"అయ్యో.... అంతగా చెప్పాలా? అసలే మేం వంటకూడా చేస్కోకుండా వచ్చాం" అన్నాడు చిట్టబ్బాయి.
కన్నారావు చిట్టబ్బాయి డొక్కలో పొడిచి "ఇంక వెళ్తామోయ్... వెళ్ళొస్తామండీ" అని మోహన్ కి, పెళ్ళికూతురికీ చెప్పి చిట్టబ్బాయి చెయ్యి పట్టుకుని ఇవతలకి లాక్కొచ్చాడు.
"ఏంటలా డొక్కలో పొడుస్తావ్ మాటిమాటికీ?" కన్నారావు మీద విరుచుకు పడ్డాడు చిట్టబ్బాయి.
"లేకపోతే ఏంటా వాగుడు తిండిపోతులా?" మొహం చిట్లిస్తూ అన్నాడు కన్నారావు. "మోహన్ మనకి పాతవాడే. వాడేం అనుకోడుగానీ ఆ అమ్మాయి ఏమనుకుంటుంది?"
చిట్టబ్బాయి సడెన్ గా కెవ్వుమని కేకవేశాడు.
"నేను నీ డొక్కలో పొడవలేదుగా? ఎందుకంతచేటున కేకేశావ్?" ఆశ్చర్యంగా అడిగాడు కన్నారావు.
"నేనేమీ బాధతో కేకెయ్యలేదు... సంతోషంతో వేశాను. ఓసారి అటు పక్కకిచూడు" కన్నారావు జబ్బపట్టుకుని ఊపేస్తూ అన్నాడు చిట్టబ్బాయి.
కన్నారావు చిట్టబ్బాయి చూపించినవైపు చూశాడు.
"ఏముందక్కడ?"
"అదిగో... ఆ పక్కగా చింతపిక్క రంగు పట్టుచీర కట్టుకుని నిల్చున్న ఆ అమ్మాయిని చూడు, ఆ డార్క్ కలర్ శారీలో పచ్చగా ఎలా మెరిసిపోతుందో!! చాల బాగుంది కదూ?"
"అవును నిజంగానే బాగుంది!" అన్నాడు కన్నారావు ఆ అమ్మాయి వంక చూస్తూ.
"ఒరేయ్ కన్నా! నాకు ఆ అమ్మాయి కావాల్రా" అన్నాడు చిట్టబ్బాయి.
"ఆ అమ్మాయేమైనా బొమ్మల షాపులోని బొమ్మా, కావాలి అనుకోగానే పదిరూపాయలు పడేసి కొనుక్కోడానికి?" కసిరాడు కన్నారావు.
"ఏమో!.... ఆ అమ్మాయి నాకు కావాలి!!"
"పోనీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్యూ అని చెప్పు."
"బాబోయ్.... ఈ అమ్మాయికి కూడా కరాటే వస్తేనో?" మొహం తడుముకుంటూ అన్నాడు చిట్టబ్బాయి.
"అయితే నోర్మూసుకుని కూర్చో..."
చింతపిక్క రంగు పట్టుచీరలో ఉన్న అమ్మాయి తనకూడా ఉన్న మరో ముగ్గురు అమ్మాయిలతో ముందుకు కదిలింది. ఆ ముగ్గురు అమ్మాయిలూ ఆమె స్నేహితురాళ్ళు అయివుండవచ్చు.
"ఒరేయ్... వాళ్ళు కూడా భోం చెయ్యడానికి వెళ్తున్నట్టున్నారు... పద మనంకూడా వెళ్దాం" అన్నాడు చిట్టబ్బాయి కన్నారావు చేయిపట్టిలాగుతూ.
ఇద్దరూ ఆ అమ్మాయికి కాస్త దూరంలో ఫాలో అవుతూ భోజనాలు వడ్డిస్తున్న హాలు దగ్గరికి వెళ్ళారు.
అక్కడ సీన్ చూడగానే చిట్టబ్బాయికి నీర్సం వచ్చింది.
ఆ హాల్లో ఒక పక్కనంతా ఆడాళ్ళకి, ఒక పక్కనంతా మగాళ్ళకి ఏర్పాటు చేశారు.
"అంటే మనం ఆ అమ్మాయికి దగ్గర్లో కూర్చుని భోంచేసే అవకాశం లేదన్నమాట!!" నిరుత్సాహంగా అన్నాడు చిట్టబ్బాయి.
"దగ్గరగా కూర్చుని భోంచేసే అవకాశం లేదుగానీ ఆ అమ్మాయికి దగ్గరగా మెసిలే అవకాశం మాత్రం ఉంది" అన్నాడు కన్నారావు.
"ఎలా? ఎలా?? ఎలా???" కన్నారావు భుజాలుపట్టి తీవ్రంగా కుదిపేస్తూ ఆతృతగా అడిగాడు చిట్టబ్బాయి.
"ఇంక ఆ కుదపడం ఆపు. నా మెడ బెణికేలా ఉంది" కోపంగా చూస్తూ అన్నాడు కన్నారావు.
కన్నారావు భుజాలు వదిలేశాడు చిట్టబ్బాయి.
"చెప్పు... చెప్పు... చెప్పు" అన్నాడు మొహంలో మొహం పెట్టి కుతూహలంగా.
"ఏం లేదు వెరీ సింపుల్... నువ్వు కూరలగుత్తి, నేను సాంబార్ బకెట్టు పుచ్చుకుని ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ వడ్డించడమే" అన్నాడు చిరునవ్వు నవ్వుతూ కన్నారావు.
చిట్టబ్బాయ్ కళ్ళు మెరిశాయి.
"బ్రిలియంట్ అయిడియా. కానీ చిన్న సవరణ. ఆ అమ్మాయి చుట్టూ నేను ఒక్కడ్ని తిరుగుతూ వడ్డిస్తేచాలు, నువ్వు వేరే ఆడాళ్ళకి వడ్డించు" అన్నాడు.
చిట్టబ్బాయి ఇలా చెప్తుండగా భోజనం టేబుల్స్ ముందు వర్సగా కూర్చుని వున్న ఆడాళ్ళ వంక చూస్తున్న కన్నారావు హఠాత్తుగా కళ్ళు ఇంతింత పెద్దవి చేసి నోరుచాపి అటే చూస్తుండిపోయాడు.
"ఏవిటి? ఏమ్తెంది??" కన్నారావు మొహంలోకి చూస్తూ అడిగాడు చిట్టబ్బాయి అది ఆనందమో ఆశ్చర్యమో తెలీక.
"ఒరేయ్! ఆ అమ్మాయి ఆ అమ్మాయే. అదిగో అక్కడ కూర్చుంది" అన్నాడు కన్నారావు.
"అయితే పోదామంటావా? ఇక్కడుంటే అనవసరంగా మనపరువుపోతుంది" పాలిపోయిన మొహంతో అన్నాడు చిట్టబ్బాయి.
"నువ్వు ఏ అమ్మాయిని అనుకుంటున్నావ్?"
"కరాటే అమ్మాయి కాదా?"
"కాదు. నేను చేతిరుమాలు వెనకాలవేసి పరిచయం చేస్కున్నానే! ఆ అమ్మాయే!! మొన్న మన కాలనీలో నాకు చిక్కు ప్రశ్న వేసి తన పేరు చెప్పకుండా తప్పించుకుందని చెప్పానే ఆ అమ్మాయి! ఈవేళ ఆ అమ్మాయి పేరు తప్పకుండా కనుక్కుని తీర్తాను" హుషారుగా అన్నాడు కన్నారావు.
"ఇహనేం?... నేను ఈ అమ్మాయి చుట్టూ తిరుగుతూ వడ్డిస్తాను, నువ్వు ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ వడ్డించు" అన్నాడు చిట్టబ్బాయి సంబరంగా కన్నారావు భుజంమీద తడ్తూ.
అక్కడ ఒక టేబులుమీద పప్పుగుత్తులూ, రసం, సాంబార్ బక్కెట్లూ, అన్నం గిన్నెలూ వగైరా వగైరా ఉన్నాయి, చిట్టబ్బాయ్ కూరల గుత్తీ, కన్నారావు సాంబారు బకెట్టూ పుచ్చుకుని ఆడవాళ్ళ వరస దగ్గరికి పరుగుతీశారు.
"ఆ... కూరలండీ! కూరలెవరికి కావాలి?" అంటూ అరిచాడు చిట్టబ్బాయి చింతపిక్కల రంగు పట్టుచీర కట్టుకున్న అమ్మాయి ముందే తచ్చాడుతూ, ఆ అమ్మాయివంకే చూస్తూ.
ఆ అమ్మాయి తలవంచుకుని అన్నంలో వేలుపెట్టి కెలుకుతుంది తప్ప చిట్టబ్బాయ్ వంక చూడనేలేదు.
"కూరలండీ... కూర కావాలా ఎవరికయినా?" ఆ అమ్మాయి ముందు నిల్చుని గట్టిగా అరిచాడు చిట్టబ్బాయి.
ఉహు! అంత గట్టిగా అరిచినా ప్రయోజనం లేకపోయింది, ఆ అమ్మాయి చూడనైనా చూడలేదుగానీ అటు ప్రక్కన ఉన్న బామ్మగారు మాత్రం చిట్టబ్బాయిని పిలిచారు.
"ఏయ్ కూరలబ్బీ! ఇలా రా!!"
ఆ పిలుపు వింటే చిట్టబ్బాయికి ఒళ్ళు మండిపోయింది. కూరలబ్బీ ఏంటి కూరలబ్బీ! కూరగాయల అమ్ముకునేవాడివి పిలిచినట్టు!!
ఒకసారి నిర్లక్ష్యంగా బామ్మగారివంక చూసి ఆ అమ్మాయి ఎదురుగానే నిల్చుండిపోయాడు.
"ఏరా!.... ముసల్దానివని ఎంత నిర్లక్ష్యం! ఏయ్ కూరలబ్బీ నిన్నే" కాస్త గట్టిగా పిలిచారు.
"చూడవయ్యా.. అక్కడ ఆవిడకి కూరలు కావాలంట... పట్టించుకోవేం? ఊ ఊ గబగబా వడ్డించాలి!" ఒక పెద్దమనిషి చిట్టబ్బాయి వీపుతట్టి ముందుకు తోశాడు.
చిట్టబ్బాయి పళ్ళు కొరుకుతూ బామ్మ దగ్గరికి వెళ్ళాడు.
ఈ చివర్న పరిస్థితి ఇలా వుంటే, ఆ చివర్న కన్నారావు అవస్థ ఎలా ఉందంటే?...
కన్నారావు సాంబారు బక్కెటు పట్టుకుని తను యిష్టపడే అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు.
"ఆ... ఎవరండీ సాంబార్"
ఆ అమ్మాయి ముందు నిల్చుని గట్టిగా అరిచాడు.
ఆ అమ్మాయి తలెత్తి చూసింది.
"అరె, మీరా? మీరు వడ్డనలు చేస్తున్నారే!!" అంది కన్నారావు వంక చూసి నవ్వుతూ.
