"హమ్మయ్య... అంతేకదా?.... "తేలికగా నిట్టూర్చి గోపి రాధ దగ్గరికి వెళ్ళి ఆమెకి చెవిని అందించాడు.
రాధ అతని చెవిలో గుసగుసా చెప్పింది.
"ఆ!... నువ్వు చెప్పింది నిజమా రాధా!!" అంటూ ఆనందంతో ఆంబోతులా అరిచాడు గోపి.
రాధ సిగ్గుతో కళ్ళు మూసుకుంది.
అంతే... గోపి రాధని ఎత్తుకుని గిరగిరా తిప్పాడు సంతోషంగా. కళ్ళు తిరిగిన రాధ కెవ్వు కెవ్వుమని అరిచింది.
ఆ దృశ్యం చూసిన సరస్వతి భయవిహ్వలయై 'బాబోయ్' అంటూ గదిలోంచి బయటికి పరుగుతీసింది.
గోపి అంత తేలికగా వదుల్తాడా?
రాధని చటుక్కున క్రింద కూలేసి సరస్వతి వెంటబడి ఆమెని తరిమి తరిమి పట్టుకున్నాడు.
ఆమె "వద్దురా నాయనా... వద్దురా కన్నా... వద్దురా బాబూ... వద్దురా ప్లీజ్" అని అంటున్నా వినకుండా ఆవిడని కూడా ఎత్తుకుని ఆనందంతో గిర గిరా తిప్పాడు.
అలా ఆవిడను ఒక అయిదు నిమిషాలపాటు త్రిప్పి ఆవిడను కిందకు దింపాడు గోపి.
బుర్ర తిరిగిపోయిన సరస్వతి తూలిపోయి నేలమీద కూలబడిపోయింది.
నీ సంతోషం మంటెట్టా ... ఇలా నీకు ఆనందం కలిగినప్పుడల్లా ఎత్తుకుని గిరగిరా తిప్పితే ఇహ మేం ఈ యింట్లో ఉండక్కర్లేదు" అంది సరస్వతి విసుక్కుంటూ.
"ఏంటమ్మా... దేవతలాంటి నువ్వు కూడా అలా అంటావ్.... తండ్రి అవుతున్నాడంటే ఏ మగాడికి ఆనందంగా ఉండదూ?" అన్నాడు గోపి.
సరస్వతి ఓసారి ఇంటికప్పు వంక చూస్తూ గతం గుర్తు చేసుకుంటూ అంది.
"అవున్రా అబ్బాయి... నువ్వు చెప్పింది నిజమే... నువ్వు కడుపులో పడ్డప్పుడు మీ నాన్నారూ అంతే.... నన్ను ఎత్తుకుని పావుగంటసేపు తిప్పాడు. నువ్వైనా నయం... ఇంతటితో వదిలావ్... మీ నాన్నారైతే తృప్తితీరక నన్ను ఎగ్జిబిషన్ కి తీస్కెళ్ళి అక్కడ జయింట్ వీల్ ఎక్కించి కసిగా గిర గిరా తిప్పించారు."
అలా చెబుతున్నప్పుడు ఆమె మొహంలో ఆనందం ఛడమడా తాండవం చేసేసింది.
"హవునా అమ్మా... నా కన్నతండ్రి అంతటి ఉన్నతుడా అమ్మా?" ఆనందభాష్పాలు రాలుస్తూ అడిగాడు గోపి.
"అవున్రా బాబూ... అవును" సరస్వతి కూడా ఆనందభాష్పాలు రాల్చింది.
గోపికి రాధ గుర్తుకువచ్చింది.
"హర్రే... రాధవిషయం మర్చిపోయానే!"
గోపి ఆ గదిలోంచి బయటికి పరుగుతీశాడు.
రాధ ఇంకా నేలమీదే కూర్చుని వుంది కళ్ళు తిరుగుతూంటే.
"రాధా!...." మంద్రస్వరంతో పిలిచాడు గోపి.
రాధ పట్టించుకోలేదు.... తలత్రిప్పి గోపివంక చూడనేలేదు.
"రాధా!..." ఇంకాస్త మంద్రస్వరంతో ప్రేమగా అన్నాడు గోపి గుమ్మంలో నిలబడే.
ఉహూ... రాధ గోపివంక చూడలేదు.
"రాధా!...." గోపి గట్టిగా పిలిచాడు.
రాధ ఉలిక్కిపడి తలెత్తి గోపీవంక చూసింది.
"ఏంటి రాధా... అంత ప్రేమగా పిలిచినా డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నావ్?" బాధగా అడిగాడు గోపి.
"ఛఛ... అవేం మాటలండి? పతియే ప్రత్యక్ష దైవం అని అన్నారు. అందులో పవిత్ర భారతనారికి మరీనూ. అలాంటిది మిమ్మల్ని కేర్ చెయ్యకుండా ఎలా ఉంటాను? మీరంత మంద్రస్వరంతో పిలుస్తూ ఉంటే గేదె ఏదైనా అరుస్తుందేమో అనుకున్నానండీ.... నన్ను క్షమించండి" అంది బాధపడుతూ.
"రాధా..." ప్రేమగా పిలుస్తూ గుమ్మంలోంచి రెండడుగులు లోపలికి వేశాడు గోపి.
"ఏవండీ.... మళ్ళీ నన్ను ఎత్తుకుని గిరగిరా త్రిప్పకండి. మీ సంతోషం కాదుగానీ కళ్ళు తిరిగి ఛస్తున్నాను" భయం భయంగా చూస్తూ అంది రాధ.
"లేదులే రాధా... ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నది నిన్ను గిరగిరా తిప్పడానికి కాదు".
"మరి?"
గోపీ క్రింద కూలబడివున్న రాధని నేలమీద నుండి లేవనెత్తి మంచంమీద కూర్చుని తాను ఆమె ఎదురుగా కూర్చుని చింతపండు పళ్ళెం, మామిడికాయలూ ఇద్దరి మధ్యాపెట్టాడు.
రాధ ముసిముసిగా నవ్వింది.
గోపి పళ్ళెంలోంచి చింతపండు తీసి నిమ్మకాయ సైజులో ఉండచుట్టి రాధ నోట్లో పెట్టాడు.
రాధ ఆ చింతపండు ఉండని పచక్ పచక్ మని నమిలి గుటుక్ మని మింగింది.
ఆ తర్వాత మరో ముద్ద..... ఇంకో ముద్ద... ఇంకోటి!!!! అలా మొత్తం కంచం అంతా ఖాళీ అయిపోయింది.
రాధ ఆనందభాష్పాలు రాలుస్తూ "హేవండి! మీరెంత పుణ్య పురుషులండి" అంది.
"రాధా!" ప్రేమగా ఆమెని దగ్గరకు తీసుకున్నాడు గోపి.
15
సీతాలు పొలాల గట్లమ్మట నడుస్తూంది.
అలా మామూలుగా నడుస్తుంటే అదోమాదిరిగా ఏదో మాదిరిగా ఎబ్బెట్టుగా అనిపించింది సీతాలుకు.
అందుకే ఓసారి ఆకాశంవంక చూసి ఓ రెండు క్షణాలు ఆలోచించి తనలో తాను నకిలించి ఒక్కసారిగా చెంగున దూకింది.
అంతే... ఇహప్పట్నుండి సీతాలు పొలం గట్టుమీద చెంగు చెంగున దూకుతూ నడవసాగింది.
కాస్సేపయ్యాక మళ్ళీ ఠకీమని పొలం గట్టుమీద ఆగిపోయింది.
ఓ ప్రక్కన పిల్లగాలులు వీస్తున్నాయి. మరో ప్రక్క ఆ పిల్లగాలులకు చెట్లు తలలూగిస్తున్నాయి. ఇంకో ప్రక్క ఆకాశంలో మేఘాలు దూదిపింజల్లా తేలిపోతున్నాయి.
అట్టాంటప్పుడు ఊర్కే నడుస్తూంటే బాగుంటుందా? అబ్బే ... అలా నడిస్తే ఎబ్బెట్టుగా వుండదూ
సీతాలు మళ్ళీ ఆకాశవంక చూసి రెండు క్షణాలు ఆలోచించి తనలో తను ఇకిలించి "హెయ్య!..." అని ఓ గెంతు గెంతింది.
ఆ దెబ్బకి పొలంగట్టు తెగిపోయింది.
సీతాలు పాట అందుకుంది.
"హెయ్య...
సల్లగాలికి సిమ సిమమంటూంది ఒళ్ళూ
మబ్బు తునకలూ కురిపిస్తున్నాయి వానజల్లూ."
సీతాలు అలా అనగానే కూసింత వర్షం పడడం ప్రారంభించింది.
"చితచితలాడుతున్నది పొలమూ...
చిత్తడిగున్నది జాకెట్టు... హిహిహి....
ఏడున్నాడో నను మనువాడే మొనగాడు....
ఆడే నన్నేలే మగసిరిగల అందగాడు..."
"సల్లగాలికి సిమసిమ మంటోంది ఒళ్ళూ... మబ్బుతునకలూ కురిపిస్తున్నాయి వానజల్లూ"
పాట పూర్తయింది.
ఇప్పుడు సీతాలు మనసుకు ఊరట కలిగించింది. కుతి తీరిన సీతాలు పొలం గట్టమ్మట కూనిరాగంతీస్తూ జంపింగ్ చేస్తూ నడవసాగింది.
ఆమె అంతసేపు అలా జంపింగ్ చేస్తూ పాట పాడ్తుంటే ఆమెను రెండు జతల కళ్ళు అంతసేపూ గమనిస్తున్నాయి అన్న సంగతి సీతాలుకి తెలీదు.
ఆ రెండు జతల కళ్ళు రాయుడివీ, సంతానానివీ.
"ఓర్నీయవ్వ... పిల్ల పిటపిట లాడిపోతుందే " అన్నాడు రాయుడు మీసాలు మెలేస్తూ.
"దీనిగురించి ఇన్ ఫర్ మేషన్ కావాలండి... కనుక్కుని రేపు మీకు చెప్తాలెండి...." అన్నాడు సంతానం.
"నువ్వు చెప్పేది ఏంటి బోడి ఇన్ ఫర్మేషన్.... దీనిమీద నా కన్ను ఏనాడో పడింది.... దీనిపేరు సీతాలు... వయస్సు పద్దెనిమిది - బరువు నలభై రెండు కేజీలు - ఎత్తు ఐదు అడుగుల రెండంగుళాలు - చాలా ఇంకా ఇన్ ఫర్ మేషన్ కావాలా?-"
"వద్దు మహాప్రభూ - వద్దు - చెప్పింది చాలు" చేతులెత్తి దణ్ణం పెట్టాడు సంతానం.
