Previous Page Next Page 
ఉదాత్తచరితులు పేజి 16

 

    ఏభై రోజుల తరవాత మరల కాలీజీకి వెళ్ళింది వీణ.
    వీణకు సోఫియా జాడే కానరాలేదు. మరీ మంచిదని తలంచింది. కాని, ఓ రోజు జుబేదాను అడిగింది-"సోఫియా హాస్టల్లో లేదా?" అని.
    పుస్తకం తిరగవేస్తున్న జుబేదా, "ఇప్పుడు తను డే స్కాలర్! సుజాత ఇంట్లో ఉంది" అని చెప్పింది.
    వీణ మరింకేమీ అడగలేదు. జుబేదా లేదు. మూడో సంవత్సర పాఠాలు కష్టంగా అనాటమీ, ఫిజియాలజీ- రెండూ టఫ్ సబ్జెక్ట్స్. రాత్రుళ్ళు టీ తాగి ఎక్కువసేపు మేల్కొంటున్నారు. వీణ సరిగ్గా భోజనమే చేయటం లేదు. వీణ చూపులు ఒక్కొక్కసారి శూన్యంలోకి చూస్తుంటాయి. స్నానం చేసి వచ్చిన జుబేదాను చూసినప్పుడల్లా 'పాలలా స్వచ్చంగా ఉంది జుబేదా' అని అనుకొంటుంది వీణ మనస్సు. ఎన్నడూ కలగని బాధ కలుగుతూ ఉంది. మన స్సెప్పుడూ ఎక్కడో ఉంటుంది.
    మధ్యాహ్నం ఫిజియాలజీ ప్రాక్టికల్స్. హార్ట్ ఎలా కండిషన్ లో ఉందో పరీక్షించుకొంటున్నారు. ముందు విశ్రాంతిగా ఉన్నప్పుడు పల్స్ లెక్కించుకొన్న తరవాత ఎనిమిది అంగుళాల స్టూలు మీద ఒక కాలు ఉంచి రెండో కాలుతో స్టూలు మీద త్వరత్వరగా ఎక్కుతూ, అలా కాస్సేపు చేశాక దిగి పల్స్ చూసుకోవాలి. ఇప్పుడు వేగంగా కొట్టుకొంటున్న పల్స్ ని చూసి, ఆ పల్స్ మరెంతసేపటికి నార్మల్ కి వస్తుందో చూసుకోవాలి. ఎంత త్వరగా నార్మల్ కి వస్తే అంత మంచి కండిషన్ లో ఉందన్న మాట హార్ట్.
    అందరిలాగే వీణ స్టూలుమీద ఎక్కుతూ, దిగుతూ కళ్ళు తిరిగి పడిపోయింది. వీణ తలను ఒళ్ళో ఉంచు కొంది జుబేదా, నీళ్ళతో ముఖం తుడిచి. స్మెల్లింగ్ సాల్ట్మ్ ముక్కు దగ్గర ఉంచారు. మెల్లిగా కళ్ళు తెరిచి, చుట్టూ గుమికూడి తననే చూస్తున్న స్టూడెంట్స్ ను చూసి సిగ్గు పడుతూ లేచి కూర్చుంది.
    "చదువెక్కువ, తిండి తక్కువైతే ఇలాగే ఉంటుంది. ఫ్యాషన్ చేయక బాగా భోజనం చేయ"మని చెప్పి పంపారు ప్రొఫెసరుగారు.
    "వీణా! వేడిగా ఏమైనా తాగుదువు రా!" కాంటీన్ లోకి తీసుకెళ్ళింది జుబేదా.
    తాగిన కాఫీ తాగినట్లే వాంతి చేసుకొంది వీణ.
    "వీణా! హాస్పిటల్ కి వెళ్ళుదామా!" అంది జుబేదా.
    "వద్దు! వద్దు! రూముకి వెళ్ళుదాము. పద!"అంది.
    పడకమీద పడుకొని ఏడవసాగింది వీణ.
    వీణ తల నిమురుతున్న జుబేదా చెయ్యి తొలగించి, "జుబేదా! నన్ను తాకవద్దు. నా శరీరం మలినమైంది, జుబేదా! ఇప్పుడు నా కేది దారి? ఇప్పుడు నే నేమి చేయాలి? నేను చేయని తప్పుకి నా కెందుకీ శిక్ష..." అంది.
    "నీ వేమంటున్నావు, వీణా! అర్ధమయ్యేలాగ చెప్పు."
    "ఏదో శని నన్ను ఆవరించి సోమశిలకు లాక్కొని పోయింది. ఆ డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చాడు. మత్తులో నిస్సహాయురాలుగా ఉన్నప్పుడు ఆ బ్రూట్ నన్ను...నన్ను....శరీరం నిద్రపోతున్నా, నా మనస్సు మేల్కొనే ఉంది. ఆ హేరాయిల్ వాసన నాకు బాగా గుర్తు. మేల్కొనే ఉన్న నా మనస్సు ఏమీ చేయలేకపోయింది."
    "హాయ్, అల్లా!" వెక్కి వెక్కి ఏడుస్తున్న వీణను కళ్ళప్పగించి చూసింది జుబేదా.
    వీణ ఉధృతం తగ్గాక, "ఆ బద్మాష్ అప్పటికప్పుడు మహాబలిపురం వెళ్ళే బస్సుని ఓవర్ టేక్ చేసి, మీరు ఎక్కడకు వెళ్ళింది కనుక్కొని వచ్చాడని, వచ్చిన వెంటనే తిరిగి వెళ్ళిపోయాడని చెప్పింది సోఫియా. ఈ సంగతి నాకు చెప్పలేదు. వీణా! ఏం చేద్దాం?"
    "నేను చచ్చిపోకూడదు అనుకొన్నాను. కాని, విధి నన్ను వెంటాడుతున్నది. మరణమే శరణ్యం! ఈ పాపపు జీవితం ఎలా జీవించను? లోకానికి ముఖ మెలా చూపను? ఇందులో నా తప్పు లేదంటే నమ్ముతార? ఈ స్థితిలో నాగలక్ష్మిని ఎలా చూడను? ఆ కళ్ళలోని ప్రేమ అసహ్యంగా మారి నన్ను దూషిస్తూ ఉంటే ఎలా బ్రతకాలి? నాన్నమ్మ నన్ను ముట్టుకొంటుందా? వారి ఆశలు కూలిపోగా, ఆ గ్రామంలో ఎలా తలెత్తుకు తిరుగుతారు? మా అందరి బ్రతుకులు అంతమై పోవలసిందేనా! జు..."
    జుబేదా రక్తం పొంగింది. "నీవు చావటానికి వీలు లేదు. మగవాడి అన్యాయలకి బలి అయ్యే రోజులు పోయాయి. వీణా! వాడిని ఎదుర్కోవాలి. ఆ నమ్మకద్రోహిని అలా వదలటానికి వీలు లేదు. నీవు చేయని తప్పుకు నీ కెందుకీ సిగ్గు? వాడు సిగ్గు పడేలా చేయాలి. ఇక నీవు కంట నీరు పెట్టకూడదు. వీణా! ఎన్నో నెల?"
    తెలియదన్నట్లు తల ఊపింది.
    వీణ సూటుకేసు సర్దింది. బెడ్డింగ్ కట్టి, "వీణా! పద, పోదాము" అంది జుబేదా.
    "ఎక్కడికి?!"    
    "నీవు వెళ్ళవలసిన చోటుకు! రాజీవ్ ఇంటికే!"    
    "జుబేదా!!!"    
    "నిన్ను పెళ్ళి చేసుకొంటాడు. నిన్ను..."
    "ఛీ! నా కిష్టం లేదు. ఐ హేట్ హిమ్ లైక్ ఎనీథింగ్!"
    "వీణా! తప్పదు. లోకం కోసం, నీ వాళ్ళ కోసం! తరవాత నీ పగ తీర్చుకో!"
    "వాళ్ళేమంటారో..."    
    "ఒప్పుకు తీరవలసిందే!" లేదా ఖూనీ చేద్దాం అన్నట్లు చెప్పింది.
    టాక్సీలో బయలుదేరారు.

                                                        *    *    *

    జుబేదా వీణను వదిలి వెళ్ళి పక్షం రోజులైంది. వీణ తరఫున న్నీ జుబేదా మాట్లాడింది. ఆ రోజంత ఆ బంగళా మౌనం వహించినట్లైంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. కొడుకు తప్పును మౌనంగా స్వీకరించింది ఒక్క రాజీవ్ తండ్రి మాత్రమే!
    "బాబు అలా ప్రవర్తించాడంటే నమ్మలేకుండా ఉన్నాను" అని స్వగతంగా పదేపదే పలుక్కొంటూనే ఉంది లక్ష్మి.
    జానకీదేవి ఆరాటం ఎక్కువైంది. కొరకొర చూపులు చూడసాగింది వీణ వైపు.
    ఎన్నో ఎన్నో, అనాలని, మెడ పట్టి బయటికి గెంటాలని ఉంది.
    భర్త గట్టిగా చెప్పాడు: "అన్యాయంగా ఆ అమ్మాయి ప్రాణం తీసుకొంటుంది. అబ్బాయి వచ్చాక అన్నీ తెలుస్తాయి. అంత చిన్నపిల్ల అబద్ధం ఆడుతుందని ఎలా అనుకొంటావు" అని, "కఠినంగా ఎవ్వరూ ప్రవర్తించకండి" అని ఇంట్లో అందరికీ చెప్పాడు.
    తన సూటుకేసు పట్టుకొని నేరుగా రాజీవ్ గదిలోకి వెళ్ళుతున్న వీణను చూచి, 'నా కొడుక్కి ఇలా వ్రాసి ఉంది. మినిస్టరుగా రమ్మాయి-అయిదు లక్షలు పోయినట్లే' అనుకొని నిట్టూర్చింది జానకి.    
    విశాలమైన ఆ గదిలో అన్నీ వసతులు ఉన్నాయి. ఆ గదిలో ఏ వస్తువూ ముట్టుకోవాలని లేదు. కిటికీ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుని నింగి కేసి చూసింది. తన జీవితం ఎలా మొదలై ఎలా నడుస్తున్నది! మరెట్లా అంతమవుతుందో?        యువరాజ్ అరుపుతో తిరిగి చూచింది. పదిహేను సంవత్సరా లబ్బాయి యువరాజ్ తో లోనికి వచ్చాడు. వీణను చూస్తూ ఉండిపోయాడు. అతని పెద్దకళ్ళు నవ్వుతున్నాయి పలకరింపుగా. సన్నగా నవ్వాడు.
    వీణ నవ్వలేదు.
    దగ్గరగా వచ్చి "నా పేరు రాజ్ కుమార్! మద్రాసులో చదువుతున్నాను" అన్నాడు. ఆ అబ్బాయి గొంతు బొంగురుగా ఉంది.
    వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తున్న యువరాజ్ ను గొలుసు పట్టి ఆపుతూ, "మీ రంటే యువరాజ్ కు కోపంగా ఉంది- ఎందుకో!" అని అమాయకంగా పలికాడు.
    "నే నంటే అందరికీ కోపమే ఈ ఇంట్లో!" అంది.
    "లేదు! లేదు! నా కేమీ కోపం లేదు. మీ రంటే నాకు ఇష్టమైంది."
    నవ్వకుండా ఉండలేకపోయింది వీణ.    
    "రాజ్ కుమార్!" అంటూ పిలిచిన జానకీదేవి పిలుపు వినిపించింది.    
    "వస్తా, వదినా! అమ్మ పిలుస్తున్నది" అంటూ వెళ్ళిపోయాడు రాజీవ్ తమ్ముడు కుమార్.
    అతడికి తమ్ముడున్నాడన్న మాట! ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఏమో? మూడు నెలలైంది రాజీవ్ ఇంటికి వచ్చి, ఒకటి రెండు సార్లు డబ్బు తెప్పించుకొన్నాడు.
    తప్పు చేసి ఇంటికి రాకుండా ఊర్లు తిరుగుతున్నా డని తలంచారు ఇంట్లోవాళ్ళు.
    వీణ ఆ గదిలోనే ఉంది. భోజనం గదిలోకే వచ్చేది. రెండు మూడు రోజులు ఎంగిలి చేసి వదిలింది. క్షుద్భాధను ఎన్ని రోజులు ఓదార్చుకోగలదు? లక్ష్మి  వీణను దగ్గరకు తీసుకొని అసలు విషయాన్ని మెల్లి మెల్లిగా అడిగి తెలుసుకొంది. ధైర్యం చెప్పింది. వీణను అతను ఎంత గాఢంగా ప్రేమించాడో తనతో ఎన్నో సార్లు అన్నాడు. కాని, అలా నీచంగా ప్రవర్తించాడంటే ఆమె మనస్సు అంగీకరించకుండా ఉంది.
    ఎప్పుడంటే అప్పుడు రాజ్ కుమార్ తనతో ఏదో ఒక ఆట, చెస్, వైకుంఠ పాళీ ఆడేవాడు. పేకాట రానందుకు ఆశ్చర్యపోయాడు ముందు. తరవాత నవ్వాడు. ఈ రోజే స్కూలుకి వెళ్ళిపోయాడు.
    దీపాలు వెలిగి చాలా సేపైంది. ఒక మూల తనకైవేయించుకొన్న మంచంపై పడుకొని ఉంది వీణ. ఎన్నాళ్ళకో తలస్నానం చేసింది. ఆరని వెంట్రుకలు దిండుపై చెల్లాచెదురుగా ఉన్నాయి. తన గదిలో లైటు వేసుకోలేదు. ఎన్నాళ్ళు ఈ చీకటి బ్రతుకు!
    నాన్నమ్మకు కాలేజీలో ఉన్నట్లు లేఖలు వ్రాస్తున్నది. తనకు వచ్చే లెటర్స్ జుబేదా తెచ్చి ఇస్తుంది. అయిదు రోజులుగా జుబేదాకూడా రాలేదు.
    గదిలో లైటు వెలిగింది.
    "వద్దు! ఆర్పేయ్!" అంది ఏ పనివాడో వేశాడని.
    లైటు ఆరిపోలేదు. విసురుగా చూసింది వీణ. కన్నార్పటం మరిచిపోయింది.
    "వీణా?!" స్విచ్ బోర్డు దగ్గర రాజీవ్ నిలుచుని ఉన్నాడు. వాడిన ముఖం. పెరిగిన గడ్డం. మనిషి జబ్బు పడ్డట్టు నీరసంగా నిలువలేనట్లు ఉన్నాడు.
    తెలియని భయంతో మంచానికి అంటుకొని పోయింది.
    చిక్కిన ఆమె ముఖంలో కళ్ళు మరీ పెద్దగా కనుపిస్తున్నాయి. శోకమూర్తిలా ఉన్న వీణను తన కళ్ళతో చూస్తున్నా మనస్సు నమ్మటం లేదు.
    జానకీదేవి విసురుగా లోనికి వచ్చింది. మెట్లెక్కి వచ్చిన అలసటతో, కోపంతో పలికింది. "ఏరా! బొమ్మలా నిలుచున్నావు? ఎవర్ని చూస్తున్నావో తెలియటం లేదా? నా ఆశలన్నీ కూల్చావు కదరా! అబ్బాయ్! ఇది నిజమేనా? నీవు.... నీవు.... చేయటం.... ఆ అమ్మాయికి గర్భం రావటం!" నిశ్చేష్టుడై నిలుచున్న రాజీవ్ ను ఊపుతూ, "చెప్పరా నీవు కాదని! ఈ కాలం పిల్లలకి మగవాళ్ళతో తిరగటం ఫాషను! ఇంకెంత మందితో తిరిగిందో ఏమో!" అంది.
    ఆ క్షణమందే వీణ వైపు చూశాడు. నిలుచుని ఉంది. చెదిరిన మబ్బుల్లో ఉన్న చంద్రబింబంలా ఉంది ముఖం. పెదాలు అదురుతున్నా కళ్ళు క్రోధాన్ని వెదజల్లుతూ గర్వంగా సవాలు చేస్తున్నాయి- 'కాదు అని చెప్పగలవా!?' అన్నట్లు.
    "చెప్పరా!" కోపం పట్టలేక ఆ చెంప, ఈ చెంప మీద కొట్టుతూనే ఉంది జానకి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS