"ఇంక అదేపని చెయ్యాలి..." అంటూ కుర్చీలోంచి లేచాడు రాయుడు.
రాయుడిని చూడగానే చిత్రాంగి చెవులదాకా ఇకిలించి ఎక్కడలేని వయ్యారాన్నీ నడకలో గుప్పించి వంకర టింకరగా నడ్డిఊగిస్తూ నడిచి రాయుడి దరిదాపులదాకావెళ్ళి ధనేల్ మని సడెన్ గా బోర్లాపడింది. రాయుడు చిత్రాంగిని రెక్కపుచ్చుకుని పైకి లేవదీశాడు.
"నీ నడక మంటెట్టా.... మరీ అంత వయ్యారంగా నడవకపోతే మామూలుగా నడవరాదూ?" అన్నాడు రాయుడు చిత్రాంగినిచూసి మురిసి ముక్కలయిపోతూ.
"అలగంటారేటి బావగారూ... నా లయలూ హొయలు సూసే కదా మీరు ఇంట్లో పెళ్ళాన్ని ఉంచుకుని కూడా నా సుట్టూ తిరుగుతున్నారు... సెంద్రమండలం చుట్టూ రాకెట్లా..." దీర్ఘాలుతీస్తూ అంది చిత్రాంగి.
"హోస్ హోష్.... మాటలు బాగా నేర్చావే?...." అన్నాడు రాయుడ మీసాలు దువ్వుతూ.
* * *
గోపీ రిక్షాతొక్కికష్టపడి ఇంటికి వచ్చాడు. ఎప్పుడూ అతనికి నవ్వుతూ ఎదురొచ్చే రాధ ఆరోజు రాలేదు.
అతని తల్లి అన్నపూర్ణ గోపీ కాళ్ళకి నీళ్ళు ఇచ్చింది. కాళ్ళు కడుక్కున్నాడు గోపీ. గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చుంటూ అడిగాడు.
"రాధ ఏదమ్మా? ఎక్కడా కనిపించదే.... గుడికికానీ వెళ్ళిందా?"
"ఉహూ..." ముసిముసిగా నవ్వుతూ అంది అన్నపూర్ణ.
"అయితే చెర్లో దూకి కాస్సేపు జలకాలాడి బిందెతో నీళ్ళు తేడానికి వెళ్ళిందా?"
"ఉహూ.... అదీ కాదు" కొంటెగా చూస్తూ అంది సరస్వతి .
"అబ్బ... ఊర్కే సస్పెన్స్ టో చంపక రాధ ఏమైందో చెప్పమ్మా." విసుక్కుంటూ అన్నాడు గోపీ.
కన్నకొడుకు, తనకు ప్రాణసమానమైన కొడుకు అలా విసుక్కునేసరికి ఆ కన్నతల్లి హృదయం విలవిల్లాడింది.
"బాబూ." గద్గద స్వరంతో పలికింది సరస్వతి.
గోపీ సరస్వతి మొహంలోని బాధని, గొంతులోన విషాదాన్ని గమనించి విసురుగా కుర్చీలోంచి లేచి సరస్వతి భుజాలు పట్టికుదిపేస్తూ "అమ్మా... ఏమైందమ్మా! నా రాధకు ఏమైందమ్మా?" అంటూ కంగారుగా అడిగాడు గోపీ.
గోపీ సరస్వతి భుజాలుపట్టి అలా విసురుగా ఊపేసరికి ఆమె కొప్పూడిపోయింది.
రాధకి ఏమీ కాలేదు బాబూ," కళ్ళు తుడుచుకుంది సరస్వతి.
"మరి నువ్వెందుకమ్మా అలా బాధ పడ్తున్నావ్?"
"దేవతలాంటి నన్ను... మమతల కోవెలనైన నన్ను విసుక్కున్నావ్ కదా? అందుకని బాబూ నేను బాధపడ్తున్నాను."
"హయ్యో... ఎంత పొరాబాటైంది. సారీ అమ్మా. దేవతలాంటి నీ మనసును ఇంకెప్పుడు గాయపరచనమ్మా. నిజం అమ్మా. నీ మీద ఒట్టు. ఇప్పటికైనా చెప్పమ్మా. రాధఎక్కడమ్మా?" ఆతృతగా అడిగాడు గోపీ.
వెంటనే సరస్వతి పకపకా నవ్వి అంది.
"రాధ ఎక్కడికి వెళ్తుంది బాబూ? లోపలి గదిలోనే ఉంది. లోపలికి వెళ్ళిచూడు రాధ ఏం చేస్తుందో."
తల్లిమాటలు పూర్తయి అవకముందే గోపీ చెంగున లోపలికి దూకాడు. సరస్వతి కూడా అతని వెనకాలే చెంగున లోపలికి దూకింది.
లోపలి దృశ్యం చూసిన గోపీ డంగైపోయాడు.
రాధ రెండు చేతుల్లో రెండు మామిడికాయలు ఉన్నాయ్. ఒకసారి ఈ చేతిలోని మామిడికాయనీ, ఒకసారి ఆ చేతిలోని మామిడికాయనీ కొరుకుతూ కసకసా నమిలేస్తుంది.
తెల్లమొహం వేసి తల్లి వంక చూశాడు గోపీ.
సరస్వతి గోపీ వంక చూసి చిలిపిగా నవ్వింది.
14
"రాధా!" డంగైపోయిన గోపీ తేరుకుని పిలిచాడు.
గోపీని చూడగానే రాధ చేతిలోని మామిడికాయలను మంచంమీద పడేసి రెండు చేతుల్తో మొహాన్ని మూస్కుంది.
"ఏంట్రాధా! మొఖాన్ని ఎందుకు అలా మూస్కున్నావ్?" అడిగాడు గోపీ.
రాధ సమాధానం చెప్పలేదుగానీ సరస్వతి చెప్పింది.
"కోడలుపిల్ల సిగ్గుపడ్తుందిరా."
"సిగ్గా? ఎందుకూ? ఆబగా రెండు చేతుల్తోనూ మామిడికాయలు తింటున్నందుకా?" తల్లితో అని రాధవైపు తిరిగాడు గోపీ.
"నువ్వలా తింటున్నందుకు నేనేమి నిన్ను తిండిపోతువని అనుకోనులే రాధా."
"పోరా పిచ్చిసన్నాసీ! నీకే విషయమూ అర్ధంకాదు." అంటూ సరసంగా గోపీ టెంకిమీద ఒకటిచ్చింది సరస్వతి.
ఆ దెబ్బకి గోపీ తూలి రాధ ప్రక్కన మంచంమీద కూలబడ్డాడు.
రాధ ఇంకా చేతులు మొహానికి అడ్డుపెట్టుకునే కూర్చుంది.
గోపీ రాధ చేతులు పట్టి ముఖంమీదనుండి అడ్డు తొలగించాడు.
రాధ సిగ్గుపడిపోతూ "ఛీ... పొండి." అంటూ గోపీ టెంకిమీద తను కూడా సరసంగా కొట్టింది.
ఈసారి గోపీ మంచంమీద బోర్లాపడి అతని తల తలగడలో కూరుకుపోయింది.
తలగడలోంచి మొహం ఎత్తి బుర్రకాయ రుద్దుకుంటూ "ఏంటీ! ఈవేళ మీరిద్దరూ వంతులవారీగా నా టెంకి మాడ్చేస్తున్నారు. ఆ?...." పకపకా నవ్వాడు గోపీ.
రాధ, సరస్వతమ్మలు ముసిముసిగా నవ్వారు.
"సరే... ఇంతకీ నువ్వు పచ్చి మామిడికాయలను అలా పసపసా ఎందుకు నముల్తున్నావో చెప్పనేలేదు." రాధ గెడ్డం పట్టి మొహం పైకెత్తి అడిగాడు గోపీ.
"ఒక్క మామిడికాయలేనా ఏంటి?.... ఇది చూడండి."
ఒక ప్రక్క సిగ్గుతో చితికిపోతూనే మంచం క్రిందనుండి కంచంతీసింది. ఆ కంచంలో అరకిలో చింతపండు ఉంది.
"హిది చూడండి. హి..." అంది రాధ.
"ఏంటీ? చింతపండా? దీంతో ఏం చేస్తున్నావ్? నాకిష్టమైన చింతపండు హల్వా చేస్తున్నావా?" చొంగ కారుస్తూ అడిగాడు గోపీ.
"కాదురా అబ్బాయి. కోడలుపిల్ల ఆ చింతపండు కూడా "ఠప్... ఠప్ మని చప్పరించేస్తూ తినేస్తుంది." అంది సరస్వతి.
రాధ చీర చెంగు మొహంమీద కప్పేస్కుని సిగ్గుపడింది.
గోపీ ఆలోచనలో పడ్డాడు.
రాధ మావిడికాయల్ని కసకసా నమిలేస్తుందా? చింతపండుని ఠప్... ఠప్ మని చప్పరిస్తూ తినేస్తుందా?"
ఎందుకు? ఎందుకు?? ఎందుకు...
సీలింగ్ వంక చూస్తూ బరబరా బుర్రకాయి గోక్కున్నాడు.
ఆ దెబ్బకి డజను వెంట్రుకలు నేలరాలాయి.
చీరచెంగు మొహంమీది నుండి తీసి "నేనెందుకు మామిడికాయలూ, చింతపండూ తింటున్నానో మీకు అర్ధం కాలేదా? అయితే ఇప్పుడు మళ్ళీ ఆలోచించకండి." అంటూ చీర చెంగుకున్న చిన్నమూటని విప్పదీసి అందులోని వస్తువుని తీసి గోపికి చూపించింది.
చింతకాయ!
గోపీ నిలువుగుడ్లు వేస్కుని చూస్తుండగానే రాధ ఆ చింతకాయని పరపరా నమిలిమింగేసి కళ్ళు ఎగరేసింది గోపీని చూస్తూ.
గోపీ దేభ్యంమొహంవేసి తల అడ్డంగా ఊపాడు. "ఏంటో బాబూ... నా కస్సలు ఏమీ అర్ధమై చావడంలేదు..." అంటూ తలమీద ఠాక్ మని మొట్టుకున్నాడు.
రాధ కిలకిలా నవ్వింది.
"మీ మొద్దుబుర్రకి అర్ధం కాదులెండి. నేను చెప్తానుగాని ఓమారిలా రండి అంది.
గోపి రాధ దగ్గరికి వెళ్ళాడు.
"ఏదీ.... మీ చెవిని ఓసారిలా పడెయ్యండి..."
రాధ ఇలా అనగానే గోపి భయంగా రెండడుగులు వెనక్కి వేశాడు.
"ఏం?.... నా చెవిని కూడా చింతకాయ, మామిడికాయ నమిలినట్టు కసకసా నమిలేసి చింతపండు చప్పరించినట్టు ఠవ్ ఠవ్ మని చప్పరించుదామానా? ఆ పప్పులే నా దగ్గర ఉడకవ్" రాధతో అని "కానీ చెవులు పుల్లగా ఉండవనుకుంటానే!!" అని ఆశ్చర్యపోయాడు గోపి.
రాధ పక పకా నవ్వింది.
"అందుకే మిమ్మల్ని చవటాయి అనేది. మీ చెవిని ఇటు పారేయమని అన్నాడు దాన్ని తినడానికి కాదు. చెవిలో రహస్యం చెప్పడానికి" అంది.
