Previous Page Next Page 
స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ పేజి 17

    అతడా పనిమీదే ప్రస్తుతం బయల్దేరుతున్నాడు.    
    అప్పుడే వర్షం పడి వెలిసింది. బయటంతా చీకటిగా వుంది. ఎంత పనిమీద వెళుతున్నా అలక్ నంద వ్రాసిన ఉత్తరం సంగతి మర్చిపోలేదు అతడు. తలుపు దగ్గరికి వెళ్ళి టక్.... టక్.... టక్... మని కోడ్ గుర్తుతో కొట్టాడు.    
    అరనిముషం తరువాత తలుపు తెరుచుకుంది. "థాంక్స్ ఫర్ ది లెటర్" అంటూ చీకట్లోనే చప్పున ఆమెని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకోబోయాడు. కెవ్వున కేక వినిపించింది. అతఃడు కంగారుగా ఆమెని వదిలేసి "మీరా అన్నపూర్ణమ్మగారూ" అన్నాడు.    
    "ఇదేం అఘాయిత్యం నాయనా నమ్మకంగా పక్క పోర్షన్ అద్దెకిస్తే ఇదా నువ్వు చేసే పని?" అందావిడ కోపంగా.    
    "క్షమించండి అత్తయ్యగారూ! మీ అమ్మాయిని మార్చే ప్రయత్నంలో ఇదొక భాగం మాత్రమే. కావాలంటే ఈ క్షణం తాళి కడతాను" అని, ఆమె మాట్లాడక పోవటంతో- "ఒక ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను. కాస్త ఎదురురండి" అంటూ టాపిక్ మార్చి శకునం రాగా బయల్దేరాడు.    
    అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కి వచ్చిన సస్పెండయిన ఇన్ స్పెక్టర్ ని చూసి రాత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. అతడు ఫోన్ అడిగి తీసుకుని వరుసగా ఫోన్ లు చేయడం ప్ర్రారంభించాడు. ఆ వూరి నుంచి వార్తలు దినపత్రికలకు పంపే విలేఖర్లు ముగ్గురు నలుగురు వున్నారు. వాళ్ళకు ఫోన్ చేశాడు.    
    "నేనూ- పులిరాజుగారి పియ్యేని మాట్లాడుతున్నాను. ఇంకో అరగంటలో మా రాజుగారు పత్రికలకి ఒక ప్రకటన చెయ్యబోతున్నారు. మీరు వెంటనే రావాలి."    
    "ఇంత అర్ధరాత్రా?"    
    "అవును అర్జంట్ ఇంటి కొచ్చెయ్యండి."    
    అలా నలుగురికీ ఫోన్ లు చేసి రాణా అక్కన్నుంచి బయల్దేరి పులిరాజు ఇంటికి వెళ్ళాడు.    
    చీకట్లో ఆ భవంతి తాటిచెట్టులా వుంది. నీళ్ళ పంపు పట్టుకుని రెండో అంతస్థులో ప్రవేశించాడు. త్రిపుర బెడ్ రూమ్ కనుక్కోవటం అతనికి పెద్ద కష్టం కాలేదు. చిన్న వూచ సాయంతో గది లాక్ తెరుచుకుని లోపలికి ప్రవేశించాడు.    
    కంటి లోపల నిద్రపోతోంది. పక్క దగ్గర నిలబడి ఒక్కక్షణం ఆమెవైపే చూశాడు. చాలా మంచి స్ట్రక్చర్ ఆ అమ్మాయిది. పరిపూర్ణమైన ఆరోగ్యంతో మిలమిలలాడుతోంది. ఆమె వేసుకున్న పలుచటి నైటీలోంచి శరీరాకృతి స్పష్టంగా కనిపిస్తూంది.    
    అతడు జేబులోంచి కత్తెర తీశాడు.    
    ఆ అలికిడి ఆమె కళ్ళు విప్పి చూసింది. మంచం పక్కనే కత్తెరతో నిలబడ్డ రాణాని చూచి ఆ అమ్మాయికి కొంచెం సేపు ఏమీ అర్ధంకాలేదు.    
    లేచి కూర్చుంటూ "ఏమిటిది?" అని అడిగింది.    
    "నేనిప్పుడు నిన్ను రేప్ చేయబోతున్నాను" అన్నాడు గంభీరంగా.    
    "కత్తెరతోనా? భలే-" అంది.    
    మాట్లాడకుండా అతడు ఆమె నైటీ బొందుని కత్తెరతో కత్తిరించాడు. ఆమె ఆ కార్యక్రమాన్నంతా కళ్ళప్పగించి చూస్తోంది. మోకాళ్ళ పైగా పీలికలు చేశాడు.    
    "ఇంతేనా రేప్ అంటే? నేను ఇంకా చాలా వుంటుందనుకున్నానే" అంది. అతడు సమాధానం చెప్పలేదు. ఆమె చెయ్యి పట్టుకుని గోళ్ళతో గీరాడు.    
    "నఖక్షతలా?" అని అడిగింది.    
    "దంతక్షతాలు కూడా" అంటూ మొహం మీదకు వంగాడు. ఆమె కెవ్వున అరిచింది. అతడు చప్పున నోరు మూశాడు.    
    "రేప్ చేస్తున్నప్పుడు అరవాలిగా. అందుకని అరుస్తున్నాను" అంటూ మళ్ళీ ప్రయత్నం చేసింది. ఈ లోపులో బయట తలుపు కొట్టిన చప్పుడు, "ఏమ్మా త్రిపురా, ఏమైంది?" అన్న పులిరాజు కంగారు గొంతు వినిపించాయి.    
    రాణా జేబులోంచి కర్చీఫ్ తీసి త్రిపుర మొహంమీద సుతారంగా అదిమాడు. ఆమె క్షణాల్లో స్పృహ తప్పినట్టు పడిపోయింది. పెన్ను ఆమె బుగ్గలమీద విదిలించాడు. ఎర్ర ఇంకు అక్కడక్కడ పడింది.        
    తాపీగా అప్పుడు వెళ్ళి తలుపు తీశాడు.    
    బలంగా తలుపు కొడుతూన్న పులిరాజు రాణా ఒక్కసారిగా తలుపు తీసేసరికి ఆ వేగానికి ముందుకు పడ్డాడు. రాణా అతడిని పొదివి పట్టుకుని ఆపుచేశాడు.    
    "ఎవరూ.... నువ్వా.... అర్ధరాత్రి నా ఇంట్లో ప్రవేశిస్తావా? ఎంత ధైర్యం నీకు? ఐ విల్ షూట్ యూ"    
    "క్షమించండి పశ్చాత్తాపంతో దహించుకుపోతున్న నన్ను అంతలేసి మాటలనటం భావ్యంకాదు" రాణా దీనంగా అన్నాడు.   
    "పశ్చాత్తాపమా? ఎందుకు పశ్చాత్తాపం? అసలేం జరిగింది?" అంటూ ముందుకొచ్చాడు పులిరాజు. అతడి దృష్టి పక్కపైనున్న కూతురిమీద పడింది. షాక్ తగిలిన వదిలా నిలబడిపోయాడు నోటమాట రాలేదు. బుగ్గమీద ఎర్రగాట్లతో చిరిగిన వస్త్రాలతో పక్కమీద పడివుంది కూతురు.    
    "నన్ను క్షమించండి" వెనుకనుంచి రాణా గొంతు వినిపించింది. "...మీరు నన్ను సస్పెండ్ చేయించారన్న ఉక్రోషంతో పిచ్చెక్కిపోయాను. మీమీదెలాగైనా కసి తీర్చుకోవాలనిపించింది. ఆ ఆవేశంతో ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు. వచ్చి మీ కూతుర్ని రేప్ చేశాను."    
    ఒక్కొక్క వాక్యం బాంబు పేలినట్టు పేలింది. పులిరాజు మొహం కందగడ్డలా మారింది. మనిషి నిలువెల్ల వణికిపోతూ "నిన్ను.... నిన్ను చంపేస్తాను" అన్నాడు.    
    అంతలో క్రింద కాలింగ్ బెల్ వినిపించింది. అంత అర్దరాత్రి ఎవరొచ్చారో పులిరాజుకి అర్ధంకాలేదు. అయోమయంగా చూశాడు.    
    "పత్రికా విలేఖర్లు...." అన్నాడు రాణా తాపీగా. "....మీ కూతుర్ని రేప్ చేస్తున్నంతసేపూ నాలో వున్న ఆవేశం, ఆ పని అయిపోయాక తగ్గిపోయింది. తెల్లటి బెడ్ షీట్ మీద ఆకుపచ్చ నైటీలో ఎర్రటి మరకల్తో రేప్ చేయబడ్డ మీ కూతుర్ని చూస్తే నాకు..... పతాకం గుర్తొచ్చింది. పశ్చాత్తాపంతో కదలిపోయాను. వెంటనే ఈ గదిలోంచే పత్రికా విలేఖర్లకు ఫోన్ చేసి ఇక్కడకు రమ్మన్నాను. ఎలాగూ ఉద్యోగంలోంచి సస్పెండ్ కాబడ్డాను. నా నేరానికి శిక్ష అనుభవించాలి. పన్నెండు సంవత్సరాలు జైల్లో మగ్గాలి. అదే నా నేరానికి ప్రాయశ్చిత్తం. లోకానికి నా నేరం తెలియాలి."    
    "నో అలా జరగటానికి వీల్లేదు."    
    "తప్పదు పులిరాజుగారూ అయినా .... అయినా నా గురించి నాకు బాధలేదు. అన్యాయంగా మీ కూతురి జీవితం ఇలా అయిపోయిందే అనే బాధ రేపు మీ అల్లుడొచ్చాక ఈ పాత పేపరు కటింగు అతనికి ఎవరైనా చూపిస్తే ఎలా? అన్నదే నన్ను పీడిస్తున్న సమస్య. నాకు పన్నెండు సంవత్సరాలే శిక్ష కానీ..... అయ్యో....మీరు చేసిన పాపానికి మీ కూతురికి జీవితాంతం శిక్ష."    
    "నేను చేసిన పాపమా?"    
    "నన్ను సస్పెండ్ చేయించటం.....అందుకేగా, ఉచ్చనీచాలు మరిచి పశువులా ప్రవర్తించాను. పులిరాజుగారూ ప్లీజ్.... జరిగినదంతా మర్చిపోండి. నన్ను ఆ విలేఖర్ల దగ్గరకు వెళ్ళనివ్వండి. నేరం ఒప్పుకోనివ్వండి" చేతిలో కత్తెరవైపు ఓరగా చూస్తూ అన్నాడు రాణా. పులిరాజు అంతా అర్ధమైనట్టు తలూపాడు. "నీ ఎత్తు అర్ధమైంది. నీ సస్పెన్షన్ ఆర్డర్ ఉపసంహరించు కోకపోతే జైలుకు వెళ్ళటానికి కూడా నువ్వు సిద్దమే కానీ నన్ను బజారు కీడుస్తావ్. అంతేగా నువ్వు చెప్పేది-"    
    "చాలా కరెక్టుగా గ్రహించారు."    
    పులిరాజు బలంగా విశ్వసించి "సరే అయితే, నీ సస్పెన్షన్ ఉపసంహరిస్తున్నాను" అన్నాడు.    
    "థాంక్స్..... నేనూ మీ అమ్మాయినేం చెయ్యలేదు. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్..." చిలిపిగా నవ్వేడు రాణా.    
    పులిరాజు నవ్వలేదు. "చూడు.... ఈ విషయం నేనిక్కడితో వదిలిపెడతాననుకోకు. అనవసరంగా కొరివితో తల గోక్కున్నావు. చాలా తొందర్లోనే అనుభవిస్తావు."    
    రాణా కూడా అతడివైపు సీరియస్ గా చూశాడు. "చూడూ, నీలాంటి వాళ్ళని లక్షమందిని చూశాను. ఈ చిన్న టౌన్ కి నువ్వు రాజువైతే అవ్వొచ్చుగానీ, మామూలుగా అతి సాధారణమైన వాడివి. నాతో గొడవంటే పార్లమెంట్ లో వాకౌట్ చేసినంత సులభం కాదు. బీ కేర్ ఫుల్...." అంటూ అక్కడినుంచి వచ్చేశాడు.    
                                            *    *    *    
    "ఎలా సంపాదించారు సార్ తిరిగి ఉద్యోగం?" బ్రహ్మానందం బాలకిషన్ ఎగ్జయిటింగ్ గా అడిగాడు. రాణా నవ్వి ఊరుకున్నాడు. సుధాకర్ కి కూడా ఇదంతా గమ్మత్తుగా అనిపించింది. అతడూ అదే ప్రశ్న అడిగాడు. ఈసారి రాణా సమాధానం చెప్పాడు.    
    "చూడు కర్రా మన మనసుకి మనం సమాధానం చెప్పుకోవలసి వుంటుంది. అది కుదిరిందనుకో- అంతటి సమస్యనైనా అవలీలగా దాటి వెయ్యవచ్చు. "అతడు చెప్పటం పూర్తికాకుండానే కానిస్టేబుల్ శర్మ పరుగెత్తుకు వచ్చాడు. "దేవుడి నగలు కొట్టేశారు సార్. మళ్ళీ గార్డులని చంపేశారు" రొప్పుతూ అన్నాడు. అక్కడంతా గగ్గోలుగా వుంది.    
    రాణా స్థాణువయ్యాడు.    
    యాభై లక్షలు దొంగతనం.... దేవుడి నగలు.... గార్డుల హత్య...    
    రెండు సంవత్సరాల క్రితం చరిత్ర మళ్ళీ పునరావృతం....    
    అయితే, ఈ సారి నగల దొంగతనం కూడా జరిగింది.    
    "మనసుకి సమాధానం చెప్పుకోగలిగితే ఎంతటి సమస్య నయినా అధిగమించవచ్చు" అన్నాడు ఇప్పుడే.... మరి దీన్ని పరిష్కరించగలడా?    
    అసెంబ్లీలో, పార్లమెంటు లో పోలీసుల అసమర్ధత గురించి రాకుండా ఆపగలడా?    
                                                9    
    గుడిలో దేవుడు కళాహీనంగా వున్నాడు.    
    ఆ ప్రాంగణమంతా వెలవెలబోతూంది.    
    ఫోటోగ్రాఫర్లు, పోలీసు కుక్కలు, దూరంగా తండోపతండాలుగా జనం అంతా హడావుడిగా వుంది.    
    రాణా ఆ తతంగాన్ని నిలబడి చూస్తున్నాడు. నిజానికి అక్కడ పోలీసులు చెయ్యగలిగినదేమీ లేదు. పోలీసు కుక్కల్ని గుడి ప్రాంగణంలోకి వదలాలా లేదా అన్న విషయమై ఎం పీ, ఎమ్మెల్యేలు వాదులాడుకుంటున్నారు.    
    ఇద్దర్లో ఎవరో ఒకరు కొట్టేశారన్నది యదార్ధం. అయితే ఎవరూ బయటపడటం లేదు. రేపు యస్పీ వస్తున్నాడు. అప్పటికే హైదరాబాద్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఇరవై నాలుగ్గంటల్లోగా నగలు దొరికేలా చూడమని.    
    సాధ్యమయ్యే పనేనా అది?    
    గుడిలోకి పోలీసు కుక్కల్ని వదలాలా అన్న విషయంమీద తొందర్లో ఒక కమిటీ వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.    
    రాణా ఆలోచిస్తున్నది అదికాదు.    
    సరీగ్గా రెండు సంవత్సరాల క్రితం ఇలాటి దొంగతనం కోసమే ప్రయత్నం జరిగింది. కొందరు మరణించారు.... ఆ ప్రయత్నం ఎవరు చేశారు? వాళ్ళే అయితే మళ్ళీ ప్రయత్నించటం కోసం రెండు సంవత్సరాలు ఎందుకు ఆగారు? అదే అర్ధం కాని ప్రశ్న.    
    ....డియస్పీ తెగ హడావుడి పడిపోతున్నాడు. పాపం ఈ వయసులో హాయిగా ఏ వీరదాసు 'అడ్డా' లోనో మందుకొట్టి పడిపోవటానికి వీల్లేకుండా ఈ కష్టం వచ్చిపడింది.    
    అంతలో యస్సై కర్రా వచ్చి సెల్యూట్ చేశాడు.    
    ".... ఇది నిశ్చయంగా స్టూవర్ట్ పురం దొంగల పనే సార్" అన్నాడు.    
    "ఎలా చెప్పగలవ్?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS