Previous Page Next Page 
విశిష్ట పేజి 17

    "నేను అటే వెడుతున్నాను. అభ్యంతరం లేకపోతే నా కారులో రావచ్చు. నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెడతాను" రోడ్ సైడ్ న పార్క్ చేసిన తన కారుకేసి నడుస్తూ అన్నాడు పృధ్వీ.

    కొత్తగా తళతళలాడిపోతున్న కారువంక, మన్మధుని వింటి నుండి దూసుకొస్తున్న పూలబాణంలా వున్న అతడివంకా అపురూపంగా చూస్తూ  "వద్దు సార్! నడిచెళ్ళిపోతాను. మాకు నడక అలవాటే!" అంది శర్మిష్ట.

    "మొహమాటపడక్కరలేదు అమ్మాయ్. నా స్టూడెంట్ చెల్లెలివి. ఆ వరుసన నువ్వు నాకు చాలా దగ్గరిదానివి. నేను వెడుతున్నది అటే కదా డ్రాప్ చేసి వెడతానంటున్నాను."

    "వద్దు సార్! ఎప్పుడూలేనిది కారులో మా ఇంటిముందు దిగితే చూసిన వాళ్ళు ఏమైనా అనుకొంటారు. అసలే మా వీధివాళ్ళు మంచివాళ్ళు కాదు. నేను నడిచే వెడతాను."

    "అబ్బా! వట్టి భయస్థురాలిలా వున్నట్టున్నావ్" భుజాలు అదోలా ఎగరేసి కారు డోర్ తీసి ఎక్కి స్టీరింగ్ అందుకొన్నాడు.

    అతడి జవాబు కోసం చూడకుండా సంచీ తీసుకొని గబగబా నడక సాగించాడు శర్మిష్ట.

    ఆమె ఇల్లు వచ్చాక ఇంటి గేటు తెరుస్తూంటే వెనుక కారు హారన్ శబ్దం వినిపించి తలత్రిప్పి చూసి నివ్వెరపోయింది.

    ఆమెను అనుసరిస్తూ స్లోగా కారును నడుపుతూ వచ్చిన పృధ్వీ తల కొద్దిగా బయటికి పెట్టి ఒక తమాషా నవ్వు విసిరి "మీ అక్కకి చెప్పు  -మీ ఇల్లు తెలిసిందని. బై!" అని చెప్పి అప్పుడు పోనిచ్చాడు కారుని స్పీడుగా.

    శర్మిష్ట గేటు మూసి ఇంట్లోకి వస్తూనే "ఇప్పుడొక తమాషా జరిగిందక్కా!" అంది.

    "ఏమిటే? ఏం జరిగింది?"

    "బజారులో మీ ఇంగ్లీషు సార్ నన్ను నువ్వనుకొని 'హలో విశిష్టా' అని పలకరించాడు. నేను నీ చెల్లెలినని తెలిశాక మనం ఇద్దరం అక్కచెల్లెళ్ళలా కాక ట్విన్స్ లా వున్నామన్నాడు. నన్ను తన కారులో దిగబెడతానంటే వద్దనేసి నడిచివస్తుంటే ఆయన నావెంటే కారులో వచ్చి నాకు 'బై' చెప్పి 'మీ ఇల్లు తెలిసిందని మీ అక్కకి చెప్పు'అన్నాడు.

    "తెలిస్తే ఏమైందట?" అదొక విశేషం కాదన్నట్లుగా అందేగాని ఆమె ముఖం వివర్ణమైంది.

    "మీ ఇంగ్లీష్ లెక్చరర్ చాలా హాండ్ సమ్ గా వున్నాడే! మీ కాలేజీలో అమ్మాయిలు అతడంటే పడి చస్తుండాలే!"

    "పడి చస్తూనే వున్నారు కదా! మొన్న కరుణ కాల్చుకొని చచ్చింది వీడివల్లే కదా?"

    "ఓ! ఆ విలన్ ఇతడేనా! అంత విలనీ వుందా ఇతడిలో? మొహం చూస్తే అలా అనిపించడే!"

    "భగవంతుడు కొందరిని మేకవన్నె పులులుగా పుట్టిస్తాడు."

    "కాని అతడు మనం అనుకొన్నంత విలన్ కాదేమో! అతి అందగాడు . అతడంటే చాలామంది అమ్మాయిలే పడిచస్తారు. పడిచచ్చిన ఆడపిల్లలందరినీ అతడు పెళ్ళాడలేడు కదా? అతడిని పెళ్ళాడే అదృష్టం ఒక్కరికే దక్కుతుంది. అది అతడు మనస్పూర్తిగా ఇష్టపడ్డ అమ్మాయికే వుంటుంది"

    "ఏమిటే! అతడివైపు వకాల్తా పుచ్చుకొన్నావు?" కోపంగా అడిగింది.

    "ఏ నాణానికైనా బొమ్మా, బొరుసు రెండూ వుంటాయి. ఒకేవైపు చూసి మాట్లాడడం తప్పు. రెండోవైపు కూడా చూడాలి. కరుణక్క మోసపోయిందంటే తప్పు ఆమెదే. తనొక ఆడపిల్లనని పెళ్ళికి ముందు ఎఫైర్స్ పెట్టుకోకూడదన్న తెలివి ఆమెకుండాలి. ఆ తెలివి ఆమెకు లేకపోయాక అతడిని నిందించడం దేనికి? అతడు బలవంతంగా ఆమెను పాడుచెయ్యలేదు కదా? దీపానికి కాల్చడం దాని సహజగుణం. పురుగు ఆకర్షితురాలై ఎగిరెళ్ళి తన రెక్కలు కాల్చుకొంటే అది దాని తప్పే గాని దీపానిది కాదు కదా?"

    "నీది వట్టి కుతర్కం. అతడు ప్రేమ నటించందే ఇది ప్రేమలో పడిందా! ఆమెను అనుభవించి పెళ్ళిమాట వచ్చేసరికి తనకేమీ తెలీదనడం......"

    "ఆగాగు! ఒక ఆడది వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయి మీద పడుతుంటే అతడేం ప్రవరాఖ్యుడా? సగటు మగవాడు. ఈ దేశంలోనైనా ఏ దేశంలోనైనా సగటు మగవాడి మనస్తత్వం ఒక్కటే. తనకు తానుగా వలచి వచ్చిన ఆడదాని పొందును వదులుకోలేడు. పొందు దొరికిందికదాని ఆమెను మెడకు తగిలించుకోలేడు."
    "ఛీ! ఛీ! వాడిని సమర్ధిస్తూ మాట్లాడే వాళ్ళు కూడా వుంటారని తెలియదు"

    "నేననేది ఏమిటంటే ఈ విషయంలో ఇద్దరిదీ తప్పుందంటాను. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు."

    "జీవితంలో నీకే పృధ్విలాంటి మనిషి ఎదురయ్యాడనుకో! ఏం చేస్తావు? మగవాడిలో ఈ బలహీనతలు, వ్వవహారాలు మామూలేనని స్వీకరిస్తావా?"

    "ఛ ఛ! అలాంటి నికృష్టుడిని నేను స్వీకరించడం ఏమిటి? అలాంటి మనుషులు నాకు అరికాలికింద చెప్పుతో సమానం. అలాంటి వాళ్ళను ఆమడ దూరంలో వుంచి మాట్లాడుతాను."

    "నీకు రెండు నాలికలున్నట్టున్నాయే!"

    "లా గ్రాడ్యుయేషన్ చేయాలని వుంది. దానికి నేను ఎంతవరకు సరిపోతానా అని చూసుకొంటున్నాను"

    మరునాడు పృధ్వీ కాలేజీలో కలిసి అన్నాడు -"నిన్న మీ సిస్టర్ కనిపించింది. పిల్ల లడ్డూలాగుంది."

    "అది లడ్డే కాదు, చిచ్చుబుడ్డి కూడా. దగ్గరికెళ్ళి చూడు కాల్చి పెడుతుంది" గుర్రుగా అంది విశిష్ట.

    "అలాగా! అయితే ఒక పట్టు పట్టి చూస్తాను. అక్కా, చెల్లెళ్ళతో దోబూచులాట చాలా రసవత్తరంగా వుంటుంది కూడా."

    "నీ ఆటలు సాగేది కరుణలాంటి అమాయకుల దగ్గర. మాలాంటి వాళ్ల దగ్గర ఆడుకోవాలంటే చెప్పుదెబ్బలూ, చీపురు దెబ్బలూ తినాల్సి వస్తుంది."

    పృధ్వీ కులాసాగా ఒక నవ్వు నవ్వి అన్నాడు - "ఏమి తింటానన్నది తరువాతి ప్రశ్న నేను నీతోటే ఆడతాను. అదే - అమ్మానాన్నల ఆట! నయాన కాకపోతే భయాన! నేను రసిక పురుషుణ్నే కాని ఇంతవరకు ఎవరినీ పాడుచెయ్యలేదు బలవంతంగా. ఇష్టపూర్తిగా నా కౌగిలిలోకి వచ్చిన వాళ్ళనే అనుభవించాను. ఆనందించాను. ఈసారి బలవంతంలోని రసానుభూతిని నువ్వు నాకు అందివ్వబోతున్నావన్న మాట."
 
    "నా బొందిలో ప్రాణముండగా నేను నీకు లొంగను"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS