Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 17

 

    దినేష్ కి చాలా ఉత్సాహంగావుంది తన పథకం ఫలిస్తోన్నందుకు తను పల్లెటూరు చూడ్డానికి వెళ్ళటం లేదు - అక్కడున్న వాళ్ళందరితో షేర్ మార్కెట్ గురించి చెప్పడానికి వాళ్ళ చేత షేర్స్ కొనిపించడానికి - ఎంత ఎక్కువమంది చేత కొనిపిస్తే అంత మంచిది తనకి - అందరూ కొబ్బరితోటల వాళ్ళే అక్కడ. సూట్ కేసు సర్దుకున్నాడు దినేష్ -
   
    ఇంక రెండురోజులే ప్రయాణం. నాన్నగారికిష్టమని హైదరాబాదు స్వీట్లు కొంది శారద పంతులుగారి భార్యకోపం రెండు ఖరీదయిన జాకెట్టు గుడ్డలు కొంది, - ఈమాట అన్నయ్యలు, పిల్లలు వదినలు ఈ గొడవ వుండదు కనక హాయిగా నాన్నగారి దగ్గరవారంరోజులు గడపాలని నిశ్చయించుకుంది శారద.
   
    "తాజ్ మహల్ హోటల్ దగ్గరుంటాను - మనందరికీ బ్రేక్ ఫాస్ట్ పాక్ చేయిస్తున్నాను - నువ్వు వచ్చేయి' - ఇది దినేషు ఫోనులో చెప్పిన విషయం - శారద హడావిడిగా తలుపుకి, తాళాలు వేసుకుని, వారం రోజులు నరసాపురం వెడుతున్న సంగతి మళ్ళీ పిన్నిగారికి చెప్పి, బయలుదేరింది ఇంట్లోంచి.
   
    కార్లో తనకోసమే ఎదురుచూస్తున్నాడు దినేష్. రోజులా రబ్బరు బాండ్ తో జుట్టుకట్టుకోకుండా వదిలేసింది శారద. ఒకప్పటి నల్లటి పొడుగాటి జడ, ఇప్పుడు భుజాలవరకు కత్తిరింపబడి స్వేచ్చగా అటు ఇటు ఎగురుతోంది. లిప్ స్టిక్ పెదాలు మెరుస్తున్నాయి. భుజాన బాగ్ వెళ్ళాడుతోంది. జీన్స్ పాంటు, వదులుషర్టు తమాషాగా వుంది శారద చూడ్డానికి, భలేగావున్నావ్"- దినేష్ కంటిరెప్పవేయకుండా చూస్తున్నాడు-
   
    అవును ప్రయాణంలో ఈడ్రెస్ బాగుంటుందని - నిన్ననే మూడు జతలుకొనుక్కున్నాను. చీరలు చాలావున్నాయనుకో' అంది కారులోకి చూస్తూ.
   
    'ఏదీ' -
   
    'రాలేదు'
   
    'ఏమిటీ - రాదా' - శారదకి ముచ్చెమటలుపోసాయి. నీరజరాదా - వస్తానందిగా - మరి ఇంకోసారి వెళ్ళేవాళ్ళంగా - ఏమయింది అసలు - 'కారు బయటనుంచునే అంది ఖంగారుగా శారద. 'కూచో, తమాషాగా అన్నాను. ఇంటిదగ్గర వుంటాను, మనని అక్కడికి రమ్మంది' - దినేష్ కారు తలుపు తీసాడు.
   
    'హమ్మయ్య' - శారద ఊపిరిపీల్చుకుంది హాయిగా, కానీ, కారు నీరజ ఇంటిమీదుగా వెళ్ళలేదని, కారులో తను దినేష్ మాత్రమే వున్నారని తెలిసాక శారదకి స్పృహతప్పినంత పనైంది. దినేష్ ఎందుకిలాచేసాడు!
   
    'శారదా - నామాటనమ్ము - నీరజ వాళ్ళమ్మగారు తెల్లారుఝామున గుండెనొప్పితో బాధపడుతుంటే మేమే ఆస్పత్రిలో చేర్పించాము - ఈ ప్రోగ్రామ్ మానుకుంటానన్నాను. కానీ నీరజ వప్పుకోలేదు - నువ్వు ఎంతో సరదాగా బయలుదేరుతుంటే ప్రయాణం ఆపటం ఇష్టంలేదంది - అసలు నాకూ రావాలని లేదు. పోనీ, వెనక్కి వెళ్ళిపోదామా. ఇప్పుడేగా ఊరుదాటాము - వెళ్ళిపోదాం' దినేష్ కారు ఆపాడు.
   
    శారదకి ఏం చేయాలో తోచలేదు - వెనక్కి వెళ్ళిపోవచ్చు -కానీ నిజానికి నరసాపురం చూస్తానని తనని బతిమాలింది దినేష్ నీరజ రాకపోతే ప్రయాణం మానేయాలా - కాకపోతే, నీరజకూడా వచ్చి వుంటే బాగుండేది. ఊళ్ళో అదీ పల్లెటూళ్ళో వాళ్ళు ముగ్గురు మనుషులు కనిపిస్తే ఎక్కువగౌరవం యిస్తారు ఒక ఆడ, ఒక మగ కనిపించేకన్నా అయినవాళ్ళతో తనకేంపని.
   
    'చెప్పు' - దినేష్ అన్నాడు కొంచం సీరియస్ గా
   
    'కారు పోనీ' - శారద దినేష్ వంక చూసి నవ్వింది ఫ్రంటు సీట్లో కూర్చుంటూ.
   
    రెండుగంటల ప్రయాణం తర్వాత కారు ఆగింది ఓ చెట్టునీడన దినేష్, శారద దిగారు. వాతావరణం ప్రశాంతంగా వుంది. తాజమహల్ హోటల్లో పాక్ చేసిన బ్రేక్ ఫాస్ట్ తిన్నారిద్దరూ.
   
    'మీ ఊరు మరీ బావుంటే నేను అక్కడే వుండిపోతాను అక్కడే నా బిజినెస్ చూసుకుంటాను' - దినేష్ మాటలకి ఫక్కున నవ్వింది శారద.
   
    'హాయిగా ఉండిపోనే వెళ్ళిపోతాను -మానాన్నకి తోడుగా వుండు' అంది "అక్కడ వాళ్ళందరికీ నేనేతోడు, నీడ, దైవం అయిపోతాను. నువ్వనుకుంటున్నావేమో ఒట్టిమాటలని, నాగురించి పూర్తిగా తెలియదు నీకు, ఒక్కసారి నేను ఒకళ్ళతో మాట్లాడితే చాలు వాళ్ళునాపై ఆకర్షణకి గురి అయిపోయి ఇక నన్నువదలరు -నేనేం చెప్పినా అది వాళ్ళకి వేదం ఇంతెందుకు, నీరజ వాళ్ళనాన్న సింగపూర్ లో హోటల్ బిజినెస్ ఎలా చేస్తున్నారంటావు - నా స్నేహితులున్నారక్కడ - వాళ్ళని పరిచయం చేసా. ఇంతెందుకు నువ్వు చూస్తావుగా, మీ ఊళ్ళో రెండురోజులుంటే చాలు ఆ ఊరువాళ్ళంతా నా వెంటపడతారు. మేం షేర్స్ కొంటాం అంటే, మేం కొంటాం అంటూ అక్షరం ముక్కరానివాళ్ళంతా షేర్స్ కోసం నా చుట్టూ తిరుగుతారు - నేనేమిటో నీకింకా తెలియదు శారదా - నా సమర్ధత, నా సమయస్పూర్తి నాచొరవ నీకు చెప్తే ఏం అర్ధమవుతాయి - చూస్తావుగా" దినేష్ చాలా హుషారుగా మాట్లాడాడు. శారద అతనివంకే చూస్తోంది.
   
    కారు వేగంగా పరుగెత్తింది. 'ఎందుకంతస్పీడు' శారద దినేష్ భుజంపైనపడింది. సద్దుకుకూచుంది.'
   
    'అబ్బ, స్లోగా డ్రైవ్ చేయి. నాకు భయమేస్తోంది. శారదకి నిజంగా భయంగావుంది.
   
    "ప్రాణముల్ తీపి అని ఎరుంగవే" - దీర్ఘంతీస్తూ నాటక ఫక్కీలో పాడాడు దినేష్.
       
    'నాటకాలుకూడా వేసేవాడివా'
   
    జీవితమే ఒక నాటకరంగం మనమంతా పాత్రధారులం.
   
    'అబ్బో - చాలా వచ్చేనీకు' శారద దినేష్ వంక చూసింది.
   
    'నాటకాలు వేశాను - ఉద్యోగాలు చేశాను - బిజినెస్ లూ చేసాను. అన్నీ - ఒకటా - కోటి విద్యలు కూటికొరకే కదా! కారు ఊరుచేరింది తిన్నగా ఎత్తరుగుల ఇంటిముందు కారు ఆగింది. శారద ఆశ్చర్యానికి అంతులేదు. ఇంటిముందు పెద్ద పందిరి. పందిరిలో ఆడుకునే పిల్లలు - ఏమిటి సందడి - తనకు తెలియకుండా. దినేష్ కారులోనే కూచున్నాడు. శారదకి లోపాలకి వెళ్ళాలంటే భయంగా వుంది. ఎవరెవరికి ఏఏ సమాధానాలు చెప్పాలో తను ఈ దినేష్ గురించి ఏం చెప్పాలో అంత భయపడటానికేముంది నా స్నేహితుడని చెప్తాను - గుండె గట్టి చేసుకుని లోపల కడుగుపెట్టింది శారద.
   
    'నువ్వేరాలేదేమో అనుకుంటున్నాము' పిన్ని రాజమ్మ శారదని పలకరించింది. 'రైలు ఆలస్యమయిందా. పొద్దున్న వడుగు అయిపోయింది. నువ్వెందుకు రాలేదా అని అంతా అనుకున్నాం" రాజమ్మ పిన్ని మాట్లాడుతుంటే ఇంట్లో అంతా అక్కడి కొచ్చారు. 'విషయమేమిటసలు' - శారద అంతాచూస్తోంది. పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, ఇంకా కొందరు బంధువులు పేకాటలో మునిగిపోయారు చిన్నవదిన ముందుగదిలో గాఢ నిద్రపోయింది. పంచశిఖలు పెట్టించుకుని, కళ్ళకు కాటుక, కాళ్ళకుపారాణితో ముచ్చటగావున్నాడు వడకపెళ్ళికొడుకు, పెద్దన్నయ్య చిన్నకొడుకు.
   
    'వడకముహూర్తం బాగుందంటే, తొందరలో పెట్టుకున్నాం - మామగారు ఇక్కడే చేయమని మరీ అడిగారు. పెద్దక్కయ్య ఇప్పుడే బస్సుకి వెళ్ళిపోయింది. వాళ్ళమ్మాయి పురిటి కొచ్చిందిట సీతమ్మకు అత్తగారి ఆరళ్ళు కదా! నీకు ఉత్తరం రాశాము ఆలస్యంగా అందిందా - పెద్ద వదిన మాటలను బట్టి తను ఉత్తరం అంది వచ్చాననుకుంటున్నారు - శారద తలతిరిగినట్టే అయింది. ఏం చెప్పాలోతోచలేదు. తను అనుకున్నదొకటి, అయిన దొకటి. మళ్ళీ క్రిందటి మాటులాగే నాన్నగారితో విడిగా మాట్లాడటానికే కుదరదు - అన్నయ్యలు, వదినలు పిల్లలు వారం పదిరోజులు వుండేట్టేవున్నారు. పిల్లలకి సెలవులు - పెద్దాళ్ళు సెలవులు పెట్టుకుని వచ్చి వుంటారు - శారదకి చాలా నిరాశగా అనిపించింది. అలాగే కూచుంది గదిలో "కాళ్ళూ చేతులు కడుక్కో భోజనం చేద్దువుగాని", పిన్ని అంది శారదతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS