
"ఏమిటి బాబూ అడుగు..."
"ఏమీలేదు మీరింకా నిద్ర మేల్కొనివుంటే ఏమయిందా అని అడుగుదామనుకుంటున్నాను" ఒక్కో మాటను సాగదీస్తూ చెప్పాడు.
"అదా! మీ అమ్మ నీ ద్వారా పంపించిన లడ్డు తిన్నానో లేదో నిద్ర ముంచుకు వచ్చింది. ఈరోజయినా నిద్రమాత్రలు లేకుండా నిద్ర పడుతున్నందుకు ఆ దేవ దేవుడికి నమస్కరిస్తూ నిద్రపోయాను. కానీ ఇదిగో-నువ్వొచ్చే ముందే మెలకువ వచ్చింది. రోజు రెండు నిద్ర మాత్రలు వేసుకుంటే గానీనాకు నిద్ర పట్టదు నాయనా ఈ రోజెందుకో మరి కోడలు పిల్ల మాత్రలు ఇవ్వకనే నిద్రపోయింది. కిందకెళ్ళి ఎంతసేపు పిల్చినా నిద్ర లేవదు. ఇక లాభం లేదనుకుని ఇక్కడ కూర్చుండి పోయాను. ఇంతలో నువ్వొచ్చావ్. ఇక ఈ రాత్రంతా జాగారమే. నీకూ నిద్ర రాకుంటే ఇక్కడే వుండిపొ. కాలక్షేపమన్నా అవుతుంది నాకు."
అదన్న మాట విషయం. డోస్ చాలక పోవడం వల్ల మధ్యలో లేచిపోయింది ముసల్ది. కానీ ఈమెకు నిద్రమాత్రలు వేసుకునే అలవాటు వుందో లేదో ముందే తెలుసుకోకపోవడం తన తప్పేననిపించింది అతనికి.
ఇక తన పథకం పారదని గ్రహింపుకొచ్చి నీరసపడిపోయాడు.
"ఇంకొకసారి ఏమయిందంటే?" తిరిగి మరో ముచ్చట చెప్పబోయింది బామ్మ.
అతను అడ్డు తగిలాడు. ఇక అక్కడ వుంటే తన అనుభవాల్తో దేముడి ప్రసాదాన్ని ఆరగించినట్టు తనని తినేస్తుందని గ్రహించి అక్కడ నుండి లేస్తూ "బామ్మగారూ! ఈరోజుకి మీ శోభనం ముచ్చట్లు చాలు వస్తాను - బ్రతికుంటే శోభనం గురించి కలలయినా కనొచ్చు" అని మరో మాటకు తావివ్వకుండా అక్కడి నుండి పరుగులాంటి నడకతో బయటపడ్డాడు. తల పైకెత్తి చూసాడు.
ముఖానికి తెల్లటి రంగు పూసుకుని మబ్బుల ప్రేక్షకుల్ని నవ్విస్తున్న జోకర్ లా వున్నాడు చంద్రుడు.
తన పూలపల్లకి ఆపరేషన్ ఫెయిలవడంతో దిక్కుతోచడం లేదు వంశీకి. సుజనకు ముఖం చూపించాలంటే సిగ్గుగా వుంది. తన ప్లాన్ కు తిరుగుండదని రెడీగా వుండమని ఉత్తరం వ్రాసి చివరికి తను వెళ్ళలేకపోవడం నామోషీగా వుంది.
ఆమె బామ్మ మీద పీకలదాకా కోపం వస్తున్నా బలవంతాన నిగ్రహించుకుంటున్నాడు.
సుజన సిగ్గుతో తన అక్కయ్యల ముందు ముఖం వేలాడేసుకునే శీనుకు ఊహించుకుంటుంటే రక్తాన్నంతా ఎవరో శరీరం నుంచి లాగేస్తున్నట్లు ఫీలైపోతున్నాడు.
మరో ప్లాన్ కోసం మెదడులోని కణాలన్నిటినీ ఒక దగ్గరగా చేర్చి ఆలోచిస్తున్నాడు. కాని లొసుగులు లేని ప్లాన్ తట్టడం లేదు.
ఇంట్లో వుంటే ఇవే ఆలోచనలు చుట్టుముట్టుతుండడం వల్ల అలా కొట్టు దగ్గరకు వెళ్ళాడు.
అప్పుడు టైము పదిగంటలు దాటింది. ఇళ్ళలోంచి లేస్తున్న పొగలు కడుపులో ఆకలిని పుట్టించడానికి మంత్రగత్తెలు వేస్తున్న ధూపంలా వుంది.
వీధి తిన్నెల మీద కూర్చున్న మగవాళ్ళు చేయబోయే వ్యవసాయం గురించి, చేసిన వ్యవహారం గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల శబ్దాలు రాలుతున్న వడ్లగింజల్లా వున్నాయి. పిల్లలంతా వీధుల్లో రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు.
వాళ్ళంతా అటూ ఇటూ తిరుగుతుంటే దేవతలు వాళ్ళను గోళీల్లా చేసుకుని ఆడుకుంటున్నట్లుంది.
వంశీ ఓ సిగరెట్ కొనుక్కుని రచ్చబండ దగ్గర నిలుచున్నాడు. రచ్చబండ మీదున్న చిన్న శిల్పాన్ని చూస్తుంటే అతనికి మొదటా తను సుజనను ముద్దుపెట్టుకోవడం గుర్తుకొచ్చింది.
యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లో వాళ్ళిద్దరూ సరదాగా ఓ ఆట ఆడుకునేవాళ్ళు ఏ సమయంలోనైనా ఒకరు మరొకర్ని 'స్టాట్యూ' అంటే శిలా ప్రతిమలా నిలబడిపోవాలి. 'డౌన్' అంటేనే తిరిగి యధాప్రకారం అయిపోవాలి.
ఓరోజు వాళ్ళిద్దరూ గోవిందరాజుల గుడికి వెళ్ళారు. ఆరోజు బుధవారం కావడం వల్ల రష్ అంతగా లేదు. సాయంకాళానికి వీడ్కోలు ఇస్తున్నట్లు అప్పుడే దీపాలు వెలిగాయి.
ధ్వజస్తంభం ఆ వెలుగుల్లో బంగారు పూలుపూసే చెట్టు కాండలా వుంది.
ఇద్దరూ గర్భగుడి వెనుకకు వెళ్లి ఒకచోట కూర్చున్నారు. మసకచీకటి మరెక్కడా చోటులేనట్లు అక్కడ తలదాచుకున్నట్లుంది. అప్పుడప్పుడూ గాలికి ఎగిరి తఃగులుతున్న చీర పైట వంశీలో గిలిగింతలు పెడుతోంది.
అంతవరకు అతను ఆమె చిటికెన వేలు కూడా తాకలేదు. కానీ అప్పుడు మాత్రం అతను ఆగలేకపోతున్నాడు. రక్తమంతా ఏదో సందేశమిస్తోంది. శరీరాన్నంతా ఆమె మీదకు వాల్చాలని ఆ సందేశం సారాంశము.
ఆ మసక చీకట్లో అలానే ఆమె మీదకు తల వాల్చబోయాడు. అతను ఏం చేయబోతున్నాడో గ్రహించి.....
"ఇలాంటివి నిషిద్దం" అంటూ అతని చుబుకాన్ని పట్టుకుని పైకి లేపింది.
అప్పుడొచ్చింది అతనికా ఐడియా.
"స్టాట్యూ" అన్నాడు.
ఆ ఆటలోని ఒప్పందం ప్రకారం ఎదుటి వ్యక్తి అలా అన్నపుడతను శిలాప్రతిమలా వుండిపోవాలి. అందుకే ఆమె అలా వుండిపోయింది.
ఆ సమయంలో ఆమె బుగ్గల మీద పెదవులు ఆన్చాడు అంతకు ముందు గుడిలో పెట్టిన పంచామృతం చప్పగా తోచిందతనికి. ఆ ముద్దు అంత తీయగా వుంది మరి.
