Previous Page Next Page 
విశిష్ట పేజి 16

    "రేపు ఇంగ్లీష్ పరీక్ష పెట్టుకొని కూరగాయలకోసం బజారుకు వెడతావా? నేను వెళ్ళొస్తాను. నాకేం పనిలేదు. బజారునుండి ఏమేం తేవాలి చెప్పమ్మా. లిస్ట్ వ్రాసుకుంటాను" విశిష్ట పెన్నూ, కాగితం పట్టుకొని తల్లిని అడిగింది.

    "చదివీ చదివి బుర్ర వేడెక్కిపోయిందే! కాస్సేపు పరీక్షల ధ్యాస మరిచిపోయి అలా వెళ్ళొస్తే మనసు రిలాక్స్ అవుతుంది. ఆ లిస్ట్, డబ్బుల సంచీ ఇలా ఇవ్వండి నేనే వెళ్ళొస్తాను" అంది శర్మిష్ట.

    విశిష్ట లిస్ట్ కాగితం, డబ్బూ సంచీ ఇచ్చింది చెల్లెలి చేతికి.

    "నాన్నగారికి బ్రెడ్డూ, మందులూ కావాలేమో అడిగి వెళ్ళమ్మా! కూరగాయలతోపాటు మందులూ తేవచ్చు" అంది తల్లి అన్నపూర్ణ.

    శర్మిష్ట తండ్రి గదిలోకి వెళ్ళి  "కూరగాయలు తీసుకురావడానికి బజారుకు వెడుతున్నాను. మీకేమైనా బ్రెడ్డూ,  టాబిలెట్స్ కావాలేమో అడిగి వెళ్ళమంది అమ్మ."

    "రెండు రోజులుగా తింటున్నది బ్రెడ్డేకదమ్మా! తినితినీ ముఖం కొట్టింది. బ్రెడ్డొద్దుగాని దగ్గు విపరీతంగా బాధిస్తోంది. సుధా మెడికల్ హాల్ సత్యం తెలుసుకదమ్మా? దగ్గు తొందరగా తగ్గడానికి ఏదైనా మంచి దగ్గుటానిక్ ఇమ్మను. డబ్బులు జీతం రాగానే పే చేస్తానని చెప్పు" ఆయన తెరలు తెరలుగా వస్తున్న దగ్గువల్ల ఆయాసపడుతూనే చెప్పాడు.

    "అప్పు అడగడానికి నాకు సిగ్గేస్తుంది నాన్నా! పది పదిహేను రూపాయలకంటే ఎక్కువ అవుతుందా దగ్గు టానిక్? నా దగ్గరున్నాయి డబ్బులు. నేనిచ్చి తెస్తాగాని జీతం రాగానే ఒక రూపాయి వడ్డీకలిపి ఇచ్చేయాలి ఏం?"

    "ఒక్క రూపాయేనా? రెండిస్తాగాని అలాగే తీసుకురా తల్లీ."

    పిల్లలకి పాకెట్ మనీగా ఇచ్చే పదో పాతికా అలాగే కూడబెట్టి అవసరం వచ్చినప్పుడు తండ్రికి అప్పు ఇవ్వడం మామూలే. జీతం రాగానే ఒకటో రెండో వడ్డీకింద ఇచ్చేస్తుంటారాయన.

    విశిష్ట, శర్మిష్ట ఇద్దరూ రెండు కళ్ళలాంటి వాళ్ళాయనకు.

    తొలి కాన్పులోనూ, మలికాన్పులోనూ ఇద్దరూ ఆడపిల్లలే పుట్టగానే మూడోసారి కొడుకు పుడతాడని భార్య ఆశపడ్డా ఆయన వినలేదు. ఎవరికీ చెప్పుకండా వెళ్ళి ఆపరేషన్ చేయించుకు వచ్చేశారు. వచ్చాక చెప్పాడు 

    వంశోద్దారకుడు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకువచ్చిన కొడుకును తల్లి చెడామడా తిట్టింది.

    "నీ చాదస్తం కాకపోతే మూడో కాన్పులోనూ కొడుకు పుడతాడని గ్యారెంటీ ఏమిటమ్మా? మూడోసారి ఆడపిల్లే పుట్టొచ్చుగా? నాకు చాలు ఈ ఇద్దరూ! మగపిల్లలైనా, ఆడపిల్లలైనా నాకు ఒక్కటే. మగపిల్లాడు లేడని నాకు లేని బాధ నీకెందుకు?" అంటూ సమాధానం చెప్పిన రామకృష్ణ ఇద్దరు పిల్లల్నీ ఎంతో అపురూపంగా పెంచుకున్నాడు.

    ఇద్దరూ చదువులో క్లాస్ ఫస్ట్.

    "నీ పిల్లలిద్దరూ చదువులో జెమ్స్ అనుకో. ఇద్దరూ నీకు కీర్తితెచ్చే పిల్లలేనయ్యా! వాళ్ళు ఎంతవరకు చదువుతానంటే అంతవరకు చదివించు. పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళే కదాని అనుకోకుండా వాళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు చదివించు. ఖర్చుకు వెనుకాడవద్దు" అని చెప్పాడు వాళ్ళు మాస్టారొకాయన. విశిష్ట టెన్త్ లో క్లాస్ ఫస్ట్ వచ్చిన సందర్భంగా.

    శర్మిష్ట ముందు కూరగాయలు కొని, కిరాణాకొట్టుకు వెళ్ళి తల్లి చెప్పినవి తీసుకుని తరువాత సుధా మెడికల్ హాల్ కి వెళ్ళింది.

    ఆమెను చూడగానే "ఏమ్మా! నాన్నగారికి సుస్తీ తగ్గిందా?"  అని అడిగాడు సత్యం.

    "జలుబుకు తోడు దగ్గు మొదలైంది అంకుల్! దగ్గు త్వరగా తగ్గిపోవడానికి మంచి పవర్ ఫుల్ మందు ఇమ్మన్నారు నాన్నగారు!"

    సత్యం దగ్గు టానిక్ బాటిల్ ఒకటితీసి కౌంటరు మీద పెట్టి చెప్పాడు" ఇది వాడమని చెప్పమ్మా. రెండు పూటలు పడగానే దగ్గు తగ్గిపోతుంది"

    "బిల్లివ్వండి అంకుల్"

    బిల్లు వ్రాశాడు సత్యం.

    పదహారున్నర.

    పర్సులోంచి డబ్బులు తీసి ఇచ్చేసి బాటిల్ బాగ్ లో సర్దుకుని మెట్లు దిగుతుంటే "హలో విశిష్టా!" అని విష్ చేసిన వ్యక్తికేసి చూసింది.

    ఎదురుగా నిలువెత్తు సుందరాకారం!

    కాఫీ కలర్ పాంట్ కి తెల్లటి బుష్ షర్ట్ టక్ చేసి హుందాగా వున్నాడు.

    తన స్టయిలే వేరన్నట్టుగా వ్రేళ్ళమధ్య సుతారంగా పట్టుకొన్న సిగరెట్టు!

    అతడు శర్మిష్టను ఎగాదిగా చూసి "అరే! విశిష్ట అనుకున్నాను ఆమె మీకేమౌతారు?" అనడిగాడు.

    "ఆమె మా సిస్టర్!"

    "సిస్టరంటే మీరు పెద్దా? ఆమె పెద్దా?"

    "ఏం? నేనంత పెద్దదానిలా కనిపిస్తున్నానా?" ఒళ్ళు మండినట్లుగా అడిగింది శర్మిష్ట.

    "ట్విన్సా?"

    "కాదు! అది నాకంటే రెండేళ్ళు పెద్దది."

    "వండర్! మీరిద్దరూ ట్విన్స్ లా వున్నారు!" ఆశ్చర్యం గుమ్మరించాడు.

    "ఇంతకీ తమరెవరు మహాశయా?"

    "విశిష్ట నా స్టూడెంట్. నేనా కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ని."

    "క్షమించండి సార్! ఎవరో ఏమిటో అనుకున్నాను" నాలిక కరుచుకుంది.

    "పొరపాటు సహజమే కదా? నేను నిన్ను విశిష్ట అనుకోలేదూ?"

    "వస్తాను సార్! బరువుగావున్న సంచీ చేయి మార్చుకుంటూ అంది.

    "ఇంతకీ మీ ఇల్లు దగ్గరేనా?"

    "దగ్గరంటే మరీ దగ్గరకాదు. దూరమంటే మరీ దూరం కాదు."

    "తమాషాగా మాట్లాడతావే! ఇంతకీ మీ ఇల్లు ఎటు?"

    చెప్పింది శర్మిష్ట.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS