ఇద్దరూ హడావిడిగా కమ్యూనిటీ హాలు బయటికి వచ్చారు. ఆ చింత పిక్కరంగు పట్టుచీర అమ్మాయి అప్పుడే ఒక ఆటోలో ఎక్కి కూర్చుంది. ఆ ఆటో ముందుకు కదిలింది.
చిట్టబ్బాయి కన్నారావులు అక్కడే ఉన్న మరో ఆటో చటుక్కున ఎక్కి ఆ ఆటో వెనకాల పోనివ్" అన్నారు.
"సొంతకారు ఎక్కి మీ డ్రైవర కి చెప్తున్నట్టు చెప్తున్నారే! నేను రాను!!" అన్నాడు ఆటోవాడు గీరగా.
చిట్టబ్బాయి జేబులోంచి పదిరూపాయలు తీసి ఆటోవాడి చేతిలోపెట్టాడు.
ఆటో రివ్వున ముందుకు కదిలింది.
* * *
చిట్టబ్బాయి సర్వస్ గా గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. అతనికి ఎంతో టెన్షన్ గా ఉంది. కన్నారావు వెళ్ళి గంటపైగా అయింది. ఇంకా ఎంత టైం తీస్కుంటాడో?.... ఎప్పటికి వస్తాడో!! అతనికి ఏమైనా ఆటంకాలు కలిగాయా?
ఇలా ఉన్నాయి అతని ఆలోచనలు. నిముష నిముషానికి వాచ్ వంక విసుగ్గా చూస్కుంటున్నాడు.
ఆ క్రితం రోజు మోహన్ పెళ్ళికి అటెండ్ అయిన తరువాత చిట్టబ్బాయి, కన్నారావులు ఆటోలో ఆ చింతపిక్కరంగు పట్టుచీర అమ్మాయి ఎక్కిన ఆటోని ఫాలో అయ్యారు.
ఆ అమ్మాయి ఎక్కిన ఆటో రయ్యిమని పరుగుతీస్తూంది. రాను రాను వీళ్ళిద్దరూ ఎక్కిన ఆటో వెనకబడిపోతూంది.
"ఏయ్ ఆటో... కాస్త స్పీడ్ గా పోనీవయ్యా!" కంగారుగా అన్నాడు చిట్టబ్బాయి ముందు వెళ్తున్న ఆటోమీది నుండి దృష్టి మరల్చకుండా.
"లేద్సాబ్... నేను మెల్లగానే పోనిస్తా" నింపాదిగా అన్నాడు ఆటోవాడు.
"అదేం?... ఎందుకలా?" చిరాకు పడ్తూ అడిగాడు చిట్టబ్బాయి.
"అర్రే సాబ్!... అగర్ మేం జోర్ గా పోతే ఆ ఆటోవాళ్లకు దిమాక్ లేదు... యాక్సిడెంట్లు ఈల్లవల్లే అవుతాయి అంటార్... గిప్పుడు నెమ్మదిగాపోతే జల్దీ పొమ్మంటార్... గిదేంది?" అన్నాడు ఆటోవాడు అంతకంటే చికాకుగా.
"మేమేమీ నిన్ను అన్లేదు కదా?..."
"అర్రే! మీరనకపోతే మంది అంటార్ సాబ్"
"అదికాదయ్యా... ఆ ఆటో ముందెళ్ళిపోతుంది కదా? అది మిస్ అవకూడదు... అందుకే త్వరగా వెళ్ళమంటున్నాం..." మధ్యలో కల్పించుకుంటూ అన్నాడు కన్నారావు.
"సమజైంది సాబ్.... కానీ స్పీడ్ గాపోతే టైర్లు ఖరాబవుతాయి సాబ్... రోడ్లంత గుంతల్ పడి ఎట్లున్నాయి మల్ల?..." అన్నాడు ఆటోవాడు.
"సర్లేనయ్యా... మీటర్ మీద రూపాయి ఎక్స్ ట్రా ఇస్తాం తీస్కో" మొహం చిట్లిస్తూ అన్నాడు చిట్టబ్బాయి.
"నై సాబ్.... రెండ్రూపాయల్ ఇవ్వాలె...."
"అలాగే.... అలాగే... త్వరగా పద...." పళ్ళుకొరికాడు చిట్టబ్బాయి.
అంతే...
సడెన్ గా ఆటో రెట్టింపు స్పీడుతో యిందుకు దూకింది. ఆ దెబ్బకి చిట్టబ్బాయి కన్నారావులు వెనక్కి తూలారు. వాళ్ళ తలలు సీటు వెనక భాగానికి ఠక్ మని కొట్టుకున్నాయి.
"ఛీపాడు!... ఏం సీట్లో ఇవి... రాళ్ళలా ఉన్నాయి... కాస్తయినా మెత్తగా లేవు" అన్నాడు చిట్టబ్బాయి బుర్రవెనక భాగాన్ని చేత్తో రుద్దుకుంటూ.
"అవును...." కన్నారావు కూడా బుర్రకాయ రుద్దుకున్నాడు.
"సీట్లు మెత్తగుండుంటే మూడ్రూపాయల్ ఎక్స్ ట్రా అడిగుండే టోన్నిసాబ్...." అన్నాడు ఆటోవాడు.
చిట్టబ్బాయి పళ్ళుకొరికి ఏదో అనబోయాడు. కానీ కన్నారావు చిట్టబ్బాయి భుజం తట్టి వారించాడు. "ప్రసుత్తం మనకి ఆటోవాడితో దెబ్బలాడ్డం ముఖ్యం కాదు, మన పని జరగడం ముఖ్యం. వాడితో వాదన పెట్టుకుంటే ఆటోని స్లో చేసేస్తాడు....' అన్నాడు మెల్లగా చిట్టబ్బాయి చెవిలో,
"అవును... అదీ నిజమే..." అని ముందుకు చూసిన చిట్టబ్బాయి కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచాడు.
"ఏమైంది?....." అడిగాడు కన్నారావు.
"ఆ ఆటో ఏది?" అంటూ కంగారుగా అన్నాడు చిట్టబ్బాయి.
"అరె... అవును!....ఏదీ?!!" కన్నారావు కూడా కంగారుపడ్డాడు.
"ఆ ఆటోని ఓవర్ టేక్ చేసి దాటొచ్చేసినా సాబ్... మల్ల మీరు జల్ది పొమ్మన్నార్ కదా?" అన్నాడు వాళ్ళ కంగారుని గమనించిన ఆటోవాడు.
చిట్టబ్బాయి బాధగా నెత్తి కొట్టుకున్నాడు.
"అది కాదోయ్... త్వరగా అంటే ఆ ఆటోని దాటి వెళ్ళమని కాదు! ఆ ఆటో మనకి అందకుండా వెళ్ళిపోకుండా దాని వెనకాలే వెళ్ళమని చెప్పాం.... ఆ ఆటో వచ్చేదాకా ఈ పక్కన ఆపు..." అన్నాడు కన్నారావు.
"హర్రే!.... ఏం పరేషాన్ చేస్తున్నార్ సాబ్!!"
విసుక్కుంటూ ఆటోవాడు రోడ్డుకి ఒక పక్కగా ఆటోని ఆపాడు.
కాస్సేపయ్యాక ఆ ఆటో వీళ్ళ ఆటోని దాటి ముందుకెళ్ళింది.
"పద... త్వరగా...పద" అన్నాడు చిట్టబ్బాయి.
"ఊ... ఆటోని స్టార్ట్ చెయి.. ఇంకా ఏంటి చూస్తున్నావ్?" కన్నారావు కూడా కంగారు పెట్టేసాడు ఆటోవాడిని.
"హర్రే... ఏం పరేషానొచ్చింది భయ్!" ఆటో వాడు నెత్తి కొట్టుకుని ఆటోని స్టార్ట్ చేసి ముందుకు పరుగెత్తించాడు.
కాస్సేపయిన తరువాత చిట్టబ్బాయి కెవ్వుమని అరిచాడు.
ఆటోవాడు కంగారుపడి ఆపేశాడు.
"నువ్వెందుకు ఆటోని ఆపావ్?" ఆశ్చర్యంగా అడిగాడు చిట్టబ్బాయి.
"మల్ల అట్ల అరిచినవ్ గదా?... నేను ఆ ఆటోని దాటిపోయిన అనుకున్న?" అన్నాడు ఆటోవాడు.
"నువ్వేమీ ఆటోని దాటిపోలేదు... అదిగో ఆ ఆటో వెళ్ళిపోతుంది....త్వరగా పద..." కంగారుగా అరిచాడు చిట్టబ్బాయి.
ఆటోవాడు మళ్ళీ విసుక్కుంటూ ఆటోని ముందుకి పరుగెత్తించాడు.
"ఎందుకలా కొంపలు మునిగేలా అరిచావ్?" కన్నారావు చిట్టబ్బాయి వంక ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు.
"మన ఆటోలు ఎటునుండి వెళ్తున్నాయో గమనించావా?...." అన్నాడు చిట్టబ్బాయి సంతోషంగా.
అప్పుడు ఆ రెండు ఆటోలూ లక్డీకాపూల్ దగ్గర మలుపు తిరిగి అయోధ్య హోటల్ ముందుగుండా మెహదీపట్నంవైపు వెళ్తున్నాయి. కాస్త దూరం వెళ్తే మసాబ్టాంక్ వస్తుంది... అక్కడి నుండి ఎడమపక్కకి తిరిగితే విజయనగర్ కాలనీ వస్తుంది. అంటే చిట్టబ్బాయి, కన్నారావులు ఉండే కాలనీ అన్నమాట.
ఆటో వెళ్తున్న దారిచూసి "అయితే ఏమిటంటావ్?" అని అడిగాడు కన్నారావు.
"ఏమిటేంటి నీ బొంద... ఆ ఆటో ఇటువైపునే వెళ్తుందంటే ఆ అమ్మాయి ఎక్కడో మనకి దగ్గర్లోనే ఉందన్నమాట... అంటే ఆ అమ్మాయిని ప్రేమించడానికి కష్టపడి ఎక్కడికో వెళ్ళనక్కరలేదు..." సంబరంగా అన్నాడు చిట్టబ్బాయి.
కన్నారావు మొహం చిట్లించి చూసాడు.
"ఏ మాత్రం కష్టపడకుండా ఎలా ప్రేమించాలని అనుకుంటున్నావ్?... ప్రేమించాలని అనుకున్నవాడు కాస్త కష్టపడ్డానికి కూడా సిద్దపడి ఉండాలి!..." అన్నాడు.
"సర్లేవోయ్... ఇప్పుడు కష్టపడట్లేదా ఏంటి? కష్టపడి ఆ ఆటోని వెంబడిస్తున్నామా లేదా?" అన్నాడు చిట్టబ్బాయి.
"మీరేం కష్టపడ్తుండ్రు సాబ్?... నేను కష్టపడ్తున్నా! ఆటోని నేన్ నడ్పుతున్నానా మీరా?" అన్నాడు ఆటోవాడు చికాకుగా.
చిట్టబ్బాయి, కన్నారావులు ఆటోవాడివంక మొహం చిట్లించి చూసారు.
"వీడు చూస్తే ఇలా అంటున్నాడు. కొంపదీసి ఆటోవాడు ఆ అమ్మాయికి లైను వేద్దామని అనుకోవడం లేదుకదా?" చిట్టబ్బాయి చెవిలో గుసగుస లాడాడు కన్నారావు.
కన్నారావు మాటలకి చిట్టబ్బాయికి కోపం వచ్చింది. కన్నారావు వైపు కొరకొర చూసాడు చిట్టబ్బాయి.
సరిగ్గా అప్పుడే ముందు వెళ్తున్న ఆటో మసాబ్ ట్యాంక్ చౌరస్తా నుండి ఎడమ పక్కకి తిరిగింది. వీళ్ళ ఆటో కూడా దానిని ఫాలో అయింది. చిట్టబ్బాయి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు.
