"జాబువ్రాసి వారంరోజులైంది కదే? ఇంకాజవాబు లేదు. జానకి ఎంత మారిపోయిందో అక్కడికి వెళ్ళి! నా పిచ్చికొద్దీ వ్రాసినట్టున్నాను!"
"పిచ్చి కాకపోతే ఏమిటమ్మా?వాళ్ళకి మనం జ్ఞాపకమున్నామా? వాళ్ళు లక్షాధికార్లు! వాళ్ళకి తగ్గవాళ్ళతో స్నేహంచేస్తారు! వాళ్ళకి తగ్గవాళ్ళతో వియ్యమందుతారు! కులం లేని, సంప్రదాయంలేని, డబ్బులేని నీతో వియ్యమందుతారా?"
"కులం, సంప్రదాయం జానక్కి మాత్రం ఉన్నాయా? తనూ కులాంతరం చేసుకొన్నదేగా?"
"డబ్బుందమ్మా వాళ్ళకి అవేవీ లేకపోయినా!"
జాబు వ్రాసిన పదిహేనురోజుల వరకూ జవాబు కోసం ఎదురుచూసిన రుక్మిణి, ఇక ఎదురుచూడడం మానుకొంది.
రేయింబవళ్ళు ఒకటేచింత రుక్మిణికి. పిల్ల పెళ్ళి ఎలాచేయాలి? పిల్లనిస్తానని ఎవరి దగ్గరికెళ్ళాలి? ఎవరి దగ్గరికైనా ఏ ముఖం పెట్టుకు వెడుతుంది?
పిల్ల పెళ్ళిచేయడం కష్టసాధ్యం అని మనసుకు తోస్తున్నకొద్ది, తను తన మేనత్తల్లా కృష్ణారామా అని పడి ఉండక మళ్లీ పెళ్ళి ఎందుకు చేసుకొన్నానా అని పశ్చాత్తాప పడసాగింది. మోడావారిన జీవితంలో వసంతం చివురింపజేసుకొందేమోగాని, ఆ వసంతంలో పూచినపువ్వుకు ఎక్కడా చోటులేకుండా పోతూందే? తను మళ్ళీ పెళ్ళి చేసుకొన్న దుష్పలితం తన కూతురు అనుభవించాల్సివస్తూందే?
* * *
ఒక తెల్లవారుఝామున మంచినిద్రలో ఉన్న సంధ్యని తట్టిలేపింది రుక్మిణి. "సంధ్యా! నాకు గుండెల్లో నొప్పిగా అనిపిస్తూందే! రాత్రంతా నిద్రలేదు. కాస్త వేడి వేడిగా ఏమైనా కాపుతావా?"
"రాత్రంతా నొప్పితో బాధపడుతూ నన్నులేపలేదేమిటమ్మా?"
"మంచి నిద్రలో ఉన్నావు! లేపడానికి మనసొప్పలేదు!"
సంధ్య గబగబా వంటింట్లోకి వెళ్ళి కుంపట్లో బొగ్గులు రాజేసి పెనం వేసి తెచ్చింది.
గుండెలమీద వెచ్చవెచ్చగా కాపుతూంటే కళ్ళుమూసుకొంది రుక్మిణి.
'రాత్రంతా నిద్ర లేదుగా? వేడి వేడిగా కాపడం పెట్టేసరికి కాస్త ఉపశమనం అనిపించి నిద్రపట్టినట్టుంది!' అనుకొంది సంధ్య. కాస్సేపు అలాగే కాపి, తలగడ సరిజేసి, తల్లి తలను జరుపుతూంటే సంధ్య గుండెల్లో జల్లుమన్నట్టుగా అయింది.
అరమూసిన కన్నులు నిర్జీవంగా కనిపించాయి.
"అమ్మా! అమ్మా!" గాబరాగా పట్టుకు ఊపేసింది.
రుక్మిణి ప్రాణం అప్పటికే పోయింది. ఆ సంగతి నిర్ధారణ కాగానే గొల్లుమంది సంధ్య.
* * *
బ్రతికుండగా తల్లీకూతుళ్ళ ఊసు ఎవరికీ పట్టలేదుగాని, చనిపోయాక ఆమె శరీరాన్ని త్వరగా ఊరినుండి కదిలించడానికి దయతో ముందుకు వచ్చారు కొందరు. ముఖ్యంగా వెంకటనర్సమ్మగారు ఆ పనికి ఆధిపత్యం వహించారు.
కావలివాళ్ళని పిలిపించడం, కుమ్మరివాళ్ళకి, మేదరివాళ్ళకీ కబురు పంపడం - మొదలైన కార్యక్రమాలన్నీ ఆవిడ చేతిమీదుగానే నడిచాయి.
మోయడానికి నలుగురు యువకులు ముందుకు వచ్చారు.
బోరుబోరుమని సంధ్య ఏడుస్తూంటే నర్సమ్మగారే గుండెలో పొదువుకొని ఓదార్చింది.
రుక్మిణి బ్రతికిఉండగా ఎవరూ సానుభూతి చూపలేదుగాని, ఇప్పుడు తల్లిని పోగొట్టుకొని దిక్కులేని పక్షిలా అయిపోయిన సంధ్యనిచూసి కంటతడి పెట్టనివారు లేరు.
* * *
కొద్దిరోజులు గడిచాయి.
ఒకరోజు రాత్రి పన్నెండుగంటల ప్రాంతంలో పరిగెత్తుకు వచ్చింది నర్సమ్మగారింటి తలుపు తట్టింది సంధ్య.
"అత్తమ్మా! నాకు నిద్రపట్టడంలేదు ఇంట్లో! ఒంటరిగా భయం వేస్తూంది!" అంది ఆవిడ తలుపు తెరవగానే.
"మీ అమ్మ పోయినప్పుడే చెప్పానుకదే, ఒంటరిగా ఆడపిల్లవు ఎలా ఉంటావు, వచ్చి నా దగ్గరుండమని?"
"ఈ రాత్రి ఇక్కడే పడుకొంటానత్తమ్మా!"
"పడుకోవే! అదికో, అక్కడ చాపుంది. వేసుకుపడుకో!"
"ఎల్లమ్మ కొడుకు సుబ్బయ్య నిన్నటినుండి ఇంటిముందు తచ్చాడుతున్నాడు. రాత్రి పడుకోబోయేప్పుడు తలుపులు వేస్తూంటే వాకిట్లో నిలబడి కనిపించాడు. తలుపులు వేసి పడుకొంటే పెరటితలుపు తట్టిన చప్పుడు. భయంవేసి తలుపులు తెరుచుకొని పరిగెత్తుకు వచ్చాను!"
