"ఆహా అంతటి మొనగత్తెవా? మగవాడి చెయ్యి పడనంతవరకే ఈ విర్రవీగుడంతా. పడిందా మైనంలా కరిగిపోతావు. ఎందరు నా చేతుల్లో మైనపు బొమ్మలు కాలేదు? పెళ్ళి చేసుకొని ఒక బిడ్డ తల్లి కూడా అయిన సుష్మ నా కౌగిలి మరిచిపోలేననంటుంది. అప్పుడప్పుడూ నా దగ్గరికి వచ్చి పోతూంటుంది."
"నేను నీ చేతిలో మైనపు బొమ్మను కాను. కావాలనుకొంటే నీ పాలిట మానవబాంబును కాగలను. నీలాంటి ఒక చీడపురుగును అంత మొందించడంలో నా చావుకి ఒక అర్ధం ఏర్పడుతుంది."
"నువ్వేమిటి? ఝాన్సీ వనుకొంటున్నావా? రుద్రమదేవి వనుకొంటున్నావా? నిన్ను నువ్వు మరీ అంత ఎక్కువగా అంచనా వేసుకోవద్దు. అలా వేసుకొనేవాళ్ళెప్పుడూ బోర్లాపడతారు."
"అజి నీక్కూడా వర్తిస్తుంది."
"ఓ.కె! ఒప్పుకొంటున్నాను. అహంభావం నాకూ వుంది. మనిద్దరం సమవుజ్జీలం. అందుకే నువ్వంటే నాకు ఇష్టం పెరిగిపోతుంది. ఎందుకొచ్చిన లడాయి మన మధ్య? ఈ చేతిలో ఎర్రజెండా పారేసి ఆకుపచ్చ జెండా పట్టుకోరాదూ? సెలవు పెట్టి హాయిగా హనీమూన్ కి తీసికెడతాను. ఏ గోవా బీచ్ లోనో సన్ బాత్ చేస్తూ.......చాలా మజాగా వుంటుంది........"
ఎంత తిట్టినా చీమ కుట్టినట్లయినా వుండదతడికి. పైగా ఆ నవ్వొకటి.
దూషణ భూషణలకు అతీతమైనట్టుగా.......చిద్విలాసమైన నవ్వు.
"ఛీ! బురదలో రాయి వేసినట్టుగా ఇంత సేపు నీతో సంభాషణ పొడిగించడమే నేను చేసిన తప్పు.
చివ్వున వెనుతిరిగింది విశిష్ట.
ఎలా ఈ సమస్య నుండి బయటపడడం?
ఒక లెక్చరర్ తనతో చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడని అతడి నిజ స్వరూపం ఇదని బయట పెట్టి స్టూడెంట్స్ తో తన్నిస్తే?
ఇంట్లో ఈ విషయం ఎట్టి పరిస్థితిలోనూ తెలియడానికి వీల్లేదు. తెలిస్తే చదువు మానేసి ఇంట్లో కూర్చోమంటారు. పెళ్ళయ్యేదాకా ఇంట్లో కూర్చొని ప్రైవేటుగా ఏవైనా పరీక్షలకు కట్టుకోమంటారు.
అతడి భయంతో కాలేజీ మానేయడమంత పిరికితనం మరొకటుండదు.
సుభాషిణి మేడమ్ ఏదైనా సలహా చెబుతుందనుకొంటే అమెరికాలో వున్న చెల్లెలి దగ్గర మూడు నెలలుండి రావడానికి ఎన్నోనాళ్ళుగా ప్రయత్నిస్తున్న వీసా దొరికి ఆమె సెలవుపెట్టి అమెరికా వెళ్ళిపోయింది.
సుబ్బరాయశర్మగారిల్లు తమ వీధిలోనే వుంది. ఒకసారి ఆయన్ని కలిసి చెబితే?
పృధ్వీ ఆయనకి శిష్యుడేనట. ఆ చనువుతో ఆయన అతడిని మందలించొచ్చు.
విశిష్ట వెళ్ళినప్పుడు శర్మలేడు. ఆయన భార్య నవరత్నం వుంది.
"మాస్టారున్నారా అమ్మా?"
"లేరు బజారు వెళ్ళారు"
"ఎప్పుడొస్తారు?"
"ఎప్పుడొస్తారో నాకేం తెలుసు? ఎవరైనా తగిలితే బాతాఖానీ కొడుతూ గంటలు గంటలు వుండిపోతారు" ఆవిడెందుకో చిరచిరలాడుతూ అంది.
"వెళ్ళి ఎంతసేపైంది?"
"ఘంటైంది"
భర్తను కలవడానికి ఎవరైనా ఆడపిల్లలు వస్తే ఆమెకు బోలెడంత అనుమానం. "ఏమైనా చెప్పించుకోవాలంటే కాలేజీలోనే చెప్పించుకోవాలి. ఏదైనా అడిగేదుంటే కాలేజీలోనే అడగాలి. ఇంటికేం పని?" అంటుంది.
అసలు కో- ఎడ్యుకేషన్ కాలేజీలో చదివే అమ్మాయిలంటే ఆమెకు సదభిప్రాయం లేదు. రోజూ మగవాళ్ళమధ్య మసలుతూ వాళ్ళు పవిత్రంగా వుంటారంటే ఆమె నమ్మలేదు.
"సార్ వచ్చేవరకు నేనిక్కడ కూర్చోవచ్చా?" కొద్దిగా జంకుతూనే అడిగింది.
ఆవిడ ఎందుకో అయిష్టంగానే తలూగించింది.
ముందు గదిలోనే వున్న కుర్చీలో కూర్చుంది. కాలక్షేపం కోసం టీపాయ్ మీదున్న మాగజైన్ చేతికి తీసుకుంది.
మధ్య మధ్య నవరత్నం ఈ పిల్లను తొంగిచూసి పోతోంది.
అరగంట గడిచినా శర్మ రాలేదు.
చీకటి పడింది.
ఆమె గదిలోకి వచ్చి లైటు వేసి "ఆయన వచ్చేసరికి ఎంత రాత్రవుతుందో! ఎంతసేపని కూర్చుంటావు? చీకటిపడేదాక బయట తిరిగితే మీ వాళ్ళు ఏమీ అనరూ? ఆయనతో ఏమైనా చెప్పేది వుంటే నాతో చెప్పి వెళ్లు. నేను చెబుతాను. లేకపోతే రేపు కాలేజీలో ఎలాగూ కలుస్తారుగా? అక్కడ మాట్లాడొచ్చు."
"లేదండీ! మాస్టారుతో అర్జంటుగా మాట్లాడే పని వుంది. కాస్త ఆలస్యమైనా ఫర్వాలేదు. కూర్చంటాను."
"నాతో చెప్పకూడనిదీ, ఆయనతో మాట్లాడేది ఏముంటుందట మీ యిద్దరి మధ్యన? కాలేజీ విషయాలేమైనా ఉంటే కాలేజీలో మాట్లాడుకోవాలి గాని యింటికే వచ్చి తిష్టవేయడం ఏమిటిట? అదీ రాత్రిపూట? ఆయన పని చేసే కాలేజీలో ఆడపిల్లలు కూడా చదువుతున్నారన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఈ ఆడపిల్లలకి చదువు మీద ధ్యాసా సున్నా! షోకులు, షికార్లు తప్ప."
విశిష్ట తెల్లబోయింది.
ఎలాగో గొంతు పెగుల్చుకుని అంది "మీరు......ఏదేదో మాట్లాడుతున్నారు. ఈయన నాకు తండ్రిలాంటివారు. నా తండ్రి వయసువారు!"
"తండ్రీ కూతురు? అనుకోగానే అయిపోతారా? మా ఊళ్ళో రాజారావని ఒకాయన వుండేవాడులే. భార్య చనిపోతే కూతురితోనే సంబంధం పెట్టుకుని- 'నేను కాయించిన పండు నేను తింటే తప్పేమి'టని వాదించేవాడాయన! 'నాన్నా' అని నోటితో పిలుస్తూ రాత్రి పక్కలో పడుకునే కూతుళ్ళున్నారులే. నీకాయన తండ్రి లాంటివారంటే నాకాయన సంగతి గుర్తొచ్చింది. నవ్వొస్తుంది."
