Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 17

    "అరెరె.... మీరుకూడా వచ్చారే!" అప్పుడే చూస్తున్నట్టు నటిస్తూ అన్నాడు కన్నారావు. "మీరు ఇప్పుడే వచ్చారా?"


    "నేను మొదట్నుండీ ఉన్నాను. మా స్నేహితురాలి పెళ్ళికి మొదట్నుండీ లేకపోతే ఎలా?" అంది ఆ అమ్మాయి.


    "మరి మీరు నాకు ఇందాకట్నుండీ కనిపించలేదేం?" ఆశ్చర్యంగా అడిగాడు కన్నారావు.


    "మీరు, మీ ఫ్రెండూ రావడం నేను చూశాను. నేను మండపం ఎదురుగా వున్న స్తంభం ప్రక్కన కూర్చున్నాను. స్తంభం మీకు అడ్డుగా ఉండడం వల్ల నేను మీకు కనిపించలేదు"


    "చూశారా ఎంత అన్యాయమో! నేను  మీకు కనిపించినా కూడా మీరు నన్ను పలకరించలేదు"


    "ఎందుకు పలకరించాలి?" అడిగింది ఆ అమ్మాయి కొంటెగా చూస్తూ


    ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక బుర్రగోక్కుని తెచ్చిపెట్టుకుని నవ్వాడు కన్నారావు.


    సరిగ్గా అదే సమయంలో కన్నారావుకి ఎందుకో అనుమానం వచ్చి చుట్టుప్రక్కల వాళ్ళని గమనించి చూశాడు.


    ఆడవాళ్ళందరూ సీరియస్ గా కన్నారావు వంక చూడసాగారు.


    "చూశారా? నేను మీతో మాట్లాడుతుంటే వీళ్ళందరికీ ఎంత జెలసీగా ఉందో!! ఎంత కోపంగా చూస్తున్నారో చూడండి" అన్నాడు ముందుకు వంగి మెల్లగా ఆమెతో.


    ఆ అమ్మాయి కిసుక్కున నవ్వింది.


    "వాళ్ళంతా అందుకేం చూడడంలేదు. ఇందాకట్నుండీ సాంబార్... సాంబార్ అని మిమ్మల్ని పిలుస్తున్నారు. మీరు నాతో మాట్లాడతూ అది గమనించలేదు..."


    "అయ్యో! మరి మీరు నాకా విషయం చెప్పరేమండీ" నోటిమీద చెయ్యివేస్కుని కళ్ళు పెద్దవిచేసి చూస్తూ అన్నాడు కన్నారావు.


    "ఏం బాబూ సాంబార్? మా దగ్గరికి వచ్చేదిలేదా?" ఒక మధ్య వయస్కురాలయిన ఆవిడ విసుగ్గా మొహం పెట్టి అంది కన్నారావుని ఉద్దేశించి.


    ఆ అమ్మాయి కిసుక్కున నవ్వింది. కన్నారావుకి ఉక్రోషం వచ్చింది.


    "నా పేరు సాంబారుకాదు! కన్నారావు!! ఓ క్షణం ఆగండి వస్తున్నా" చిరాకుగా మొహంపెట్టి అని, "మీకు సాంబార్ వడ్డించనా?" అని ఆ అమ్మాయిని అప్యాయంగా అడిగాడు.


    "వద్దండీ... నాకు కూరలు కావాలి!!" అంది ఆ అమ్మాయి.


    కన్నారావు పక్కకి చూస్తే చింతపిక్క రంగు పట్టుచీర కట్టుకున్న అమ్మాయి ముందు చిట్టబ్బాయ్ తచ్చాడుతుండడం  కనిపించింది.
    "ఒరేయ్ చిట్టీ ఇలారా.. ఇక్కడ కూరలు కావాలంట!" అంటూ అతన్ని పిలిచాడు కన్నారావు.


    "నువ్వే ఇటురా... ఇక్కడ... ఇక్కడ సాంబార్ కావాలంట" అంటూ అక్కడ నుండి అరిచాడు చిట్టబ్బాయి.


    "ఇటు రారా అంటుంటే " కోపంగా అరిచాడు కన్నారావు.


    "నేన్రాను.. నువ్వే ఇటురా" కోపంగా అరిచాడు కన్నారావు.


    అంతలో అక్కడికి ముగ్గురు నలుగురు మగాళ్ళు వచ్చి వీళ్ళిద్దరి చేతిలోని కూరగుత్తి, సాంబారు బక్కెట్టు లాగేస్కున్నారు.


    "మీరు సరిగ్గా వడ్డించడంలేదు.... ఉన్నచోటే ఉండిపోతున్నారు" అన్నాడు ఒకతను కోపంగా.


    "ఈసారి నుండి సరిగ్గా వడ్డిస్తాంలే, ప్లీజ్ నా క్కూరగుత్తి నాకు ఇచ్చెయ్యండి" అన్నాడు చిట్టబ్బాయి బ్రతిమాలుతూ.


    "ప్లీజ్... నా సాంబార్ బక్కెట్టు కూడా నాకిచ్చెయ్యండి" కన్నారావు కూడా బ్రతిమలాడాడు.


    "వీల్లేదు!... మీరు గనక వడ్డిస్తే మగపెళ్ళివారు మన ఆడపెళ్ళి వారిని చెడతిడ్తారు వడ్డనలు బాగా చెయ్యలేదని"


    అది వింటూనే చిట్టబ్బాయి, కన్నారావులు మొహమొహాలు చూస్కుని ఘొల్లున నవ్వారు.


    "మీకా భయంలేదుసార్! మేం పెళ్ళికొడుకు తరపువాళ్ళం.. మీకేం పేర్లుపెట్టం, పెట్టనివ్వం" అన్నాడు చిట్టబ్బాయి. 


    చిట్టబ్బాయి చెప్పింది వినగానే వాళ్ళు చాలా కంగారుపడిపోయారు.


    "అయ్యయ్యో! మీరు పెళ్ళికొడుకు తరపువాళ్ళా! భలేవారే. మీచేత ఇలా పనిచేయిస్తే మాకు మాటొస్తుంది. మీరు శ్రమపడి వడ్డించడం ఏంటి సార్! హాయిగా కూర్చుని భోంచెయ్యండి" అంటూ వాళ్ళిద్దరూ ఎంత చెప్తున్నా వినకుండా ఇద్దర్నీ లాక్కెళ్ళి మగాళ్ళ పంక్తిలో కూర్చోబెట్టి భోజనం వడ్డించేశారు.


    "ఒరేయ్ చిట్టీ! మెల్లగా అన్ని రుచులు చూస్తూ మింగొద్దు, త్వరగా తిను. వాళ్ళు తినేసి లేచి వెళ్ళకముందే మనం పూర్తిచేయాలి" అన్నాడు కన్నారావు.


    అయిదు నిముషాలయ్యేసరికి చిట్టబ్బాయికి సంబంధించిన చేతి రుమాలు అమ్మాయీ ఇద్దరూ మిగతా ఆడవాళ్ళతోపాటు భోజనాలు ముగించి లేచారు. వాళ్ళని చూసి చిట్టబ్బాయి కన్నారావులు కూడా భోజనం మధ్యలో లేచి చేతులు కడిగేస్కున్నారు.


    అందరు హాల్లోకి వచ్చారు. చిట్టబ్బాయి తన పట్టుచీర అమ్మాయివంకే చూస్తూ నిల్చున్నాడు.


    "ఒరేయ్... నువ్వలాగే ఆ అమ్మాయిని చూస్తూ లొట్టలు వేస్తూ ఉండు... నేను ఆ అమ్మాయితో మాట్లాడివస్తా..." కన్నారావు చిట్టబ్బాయితో అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు.


    "ఏంటండీ... నాకు ఏమీ వడ్డించుకుండానే ఎక్కడికి అలా మాయమైపోయారు?" నవ్వుతూ అడిగింది ఆ అమ్మాయి.


    "అంతా మీరు చూస్తుండగానే జరిగిందిగా..." సిగ్గుపడ్తూ అన్నాడు కన్నారావు. సరేగానీ ఈవేళైనా మీ పేరు చెప్పరా?" మెల్లగా అడిగాడు.


    "చెప్పను" అంది ఆమె.


    "ప్లీజ్..." దీనంగా ఆ అమ్మాయి వంక చూశాడు.


    "పోనీ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా... సమాధానం చెప్తే నా పేరు చెప్తా"


    "సరే...."


    "మీరు చార్మినార్ పైదాకా ఎప్పుడైనా ఎక్కారా?"


    "ఓ... చాలాసార్లు..."


    చాలాసార్లు ఎక్కానని చెప్తే అది క్రికెట్ పాయింటేమో... అలాగయితే పేరు చెప్తుందేమోనని అలా చెప్పాడు.


    "అయితే చార్మినార్ పైదాకా చేరాలంటే ఎన్ని మెట్లు ఎక్కాలి?" నవ్వుతూ అడిగింది ఆమె.


    కన్నారావు తెల్లమొహం వేశాడు.


    "అదెలా చెప్పగలనండీ?" నీర్సంగా అన్నాడు.


    "చాలాసార్లు ఎక్కానని అన్నారుగా... మా మాత్రం చెప్పలేరూ... పోనీ నేను చెప్పానా?"


    "ఊ...."


    "చార్మినార్ పైదాకా చేరాలంటే..." అడిగింది.


    "ఊ.... చేరాలంటే?" కుతూహలంగా చూశాడు కన్నారావు.


    "ఉన్న మెట్లన్నీ ఎక్కాలి!"


    ఈసమాధానం చెప్పి కన్నారావుకి టాటా చెప్పి కమ్యూనిటీ హాలు ముందు తన కోసమే ఎదురు చూస్తున్న ఫ్రెండ్స్ దగ్గరికి చరచరా వెళ్ళి కారెక్కింది ఆ అమ్మాయి. కారు రయ్యిమని ముందుకు దూసుకుపోయింది.


    కన్నారావు నోరు తెరుచుకుని శిలా ప్రతిమలా నిల్చుండిపోయాడు.


    ఇంతలో చిట్టబ్బాయి వచ్చి భుజాలుపట్టి కుదిపేసరికి ఉలిక్కిపడి చూశాడు కన్నారావు.


    "ఒరేయ్... ఒరేయ్... ఆ అమ్మాయి వెళ్ళిపోతూంది" కంగారుగా అన్నాడు చిట్టబ్బాయి.


    "వెళ్ళిపోతూంది కాదు... వెళ్ళిపోయింది... కార్లో" అన్నాడు కన్నారావు శూన్యంలోకి చూస్తూ.


    "నీ అమ్మాయి గురించి కాదు.... నా అమ్మాయి గురించి చెప్తున్నా."


    "అయితే ఏమంటావ్?"


    "ఆ అమ్మాయిని ఫాలో అయ్యి ఎక్కడుంటుందో కనుక్కుందాం."


    "పద"
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS